ఓం శ్రీ స్కందపూర్వజ సహిత స్కందాయ నమః |
శ్రీ గణేశాయ నమః
II స్కంద ఉవాచ II
యోగీశ్వరో మహాసేనః కార్తికేయోಽగ్నినన్దనః I
స్కందః కుమారః సేనానీః స్వామీ శఙ్కరసమ్భవః II 1 II
గాంగేయస్తామ్రచూడశ్చ బ్రహ్మచారీ శిఖిధ్వజః I
తారకారిః ఉమాపుత్రః క్రౌంచారిశ్చ షడాననః II 2 II
శబ్దబ్రహ్మసముద్రశ్చ సిద్ధః సారస్వతో గుహః I
సనత్కుమారో భగవాన్ భోగమోక్షఫలప్రదః II 3 II
శరజన్మా గణాధీశః పూర్వజో ముక్తిమార్గకృత్ I
సర్వాగమప్రణేతా చ వాంఛితార్థప్రదర్శనః II 4 II
అష్టావింశతినామాని మదీయానీతి యః పఠేత్ I
ప్రత్యూషే శ్రద్ధయా యుక్తో వాచస్పతిర్భవేత్ II 5 II
మహామన్త్ర మయానీతి మమ నామానుకీర్తనమ్ I
మహాప్రజ్ఞామవాప్నోతి నాత్ర కారా విచారణా II 6 II
II ఇతి శ్రీరుద్రయమలే ప్రజ్ఞావివర్ధన శ్రీకార్తికేయస్తోత్రం సంపూర్ణం II
ఓం శ్రీ స్వామినాథాయ నమః |
కార్తికేయుని 28 నామములు -
1. యోగీశ్వరః – యోగీశ్వరులకు అధిపతి
2. మహాసేనః – దేవసైన్యానికి అధిపతి, దేవసేనాపతి
3. కార్తికేయః – ఆరు కృత్తికా నక్షత్రములచే పోషింపబడిన వాడు
4. అగ్నినన్దనః – పరమశివుని జ్ఞానాగ్ని నుంచి ఉద్భవించినవాడు మరియు పరమశివుని తేజస్సు కొంత సేపు భరించినందువల్ల, అగ్ని దేవునికి కూడా తనయుడిగా పిలువబడినవాడు.
5. స్కందః – పరమశివుని తేజస్సు నుండి జన్మించినవాడు
6. కుమారః – కుమార అన్న నామం కేవలం సుబ్రహ్మణ్యునికే చెందినది. ఎందుకంటే, జగత్తుకి మాతా పితలు అయిన పార్వతీ పరమేశ్వరుల అన్యోన్యతకి ఫలం మన బుజ్జి సుబ్రహ్మణ్యుడు.
7. సేనానీః – దేవసేనలకు అధిపతి, దేవసేనాధ్యుక్షుడు.
8. స్వామీ శంకరసంభవః – శంకరుని దివ్యమైన తేజస్సు నుండి పుట్టినవాడు.
9. గాంగేయః – పరమశివుని తేజస్సు అగ్నిదేవుడు భరించలేక, గంగా మాతకి ఇచ్చేస్తే, గంగా మాత కొంత సేపు శివుని తేజస్సును భరిస్తుంది. అందువల్ల, గంగా మాతకి కూడా పుత్రునిగా పిలబడ్డవాడు కాబట్టి గాంగేయ అనే నామం వచ్చింది.
10. తామ్రచూడః – కుక్కుటమును అధిరోహించిన వాడు.
11. బ్రహ్మచారీ – ఎల్లప్పుడూ బ్రహ్మనందు రమించువాడు.
12. శిఖిధ్వజః – అగ్ని ధ్వజముగా కలవాడు
13. తారకారిః – తారకాసురడనే రాక్షస సంహారము చేయుటకు అవతారం దాల్చిన వాడు, తారకాసురుడిని, ఇతర రాక్షస గణములను సంహరించి దేవతలను రక్షించినవాడు.
14. ఉమాపుత్రః – ఉమాదేవి, అంటే పార్వతీ అమ్మ వారి ముద్దుల తనయుడు. అందుకే సుబ్రహ్మణ్య స్వామి వారు అచ్చం అమ్మవారి లానే ఉంటారు.
15. క్రౌంచారిః – పర్వత రూపములో ఉన్న క్రౌంచ అనే రాక్షసుడిని సంహరించినవాడు.
16. షడాననః – ఆరు ముఖములు గలవాడు.
17. శబ్దబ్రహ్మసముద్రః – జ్ఞాన స్వరూపుడు, అంటే వేదములు ఏ పరబ్రహ్మ స్వరూపమును గురించి ఘోషిస్తున్నాయో, ఆ వేద శబ్దములచే ప్రతిపాదించబడిన వాడు.
18. సిద్ధః – పరిపూర్ణ సిద్ధ స్వరూపుడు
19. సారస్వతః – సరస్వతీ స్వరూపము, అంటే జ్ఞాన స్వరూపము.
20. గుహః – సకలజీవుల హృదయ గుహలో కొలువై ఉన్నవాడు.
21. భగవాన్ సనత్కుమారః – చతుర్ముఖ బ్రహ్మ గారి నలుగురు మానస పుత్రులలో ఒకరైన సనత్కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా వచ్చారు. ఈ విషయమే, త్రిపురా రహస్యంలో మాహాత్మ్యఖండంలో వివరించబడినదని, శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నిర్ధారించారు.
22. భోగమోక్షఫలప్రదః – ఈ భూమి మీద మనం సుఖంగా జీవించడానికి అవసరమైన సంపదతో పాటు అంత్యమునందు మోక్షమును కూడా ఇవ్వగలిగినవాడు.
23. శరజన్మా – శరవణతటాకము (రెల్లు పొదల) నుండి జన్మించినవాడు.
24. గణాధీశః – సకల దేవతలకు, గణములకు అధిపతి అయిన వాడు.
25. పూర్వజః – అందరికన్నా ముందున్నవాడు, అంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు, కేవలం ఒక అవతారం మాత్రమే కాదు, ఎప్పుడూ ఉండే పరబ్రహ్మ స్వరూపం. ఆయన ఎప్పుడూ ఉన్నవాడు, పుట్టుక లేనివాడు.
26. ముక్తిమార్గకృత్ – ముక్తి మార్గమును బోధించే గురు స్వరూపం. అంత్యమున ముక్తిని ప్రసాదించి, తనలో కలుపుకునే స్వామి.
27. సర్వాగమప్రణేతా – సకల ఆగమములకు మూలము.
28. వాంచితార్ధప్రదర్శనః – అభీష్టములను నెరవేర్చే తండ్రి.
స్కంద ఉవాచ-
ఈ ప్రజ్ఞావివర్ధన కార్తికేయ స్తోత్రము రుద్రయమల తంత్రములోనిది. ఎవరైతే ఈ 28 నామములు ప్రతీ దినం ప్రాతః కాలం భక్తి శ్రద్ధలతో చదువుతారో, వారు సరస్వతీ అనుగ్రహం పొంది, చక్కని తెలివితేటలు, మంచి వాక్కు మరియు జ్ఞానమును పొందుతారు.
సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు
ధన్యవాదాలండి. నా వద్ద ఈ స్తోత్రము లేదు. నేను విన్నది - శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి విన్నపం మేర, మల్లాది చన్ద్ర శేఖర శాస్త్రిగారు త్రిపురా రహస్యం లోనున్న 'సనత్కుమార' రహస్యాన్ని కనుకున్నారని. నేను చదవలేదు; విన్నాను మాత్రమే!
రిప్లయితొలగించండి@ తెలుగు భావాలు
రిప్లయితొలగించండిధన్యవాదములు. మీరు చెప్పినట్లుగా, పరమాచార్య వారు చెప్పినది మల్లాది చంద్రశేఖర శాస్త్రి వారికి కాదు.
బ్రహ్మగారి నలుగురు మానస పుత్రులలో ఒకరైన సనత్కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా వచ్చారని అనే విషయం నడిచే దేవుడు, పరమాచార్య శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర స్వరస్వతి వారి విన్నపం మేర అష్టాదశ పురాణాలను తమిళంలో అనువదించిన మహా పండితుడు శ్రీవత్ససోమదేవశర్మ గారు, త్రిపురా రహస్యంలో మాహాత్మ్య ఖండంలో ముప్ఫై ఏడవ అధ్యాయంలో ఈ రహస్యం ఉన్నదని తెలియపరచారు.
అంతే కాక, సనత్కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా వచ్చారనే విషయం, ఛాందోగ్యోపనిషత్తులో స్పష్టంగా ఇవ్వబడినదని చదివాను. కాబట్టి సనత్కుమారుడే సుబ్రహ్మణ్యుడు.
అయ్యయ్యో! నేను 'సనత్కుమారుడి' ప్రస్తావనతో విభేదించలేదు. పైన 'త్రిపుర రహస్యమని' సవరణ కానీ చేశారా? ఇంతకు ముందు 'దేవి' కి సంబందించిన వేరేది చూసినట్టుగా ఙ్ఞప్తి.
రిప్లయితొలగించండిఅయ్యో, కేవలం విషయ ప్రస్తావన చేస్తూ అలా వ్రాశాను అంతేనండీ, తప్ప మీరు 'సనత్కుమారుడి' ప్రస్తావనతో విభేదించారని అని నా భావం కాదు.
రిప్లయితొలగించండిఅవునండీ సవరణ చేశాను....ముందు నేను శ్రీవిద్యా రహస్యం అని తప్పుగా వ్రాశాను. వ్రాసేటప్పుడు కొంచెం అనుమానంగానే వ్రాశాను. మీ కామెంట్ చూశాక, మళ్ళీ కామకోటి వారి పీఠం సైట్ లో చూసి, గురువు గారు ప్రవచనములో చెప్పిన విషయం కూడా గుర్తుకి వచ్చి, సరి చేశాను.
మీరు ఈ విషయం చెప్పడం వల్ల, నేను ఈ రోజు చాలాసేపు సనత్కుమారుడికి సుబ్రహ్మణ్యునికి ఉన్న సంబంధం, పరమాచార్య వారు ఈ విషయం ఎలా కనుగొన్నదీ తెలుసుకోవడానికి జాలంలో చాలా సేపు వెతికాను. దాని వల్ల సుబ్రహ్మణ్య స్వామి వారి గురించి మరిన్ని మంచి విషయాలు తెలిసాయి.
మీకు అనేకానేక ధన్యవాదములు..
స్వామీ - అనేదొక సుబ్రహ్మణ్య నామమని విన్నాను. అలా తీసుకుంటే:
రిప్లయితొలగించండిస్వామీ: పరమశివుని (పరమేశ్వరుని) కుమారుని మాత్రమే స్వామీ అని కానీ, కుమారా అని కానీ సంబోధించాలి.
అప్పుడు, గణాధీశః పూర్వజో ఒకే నామం గా (గణాథీశుని అన్నగా కలవాడని) తీసుకోవచ్చు.
పరమేశ్వరుని ఒక్కొక్కనామానికి కొన్ని కోట్ల అర్థాలు తీయచ్చు. ఎదో నా బుర్రకందినదానితో మీ పాయసంలో ఇంకొంచెం చక్కెర వేద్దామని...
@ శ్రీనివాస్ గారు,
రిప్లయితొలగించండిమీరు చెప్పింది నిజమేనండీ.. స్వామి అనే నామం అమరకోశం ప్రకారం కేవలం సుబ్రహ్మణ్యుడికి మాత్రమే చెందినది. స్వామీ అనే నామమునకు “దేవసేనాపతీ, శూరః, స్వామీ, గజముఖానుజః “ అని అర్ధంగా ఇవ్వబడినది.
కాకపోతే, స్వామీ శంకరసంభవః అనే నామం లో స్వామి అనే సంబోధన శంకరుడిని కాక, సుబ్రహ్మణ్యుడికే ఆపాదించబడింది అనిపిస్తోంది. దీని ప్రకారం, స్వామీ శంకరసంభవః అంటే, "శంకరుని తేజస్సు నుండి జన్మించిన ఓ స్వామీ!" అని సుబ్రహ్మణ్యుడినే స్తుతి చేయబడిందేమో అని నా అభిప్రాయం.
ఇంక గణాధీశః పూర్వజః అనే నామాలను కలిపి గణేష్ ని అన్నగా కలవాడు అని భావన చేయడం తప్పులేదు. కాని నామం ప్రకారం గణాధీశః పూర్వజః అంటే విఘ్నేశ్వరుని కంటే ముందు వాడు అనే అర్ధం గోచరిస్తుంది. విఘ్నేశ్వరుడి తమ్ముడిగా చెప్పే నామం, స్కాంద పురాణంలో ఇవ్వబడిన సుబ్రహ్మణ్య స్వామి వారి సహస్ర నామములలో, స్వామి వారికి "ఓం గణనాధానుజాయ నమః" అనే నామం కలదు.
సుబ్రహ్మణ్య నామ రసం అనే పాయసంలో మీరు వేసిన చక్కెరతో పాటు కొంచెం ఏలకులు కలిపానండీ...
ధన్యవాదములతో..