29, మే 2016, ఆదివారం

భగవాన్ క్రోధభట్టారక విరచిత శ్రీ ఆర్యాద్విశతి తాత్పర్యము - 19


శ్రీ గురుభ్యో నమః

II ఆర్యా ద్విశతి - 98వ శ్లోకము II
తత్సాలోత్తరభాగే భానుమయం వప్రమాశ్రయే దీప్రమ్ I
మధ్యం తు విపులమనయోర్మన్యే విక్రాంత మాతపోద్గారమ్ II ౯౮

తాః తత్సాలోత్తరభాగే - ఆ అహంకారమయ ప్రాకారమునకు పై భాగము నందు ఉండు, దీప్రమ్ - ప్రకాశించుచున్న, భానుమయం - సూర్యమయమైన, వప్రమ్ - ప్రాకారమును, ఆశ్రయే - సేవించుచున్నాను, విపులం - విశాలమైన, విక్రాంతం - పరాక్రమవంతమగు, తేజోమయమగు, ఆతపోద్గారమ్ - ఎండల యొక్క పుంజము గల, అనయోః - ఆ రెంటి (అహంకార, రవిమయ ప్రాకారములకు), మధ్యం తు - మధ్య ప్రదేశమును, మన్యే - ధ్యానించుచున్నాను !!
అహంకారమయ (23వ) ప్రాకారమునకు పై భాగమునందు ప్రకాశించుచున్న సూర్యమయ (24వ) ప్రాకారమును నేను సేవించుచున్నాను. విశాలమైన, తేజోమయమైన సూర్య కిరణాల యొక్క కాంతులు గల ఆ రెంటి మధ్య ప్రదేశమును నేణు ధ్యానించుచున్నాను !!

II ఆర్యా ద్విశతి - 99వ శ్లోకము II
తత్ర కురువిందపీఠే తామరసే కనక కర్ణికాఘటితే I
ఆసీనమరుణవాసన మమ్లానప్రసవమాలికాభరణమ్ II ౯౯

తాః తత్ర - ఆ ప్రదేశమునందు, కురువిందపీఠే - కెంపుల పీఠమునందు, తామరసే - తామరపువ్వునందలి, కనకకర్ణికాఘటితే - బంగారు కుండలములను ధరించినవాడును, ఆసీనం - కూర్చొని ఉన్నవాడును, అరుణవాససం - ఎఱ్ఱని వస్త్రము ధరించినవాడును, అమ్లాన - ఈ విధముగా వర్ణింపబడినవాడు అగు, ప్రసవమాలికాభరణమ్ - పుష్పహారమును ధరించినవాడును ....
అహంకారమయ రవిమయ ప్రాకారములకు మధ్య ప్రదేశమునందు ఉన్న కెంపులపీఠమునందు, తామరపువ్వు నడుమ బంగారు కుండలములను ధరించి కూర్చొని ఉన్నవాడు, ఎర్రని వస్త్రము ధరించి, పుష్పమాలికను ధరించినవాడును .....

II ఆర్యా ద్విశతి - 100వ శ్లోకము II
చక్షుష్మతీ ప్రకాశనశక్తిచ్ఛాయా సమారచితకేళిమ్ I
మాణిక్యమకుటరమ్యం వందే మార్తాండభైరవం హృదయే II ౧౦౦

తాః చక్షుష్మతీ - చక్షుష్మతీ అను పేరుగల శక్తి, ప్రకాశనశక్తిః - ప్రకాశనశక్తి అను పేరుగల శక్తి, ఛాయా - ఛాయాదేవి అను పేరుగల శక్తి, ఈ ముగ్గురు శక్తులతో (భార్యలతో), సమారచిత - చేయబడిన, కేళిమ్ - విలాసము కలవాడును, మాణిక్యమకుటరమ్యం - మాణిక్యమయమైన కిరీటమును ధరించుటచే సుందరమైనవాడును అగు, మార్తాండభైరవం - మార్తాండభైరవుడను సూర్యాధిదేవతను, హృదయే - మనస్సునందు, వందే - ధ్యానించుచున్నాను / నమస్కరించుచున్నాను !!

చక్ష్ముష్మతి, ప్రకాశశక్తి మరియు ఛాయాదేవి అను ముగ్గురు శక్తులనెడి భార్యలతో కూడి విలాసముగా ఉన్నవాడును, మాణిక్యమయ కిరీటమును ధరించుటచే సుందరమైనవాడును అగు, మార్తాండభైరవుడను సూర్యాధిదేవతకు మనస్సునందు నేను నమస్కరిస్తున్నాను !!

తన్మధ్యకక్ష్యా వసుధాఖచితా కురువిందకైః I
తత్ర బాలాతపోద్గారస్సర్వదావర్తతే మునే II (లలితోపాఖ్యానము, 39వ అధ్యాయము 46వ శ్లోకము)
మహాప్రకాశనామ్నాస్తి తస్యశక్తిర్మహీయసీ I
చక్షుష్మత్య పరాశక్తిచ్ఛాయాదేవ్య పరాస్మృతా I

ఇత్థంతిసృభిరేతాభిశ్శక్తిభిః పరివారితః II (లలితోపాఖ్యానము, 39వ అధ్యాయము 52-53 శ్లోకములు)

(సశేషం .... )

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.