20, జనవరి 2016, బుధవారం

భగవాన్ క్రోధభట్టారక విరచిత శ్రీ ఆర్యాద్విశతి తాత్పర్యము - 7


శ్రీ గురుభ్యో నమః

II ఆర్యా ద్విశతి - 30 నుంచి 35వ శ్లోకములు II
బిందు త్రికోణపంచ ద్విపనృపవసువేదదళసురేఖాడ్యే I
చక్రే సదా నివిష్టాం షష్ట్యష్టత్రింశదక్షరేశానామ్ II ౩౦
తాపింఛమేచకాంగీం తాళీదళఘటిత కర్ణతాటంకామ్ 
తాంబూలపూరితముఖీం తామ్రాధరబింబదృష్టదరహాసామ్ II ౩౧
కుంకుమపంకిలదేహాం కువలయజీవాతుశాబకవతంసామ్ I
కోకనదశోణచరణాం కోకిలనిక్వాణకోమలాలాపామ్ II ౩౨
వామాంసలుళితచూళీవలమాన కదంబమాలికాభరణామ్ II
ముక్తాలలంతికాంచిత ముగ్ధాళికమిళితచిత్రకోదారామ్ II ౩౩
కరవిధృతకీరశాబక కలనినదవ్యక్త నిఖిలనిగమార్ధామ్ II
వామకుచసంగివీణావాదన సౌఖ్యార్ధమీళితాక్షియుగామ్ II ౩౪
ఆపాటలాంశుకధరా మాదిరసోన్మేష వాసితకటాక్షామ్ I
అమ్నాయసారగుళికామాద్యాం సంగీతమాతృకాం వందే II ౩౫

తాత్పర్యముః 
30వ శ్లోకమున చెప్పబడినదంతయు మంత్రశాస్త్రము. ఈ శ్లోకము నుంచి 35వ శ్లోకము వరకు సంగీతమాతృకాదేవి గురించిన వర్ణనము చెప్పబడినది. సంగీతమాతృకాదేవి అంటే శ్యామలా దేవి అని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి ఆర్యా ద్విశతి ప్రవచనములో చెప్పారు.

తాపింఛ - కానుగు ఆకుల వలె, మేచక-నల్లనయిన, అంగీం - శరీరము గలదియు, తాళీదళ - తాటి ఆకులతో, ఘటిత - చేయబడిన, కర్ణ - చెవియందలి, తాటంకాం - కమ్మలు గలదియు, తాంబూలపూరితముఖీం - నోటి నిండా తాంబూలము చర్వణముచేత నిండి ఉన్నదియు, తామ్ర - ఎర్రని, అధరబింబ - దొండపండువంటి పెదవి యందు, దృష్ట - కనబడుచున్న, దరహాసాం - చిరునవ్వు కలదియు. అనగా, కానుగు ఆకులవలె నల్లనయిన శరీరం కలిగి, తాటి ఆకులతో చేయబడిన తాటంకములను ధరించినది, తాంబూలపూరితముఖీ, ఎర్రని పెదవులు కలిగి, చిరునవ్వు కలిగినదియు (31వ శ్లోకము) 

కుంకుమ - కుంకుమచేత పంకిల - పూయబడిన, దేహాం - శరీరము గలదియు, కువలయజీవాతు - కలువలకు ప్రాణాధారమైన చంద్రుని యొక్క, శాబక - బాలుని (బాలచంద్రుని), వతంసాం - శిరోభూషణముగా గలదియు, కోకనద - ఎర్రతామర వలె, శోణ - ఎర్రని, చరణాం - పాదములు గలదియు, కోకిల - కోయిలయొక్క, నిక్వాణ - ధ్వనివలే, కోమల - మనోజ్ఞమైన, ఆలాపాం - కంఠస్వరము గలదియు (32వ శ్లోకము)

వామాంస - ఎడమ భుజమునందు, లుళిత - జారుతున్న, చూళీ - క్రొమ్ముడినుండి (కొప్పునుండి), వలమాన - వ్రేలాడుచున్న, కదంబమాలికా - కడిమిపూల దండను, ఆభరణాం - ధరించినదియు, ముక్తాలలంతికా - ముత్యములతో కూర్పబడిన హారముచేత, అంచిత - ఒప్పుచున్న, ముగ్ధ - సుందరమైన, అళిక - ఫాలప్రదేశమునందు, మిళిత- కూడిన, చిత్రిక - బొట్టుచేత, ఉదారాం -మహనీయముగా ఉన్నదియు.. (33వ శ్లోకము)

కర - చేతియందు, విధృత - ధరింపబడిన, కీరశాబక - చిలుకపిల్లయొక్క, కల - అవ్యక్తమధురమైన, నినద - శబ్దముచేత, వ్యక్త - ప్రకటింపబడిన, నిఖిల - సమస్తమైన, నిగమార్ధాం - వేదార్ధములు గలదియు, వామకుచ - ఎడవ స్తనము నందు, సంగి -చేరిన, వీణావాదన - వీణ వాయించుటవలన కలిగెడు, సౌఖ్య - ఆనందముచేత, అర్ధమీళిత - సగము మూయబడిన, అక్షియుగాం - నేత్రద్వయము గలదియు (34వ శ్లోకము)

ఆపాటల - మిక్కిల ఎర్రనయిన, అంశుక - పైటను, ధరామ్ - తాల్చినదియు, ఆదిరస - శృంగారరసము, ఉన్మేష - ప్రకాశముచేత, వాసిత - మిళితమైన, కటాక్షాం - క్రీగంటిచూపులు గలదియు, ఆమ్నాయసారగుళికాం - రాశీభూతమైన వేదాసారముగా ఉన్నదియు, ఆద్యాం - మొదటి దేవతయగు, సంగీతమాతృకాం - సంగీతమాతృకయను దేవికి, వందే - నమస్కరించుచున్నాను.

సంగ్రహముగా ----- "నల్లని శరీరము కలిగి, తాటిఆకుల తాటంకములు ధరించి, తాంబూలచర్వణము చేస్తూ ఉన్నది, ఎర్రని పెదవుల నుండి చిరునవ్వు కలది, కుంకుమపూవులచేత పూయబడిన ఎర్రని శరీరము కలిగినది, శిరస్సుపై చంద్రవంకను ధరించినది, ఎర్రని చరణకమలములు కలిగినది, కోయిల స్వరంవంటి కమనీయమైన కంఠస్వరము కలిగినది, సకల వేదార్ధములను పలికే చిలుకను చేతియందు ధరించినది, వీణానాదముచేత హృదయమునందు ఆనందపారవశ్యము చెంది, అర్ధనిమీళిత నేత్రములు కలిగినది, మిక్కిలి ఎర్రని చీరను ధరించినది, శృంగారరసముతో కూడిన క్రీగంటి చూపులు కలిగినది, వేదరాశి యొక్క రాశీభూతమైన ఆదిదేవత, సంగీతమాతృకామాత (శ్యామలాదేవికి) నేను నమస్కరించుచున్నాను".

(సశేషం .... )

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి