19, జనవరి 2016, మంగళవారం

భగవాన్ క్రోధభట్టారక విరచిత శ్రీ ఆర్యాద్విశతి తాత్పర్యము - 6


శ్రీ గురుభ్యో నమః

II ఆర్యా ద్విశతి - 26వ శ్లోకము II
కాదంబవిపినవాటీమనయోర్మధ్యభువి కల్పితావాసామ్ I
కలయామి సూనకోరకకందళితామోదతుందిలసమీరామ్ II ౨౬

తాః అనయోర్మధ్యభువి - ఏడవది అయిన వెండి మరియు ఎనిమిదవది అయిన బంగారు ప్రాకారముల మధ్యన, కల్పితావాసామ్ - చేయబడిన నివాసం గలదియు, సూన - పూయుచున్న, కోరక - మొగ్గల నుండి, కందళిత - పుట్టుచున్న ఆమోద - పరిమళముచేత, తుందిల - బలసిన (నిండిన), సమీరాం - వాయువు కలదియు అగు, కాదంబవిపినవాటీం - కడిమిమ్రాకుల తోపును, కలయామి - ధ్యానించుచున్నాను !! 
వెండి, బంగారు ప్రాకారముల మధ్యన పూయుచున్న మొగ్గల పరిమళముచేత నిండిన వాయువులు కల కదంబవనమును ధ్యానించుచున్నాను !!

II ఆర్యా ద్విశతి - 27వ శ్లోకము II
తస్యామతిశిశిరాకృత్యాసీన స్తపస్తపస్యలక్ష్మీభ్యామ్ I
శివమనిశం కురుతాన్మే శిశిరర్తుః సతతశీతలదిగంతః II ౨౭

తాః తస్యాం - ఆ కదంబవనమునందు ఉండు, అతిశిశిర - మిక్కిల చల్లనైన, ఆకృతి - రూపముగల, తపస్ - మాఘ మాసము, తపస్య - ఫాల్గుణ మాసము అనెడు, లక్ష్మీభ్యాం - లక్ష్ములతో (సంపదలతో), ఆసీనః - కూర్చొనిఉన్న, సతత - ఎల్లప్పుడూ, శీతలదిగంతః - చల్లని దిక్కుల కొనలు కలదియు, శిశిరర్తుః - శిశిర ఋతువు, మే - నాకు, శివం  - మంగళమును, అనిశం - ఎల్లప్పుడూ, కురుతాత్ - చేయుగాక !!
వెండి, బంగారు ప్రాకారముల మధ్యన ఉన్న కదంబవనము నందు మాఘ, ఫాల్గుణ మాస సంపదలతో కూడినది, దిక్కులన్నిటియండు చల్లగా వ్యాపించునది అయిన శిశిర ఋతువు, మాకు ఎల్లప్పుడూ మంగళములను చేయుగాక !!

II ఆర్యా ద్విశతి  - 28వ శ్లోకము II
తస్యాం కదంబవాట్యాం తత్ప్రసవామోదమిళితమధుగంధమ్ I
సప్తావరణమనోజ్ఞం శరణం సముపైమి మంత్రిణీశరణమ్ II ౨౮

తాః తస్యాం కదంబవాట్యాం - ఆ కదంబ వనమునందు ఉన్న, తత్ప్రసవ - ఆ కదంబపుష్పముల, ఆమోదమిళిత - పరిమళముతో కూడిన, మధుగంధం - తేనెవాసనలు గలదియు, సప్తావరణమనోజ్ఞం - ఏడు ప్రాకారములచేత రమ్యమైనదియు, మంత్రిణీశరణం - మంత్రిణీదేవత యొక్క వాసస్థానమును (గౄహమును), శరణం సముపైమి - శరణు వేడుచున్నాను (సేవించుచున్నాను). 
వెండి, బంగారు ప్రాకారముల మధ్యన ఉన్న కదంబవనము నందు ఉన్న కదంబ పుష్పముల పరిమళములతో కూడిన, తేనెల వాసనలు కలిగినది, ఏడు ప్రాకారములచేత రమ్యమైనది అయినటువంటి మంత్రిణీదేవత యొక్క గృహమున శరణు వేడుచున్నాను !!
మంత్రిణీ - సచివేశానీ - శ్యామలా - కదంబవనవాసినీ - ఇవి మొదలైనవి సంగీతయోగిని పేర్లు. ఈమెయే 35వ శ్లోకము నందు చెప్పబడిన సంగీతమాతృకాదేవి. 

సంగీతయోగిన్యాః షోడశనామాని యథా I
సంగీతయోగినీ శ్యామా శ్యామలా మంత్రినాయికా II
మంత్రిణీ సచివేశానీ ప్రధానేశీ శుకప్రియా I
వీణవతీ వైణికీ చ ముద్రిణీ ప్రియకప్రియా II
నీపప్రియా కదంబేశీ కదంబవనవాసినీ I
సదామదా చ నామాని షోడశైతాని కుంభజః II
ఏతైర్యస్సచివేశానీం సకృత్సౌతి శరీరవాన్ I
తస్య త్రైలోక్యమఖిలం వశేతిష్ఠత్య సంశయః II ( లలితోపాఖ్యానము)

ఈ దేవె శ్రీలలితాదేవి యొక్క బుద్ధి నుండి పుట్టినది. 

బుద్ధేశ్చ లలితాదేవ్యాశ్స్యామలా పరమేశ్వరీ I
వీణాశుకలసత్పాణిర్జాతా సంగీతయోగినీ II (లలితోపాఖ్యానము నుంచి..)

II ఆర్యా ద్విశతి - 29వ శ్లోకము II
తత్రాలయే విశాలే తపనీయారచిత తరళసోపానే I
మాణిక్యమండపాంతర్మహితే సింహాసనే మణీఖచితే II ౨౯ 

తాః తత్రాలయే విశాలే - విశాలమైన ఆ గృహమునందు ఉండు, తపనీయ - బంగారము చేత, ఆరచిత - చేయబడిన, తరళ - నునుపైన, సోపానే - మెట్లుగల, మాణిక్యమంటపాంతః - మాణిక్యమయమగు మంటపమధ్యమునందు, మణీఖచితే - రత్నములు పొదుగబడిన, మహతి - గొప్పదైన, సింహాసనే - సింహాసనము నందు ...
 

(సశేషం ....)

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి