ఉత్తర స్వామిమలై – శ్రీ స్వామినాథ స్వామి
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్య ధామములలో ప్రఖ్యాతి వహించిన ఆరుపడైవీడు క్షేత్రముల తరవాత అంతే స్థాయిలో ఏడవ పడైవీడుగా ప్రసిద్ధి గాంచిన పుణ్య క్షేత్రం - ఉత్తర స్వామి మలై. ఈ ఆలయం భారత దేశ రాజధాని అయిన హస్తినాపురములో (అంటే ప్రస్తుత న్యూ ఢిల్లీలో) ఉన్నది.
ఈ క్షేత్రములో సుబ్రహ్మణ్య స్వామి వారు శ్రీ స్వామినాథ స్వామిగా కొలువబడతారు. ఈ ఉత్తర స్వామిమలై తమిళనాడు లోని ఆరుసుబ్రహ్మణ్య క్షేత్రములలో ఒకటైన స్వామిమలై క్షేత్ర నమూనాలో నిర్మించబడినది. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారు, కర్పగ వినాయగర్, మీనాక్షీ అమ్మవారు, సుందరేశ్వర స్వామి వార్లు, ఇతర పరివార దేవతలు కొలువై ఉన్నారు. ఈ క్షేత్రమును సహస్రార క్షేత్రముగా కొలుస్తారు. సుబ్రహ్మణ్యుని ఆరుపడైవీడు క్షేత్రాలు మన శరీరంలో ఆరు చక్రములకు (షట్చక్రములు) ప్రతీకగా పెద్దలు చెప్తారు. అవి వరుసగా..
౧. తిరుచెందూర్ – మూలాధార చక్రం
౨. తిరుప్పరంకుండ్రం – స్వాధిష్టాన చక్రం
౩. స్వామి మలై – మణిపూరక చక్రం
౪. పళని – అనాహత చక్రం
౫. పళముదిర్చొళై – విశుద్ధి చక్రం
౬. తిరుత్తణి – ఆజ్ఞా చక్రం
౭. ఉత్తర స్వామి మలై – సహస్రార చక్రం
అయితే ఈ ఆరు చక్రములతో పాటు, బ్రహ్మరంధ్ర స్థానము అయిన సహస్రార చక్రంగా ఈ ఉత్తర స్వామి మలై క్షేత్రము అని గురువులు, పెద్దలు నిర్ధారించినారు. అందుకే ఈ ఉత్తర స్వామిమలైని సహస్రార క్షేత్రం అంటారు. (ఇక్కడ ఆలయంలో జరిగే ప్రతీ పూజా, ఉత్సవాలు అన్నిటా సంకల్పములో, భరత ఖండే, ఇంద్రప్రస్థ నగరే, గురుగ్రామే, “సహస్రార క్షేత్రే”.... అని ఇక్కడ అర్చకులు చదవడం నేను విన్నాను).
ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి గర్భగుడి 90 అడుగుల ఎత్తు ఉన్న కొండ మీద ఉంటుంది. తమిళ భాషలో కొండని మలై అంటారు. కాబట్టే, ఈ క్షేత్రము మలై మందిర్ అనే పేరుతో ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏమిటంటే, కరచరణాదులతో ఉన్న భగవంతుని మూర్తిని సాధారణంగా బ్రహ్మ స్థానం లోనూ, లేదా గర్భగుడి మధ్యలోనూ ప్రతిష్ఠ చేయరు. కానీ, ఇక్కడ ప్రత్యేకత సుబ్రహ్మణ్య స్వామి వారి మూల విగ్రహ మూర్తిని బ్రహ్మస్థానములో ప్రతిష్ఠ చేశారు.
|
స్వామి వారి గర్భగుడి |
క్షేత్ర ఆవిర్భావము:
1940 సంవత్సర ప్రాంతంలో ఢిల్లీ నగరంలో దక్షిణ భారత దేశీయులు తక్కువగా ఉండేవారు. ఆ సమయంలో స్వామినాథ స్వామి వారి యొక్క ఒక మహాభక్తుడు ఉండేవారు. వారికి భగవాన్ రమణ మహర్షి స్వయంగా పచ్చ తో తయారు చేసిన స్వామినాథ స్వామి వారి మూర్తిని బహూకరించారు. వీరు ఆ మూర్తిని ఎంతో భక్తి శ్రద్ధలతో రోజూ పూజించేవారు. ప్రతీ ఏటా కార్తీక మాసంలో తమిళులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరిపే స్కంద షష్ఠి ఉత్సవాలను ఈ భక్తుడు కూడా జరిపేవారు. వీరు మొదటగా 1943 లో స్వామినాథ స్వామి వారి మూర్తిని సకల జనులూ దర్శించేవిధంగా, స్కంద షష్ఠి ఉత్సవాలు జరపడం ప్రారంభించారు. నెమ్మదిగా ప్రతీ సంవత్సరమూ స్కంద షష్ఠి ఉత్సవాలలో పాల్గొనే భక్తుల సంఖ్య వేలలోకి చేరింది. స్వామి వారికి ఒక ప్రత్యేక ఆలయం నిర్మించవలసిన తరుణం ఆసన్నమయింది.
భక్తులు అందరూ 1961 లో స్వామినాథ స్వామి ఆలయం కోసం ఒక ఎత్తైన స్థలం వెదకడం ఆరంభించారు. అయితే, కారుణ్య మూర్తి అయిన సుబ్రహ్మణ్యుడు ఆయన మందిరం యొక్క స్థలం ఎక్కడ ఉండాలో వారే ఒక భక్తుని స్వప్నంలో కనిపించి తెలియజేశారు. స్వామి ఎంచుకున్న స్థలం, ఢిల్లీ నగరంలోనే వసంత గ్రామము అనే చోట, దట్టమైన రేగిచెట్ల నడుమ ఉన్న ఒక చిన్న కొండ. ప్రస్తుతం ఈ వసంత గ్రామమునే వసంత్ విహార్ గా పిలుస్తారు.
స్వామి వారే స్థల నిర్ణయం చేశాక, ఇక తిరుగు ఉంటుందా... ఆ తరువాత భారత ప్రభుత్వ పురాతత్వ శాఖ వారు ఈ కొండ ఉన్న స్థలమును ఆధ్యాత్మిక/ధార్మిక స్థలముగా అనువైనది అని అనుమతి మంజూరు చేశారు. అప్పట్లో (1961) శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానిగా ఉన్న రోజులు. వారి ప్రభుత్వం వసంత విహార్ లోని ఈ కొండ ఉన్న స్థలమును 21,000 రూపాయల ధరకు ఆలయ నిర్మాణమునకు కేటాయించారు.
1961 అక్టోబర్ 18 న, సుప్రీం కోర్టు జడ్జి, సంగీత కళానిధి శ్రీ వేంకటరమణ అయ్యర్ గారి ఆధ్వర్యంలో శ్రీ స్వామినాథ స్వామి సేవా సమాజం స్థాపించబడినది. నెమ్మదిగా ఆలయ నిర్మాణానికి భక్తుల నుంచి విరాళాలు సేకరించడం మొదలు పెట్టారు. నిధుల సేకరణలో భాగంగా, తమిళనాడు ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు, ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇరవై ఐదు వేల రూపాయలు, తిరుమల తిరుపతి దేవస్థానము వారు ఇరవై ఐదు వేల రూపాయలు స్వామి మలై నిర్మాణమునకు చేయి అందించారు. 1963 లో ఆ స్థలంలో ఒక చిన్న తాత్కాలిక మందిరమును నిర్మించి, ఒక ఉత్సవ మూర్తిని ఉంచి, నిత్య ఆరాధనలు ప్రారంభం చేశారు.
ఇక ప్రధాన మందిర నిర్మాణం చేపట్టే దిశగా, తమిళనాడు ప్రభుత్వ అనుమతితో, ప్రఖ్యాత ఆలయ వాస్తు-శిల్ప కళా నిపుణుడు, శ్రీ గణపతి స్థపతి గారు ఉత్తర స్వామి మలై మందిర నిర్మాణము చేసే బాధ్యత స్వీకరించారు. శ్రీ గణపతి స్థపతి గారు, శ్రీ వైద్యనాథ స్థపతి యొక్క కుమారుడు. వీరి ఆధ్వర్యంలో ఎన్నో ప్రఖ్యాత ఆలయ/భగవన్మూర్తుల నిర్మాణం జరిగింది. వీరిని కంచి పరమాచార్య స్వామి వారు ఎంతో అభిమానించి గౌరవించేవారు. (వీరి గురించి వేరే టపాలో తెలియజేస్తాను).
ఇక ఈ ఉత్తర స్వామి మలై మందిర నిర్మాణమునకు, అప్పటి కంచి కామకోటి పీఠాధిపతి నడిచే దేవుడు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారి ఆశీస్సులు లభించాయి. పరమాచార్య వారి ఆశీస్సులతో, దివ్య క్షేత్ర నిర్మాణము 1965 సెప్టెంబర్ 8వ తేదీన అప్పటి ప్రధాని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు మరియు తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ భక్తవత్సలం గారి చేతుల మీదుగా జరిగింది. అదే రోజు ఈ మందిరం నిర్మాణం కొఱకు అవసరమైన గ్రానైట్ రాళ్ళను చెక్కడానికి 75 మంది నైపుణ్యం కలిగిన శిల్పులతో తమిళనాడులోని వలజాబాద్ లో పని ప్రారంభం చేశారు. దగ్గరలో ఉన్న పట్టుమలై కుప్పం క్వారీ నుండి ఈ గ్రానైట్ రాళ్ళను తీసుకువచ్చారు. ఈ పని మొత్తం పూర్తి అవడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది.
శిలా సంగ్రహ మహోత్సవం:
ఇదే సమయంలో శ్రీ స్వామినాథ స్వామి వారి యొక్క మూల విగ్రహము తయారు చేయుట కొఱకు, 1967 జూన్ 2వ తేదీన, తమిళనాడులోని తిరునెల్వేలిలో “శిలాసంగ్రహ” వేడుక జరిగింది. కంచి కామకోటి పీఠాధిపతి అయిన శ్రీ పరమాచార్య వారి మరియు తిరుప్పనందల్ లోని కాశీ మఠ పీఠాధిపతి శ్రీ అరుళ్ నంది తంబిరన్ స్వామిగళ్ వార్ల ఆశీస్సులతో, సుబ్రహ్మణ్యస్వామి వారి మూర్తి చేయడానికి కావలసిన శిలను తాంబరవరుణి నది నుండి వెతికి పైకి తీశారు. ఇక్కడ ఒక అద్భుత విశేషం ఏమిటంటే, ఇదే తాంబర వరుణి నదిలోని ఏ ఆధార శిల నుండి అయితే ఉత్తర స్వామి మలై మూల విగ్రహము కోసం శిలా సంగ్రహం జరిగిందో, అదే ఆధార శిల నుండి, ఆరుపడైవీడులో ప్రఖ్యాత క్షేత్రమైన, తిరుచెందూర్ లోని సుబ్రహ్మణ్యుని మూల విగ్రహము యొక్క శిల కూడా ఇక్కడి నుండే సంగ్రహించారు. అంటే, ఆరుపడైవీడు తర్వాత, ఈ ఉత్తర స్వామిమలై క్షేత్రము “ఏడవ పడైవీడు”గా ప్రసిద్ధి గాంచినది అంటే ఆరు సుబ్రహ్మణ్య క్షేతములకు, ఈ సహస్రార క్షేత్రమునకు గల అవినాభావము (అభేదము) అవగతమవుతుంది.
తాంబరవరుణి నది నుంచి, మూలవిగ్రహ నిర్మాణం కోసం ఆ శిలను మహాబలిపురం తీసుకు వచ్చారు. శ్రీ గణపతి స్థపతి గారు స్వామి వారి మూలవిగ్రహమును తయారు చేయడానికి ముప్ఫై నెలలు సమయం పట్టింది. 1970 ఏప్రిల్ నెలలో, శ్రీ పరమాచార్య వారి ఆశీస్సుల కోసమై, స్వామి వారి మూలవిగ్రహ మూర్తిని కాంచీపురం తీసుకువెళ్ళారు. గణపతి స్థపతి గారి కళా నైపుణ్యానికి, వారి భక్తికి, పరమాచార్య వారు ఎంతగానో సంతోషించి, అభినందించారు. అప్పుడు పరమాచార్య స్వామి వారే స్వయంగా స్వామినాథ స్వామికి ప్రత్యేక అభిషేకములు, అర్చన జరిపారు.
|
పరమాచార్య స్వామి వారు స్వామినాథ స్వామి వారి మూర్తికి చేస్తున్న విశేష పూజలు |
అటు పిమ్మట స్వామినాథ స్వామి వారి మూర్తిని, న్యూ ఢిల్లీ లోని ఉత్తర మలై మందిర్ కి తీసుకువెళ్ళి, అక్కడ స్వామి వారిని “ధాన్య వాసము” లో ఉంచారు. ఈ మందిర నిర్మాణమునకు పట్టే అన్ని గ్రానైట్ శిలలను, తమిళనాడులోని వలజాబాద్ నుండి 1969 మే నెలకల్లా మొత్తం 19 రైలు బోగీలలో తరలించారు. ఈ శిలలను తయారు చేసిన 75 మంది శిల్పులు కూడా ఢిల్లీ చేరుకుని, ఇక్కడ నిర్మాణ కార్యక్రమం మొదలు పెట్టారు. 1969 సెప్టెంబర్ కల్లా పునాది నిర్మాణం పూర్తి చేసి, ఆలయ కట్టడం మొదలు పెట్టారు. ఈ ఆలయ నిర్మాణం ప్రత్యేకత ఏమిటంటే, ముందుగా తయారు చేసిన శిలలను తెచ్చి, సిమెంట్ వాడకుండా, సున్నపురాయి, ఇసుక, మొలాసెస్ మరియు పళ్ళ రసముల మిశ్రమాన్ని ఉపయోగించి అమర్చారు.
ఈలోగా, 1970 ఏప్రిల్ 26న, అప్పటి జ్యోతిర్మఠం శంకరాచార్యులు పూజ్య శ్రీకృష్ణ భోదాస్రామి వారిచేతుల మీదుగా “గర్భ న్యాసం” పూర్తి చేశారు.
1973 నాటికల్లా, మొత్తం ఆలయ నిర్మాణం పూర్తి అయింది. శ్రీస్వామినాథ స్వామి సేవా సమాజం వారి విన్నపం మేర, శ్రీ పరమాచార్య స్వామి వారి తర్వాత జగద్గురువులు శంకరాచార్య శ్రీ జయేంద్రసరస్వతీ స్వామి వారు (ప్రస్తుత కంచి కామకోటి పీఠాధిపతి) తమిళనాడులోని కాంచీపురం నుండి మొదలుకొని, ఢిల్లీ లోని ఉత్తర స్వామిమలై వరకు 2400 కిలోమీటర్ల దూరం కాలినడకన విజయ యాత్రచేశారు. వారి ఈ పాదయాత్ర ఫిబ్రవరి 1973 లో ప్రారంభం అయ్యి, కాంచీపురం నుండి తిరుపతి, హైదరాబాద్, నాగపూర్,ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా, మథురా నగరముల మీదుగా వెడుతూ జూన్ 1973 మొదటి వారానికల్లా, మొత్తం నాలుగు నెలల పాదయాత్ర తర్వాత ఉత్తర మలై మందిర్ చేరుకున్నారు.
1973 జూన్ 4వ తేదీన, శంకరాచార్య శ్రీ శ్రీ శ్రీ జయేంద్రసరస్వతీ స్వామి వారు స్వామినాథ స్వామి గర్భాలయ యంత్రస్థాపన చేశారు. పూరీలోని గోవర్ధన పీఠాధిపతి శంకరాచార్య శ్రీ నిరంజన దేవ్ తీర్థ మహారాజ్ వారు, జ్యోతిర్మఠ శంకరాచార్య శ్రీ శ్రీ శ్రీ కృష్ణ బోధస్రామి మహారాజ్ గారు ఈ యంత్ర స్థాపన మహోత్సవంలో పాల్గొన్నారు. అప్పటికే శ్రీ స్వామినాథ స్వామి వారిని ధాన్యవాసం నుండి మార్చి, జలాధివాసంలో ఉంచారు.
మహాకుంభాభిషేకం:
|
మహాకుంభాభిషేకం |
1973 జూన్ 7వ తేదీన, ఎన్నో సంవత్సరాలుగా భక్తులు ఎదురుచూస్తున్న, స్వామినాథ స్వామి వారి ఆలయ మహాకుంభాభిషేకం జరిగింది. ఆ రోజు ఈ క్రతువు వీక్షించడానికి సుమారు మూడు లక్షల మంది భక్తులు వచ్చారు. ఈ మహాకుంభాభిషేక కార్యక్రమమును, కంచి శంకరాచార్య శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి వారి ఆధ్వర్యంలో, సర్వ సాదకం శివాచారియర్ అయ్యమణి శివం గారు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని యాగశాలలో 47 హోమ కుండములు, 64 కలశలతో, దేశములోని వివిధ ప్రదేశాల నుండి వచ్చిన వంద మంది శివాచారులు, వేద పండితులు హోమము, పూజాది క్రతువులు నిర్వహించారు.
తరువాత, కంచి శంకరాచార్యుల వారి అనుజ్ఞ మేరకు, ఒక చక్కని శిల్ప కళామండపం కూడా నిర్మించారు. అటు పిమ్మట, కర్పగ వినాయకుడి, మీనాక్షీ అమ్మ వారి మరియు సుందరేశ్వరుని మందిరములను, కొండ దిగువ భాగంలో నిర్మించారు. పరమాచార్య స్వామి వారి ఆజ్ఞ మేరకు, మీనాక్షి సుందరేశ్వరుల మందిరములు మధురై మీనాక్షీ ఆలయ నమూనాలో నిర్మించారు.
|
మీనాక్షీ సుందరేశ్వర మరియు కర్పగ వినాయక మందిరం |
సుందరేశ్వరుని మందిరం లోని శివ లింగము, ఓంకారేశ్వర్ లోని నర్మదా నది నుంచి సంగ్రహించిన “బాణ లింగం”. ఈ సుందరేశ్వరుని పరివార దేవతలలో, వీణా దక్షిణామూర్తి, చండీశ్వరుడు, కాల భైరవ స్వామి వారు, నవగ్రహ మంటపము ప్రతిష్టించబడ్డాయి.
ఈ మందిరం పల్లవుల నిర్మాణ పద్ధతిలో నిర్మాణం జరిగింది. స్వామినాథ స్వామి మందిరం చోళుల నిర్మాణ శైలిలోనూ, మీనాక్షీ అమ్మ మందిరం పాండ్యుల నిర్మాణ శైలి లోనూ జరిగింది. మీనాక్షీ, సుందరేశ్వరుల ఆలయ యంత్రస్థాపన మరియు మహాకుంభాభిషేకం మరియు స్వామినాథ స్వామి వారి జీర్ణోద్ధారణ కుంభాభిషేక మహోత్సవములు కలిపి ఒకేసారి 1990 జూన్ 13వ తేదీన జరిగాయి.
1990 సంవత్సరంలో, ఇదే క్షేత్రంలో ఆది శంకరాచార్యుల వారి ధ్యాన మందిరం కూడా నిర్మించబడినది. వీటితో పాటు, ఈ ఆలయంలో ప్రఖ్యాత “కావడి ఉత్సవం” ఆవిర్భావానికి కారణం అయిన సుబ్రహ్మణ్య భక్తుడు, అగస్త్య మహర్షి శిష్యుడు అయిన శ్రీ ఇడుంబన్ మందిరం కూడా నిర్మించారు. ఈ ఇడుంబన్ మందిరం స్వామినాథ స్వామి వారి సన్నిధికి మెట్లు ఎక్కే దారిమధ్యలో ఉంటుంది. ఇక్కడ ఇడుంబన్ కి నమస్కరించిన తరువాతనే, పైకి సుబ్రహ్మణ్య దర్శనమునకు వెళ్ళాలి. అలాగే ఇంకొంచెం పైకి మెట్ల మార్గంలో వెడితే, అక్కడ నాగేంద్ర స్వామి వారి రూపంలో ఉన్న సుబ్రహ్మణ్యుడు దర్శనమిస్తాడు.
|
స్వామినాథస్వామి వారిని చేరే మార్గంలో నాగేంద్ర స్వామి వారు |
ఇంకా పైకి కొండ మీదకి వెళ్ళాక, సుబ్రహ్మణ్య స్వామి వారి గర్భ గుడి ప్రాంగణంలో విష్ణు దుర్గ అమ్మ వారు కొలువై ఉంటారు. అక్కడ అమ్మ వారిని దర్శించుకుని, లోపలికి వెడితే, సర్వాలంకార శోభితుడై, శక్తి ఆయుధం చేతబూని, చిరునవ్వులు చిందిస్తూ, దివ్య మంగళమైన స్వరూపంతో స్వామినాథ స్వామి వారు దర్శనం ఇస్తారు. గర్భగుడి బయట స్వామివారి ఎడమవైపు తారక పరమేశ్వరార్ అనే పేరున లింగ రూపంలో దర్శనమిస్తారు శంకరుడు. ఆ ప్రక్కనే చిదంబరేశ్వరుడు నటరాజ మూర్తిగా దర్శనమిస్తారు. ఆ ప్రక్కనే వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఉత్సవ మూర్తులు కొలువై ఉంటారు. ఇవి కాక, క్రింద సుందరేశ్వర స్వామి వారి సన్నిధిలో వీణా దక్షిణామూర్తి, చండికేశ్వరుడు, కాలభైరవుడు కొలువై ఉంటారు.
ఉత్తర స్వామి మలైలో జరిగే పూజలు మరియు ఆర్జిత సేవలు:
వైదిక ఆగమాలను అనుసరించి రోజూ నాలు వేళలలో స్వామినాథ స్వామి వారికి, మీనాక్షీ అమ్మ వారికి, సుందరేశ్వరస్వామి వారికి, కర్పగ వినాయకుడికి పూజలు చేస్తారు. ఈ క్షేత్రములో స్వామి వారికి, మిగతా అందరు పరివార దేవతలకి, రోజూ ఉదయం సాయంత్రం అభిషేకములు జరుగుతాయి.
ఇవి కాక ప్రతీ సంవత్సరం కార్తీక మాస శుక్ల పాడ్యమి మొదలుకొని స్కంద షష్ఠి ఉత్సవాలు చేస్తారు. ఆరు రోజుల ఉత్సవం అయ్యాక, చివరి రోజున, దేవసేనా, సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా చేస్తారు. ఆ కళ్యాణం రోజున కనీసం పదివేలకి పైగా భక్తులు వస్తారు. ఈ స్కంద షష్ఠి జరిగే రోజులలో, ఉదయం పది గంటలకు “కావిడి” ఉత్సవం చేస్తారు. ఈ కావిడి ఉత్సవంలో కనీసం ఐదు వందల మంది భక్తులు పాలతో నింపిన కావిడిలు భుజాన ఎత్తుకుని, ఆర్తితో, పెద్దగా “వేల్ వేల్ మురుగా వెట్రివేల్ మురుగా! వెట్రివేల్ మురుగనకు హరోం హర! జ్ఞాన వేల్ మురుగనకు హరోం హర!” అని స్వామి నామం చేస్తూ హస్తినాపుర రాజ వీధులలో స్వామి వారి కొండ చుట్టూ ప్రదక్షిణం చేసి వస్తారు. అలా కావిడిలో తెచ్చిన పాలతో, మరియు పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పళ్ళ రసములు, గంధము, విభూతి మొదలగు ద్రవ్యములతో వల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యస్వామి వారికి (ఉత్సవ మూర్తి) అద్భుతమైన అభిషేకం చేస్తారు. ఈ అభిషేకంలో శ్రీ వైద్యనాథ శివాచారి అనే అర్చకస్వామి వారు కనీసం గంటన్నర పైగా కేవలం పాలతోనే అభిషేకిస్తారు. నిజంగా ఈ అద్భుత ఘట్టం చూసి తీరాలి. ఆ పాలలో మునిగి తేలుతున్న సుబ్రహ్మణ్యుడిని చూస్తే, ఎంతో ముద్దుగా ఉంటుంది. ఆ తర్వాత విభూతి అభిషేకం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ అభిషేకం చూస్తున్న భక్తులకు స్వామి వారి యొక్క విశేష అనుగ్రహం లభిస్తుంది. ఇలా అభిషేకం అయ్యాక, సాయంత్రం దేవసేనా, సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం.
ఇదే విధంగా, ప్రతీ ఏటా ఫాల్గుణ మాసంలో (ఫాల్గుణి ఉత్తరం అంటారు) వల్లీ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం చేస్తారు. ఈ మాసంలో కూడా ఆరు రోజులు ఉత్సవం చేసి, చివరి రోజున కళ్యాణం చేస్తారు. పైన చెప్పిన రెండు సందర్భాలలోనూ (స్కంద షష్ఠి, ఫాల్గుణి ఉత్తరం), స్వామి వారి కళ్యాణంలో పాల్గొనే భాగ్యం మాకు స్వామి వారు కటాక్షించారు. అంతే కాక, "కావడి" ఉత్సవంలో కూడా పాల్గొని, పాల కావిడలు ఎత్తి, "మేము సుబ్రహ్మణ్యుడి దగ్గరకి వెడుతున్నాము" అని ఆనందంగా స్వామి సేవల్లో పాల్గొనే అదృష్టం కలుగజేశారు స్వామి వారు.
ఈ క్షేత్రమును చేరే మార్గములు:
ఉత్తర స్వామి మలై మన దేశ రాజధాని నగరం అయిన ఢిల్లీలో వసంత్ విహార్, సెక్టార్-7, ఆర్.కే.పురం అనే ప్రాంతంలో ఉంది. ఢిల్లీ విమానాశ్రయం నుండి ఈ మందిరం కేవలం పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఢిల్లీ లోని ఉత్తర భారతీయులకు ఈ క్షేత్రం “మలై మందిర్” అనే పేరుతో బాగా ప్రతీతి. హిందీ వారు సుబ్రహ్మణ్యస్వామి వారిని కార్తికేయ అనే నామంతో పిలుస్తారు.
ఈ క్షేత్రం యొక్క వెబ్ సైట్:
Address | Sree Swaminatha Swami Seva Samaj,
Sree Uttara Swami Malai Temple (or Malai Mandir)
Sector VII, Rama Krishna Puram,
New Delhi 110 022 |
| |
Phones | 91- 011- 2616 3373 or 2617 5104 |
ఇంత అద్భుతమైన ఈ ఉత్తర స్వామిమలై తప్పక చూడవలసిన క్షేత్రము. అవకాశం ఉన్నవారు, ఢిల్లీ నగరం వచ్చినప్పుడైనా తప్పక ఈ సహస్రార క్షేత్రములో స్వామినాథస్వామి వారి దర్శనం చేసుకుని స్వామి అనుగ్రహ కటాక్షాలు పొందుదాము.
|
సర్వం శ్రీ వల్లీదేవసేనాసమేత శ్రీ సుబ్రహ్మణ్యార్పణమస్తు. |