21, జనవరి 2016, గురువారం

భగవాన్ క్రోధభట్టారక విరచిత శ్రీ ఆర్యాద్విశతి తాత్పర్యము - 8


శ్రీ గురుభ్యో నమః

II ఆర్యా ద్విశతి - 36వ శ్లోకము II
తస్య చ సువర్ణసాలస్యోత్తరతస్తరుణ కుంకుమచ్ఛాయః I
శమయతు మమ సంతాపం సాలో నవమస్సపుష్యరాగమయః II ౩౬

తాః తస్య చ సువర్ణసాలస్య - ఆ బంగారు ప్రాకారమునకు, ఉత్తరతః - పై భాగము నందు, తరుణకుంకుమచ్ఛాయః - లేతకుంకుమ ఛాయ కలదియు, పుష్యరాగమయః - పుష్యరాగమణులచే అద్దబడినది అయిన, నవమః - తొమ్మిదవ, సాలః - ప్రాకారము, మమ సంతాపం -నా దుఃఖమును, శమయతు - పోగొట్టుగాక !!
బంగారు ప్రాకారమునకు పై భాగమున, లేతకుంకుమఛాయ కలిగినది, పుష్యరాగమణులచే అద్దబడిన తొమ్మిదవ ప్రాకారము - పుష్యరాగమణి ప్రాకారము, నా దుఃఖములను పోగొట్టుగాక.

II ఆర్యా ద్విశతి - 37వ శ్లోకము II
అనయోరంతరవసుధాః ప్రణుమః ప్రత్యగ్రపుష్యరాగమయీః I
సింహాసనేశ్వరీమనుచింతననిస్తంద్రసిద్ధనీరంధ్రాః II ౩౭

తాః అనయోః - బంగారు, పుష్యరాగ ప్రాకారముల యొక్క, అంతరవసుధాః - మధ్య ప్రదేశములను, ప్రత్యగ్ర - కొత్త, పుష్యరాగమయీః - పుష్యరాగమణులమయమైనట్టిదియు, సింహాసనేశ్వరీ - సింహాసనేశ్వరి అను దేవత యొక్క (శ్రీలలితాదేవి), మను - జపమును, చింతన - జపించుటయందు, నిస్తంద్ర - ఏమరపాటులేని (పరమాసక్తి గల), సిద్ధ - సిద్ధపురుషులచేత, నీరంధ్రాః - నిండినవి అయిన, ప్రణమః - వినుతించుచున్నాను.
బంగారు, పుష్యరాగ ప్రాకారముల మధ్య ప్రదేశమున, ఏమరుపాటులేకుండా, సింహాసనేశ్వరి అయిన శ్రీలలితాదేవిని ఉపాసించుచున్న/జపించుచున్న సిద్ధ పురుషులకు నేను ప్రణమిల్లుతున్నాను. 

II ఆర్యా ద్విశతి - 38వ శ్లోకము II
తత్సాలోత్తరదేశే తరుణజపాకుసుమధోరణీశోణః I
ప్రశమయతు పద్మరాగప్రాకారో మమ పరాభవం దశమః II ౩౮

తాః తత్సాలోత్తరదేశే - ఆ పుష్యరాగ ప్రాకారమునకు పై భాగము నందు, తరుణ - క్రొత్త (అప్పుడే వికసించిన), జపాకుసుమ - మందార పూవుల, ధోరణీ - వరుస (గుంపు) వలె, శోణః - ఎర్రనిదియగు, దశమః - పదవది అయిన, పద్మరాగప్రాకారః - పద్మరాగమణి నిర్మితమైన ప్రాకారము, మమ- నా యొక్క, పరాభవం - అవమానమును లేదా కీడును, ప్రశమయతు - పోగొట్టుగాక.
తొమ్మిదివ (పుష్యరాగ) ప్రాకారమునకు పై భాగమునందు, క్రొత్తగా వికసించిన మందాలపూవుల వరుసవలె, ఎర్రగా ఉన్న, పద్మరాగమణులతో చేయబడినది అయిన పదవ ప్రాకారము - నా యొక్క అవమానమును/కీడును తొలగించుగాక !!

II ఆర్యా ద్విశతి - 39వ శ్లోకము II
అంతరభూకృతవాసాననయోరపనీత చిత్తవైమత్యాన్ I
చక్రేశీపదభక్తాంశ్చారణవర్గానహర్నిశం కలయే II ౩౯

తాః అనయోః - పుష్యరాగ, పద్మరాగ ప్రాకారముల, అంతరభూః - మధ్యప్రదేశము నందు, కృతవాసాన్ - వసించుచున్నవారును, ఆపనీత - తొలగింపబడిన, చిత - మనస్సులయొక్క, వైమత్యాన్ - విముఖత కలిగిన వారును (అనగా ఏకాగ్రచిత్తులయిన వారు), చక్రేశీపదభక్తాన్ - చక్రేశీ అను పేరు గల దేవత (శ్రీలలితాదేవి) పాదములను ఆరాధించు వారును, చారణవర్గాన్ - చారణుల సమూహములను, అహర్నిశం - రేయింబవళ్ళు (ఎల్లప్పుడూ..), కలయే - సేవించుచున్నాను. 
పుష్యరాగ, పద్మరాగ ప్రాకారముల మధ్యన ఉండే వారును, ఏకాగ్రచిత్తులై, చక్రేశీ అను దేవత పాదములను ఆరాధించువారు అయిన చారణులను, రేయింబవళ్ళు నేను సేవించుచున్నాను. 

II ఆర్యా ద్విశతి - 40వ శ్లోకము II
సారంగవాహనయోజనదూరే సంఘటిత కేతనస్తస్యః II
గోమేదకేన రచితో గోపాయతు మాం సమున్నతః సాలః II ౪౦

తాః తస్య - దానికి (పద్మరాగ ప్రాకారమునకు), సారంగవాహనయోజనదూరే - ఏడు యోజనముల దూరము (జింకను వాహనముగా గల వాయువు), సంఘటితకేతనః - బాగుగా చేసిన పతాకములు గలదియు, గోమేదకేన రచితః - గోమేదక మణులచేత చేయబడినది అగు, సమున్నతః - మిక్కిలి పొడవైన, సాలః - ప్రాకారము, మాం - నన్ను, గోపాయతు - రక్షించుగాక !!
పద్మరాగ ప్రాకారమునకు పై భాగమున ఏడు యోజనముల దూరములో మిక్కిలి పొడవైనది, బాగుగా కూర్చబడిన పతాకములు గలదియు అయిన గోమేదక మణులచేత చేయబడిన - పదకొండవ ప్రాకారము - నన్ను రక్షించుగాక.

(సశేషం ..... )


సర్వం శ్రీవల్లీదేసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి