28, జనవరి 2016, గురువారం

భగవాన్ క్రోధభట్టారక విరచిత శ్రీ ఆర్యాద్విశతి తాత్పర్యము - 11


శ్రీ గురుభ్యో నమః

II ఆర్యా ద్విశతి - 51వ శ్లోకము II
ఆవృత్తోరధిమధ్యం పూర్వాస్యాం దిశి పురందరః శ్రీమాన్ I
అభ్రమువిటాధిరూఢో విభ్రమ మస్మాక మనిశమాతనుతాత్ II ౫౧

తాః ఆవృత్తోరధిమధ్యం - ఇంద్రనీల, ముక్తామణి ప్రాకారముల మధ్యప్రదేశమునందు, పూర్వాస్యాం - తూర్పుదిక్కున ఉండు, శ్రీమాన్ - సంపద్యుక్తుడు, అభ్రమువిట -అభ్రము అనగా ఐరావతము యొక్క భార్య, ఆమె మగడగు ఐరావతము మీద కూర్చున్నవాడును, పురందరః - దేవేంద్రుడు, అస్మాకం - మాకు, అనిశం - ఎల్లప్పుడూ, విభ్రమం - ఆనందమును, తనుతాత్ - కలుగజేయుగాక !!
ఇంద్రనీల, ముక్తామణి ప్రాకారముల మధ్య ప్రదేశమునందు ఐరావతము మీద కూర్చొని ఉండే దేవేంద్రుడు మాకు ఎల్లప్పుడూ ఆనందమును కలుగజేయుగాక.

II ఆర్యా ద్విశతి - 52వ శ్లోకము II
తత్కోణే వ్యజనస్రుక్తోమరపాత్ర స్రువాన్నశక్తిధరః I
స్వాహాస్వధాసమేతః సుఖయతు మాం హవ్యవాహనః సుచిరమ్ II ౫౨

తాః తత్కోణే - ఆ తూర్పు దిక్కు మూలయందు ఉండు, వ్యజన - వీవన, స్రుక్ - హోమపాత్రము, తోమర - తోమరమను ఆయుధము, పాత్ర - ఘృతపాత్ర, స్రువ - హోమపాత్రము, (ఆజ్యమును గ్రహించి అగ్నిలో వ్రేల్చు పాత్ర), అన్న - అన్నము (హవిస్సు), శక్తి - ...వీనిని, ధరః - ధరించినవాడును, స్వాహాస్వధాసమేతః - స్వాహాదేవితోనూ, స్వధాదేవితోనూ కూడి ఉన్నవాడును అయిన, హవ్యవాహనః - హవ్యవాహనుడగు అగ్నిదేవుడు, మాం - మమ్మల్ని, సుచిరం - ఎల్లప్పుడూ, సుఖయతు - సుఖింపజేయుగాక!!

ఇంద్రనీల, ముక్తామణి ప్రాకారముల మధ్య ప్రదేశమునందు, తూర్పుదిక్కున, అనేక హోమద్రవ్యములను (స్రుక్కు, స్రువము, హోమపాత్రము, తోమరము, అన్నము మొదలైన హవిస్సులు..) ధరించినవాడు, స్వాహాదేవి, స్వధాదేవీలతో కూడినవాడు అయిన అగ్నిదేవుడు, మమ్మల్ని ఎల్లప్పుడూ సుఖింపజేయుగాక !

అగ్నిధ్యానశ్లోకము (ఔపాసనాదౌకర్మణి - ఔత్తరాణాహామ్)
సప్తహస్తశ్చతుశ్శృంగః సప్తజిహ్వోద్విశీర్షకః I
త్రిపాత్ప్రసన్నవదనః సుఖాసీనః శుచిస్మితః II

స్వాహాంతుదక్షిణేపార్శ్వే దేవీంవామే స్వధా తథా I
బిభ్రద్దక్షిణ హస్తైస్తు శక్తిమన్నం స్రుచం స్రువమ్ II

తోమరం వ్యజనం వామే ఘృతపాత్రంతు ధారయన్ I
మేషారూఢో జటాబద్ధో గౌరవర్ణో మహౌజసః II

ధూమ్రధ్వజో లోహితాక్షస్సప్తార్చిస్సర్వకామదః I
ఆత్మాభిముఖమాసీన ఏవం రూపో హుతాశనః II 

II ఆర్యా ద్విశతి - 53వ శ్లోకము II
దక్షిణదిగంతరాళే దండధరో నీలనీరదచ్ఛాయః I
త్రిపురాపదాబ్జభక్త స్తిరయతు మమ నిఖిలమంహసాం నికరమ్ II ౫౩

తాః దక్షిణదిగంతరాళే - ఆ మధ్య భూమికి దక్షిణదిశ నడుమ ఉండు, నీలనీరదచ్ఛాయః - నల్లనిమేఘమువంటి శరీరకాంతి గలవాడును, త్రిపురాపదాబ్జభక్తః - శ్రీ త్రిపురసుందరీ పాదారవిందములను సేవించువాడును, దండధరః - యముడు, మమ - నా యొక్క, నిఖిలం - సమస్తమైన, అంహసాం నికరం - పాపముల సమూహమును, తిరయతు - పోగొట్టుగాక !!

ఇంద్రనీల, ముక్తామణి ప్రాకారముల మధ్యప్రదేశమునందు, దక్షిణదిశ మధ్యలో, నల్లనిమేఘము వంటి శరీర ఛాయ కలిగినవాడును, శ్రీత్రిపురమహాసుందరీ అమ్మవారి పాదారవిందముల సదా సేవించువాడు అయిన యమధర్మరాజు గారు, నా యొక్క సమస్త పాపములను పోగొట్టుగాక !!
 
II ఆర్యా ద్విశతి - 54వ శ్లోకము II
తస్యైవ పశ్చిమాయాం దిశి దళితేందీవరప్రభాశ్యామః I
ఖేటాసియష్టిధారీ ఖేదానపనయతు యాతుధానో మే II ౫౪

తాః తస్యైవ - ఆ దక్షిణదిశయందలి మధ్యభాగమునకు, పశ్చిమాయాం - పశ్చిమ దిక్కునందు ఉండు, దళిత- వికసించిన, ఇందీవర - కలువల, ప్రభా - కాంతివలె, శ్యామః - నల్లని మేనిఛాయ కలవాడు, ఖేట - ఖడ్గము, అసి - కత్తి, యష్టి - కొయ్య, ధారీ - ధరించినవాడును, యాతుధానః - నైరృతి, మే- నాయొక్క, ఖేదాన్ - దుఃఖములను, అపనయతు - పోగొట్టుగాక !!
ఇంద్రనీల, ముక్తామణి ప్రాకారముల మధ్య ప్రదేశమునందు, దక్షిణదిశమధ్య భాగమునకు పశ్చిమ దిక్కులో, బాగా వికసించిన నల్లకలువల కాంతివలే, నల్లని మేని ఛాయ కలిగిన నైరృతి, నా యొక్క దుఃఖములను పోగొట్టుగాక !!

II ఆర్యా ద్విశతి - 55వ శ్లోకము II
తస్యా ఉత్తరదేశే ధవళాంగో విపులఝుషవరారూఢః I
పాశాత్తపాణిపద్మః పాశీ విదళయతు పాశజాలాని II ౫౫

తాః తస్యాః - ఆ పడమటి దిక్కునకు, ఉత్తరదేశే - ఉత్తరదిక్కునందు ఉండు, ధవళాంగః - తెల్లని శరీరము కలవాడును, విపులఝుషవరారూఢః - గొప్పదైన మత్స్యముపై కూర్చున్నవాడును, పాశ - త్రాటితో, ఆత్త - కూడిన, పాణిపద్మః - కరకమలములు కలిగినవాడును అయిన, పాశీ - వరుణుడు, పాశజాలాని - బంధముల సమూహములను, విదళయతు - పోగొట్టుగాక !!


ఇంద్రనీల, ముక్తామణి ప్రాకారముల మధ్య ప్రదేశము నందు, పై శ్లోకములో చెప్పబడిన పడమటి దిక్కుకు ఉత్తర దిశలో ఉండు, తెల్లని శరీరము కలవాడు, గొప్పమత్స్యముపై కూర్చున్నవాడు, కరకమలములయందు పాశమును ధరించిన వరుణుడు, మా పాశములను (బంధములను) విడుదల చేయుగాక!!

(సశేషం ..... )

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి