24, మార్చి 2012, శనివారం

శ్రీ శృంగేరి జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ మహాస్వామి విరచిత శ్రీ గురుపాదుకా స్తోత్రం

శ్రీ సచ్చిదానన్దశివాభినవ్య నృసింహభారత్యభిధాన్యతీన్ద్రాన్
విద్యానిధీన్ మన్త్రనిధీన్ సదాత్మనిష్ఠాన్ భజే మానవ శంభురూపాన్


II జగద్గురు శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ మహాస్వామి వారు II

ఈ రోజు అనగా, చైత్ర శుద్ధ విదియ, జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు స్థాపించిన శృంగగిరి-దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠమునకు 33వ పీఠాధిపతి అయిన జగద్గురు శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ మహాస్వామి వారి 100వ ఆరాధనోత్సవం

వీరు 1879 నుండి 1912 వరకు శృంగేరి పీఠాధిపత్యం వహించారు. సాక్షాత్ ఆది శంకరాచార్యుల వారే తిరిగి సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ మహాస్వామి వారిగా అవతరించారని పెద్దలు చెప్తారు. వీరి పూర్వాశ్రమ నామము శివస్వామి.

శ్రీ గుణిగల్లు రామశాస్త్రి గారు మరియు శ్రీమతి లక్ష్మమ్మ అనే పుణ్య దంపతులకు ఈశ్వరానుగ్రహంచేత నాలుగవ సంతానముగా జన్మించారు శ్రీ నృసింహభారతీ స్వామి వారు. శ్రీ రామశాస్త్రి గారు మైసూరు సమీపంలో బ్రాత అగ్రహారమునందు నివసించేవారు. వీరు వేదోక్త సకల కర్మానుష్ఠానపరులు, వేదవేదాంగములను అధ్యయనం చేసిన మహాపండితులు. శ్రీమతి లక్ష్మమ్మ గారు పతి శుశ్రూషా పరాయణురాలై ఉండేవారు. ఈ దంపతులు గార్హస్థ్య ధర్మానుష్టానములను యథాశాస్త్రము క్రమం తప్పకుండా ఆచరించేవారు. వీరికి నలుగురు పిల్లలు కలిగినా, ప్రారబ్ధ కర్మవశమున ఎవరూ దక్కలేదు. వీరి యొక్క ఈ బాధను పరమేశ్వరుడు ఒక్కడే తీర్చగలరని, శ్రీ రామశాస్త్రి గారు, వారి ధర్మపత్నితో కలిసి యథోక్త నియమము లతో శ్రీ మేధాదక్షిణామూర్తిని ఉపాసించారు. వీరి నిష్కపట భక్తికి మెచ్చిన శంకరుడు, వీరి వంశమునకు కీర్తిని తెచ్చే పుత్రరత్నమును అనుగ్రహించెను. శ్రీ శాస్త్రులగారి 34వ యేట శార్వరీ నామ సంవత్సరమున వైశాఖ మాస శుక్ల త్రయోదశి నాడు ఒక మగపిల్లవాడు జన్మించెను. అతనికి వీరి కులదైవమైన లక్ష్మీనరసింహుడు అనే పేరు పెట్టారు. వీరి తర్వాత ఒక కుమారుడు, కుమార్తె కలిగెను. 

వీరికి నాలుగవ సంతానము జన్మించబోయే ముందే, శ్రీ రామశాస్త్రి గారు, పుట్టబోయే సంతానం మగపిల్లవాడు కావాలి అని, శాస్త్ర ప్రకారం మొదటి సంతానమునకు జరిపించవలసిన పుంసవన సంస్కారం జరిపించారు. అంతేకాదు, దక్షిణామూర్తి అనుగ్రహంతో సంతానం కలిగారు కావున, ఈసారి పుట్టబోయే పిల్లవాడికి శివస్వామి అని పేరుపెడదామని నిర్ణయించారు. శాస్త్రి గారు ముందే ఊహించినట్లుగా 1858లో ఫాల్గుణ బహుళ ఏకాదశి నాడు గురువారము, శ్రవణ నక్షత్రమున మకర రాశి యందు రాత్రి తొమ్మిది గంటలకు మగ పిల్లవాడు జన్మించెను. ముందుగా నిర్ణయించినట్లే వీరికి ‘శివస్వామి’ అని నామకరణం చేసిరి.


వీరికి ఎనిమిదవ ఏటనే అప్పటి 32వ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ వృద్ధ నృసింహభారతీ మహాస్వామి వారిచే సన్యాస దీక్ష ఇవ్వబడినది. అప్పటి నుండి శివస్వామి అనే నామం “శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ మహాస్వామి” అనే దీక్షా నామము గా మారినది. శ్రీ స్వామి వారిని నడిచే శంభుదేవునిగా స్తుతించేవారు.  

శంకరాచార్య స్వామి వారి జన్మ స్థలమును వీరు ధ్యానములో దర్శించి, ఇప్పటి కేరళ రాష్ట్రము లోని, ఎర్నాకుళం జిల్లాలో, పెరియార్ నదీ తీరంలో ఉన్న “కాలడి” అనే గ్రామము అని గుర్తించి, అక్కడ జగద్గురు ఆదిశంకరుల మరియు శారదా మాత యొక్క ఆలయం నిర్మింపచేశారు. ప్రతీ ఏటా వైశాఖ శుక్ల పంచమి శంకర జయంతి ఉత్సవాలు మొదట ప్రారంభం చేసింది శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామీ వారే. వీరు ఆది శంకరులు చేసిన అన్ని రచనలకు ఒకచోట సంగ్రహము చేసి “శంకర గ్రంథావళి” పేరున ప్రచురింపచేశారు.

వీరికి ఆది శంకరాచార్యులన్నా, వారి ప్రత్యక్ష గురువు శ్రీ వృద్ధ నృసింహ మహాస్వామి వారన్నా విపరీతమైన గురు భక్తి. వీరు చేసిన అనేక స్తోత్రములలో ఈ “గురుపాదుకా స్తోత్రము” ఒకటి. శ్రీ శృంగేరి శారదా పీఠం వారి వెబ్ సైట్ లో ఇవ్వబడిన ఈ స్తోత్రమును యథాతథంగా ఇక్కడ తెలుగులో పొందుపరిచాను. ఈ స్తోత్రము యొక్క ఆంగ్ల అనువాదము ఈ క్రింద లంకెలో చూడగలరు.ఈరోజు వీరి ఆరాధనోత్సవం సందర్భంగా శృంగగిరి శారదా పీఠం వారు ఒక వీడియో డాక్యుమెంటరీ తయారు చేశారు. ఈ వీడియో ఈ క్రింది లంకెలో చూడగలరు.


అంతేకాక, శృంగగిరి శారదా పీఠం వారు “శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీమహాస్వాములవారి దివ్యచరిత్ర”  అనే తెలుగు పుస్తకం కూడా ప్రచురించారు. పుస్తకం కావాలనుకునే వారు ఈ క్రింది ఈ మెయిల్ లో శారదా పీఠం వారిని సంప్రదించి కొనుగోలు చేయవచ్చు. ఈ పుస్తకం వెల రూ.75/-.
ఈ రోజు, జగద్గురువులైన శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ మహాస్వామి వారిని స్మరించడం వలన తప్పక మనం అందరం శ్రీ స్వామి వారి కృపకు పాత్రులం అవుతాము.


II శ్రీ శృంగగిరి జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ మహాస్వామి విరచిత శ్రీ గురుపాదుకా స్తోత్రం II

నాలీకనీకాశపదాదృతాభ్యాం
నారీవిమోహాదినివారకాభ్యామ్
నమజ్జనాభీష్టతతిప్రదాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ II 1 II

శమాదిషట్కప్రదవైభవాభ్యాం
సమాధిదానవ్రతదీక్షితాభ్యామ్
రమాధవాంఘ్రి స్థిరభక్తిదాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ II 2 II

నృపాలిమౌలివ్రజరత్నకాన్తి-
సరిద్విరాజజ్ఝషకన్యకాభ్యామ్
నృపత్వదాభ్యాం నతలోకపంక్తేః
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ II 3 II

అనన్తసంసారసముద్రతార
నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యామ్
వైరాగ్యసామ్రాజ్యదపూజనాభ్యా
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ II 4 II

పాపాన్ధకారార్కపరమ్పరాభ్యాం
తాపత్రయాహీన్ద్రఖగేశ్వరాభ్యామ్
జాడ్యాబ్ధిసంశోషణబాడవాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ II 5 II

కవిత్వవారాశినిశాకరాభ్యాం
దారిద్ర్‌యదావామ్బుధిమాలికాభ్యామ్
దూరీకృతానమ్రవిపత్తతిభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ II 6 II

నతా యయోః శ్రీపతితాం సమీయుః
కదాచిదప్యాశు దరిద్రవర్యాః
మూకశ్చ వాచస్పతితాం హి తాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ II 7 II

కామాదిసర్పవ్రజభఞ్జకాభ్యా
వివేకవైరాగ్యనిధిప్రదాభ్యామ్
బోధప్రదాభ్యాం ద్రుతమోక్షదాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ II 8 II

స్వార్చాపరాణామఖిలేష్టదాభ్యా
స్వాహాసహాయాక్షధురంధరాభ్యామ్
స్వాన్తాచ్ఛభావప్రదపూజనాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ II 9 II

II ఇతి శ్రీ శృంగగిరి జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీ మహాస్వామి విరచిత శ్రీ గురుపాదుకా స్తోత్రం సంపూర్ణం II సర్వం శ్రీ వల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు4 వ్యాఖ్యలు:

 1. కాస్తంత ఆలస్యంగా చూశాను. మంచి టపా. వివరాలు అందించినందుకు కృతఙ్ఞతలు...

  ప్రత్యుత్తరంతొలగించు
 2. నృసింహభారతీ మహాస్వామివారి గూర్చిన వివరాలను తెలియజేసినందుకు కృతజ్ఞతలు. I am happy to read about Him. On a side note, I thought that Guru-Paduka-Stotram was written by Sri Adi Sankaracharya... You may have a look at the references mentioned in the following post:
  http://subrahmanyamgorthi.blogspot.ch/2012/06/gurupaduka-stotramu.html
  It of course doesn't matter much whoever of those two Jagadgurus has written, but still just wanted to mention... Once again THANK you Sir for the posting.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. అవును. శృంగేరి పరాపర గురువులు దీనిని రాసారు. అంతే కాకుండా 'అనంత సంసార' తో మొదలయ్యేటట్టు ఇప్పటి ఆడియో చెప్తున్నా.. 'నాళీక..' తో మొదలవుతుందని ప్రస్తుత జగద్గురువులు తెలిపి యున్నారు..

  ప్రత్యుత్తరంతొలగించు