14, జనవరి 2016, గురువారం

భగవాన్ క్రోధభట్టారక విరచిత శ్రీ ఆర్యాద్విశతి తాత్పర్యము - 2


శ్రీగురుభ్యో నమః

II ఆర్యా ద్విశతి - 6వ శ్లోకము II
ప్రథమం సహస్రపూర్వక షట్ఛతసంఖ్యాయోజకం పరితః I
వలయీకృత స్వగాత్రం వరణం శరణం వ్రజామ్యయోరూపమ్ II ౬ 

తాః దాని చుట్టునూ (అనగా శ్రీపురమునకు), పదహారు వందల యోజనముల కలిగిన చుట్టబడిన గుడ్రమగు శరీరము గల, అయోరూపం - ఇనుముతో చేయబడిన, ప్రథమ వరణం - మొదటి ప్రాకారమును, శరణం వ్రజామి - నేను శరణు వేడుచున్నాను, ధ్యానించుచున్నాను. 
ఆదివిద్యానగరమునకు చుట్టూ గల 1600 యోజనముల విస్తీర్ణముగల ఇనుప ప్రాకారమును నేను సేవించుచున్నాను. (ఈ ప్రాకారమునకు నాలుగు దిక్కులయందు ద్వారములు, గోపరములు కలవు).

II ఆర్యా ద్విశతి - 7వ శ్లోకము II
తస్యోత్తరే సమీరణయోజనదూరే తరంగితచ్ఛాయః I
ఘటయతు ముదం ద్వితీయో ఘంటాస్వనసార నిర్మితస్సాలః II ౭

తాః ఆ ఇనుప ప్రాకారమునకు పైభాగము నందు, సమీరణయోజనదూరే - ఏడు యోజనముల దూరమునందు (సమీరణ అనగా వాయువు, వాయువులు ఏడు కనుక ఏడు యోజనములు), తళతళలాడు ప్రకాశముగలదియు, ఘంటానాదము యొక్క సారము చేత (కంచు చేత), నిర్మింపబడినదియు, ద్వితీయ ప్రాకారము, మాకు సంతోషమును కూర్చుగాక !!

II ఆర్యా ద్విశతి - 8వ శ్లోకము II
ఉభయోరంతరసీమన్యుద్దామ భ్రమరకూజితోదారమ్ I
ఉపవనముపాస్మహే వయమురరీకృత మందమారుతస్పందమ్ II ౮

తాః పైన చెప్పబడిన రెండు ప్రాకారముల (ఇనుము మరియు కంచు) అంతరసీమని - మధ్యభాగము నందు, అధికమైన తుమ్మెదల ఝుంకారముచేత, గొప్పది, మహిమ గలదియు, ఉరరీకృత - అంగీకరింపబడిన, మందమారుతము యొక్క కదలిక కలిగినదియు అయిన, ఉద్యానవనమును మేము ధ్యానించుచున్నాము !!

II ఆర్యా ద్విశతి - 9వ శ్లోకము II
ఆలింగ్య భద్రకాళీమాసీనతత్ర హరిశిలాశ్యామామ్ I
మనసి మాహాకాళో మే విహరతు మధుపానవిభ్రమన్నేత్రః II ౯

తాః తత్ర - ఆ ఆరామమునందు ఉండు, హరిశిలాశ్యామాం - ఇంద్రనీలమణివలె నీలమైన దేహకాంతి గల, భద్రకాళి అను దేవతను, కౌగలించుకుని కూర్చున్నవాడును, మధుపానవిభ్రమన్నేత్రః అనగా మధుపానము చేత తిరుగుచున్న కనులు కలవాడును అయిన, మహాకాళుడను (శివభటుడను దేవత), నా మనసునందు సంచరించుగాక !! (భద్రకాళీ సమేతుడైన మహాకాళుడిని ధ్యానించుచున్నాను.

II ఆర్యా ద్విశతి - 10వ శ్లోకము II
తార్తీయికో వరణస్తస్యోత్తరసీమ్ని వాతయోజనతః I
తామ్రేణ రచితమూర్తిస్తనుతాదాచంద్రతారకం భద్రమ్ II ౧౦


తాః ఆ కంచు ప్రాకారమునకు పై భాగమునందు, వాతయోజనతః - ఏడు యోజనముల దూరమునందు ఉండు, తామ్రేణ - రాగి చేత చేయబడిన రూపము కల, తార్తీయికః - మూడవదియగు, వరణ - ప్రాకారము, ఆచంద్రతారకం - చంద్రుడు నక్షత్రములుండువరకు శాశ్వతముగా, భద్రం - శ్రేయస్సును, తనుతాత్ - చేయుగాక !!

(సశేషం ....)

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి