22, జనవరి 2016, శుక్రవారం

భగవాన్ క్రోధభట్టారక విరచిత శ్రీ ఆర్యాద్విశతి తాత్పర్యము - 9


శ్రీ గురుభ్యో నమః

II ఆర్యా ద్విశతి - 41వ శ్లోకము II
వప్రద్వయాంతరుర్వ్యాం వటుకై ర్వివిధైశ్చ యోగినీబృందైః I
సతతం సమర్చితాయాః సంకర్షిణ్యాః ప్రణౌమి చరణాబ్జమ్ II ౪౧

తాః వప్రద్వయాంతః - పద్మరాగ, గోమేధిక ప్రాకారముల మధ్యన, ఉర్వ్యాం - ప్రదేశమునందు ఉండు, వటుకైః - వటువుల చేతను, వివిధైశ్చ - నానావిధములైన, యోగినీబృందైః - యోగినుల సమూహములచేతను, సతతం - ఎల్లప్పుడూ, సమర్చితాయాః - పూజింపబడుచున్న, సంకర్షిణ్యాః - సంకర్షిణీ దేవత, చరణాబ్జమ్ - పాదకమలములను, ప్రణౌమి - నమస్కరించుచున్నాను.
పద్మరాగ, గోమేధిక ప్రాకారముల మధ్యన ఉండే ప్రదేశమున, వటువులచేతనూ, అనేకరకములైన యోగినుల చేతను పూజింపబడుతున్న సంకర్షిణీ దేవత పాదపద్మములకు నమస్కరించుచున్నాను !!

II ఆర్యా ద్విశతి - 42వ శ్లోకము II
తాపసయోజనదూరే తస్య సముత్తుంగ గోపురోపేతః I
వాంఛాపూర్త్యై భవతా ద్వజ్రమణీని కరనిర్మితో వప్రః II ౪౨

తాః తస్య - గోమేధిక ప్రాకారమునకు, తాపసయోజనదూరే - ఏడు యోజనముల దూరమునందు ఉండు (తాపస=ఋషి సంఖ్య), ఉత్తుంగ గోపురోపేతః - మిక్కిలి పొడవైన గోపురములతో కూడినదియు, వజ్రమణీని కరనిర్మితః - వజ్రమణుల గుంపులతో నిర్మింపబడిన, వప్రః - ప్రాకారము, వాంఛాపూర్త్యై - నా కోరికను నెరవేర్చుటకు, భవతాత్ - అగుగాక.
పదకొండవ (గోమేధిక) ప్రాకారమునకు, ఏడు యోజనముల దూరము నందు ఉండు, మిక్కిలి పొడవైన గోపురములతో కూడినదియు, వజ్రమణులతో నిర్మింపబడిన పన్నెండవ ప్రాకారము - నా మనోవాంఛలను నెరవేర్చుగాక !!

II ఆర్యా ద్విశతి - 43వ శ్లోకము II
వరణద్వితయాంతరతో వాసజుషో విహితమధురసాస్వాదాః I
రంభాదివిబుధవేశ్యా రచయంతు మహాంతమస్మదానందమ్ II ౪౩

తాః వరణద్వితయాంతరతః - గోమేధిక, వజ్రమణి ప్రాకారముల మధ్యన, వాసజుషః - వాసము చేయుచున్నట్టి, విహితమధురసాస్వాదాః - మద్యములను త్రాగుచున్న, రంభాదివిబుధవేశ్యాః - రంభ మొదలగు దేవతా వేశ్యలు, మహాంతమ్ - గొప్పదైన, అస్మదానందం - మా యొక్క సంతోషమును, రచయంతు - కలిగింతురు గాక. 
గోమేధిక, వజ్రమణి ప్రాకారముల మధ్యన వాసము చేయు రంభ మొదలైన దేవతా వేశ్యలు, మాకు సంతోషములను కలుగజేయుదురు గాక !!

II ఆర్యా ద్విశతి - 44వ శ్లోకము II
తత్ర సదా ప్రవహంతీ తటినీ వజ్రాభిధా చిరం జీయాత్ I
చటులోర్మిజాలనృత్యత్కలహంసీకులకలక్వణితపుష్టా II ౪౪

తాః తత్ర - ఆ ప్రదేశమునందు, సదా - ఎల్లప్పుడూ, ప్రవహంతీ - పాఱుచున్నదియు, చటుల - చలించుచున్నది, ఊర్మిజాల - అలల సమూహములయందు, నృత్యత్ - ఆడుచుండు, కలహంసీకుల - రాయంచమగువల సమూహములయొక్క, కలక్వణిత - మధురములగు ధ్వనులచేత, పుష్టా - నిండినదియు, వజ్రభిధా - వజ్రయను పేరుగల, తటినీ - నది, చిరం - ఎల్లప్పుడూ, జీయాత్ - సర్వోత్కృష్టముగా వర్తించుగాక !!

గోమేధిక, వజ్రమయ ప్రాకారముల నడుమ, ఎల్లప్పుడూ ప్రవహించునది, అలల సమూహములయందు కలహంసల మధురధ్వనులచేత నిండినది అయిన, వజ్ర అను పేరుగల నది, ఎల్లప్పుడూ సర్వోత్కృష్టముగా వర్ధిల్లుగాక !!

II ఆర్యా ద్విశతి - 45వ శ్లోకము II
రోధసి తస్యా రుచిరే వజ్రేశీ జయతి వజ్రభూషాఢ్యా I
వజ్రప్రదానతోషిత వజ్రిముఖత్రిదశ వినుతచారిత్రా II ౪౫

తాః తస్యాః - ఆ నది యొక్క (అనగా వజ్ర నది యొక్క), రుచిరే - సొబగైన, రోధసీ - తీరమునందు, వజ్రభూషాఢ్యా - రవలు చెక్కిన సొమ్ములు ధరించినదియు, వజ్రప్రదాన - వజ్రాయుధమును ఇచ్చుటచేత, తోషిత - సంతోషపెట్టబడిన, వజ్రి - దేవేంద్రుడు, ముఖ - మొదలగు, త్రిదశ - దేవతలచేత, వినుత - కీర్తించబడిన, చారిత్రా - చరిత్ర గలదియు, వజ్రేశీ - వజ్రేశ్వరి యను దేవత, జయతి - సర్వోత్కృష్టముగా వర్తించుచున్నది.
వజ్ర నది యొక్క సొబగైన తీరమునందు, వజ్రాయుధము ఇచ్చుటచేత సంతోషపెట్టబడిన దేవేంద్రుడు మొదలైన దేవతలచేత కీర్తింపబడిన/నమస్కరింపబడిన చరిత్ర కలది, వజ్రభూషణములు ధరించినది అయిన, వజ్రేశ్వరీ అను దేవత సర్వోత్కృష్టముగా వర్తించుచున్నది (జయము కలుగుగాక) !!

(సశేషం .... )


సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి