31, ఆగస్టు 2011, బుధవారం

గర్భరక్షాంబికా అమ్మ వారు & వంశ వృద్ధికర శ్రీ దుర్గా కవచం


ఓం శ్రీ మాత్రే నమః 
భగవంతుడు అన్ని చోట్లా సర్వ వ్యాపియై ఉన్నా కూడా, కొన్ని స్థలములలో, కొన్ని రూపములలో  విశేషించి ఆయన అనుగ్రహము ప్రసరిమ్పబడుతుంది. వీటినే పుణ్య క్షేత్రములు అంటాము. ఇటువంటి ఎన్నో దివ్యమైన పుణ్య క్షేత్రములు గల భూమి మన భారత దేశం. ఈ పుణ్య క్షేత్రాలలో, ఒక్కో స్థలం ఒక్కో కారణానికి బాగా ప్రసిద్ధం అయ్యాయి. ఇటువంటి వాటిలో గర్భారక్షాంబికా ఆలయం అనే పుణ్య క్షేత్రం ఒకటి. ఇక్కడ అమ్మ వారు స్త్రీల యొక్క సంతాన సబంధమైన సమస్యలను నివారించి, చక్కని సంతాన ప్రాప్తి కటాక్షించేందుకు వెలిసిన తల్లి.

 శ్రీ గర్భరక్షాంబికా సమేత శ్రీ ముల్లైవనాథర్ ఆలయం తమిళనాడులో ఉన్న ఒక అద్భుతమైన క్షేత్రం. ఈ ఆలయంలో ప్రధాన దేవత శ్రీ గర్భరక్షాంబికా అమ్మవారు మరియు శ్రీ ముల్లైవనాథర్. ఈ క్షేత్రం యొక్క పేరులోనే క్షేత్ర మహిమ అవగతమవుతుంది. గర్భరక్షాంబికా అంటే గర్భములో ఉన్న శిశువును, ఆ గర్భం దాల్చిన తల్లిని కాపాడే అమ్మల గన్న యమ్మ చాల పెద్దమ్మ. పార్వతీ మాతయే ఇక్కడ గర్భారక్షాంబికా అమ్మగా పిలవబడుతోంది. ఇక్కడ అమ్మ వారు కేవలం గర్భం దాల్చిన వారికే కాకుండా, సంతానము లేని దంపతులకు కూడా సత్సంతానము కటాక్షిస్తుంది.

ఇదే క్షేత్రంలో అమ్మ వారితో పాటుగా కొలువై ఉండి భక్తులను అనుగ్రహించే నా తండ్రి శంకరుడు శ్రీ ముల్లైవనాథర్ గా కొలువబడుతున్నాడు. అంటే మన తెలుగులో చెప్పాలంటే ముల్లైవ నాథర్ అంటే మల్లికార్జున స్వామి వారు. ఇక్కడ స్వామి ని సేవిస్తే ఎటువంటి చర్మ వ్యాధులైనా నయం అయిపోతాయి.

ఈ గర్భారక్షాంబికా ఆలయం తమిళనాడు లో తంజావూర్ జిల్లాలో, పాపనాశం తాలూకా లో తంజావూర్ –కుంభకోణం వెళ్ళే దారిలో కుంభకోణం అనే ప్రసిద్ధ పట్టణమునకు ముందు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్షేత్రము గల ఊరిని అక్కడ “తిరుక్కరుగావుర్” (Thirukkarugavur) గా పిలుస్తారు.

గర్భ రక్షామ్బికా అమ్మ వారు   
ఇక్కడ అమ్మవారు సుమారు ఏడు అడుగుల ఎత్తులో ఉండి చక్కని కంచి పట్టు చీర ధరించి, సర్వాలంకార భూషితయై మెరిసి పోతూ ఉంటుంది. అమ్మ చిరునవ్వులు చిందిస్తూ “రా నాన్నా, నీకెందుకు బెంగ, నేను ఉన్నాను కదా నీకు” అని అభయం ఇచ్చినట్లుగా ఉంటుంది అమ్మ వారి యొక్క స్వరూపం. ఇక్కడికి వచ్చే భక్తులకు అమ్మ వారు ఒక విగ్రహం కాదు, అంతటా నిండి నిబిడీకృతమై ఉన్న అమ్మ సంతానము కటాక్షించడానికి సాకార రూపం దాల్చి ఉన్న శ్రీమాత ఈ అమ్మ. ఎంతో మంది భక్తులు సత్సంతాన ప్రాప్తికై అమ్మని నమ్మి వస్తారు. ఎవరైనా తెలిసి కాని తెలియక కాని ఈ క్షేత్రములో అమ్మని దర్శించినచో, వారికి కూడా తప్పక అమ్మ అనుగ్రహం కలుగుతుంది.

  శ్రీ ముల్లైవనాథర్ 
ఇక్కడ ముల్లైవనాథర్ గా ఉన్న పరమేశ్వరుడు స్వయంభూ గా వెలిసిన స్వామి. శంకరుడు స్వయంభూగా వెలిసిన అరవైనాలుగు క్షేత్రాలలో ఇది ఒకటి. ఇక్కడ శివ లింగము పుట్ట మన్నుతో చేసినది, అందుచేతనే, ఇక్కడ స్వామికి జలముతో అభిషేకం చేయరు, కేవలం మల్లె నూనెతో అభిషేకం. ఈ క్షేత్రమును మాధవీ క్షేత్రం అని కూడా అంటారు. మాధవీ అంటే సంస్కృతములో మల్లెలు. ఈ స్థల వృక్షం కూడా మల్లె తీగయే.

ఈ ఆలయం లో మరొక ప్రత్యేకత ఏమిటంటే, ప్రతీ ఏటా తమిళ ఫాల్గుణ మాసం లో పౌర్ణమి నాడు చంద్ర కిరణాలు శివ లింగము మీద పడతాయి. అది ఒక అద్భుత దృశ్యము.

ఇక్కడ కర్పగ వినాయాకర్ మరియు నందీశ్వరుడు కూడా స్వయంభూ గా వెలిశారు. ఈ ఆలయం లోనే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి సన్నిథి కూడా కలదు.

ఆలయ ప్రవేశ ద్వారము
స్థల పురాణము:
ఈ ఆలయం కనీసం వేయి సంవత్సరాల క్రితం నుంచి ఉన్నది. ఇక్కడ ఉన్న ఎత్తైన గోపురము, ప్రహరీలు చూస్తే తెలుస్తుంది. ఇక్కడ తొమ్మిదవ శతాబ్దములో చోళ రాజుల హయాములో చెక్కిన శిలా ఫలకాలు ఉన్నాయి. ఈ క్షేత్రం యొక్క మహిమను అప్పార్, సుందరార్ మరియు జ్ఞాన సంబంధార్ అనే ముగ్గురూ ప్రఖ్యాత నాయనార్లు వారి పద్యములలో కీర్తించారు. వీటిని తమిళంలో పత్తిగం అంటారు. ఈ ఆలయ సందర్శనార్ధం వస్తున్న ఈ ముగ్గురు నాయనార్లకి దారి కనపడకపోతే, సాక్షాత్తు పరమశివుడే వీరికి ఈ ఆలయ దర్శనం చేయించారు.

ఇక్కడ అమ్మ వారు, అయ్య వారు ఎందుకు వెలిశారు, ఆ కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం....


  శివ పార్వతులను ప్రార్ధిస్తున్న నిద్రువ మహర్షి, ఆయన పత్ని వేదిక

  పూర్వం ఇక్కడ నిధ్రువ అనే ఒక మహర్షి ఆయన ధర్మ పత్ని వేదిక తో కలిసి ఒక ఆశ్రమం లో నివసించేవారు. వాళ్ళు ఎప్పుడూ ఈశ్వరుని పూజిస్తూ విహిత కర్మాచరణ చేస్తూ ఆ దంపతులు ఇద్దరు ఆనందంగా కాలం గడిపేవారు. అయితే వారికి ఉన్న ఒకే సమస్య సంతానము కలుగక పోవడం. సంతానము కొఱకై ఈ దంపతులు అమ్మ వారిని, తండ్రి శంకరుడిని విశేష ఆరాధన చేశారు. ఒక మంచి రోజు ఆ తల్లి గర్భం దాల్చింది. ఇలా గర్భం దాల్చిన తర్వాత, ఒక రోజు నిధ్రువ మహర్షి వరుణుడిని కలుసుకోవడానికి బయటకి వెళతారు. అప్పుడు వేదిక మూడవ త్రైమాసికం లో ఉన్నది, కొద్ది రోజులలో ప్రసవం జరగాల్సి ఉంది. నిధ్రువ మహర్షి బయటకి వెళ్ళిన సమయంలో ఊర్ధ్వపాదుడు అనే మహర్షి ఆశ్రమమునకు వచ్చారు. అప్పటికే ఇంటి పనులలో అలసిపోయిన వేదిక విశ్రాంతి తీసుకుంటోంది, దాంతో వచ్చిన మహర్షికి అతిథి మర్యాదలు చేయలేదు, ఆయన వచ్చారని తెలియదు. ఆగ్రహం చెందిన ఊర్ధ్వ పాదుడు, ఆమె గర్భం ధరించి ఉంది అని తెలియక ఆమెను శపిస్తారు. ఆయన శాప ఫలితంగా వేదిక ఒక వింత వ్యాధితో బాధపడడం మొదలు అవుతుంది. తత్ఫలితంగా ఆమె శరీరంలోని భాగాలే కాకుండా, గర్భంలో ఉన్న శిశువు కూడా తినివేయబడడం మొదలు అయ్యింది. వెంటనే ఆమె ఎంతో ఆర్తితో బాధ పడుతూ సర్వ మంగళ స్వరూపమైన ఆ పార్వతీ మాతను ప్రార్ధిస్తుంది. అవ్యాజకరుణామూర్తి అయిన అమ్మ వారు వెంటనే ప్రత్యక్షం అయ్యి ఆ గర్భస్థ పిండమును ఒక పవిత్రమైన కుండలో ఉంచి రక్షిస్తుంది. ఈ విధం గా రక్షింపబడిన శిశువు  ఆ కుండలో పెరిగి చక్కని మగ పిల్లవాడు పుడతాడు. వాడికి నైధ్రువన్ అని పేరు పెడతారు. అప్పుడే పుటిన ఈ శిశువు కి కామధేనువు తన పాలిచ్చి ఆకలి తీరుస్తుంది. ఈలోగా ఆశ్రమం చేరుకున్న నిధ్రువ మహర్షి విషయం తెలుసుకుని ఎంతో సంతోషించి శివ పార్వతులను ఇక్కడే ఉండి రాబోయే తరాలలో కూడా మిమ్మల్ని  ఆశ్రయించే వాళ్లకి గర్భ రక్ష కలుగజేయమని ప్రార్ధిస్తారు. మహర్షి చేసిన ప్రార్ధనకి సంతసించిన అమ్మ వారు మరియు అయ్య వారు ఈ క్షేత్రములోనే గర్భారక్షాంబిక, ముల్లైవనాథర్ గా కొలువున్నారు. ఇప్పటికీ, అమ్మ అనుగ్రహముతో ఈ క్షేత్రమును దర్శించిన గర్భిణీ స్త్రీలకు ఎంతో చక్కగా ప్రసవం అయ్యి, మంచి పిల్లలు పుడతారు.
 ఇక్కడ అమ్మను సేవిస్తే ఇంకా పిల్లలు లేని వారికి గర్భం దాల్చడం జరుగుతుంది. గర్భం దాల్చిన వాళ్లకి చక్కని ప్రసవం అవుతుంది. పెళ్లి కాని ఆడ పిల్లలు ఇక్కడ అమ్మని ప్రార్ధిస్తే వెంటనే మంచి వ్యక్తితో వివాహం అయి సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ క్షేత్రం ఉన్న ఊరిలో ఇప్పటి వరకు ఎప్పుడూ ఎవరికీ గర్భ స్రావం కావడం, పిల్లలు కలుగక పోవడం అనే సమస్య లేదు.  ఇక్కడ స్థానికులు ఈనాటికీ అమ్మ వారి అనుగ్రహం ఈ క్షేత్రంలో ఉంది, అందువల్లనే మేము రక్షిమ్పబడుతున్నాము అని విశ్వసిస్తారు. మన దేశము నుండి వేరే దేశముల నుండి ఎక్కడెక్కడి నుంచో దంపతులు వచ్చి ఇక్కడ అమ్మ ఆశీస్సులు పొంది వెడతారు.

పూజా విధానము:
·         పిల్లలు లేని వారికి అమ్మవారి & అయ్యవారి దగ్గర ఉంచి మంత్రించిన నెయ్యి ఇస్తారు, ఆ నెయ్యిని దంపతులు ఇద్దరూ నలభై ఎనిమిది (48) రోజులు నిద్రించ బోయే ముందు సేవిస్తే తప్పకుండా త్వరలోనే గర్భం దాల్చడం జరుగుతుంది.
·         గర్భిణీ స్త్రీలు అయితే వారికి అమ్మవారి & అయ్యవారి దగ్గర ఉంచి మంత్రిచిన తైలము (ఆముదం) ఇస్తారు. ఈ తైలమును గర్భిణి గా ఉన్న తల్లికి నొప్పులు ప్రారంభం అవ్వగానే ఉదర భాగములో రాయడం వల్ల, ఎటువంటి సమస్య లేకుండా తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యం గా ఉండేలా ప్రసవం అవుతుంది. (గర్భిణి గా ఉన్న స్త్రీలు ఆ సమయంలో ఈ క్షేత్రం వెళ్ళ లేకపోయినా, వారి యొక్క భర్త కాని, ఎవరైనా బంధువు కాని ఈ క్షేత్రం దర్శించి, ఆమె పేరు మీద సంకల్పము చేయించి ఈ తైలము తెచ్చుకోవచ్చు.) 
·         అంతే కాక సంతానము కావలసిన స్త్రీల యొక్క జన్మ నక్షత్రం రోజున ప్రతీ నెలా ప్రత్యేక అర్చన కూడా చేయించుకోవచ్చు. దీని కోసం సంవత్సరానికి ఐదు వందల రూపాయలు తీసుకుంటారు ఆలయ యాజమాన్యం వాళ్ళు. ప్రతీ నెలా ఇంటికి అమ్మ వారి కుంకుమ మరియు స్వామి విభూతి ప్రసాదంగా పంపిస్తారు.

అయితే ఇలా అమ్మ అనుగ్రహముతో ప్రసవం అయిన తర్వాత వీలు చూసుకుని ఆ దంపతులు పుట్టిన పిల్లవాడిని తీసుకు వెళ్లి అమ్మ వారి ఎదురుగా ఒక వెండి ఊయల ఉంటుంది, అందులో పిల్లాడిని పడుకోబెట్టి అమ్మ యొక్క దర్శనం చేయించాలి. అలా చేస్తే ఆ పిల్లలు కూడా, అమ్మ వారి అనుగ్రహం ప్రసరించి, దీర్ఘాయుష్మంతులై, ప్రయోజకులవుతారు.

ఆలయం యొక్క చిరునామా:
Sri Mullaivanatha Swamy Temple
(Sri Grabharakshaambigai Sannithi)
Thirukkuarugavur (P.O) – 614 302
Papanasam Taluk, Thanjavur Dt, Tamil Nadu.
Phone No: +91 - 4374 – 273423




శౌనక మహర్షి విరచిత శ్రీ గర్భరక్షా స్తోత్రం:
ఓం శ్రీ గణేశాయ నమః    
ఓం శ్రీమాత్రే నమః
ఏహ్యేహి భగవాన్ బ్రహ్మన్
ప్రజా కర్తా, ప్రజా పతే
ప్రగృహ్షీణివ బలిం ఇమం
ఆపత్యాం రక్ష గర్భిణీమ్. II 1 II

అశ్వినీ దేవ దేవేసౌ
ప్రగృహ్ణీతమ్ బలిం ద్విమం
సాపత్యాం గర్భిణీమ్ ఇమం
రక్షతాం పూజ యనయా II 2 II

రుద్రాశ్చ ఏకాదశ ప్రోక్తా
ప్రగృహనంతు బలిం ద్విమం
యుష్మాకం ప్రీతయే వృతం
నిత్యం రక్షతు గర్భిణీమ్. II 3 II

ఆదిత్య ద్వాదశ ప్రోక్తా
ప్రగ్రహ్ణీత్వం బలిం ద్విమం
యుష్మాగం తేజసాం వృధ్య
నిత్యం రక్షత గర్భిణీమ్. II 4 II

వినాయక గణాధ్యక్షా
శివ పుత్రా మహా బల
ప్రగ్రహ్ణీష్వ బలిం ఇమం
సపత్యాం రక్ష గర్భిణీమ్. II 5 II

స్కంద షణ్ముఖ దేవేశా
పుత్ర ప్రీతి వివర్ధన
ప్రగ్రహ్ణీష్వ బలిం ఇమం
సపత్యాం రక్ష గర్భిణీమ్. II 6 II

ప్రభాస, ప్రభవశ్శ్యామా
ప్రత్యూషో మరుత నల
దృవూ  ధురా ధురశ్చైవ
వసవోష్టౌ ప్రకీర్తితా
ప్రగ్రహ్ణీత్వం బలిం ఇమం
నిత్యం రక్ష గర్భిణీమ్. II 7 II

పితుర్ దేవీ పితుశ్రేష్టే
బహు పుత్రీ మహా బలే
భూత శ్రేష్టే, నిశావాసే
నిర్వృతే, శౌనక ప్రియే
ప్రగ్రహ్ణీష్వ బలిం ఇమం
సపత్యాం రక్ష గర్భిణీమ్. II 8 II

రక్ష రక్ష మహాదేవ,
భక్తానుగ్రహకారక
పక్షి వాహన గోవిందా
సపత్యాం రక్ష గర్భిణీమ్. II 9 II
         *****

** పై స్తోత్రమును ప్రతీ రోజూ పూజా మందిరంలో, అమ్మ వారికి కొంచెం పళ్ళు, పాలు లేదా ఏదైనా పదార్ధం నివేదన చేసి, గర్భరక్షా స్తోత్రం క్రింద తెలిపిన విధంగా చదువుకోవాలి.
·         2 నెలలో, మొదటి రెండు శ్లోకములురోజూ 108 సార్లు
·         3 నెలలో, మొదటి మూడు శ్లోకములురోజూ 108 సార్లు
·         4 నెలలో, మొదటి నాలుగు శ్లోకములురోజూ 108 సార్లు
·         5 నెలలో, మొదటి ఐదు శ్లోకములురోజూ 108 సార్లు
·         6 నెలలో, మొదటి ఆరు శ్లోకములురోజూ 108 సార్లు
·         7 నెలలో, మొదటి ఏడు శ్లోకములురోజూ 108 సార్లు
·         8 నెలలో, మొదటి ఎనిమిది శ్లోకములురోజూ 108 సార్లు
·         9 నెలలో, మొదటి తొమ్మిది శ్లోకములురోజూ 108 సార్లు

వంశ వృద్ధికర శ్రీ దుర్గా కవచం:
సూర్య భగవానుడు, ఆయన పుత్రుడు అయిన శనీశ్వరునికి చెప్పిన ఒక గొప్ప స్తోత్రం

ఓం శ్రీ గణేశాయ నమః     ఓం శ్రీమాత్రే నమః
శనైశ్చర ఉవాచ:-
భగవాన్ దేవ దేవేశ కృపయా త్వం జగత్ప్రభో
వంశాఖ్య కవచం బ్రూహి మహ్యం శిష్యాయా తే అనఘ
యశ్య ప్రభావాత్ దేవేశ వంశ వృద్ధిర్హి జాయతే II

సూర్య ఉవాచ:-
శృణు పుత్రా ప్రవక్ష్యామి వంశాఖ్యాం కవచం శుభం
సంతాన వృద్ధిర్ యత్ పఠనాద్ గర్భ రక్షా సదా నృణామ్ I
వంధ్యాపి లభతే పుత్రం కాక వంధ్యా సుతైర్యధా
మృత వత్సా సుపుత్రస్యాత్ స్రవత్ గర్భ స్థిర ప్రజా I
అపుష్పా పుష్పిణీ యస్యా ధారణాశ్చ సుఖ ప్రసుః
కన్యా ప్రజా పుత్రిణీ ఏతత్ స్తోత్రమ్ ప్రభావతః I
భూత ప్రేతాధిజ బాధా యా బాధా కలి దోషజా
గ్రహ బాధా, దేవ బాధా యా శత్రు బాధా కృత యా I
భశ్మీ భవంతి సర్వస్తాః కవచస్య ప్రభావతః
సర్వ రోగ వినశ్యంతి సర్వే బాల గ్రహశ్చ యే II

అథ దుర్గా కవచమ్
ఓం పూర్వ రక్షతు వారాహీ ఆగ్నేయం అంబికా స్వయమ్
దక్షిణే చండికా రక్షేత్ నైరుత్య హంస వాహినీ II

వారాహీ పశ్చిమే రక్షేత్ వాయవ్యాం మహేశ్వరీ
ఉత్తరే వైష్ణవీ రక్షేత్ ఈశాన్యం సింహ వాహినీ II

ఊర్ధ్వం తు శారదా రక్షేత్ అథో రక్షతు పార్వతి
శాకంబరీ శిరో రక్షేత్ ముఖం రక్షతు భైరవీ II
కంఠమ్ రక్షతు చాముండా హృదయం రక్షతాత్ శివ
ఈశాని భుజౌ రక్షేత్ కుక్షిమ్ నాభిమ్ కాళికా II

అపర్ణాః ఉదరం రక్షేత్ బస్తిం శివ ప్రియా
ఊరూ రక్షతు కౌమారీ జయా జానుధ్వయం తధా II

గుల్ఫౌ పాదౌ సదా రక్షేత్ బ్రహ్మణీ పరమేశ్వరీ
సర్వాంగాని సదా రక్షేత్ దుర్గా దుర్గార్తి నాశినీ II

నమో దేవ్యై మహా దేవ్యై దుర్గాయై సతతం నమః
పుత్ర సౌఖ్యం దేహి దేహి గర్భ రక్షం కురుష్వా నః II

ఓం హ్రీం హ్రీం హ్రీం - శ్రీం శ్రీం శ్రీం - ఐం ఐం ఐం
మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతీ రూపాయై
నవ కోటి మూర్త్యై దుర్గాయై నమః - హ్రీం హ్రీం హ్రీం
దుర్గార్తి నాశినీ సంతాన సౌఖ్యం దేహి దేహి II

వంధ్యత్వం మృతవత్సత్వం హర హర - గర్భ రక్షం కురు కురు
సకలాం బాధాం కులజాం బాహ్యజం కృతమకృతాం నాశయ నాశయ

సర్వగాత్రాణి రక్ష రక్ష గర్భం పోషయ పోషయ
సర్వోపద్రవం శోషయ శోషయ స్వాహా II

ఫల శృతిః
అనేన కవచేనాంగం సప్త వారాభి మంత్రితం
ఋతు స్నానో జలంపీత్వా భవేత్ గర్భవతీ ధ్రువం
గర్భ పాత భయే పీత్వా ధృఢ గర్భా ప్రజాయతే
అనేన కవచేనాధ మార్జిత యా నిశాగమే
సర్వ బాధా వినిర్ముక్తా గర్భిణీస్యాత్ సంశయః
అనేన కవచేనేహ గ్రంధితం రక్త దోరకం
కటి దేశే ధారయంతి సుపుత్రా సుఖ భాగినీ
అసూత పుత్రమింద్రాణి జయంతం యత్ ప్రభావతః
గురుపాధిష్టం వంశాఖ్యం కవచం తదిధం సదా
గుహ్యాత్ గుహ్యతర చేదం ప్రకశ్యం హి సర్వతః
ధారణాత్ పఠనధస్య వంశఛ్చేధో జాయతే
ఇతి శ్రీ జ్ఞాన భాస్కరే వంశ వృద్ధికర దుర్గా కవచం సంపూర్ణం.

 సర్వం శ్రీ ఉమా మహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.