శ్రీ గురుభ్యో నమః
II ఆర్యా ద్విశతి - 46వ శ్లోకము II
తస్యోదీచ్యాం హరితి స్తబకిత సుషమావలీఢవియదంతః I
వైడూర్యరత్నరచితో వైమల్యం దిశతు చేతసో వరణః II ౪౬
తాః తస్య - పన్నెండవ (వజ్రమయ ప్రాకారమునకు), ఉదీచ్యాం - ఉత్తరపు (పై భాగమునందు), హరితి - దిక్కునందు ఉండు, స్తబకిత - గుంపులుగా ఉండు, సుషమా - ఉత్కృష్టమైన కాంతులచేత, అవలీఢ - వ్యాపింపబడిన, వియదంతః - ఆకాశముయొక్క కొనలు గలదియు (అనగా బాగా పొడవైన), వైడూర్యరత్నరచిత - వైఢూర్య మణులచేత నిర్మింపబడినది, వరణః - ప్రాకారము, చేతసః - మనస్సుకు, వైమల్యం - నిర్మలత్వమును (ప్రసన్నత్వమును), దిశతు - ఇచ్చుగాక !!
వజ్రమయ ప్రాకారమునకు పై భాగమునండు, గుంపులుగా ఉత్కృష్టమైన కాంతులచేత వ్యాపింపబడినది, ఆకాశమంత ఎత్తులో కొనలు కలిగి, వైఢూర్య మణులచే చేయబడిన పదమూడవ ప్రాకారము - మా మనస్సుకు నిర్మలత్వమును చేకూర్చుగాక !!
II ఆర్యా ద్విశతి - 47వ శ్లోకము II
అధిమధ్యమేతయోః పున రంబాచరణావలంబితస్వాంతాన్ I
కర్కోటకాదినాగాన్ కలయామః కించ బలిముఖాన్ దనుజాన్ II ౪౭
తాః ఏతయోః - ఆ రెండు (వజ్ర, వైఢూర్య ప్రాకారముల), అధిమధ్యం - మధ్యప్రదేశమునందు, పునః - వాక్యాలంకారార్ధము ప్రయోగింపబడినది, అంబా - పరమేశ్వరి యొక్క, చరణావలంబిత - చరణ కమలములను ఆశ్రయించిన, స్వాంతాన్ - మనస్సుగలవారగు, కర్కోటకాదినాగాన్ - కర్కోటకుడు మొదలైన సర్పరాజులను, కలయామః - ధ్యానించుచున్నాను.
వజ్ర వైఢూర్య (పన్నెండు, పదమూడవ) ప్రాకారముల మధ్య ప్రదేశము నందు, లలితాపరమేశ్వరి అమ్మవారి చరణము యందు మనస్సు గలవారైన కర్కోటకుడు మొదలైన సర్పములను నేను ధ్యానించుచున్నాను.
II ఆర్యా ద్విశతి - 48వ శ్లోకము II
గంధవహసంఖ్యయోజనదూరే గగనోర్ధ్వజాంఘికస్తస్య I
వాసవమణిప్రణీతో వరణో బహుళయతు వైదుషీం విశదామ్ II ౪౮
తాః తస్య - ఆ వైఢూర్య ప్రాకారమునకు గంధవహసంఖ్యయోజనదూరే - ఏడు యోజనముల దూరము నందు ఉండు (గంధవహ - వాయువు), గగన - ఆకాశమునకు, ఊర్ధ్వ - పైభాగమున, జాంఘిక - ఎగురునట్టి, వాసవమణిప్రణీతః - ఇంద్రనీలమణులతో నిర్మింపబడిన (వాసవ అనగా ఇంద్రుడు), వరణః - ప్రాకారము, విశదాం - స్వచ్ఛమైన, వైదుషీం - పాండిత్యమును, బహుళయతు - మాకు వౄద్ధిని పొందించుగాక.
పడమూడవది అయిన వైఢూర్య ప్రాకారమునకు ఏడు యోజనముల దూరములో, ఆకాశము కన్నా ఎత్తైన ప్రదేశములో, ఇంద్రనీలమణులతో చేయబడిన - పద్నాలుగవ ప్రాకారము - మాకు స్వచ్ఛమైన పాండిత్యమును వృద్ధిని పొందించుగాక !!
II ఆర్యా ద్విశతి - 49వ శ్లోకము II
మధ్యక్షోణ్యా మనయో ర్మహేంద్రనీలాత్మకాని చ సరాంసి I
శాతోదరీసహాయాన్ భూపాలానపి పునః పునః ప్రణుమః II ౪౯
తాః అనయోః - వైఢూర్య, ఇంద్రనీల ప్రాకారముల, మధ్యక్షోణ్యాం - మధ్య ప్రదేశము నందు ఉండు, మహేంద్రనీలాత్మకాని - గొప్ప ఇంద్రనీలమయములగు, సరాంసి - సరస్సులను, శాతోదరీసహాయాన్ - స్త్రీలతో కూడిన, భూపాలానపి - రాజులును (మను, మాంధాత, భగీరథ, భరత, పృథు..మొదలగు రాజులను), పునః పునః - మాటిమాటికీ, ప్రణుమః - నమస్కరించుచున్నాను.
వైఢూర్య, ఇంద్రనీల ప్రాకారముల మధ్యన ఉండే ప్రదేశములో, గొప్ప ఇంద్రనీల కాంతులతో ఉన్న సరస్సులను, స్త్రీలతో కూడిన, మను, మాంధాత, భగీరథ, భరథ.... మొదలైన రాజులను పునః పునః నుతించుచున్నాను.
II ఆర్యా ద్విశతి - 50వ శ్లోకము II
ఆశుగయోజనదూరే తస్యోర్ధ్వం కాంతిధవళితదిగంతః I
ముక్తావిరచితగాత్రో ముహురస్మాకం ముదే భవతు వప్రః II ౫౦
తాః తస్యోర్ధ్వం - ఇంద్రనీల ప్రాకారమునకు పై భాగము నందు, ఆశుగయోజనదూరే - ఏడు యోజనముల దూరము నందు, కాంతి ధవళిత దిగంతః - తన యొక్క కాంతులచేత తెల్లగాచేయబడిన దిక్కులు కలిగినదియు, ముక్తావిరచితగాత్రః - ముత్యములతో నిర్మింపబడినది అయిన, వప్రః - ప్రాకారము, అస్మాకం - మాకు, ముహుః - ఎల్లప్పుడూ, ముదే - సంతోషమును, భవతు - కలిగించుగాక.
ఇంద్రనీల ప్రాకారమునకు పై భాగము నందు ఏడు యోజనముల దూరములో, తన యొక్క కాంతులచేత తెల్లగా చేయబడిన, ముత్యాలతో నిర్మింపబడిన - పదిహేనవ ప్రాకారము - మాకు ఎల్లప్పుడూ సంతోషమును కలిగించుగాక.
(సశేషం ..... )
సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి