17, జనవరి 2016, ఆదివారం

భగవాన్ క్రోధభట్టారక విరచిత శ్రీ ఆర్యాద్విశతి తాత్పర్యము - 5



శ్రీగురుభ్యో నమః

II ఆర్యా ద్విశతి - 21వ శ్లోకము II
తస్యామిషోర్జలక్ష్మీ తరుణీభ్యాం శరదృతుః సదా సహితః I
అభ్యర్చయన్ స జీయాదంబామామోదమేదురైః కుసుమైః II ౨౧

తాః తస్యాం - ఆ మందార వృక్షముల యందు, ఇష - ఆశ్వయుజ మాసము, ఊర్జ - కార్తీక మాసము, ఈ రెండు మాసముల లక్ష్ములనెడు (సంపదల) తరుణీభ్యాం - యువతులతోడి, సదా - ఎల్లప్పుడూ, సహిత - కూడినది అయిన, శరదృతువు, ఆమోదమేదురైః - వాసనలతో దట్టమైన, కుసుమైః - పుష్పములచేత, అంబాం - పరమేశ్వరిని, అభ్యర్చయన్ - పూజించుచు, సః జీయాత్ - సర్వోత్కృష్టముగా వర్తించుగాక !!

మందారవృక్షముల యందు, ఆశ్వయుజ, కార్తీక మాస సంపదలతో కూడినది, పుష్పముల చేత సదా అమ్మవారికి నమస్కరించి, అర్చించే శరదృతువు సర్వోత్కృష్టముగా ఉండుగాక !!

II ఆర్యా ద్విశతి - 22వ శ్లోకము II
తస్యర్షిసంఖ్యయోజనదూరే దేదీప్యమానశృంగౌఘః I
కలధౌతకలితమూర్తిః కల్యాణం దిశతు సప్తమస్సాలః II ౨౨

తాః తస్య - ఆరవ (పంచలోహ) ప్రాకారమునకు, ఋషిసంఖ్యయోజనదూరే - ఏడు యోజనముల దూరమునందు ఉండు, దేదీప్యమానశృంగౌఘః - మిక్కిలి ప్రకాశించుచున్న శిఖరముల గుంపు కలదియు, కలధౌత - వెండితో, కలిత - చేయబడిన, మూర్తిః - శరీరము కలది, సప్తమస్సాలః - ఏడవ ప్రాకారము, కల్యాణం - శుభములను, దిశతు - ఇచ్చుగాక !!
ఆరవ (పంచలోహ) ప్రాకారమునకు పైభాగమునందు, ఏడు యోజనముల దూరములో, గొప్ప ప్రకాశవంతమైన శిఖరములతో కూడిన ఏడవ ప్రాకారము - వెండితో చేయబడినది, మాకు శుభములను ఇచ్చుగాక !!

II ఆర్యా ద్విశతి - 23వ శ్లోకము II
మధ్యే తయోర్మరుత్పథలంఘిత విటపాగ్రవిరుతకలకంఠా I
శ్రీపారిజాతవాటీ శ్రియమనిశం దిశతు శీతలోద్దేశా II ౨౩

తాః తయోర్మధ్యే - ఆరవ (పంచలోహ) మరియు ఏడవ (వెండి) ప్రాకారముల మధ్యప్రదేశమునందు, మరుత్పథ - దేవతల మార్గమగు ఆకాశమును, లంఘిత - అతిక్రమించిన, విటపాగ్ర - కొమ్మలకొనలయందు, విరుత - కూయుచున్న, కలకంఠా - కోయిలలు కలది, శీతలోద్దేశా - చల్లని ప్రదేశములు కలదియు అగు, శ్రీపారిజాతవాటీ - లక్ష్మీకరమైన పారిజాతవృక్షముల వనము, అనిశం - ఎల్లప్పుడూ, శ్రియం - సంపదను, దిశతు - ఇచ్చుగాక !!
ఆరవ (పంచలోహ) మరియు ఏడవ (వెండి) ప్రాకారముల మధ్యన ఆకాశమంత ఎత్తులో ఉన్న కొమ్మలయందు కూయుచున్న కోయిలల గానములతోడి, చల్లని ప్రదేశము అయిన, పారిజాతవృక్షముల వనము కలదు, ఆ పారిజాతవనము మాకు ఎల్లప్పుడూ సంపదలను ఇచ్చుగాక !!

II ఆర్యా ద్విశతి - 24వ శ్లోకము II
తస్యాం అతిప్రియాభ్యాం సహ లేఖన్ సహ సహస్యలక్ష్మీభ్యాం I
సామంతో ఝుషకేతోర్హేమంతో భవతు హేమవృద్ధ్యై నః II ౨౪

తాః తస్యాం - ఆ పారిజాతవనము నందు, అతిప్రియాభ్యాం - మిక్కిలి ప్రియురాండ్రగు, సహః - మార్గశీర్ష మాసము, సహస్య - పుష్య మాసము (ఈ రెండిటి), లక్ష్మీభ్యాం - లక్ష్ములతో (సంపదలతో) సహ - కూడిన, ఖేలన్ - విహరించుచున్న, ఝుషకేతోః - మీనధ్వజుడగు మన్మథుని, సామంతః - అనుచరుడగు, హేమంత ఋతువు, నః - మాకు, హేమవృద్ధ్యై - బంగారము వృద్ధిపొందించుటకు, భవతు - అగుగాక !!
ఆరవ, ఏడవ ప్రాకారముల మధ్యన ఉన్న పారిజాతవనము నందు, మికిలి ప్రియమైన మార్గశీర్ష,పుష్య మాస సంపదలతో కూడిన, మన్మథుని అనుచరుడైన హేమంత ఋతువు, మాకు సదా సంపదలను (బంగారమును), ధనసమృద్ధిని ఇచ్చుగాక !!

II ఆర్యా ద్విశతి - 25వ శ్లోకము II
ఉత్తరతస్తస్య మహానుద్భటహుతభుక్ఛిఖారుణమయూఖః I
తపనీయఖండరచితస్తనుతాదాయుష్యమష్టమో వరణః II ౨౫

తాః తస్య - ఏడవది అయిన వెండి ప్రాకారమునకు, ఉత్తరతః - పై భాగమునందు, మహాన్ - గొప్పదియు, ఉద్భటః - ఉత్తమమైన, హుతభుక్ఛిఖా - అగ్నిజ్వాలలవంటి, అరుణ - ఎర్రని, మయూఖః - కాంతి కలిగినదియు, తపనీయఖండరచితః - బంగారుదిమ్మలచే చేయబడినయు అయిన, అష్టమ వరణః - ఎనిమిదవ ప్రాకారము, ఆయుష్యం - ఆయుర్వృద్ధిని, తనుతాత్ - చేయుగాక !! 
ఏదవది అయిన వెండి ప్రాకారమునకు పై భాగము నందు, ఉత్తమమైన ఎర్రని అగ్నిజ్వాలలవంటి కాంతి కలిగిన, బంగారు దిమ్మెలచే చేయబడినది అయిన ఎనిమిదవ ప్రాకారము (బంగారు ప్రాకారము), మాకు ఆయుర్వృద్ధిని కలుగజేయుగాక !!

(సశేషం ...)

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి