శ్రీగురుభ్యో నమః
II ఆర్యా ద్విశతి - 16వ శ్లోకము II
ఉత్తరసీమని తస్యోన్నత శిఖరోత్కంపి హాటకపతాకః I
ప్రకటయతు పంచమో నః ప్రాకారః కుశలమారకూటమయః II ౧౬
తాః తస్య - దాని (సీసప్రాకారము యొక్క) పై ప్రదేశమునందు ఉండు ఉన్నతమైన శృంగములందు, ఉత్కంపి-కదులుచుండెడు, హాటకపతాకః - బంగారు టెక్కెములు కలదియు, ఆరకూటమయః - ఇత్తళిచే చేయబడినదియు అగు ఐదవ ప్రాకారము, నః - మాకు, కుశలం - యోగక్షేమమును ప్రకటయతు - కలిగించుగాక !!
సీసప్రాకారము పైన, ఉన్నతమైన శృంగములు కలిగి, బంగారు టెక్కెములు కలిగిన ఇత్తళి ప్రాకారము మాకు యోగక్షేమములను కలిగించుగాక !!
II ఆర్యా ద్విశతి - 17వ శ్లోకము II
ప్రాకారయోశ్చ మధ్యే పల్లవితా౨న్యభృతపంచమోన్మేషా I
హరిచందనద్రువాటీ హరతాదామూలమస్మదనుతాపమ్ II ౧౭
తాః ప్రాకారయోశ్చ మధ్యే - సీస, ఇత్తళి ప్రాకారముల మధ్య ఉండు, పల్లవిత - చిగుళ్ళు కలది, అన్యభృత - కోకిల యొక్క, పంచమ - పంచమ స్వరము యొక్క, ఉన్మేషా - ప్రకాశము కలదియు, హరిచందన వృక్షముల వనము, అస్మదనుతాపం - మా కష్టములను, ఆమూలం - పూర్తిగా, హరతాత్ - పోగొట్టుగాక !!
సీస, ఇత్తళి ప్రాకారముల మధ్య చిగుళ్ళు కలిగిన, కోకిల పంచమస్వరములు కలిగిన, గొప్ప ప్రకాశము కలిగిన హరిచందన వృక్షములవనము, మా కష్టములను పూర్తిగా పోగొట్టుగాక !!
II ఆర్యా ద్విశతి - 18వ శ్లోకము II
తత్ర నభశ్శ్రీముఖ్యైస్తరుణీవర్గైః సమన్వితః పరితః I
వజ్రాట్టహాసముఖరో వాంఛాపూర్తిం తనోతు వర్షర్తుః II ౧౮
తాః తత్ర - ఆ హరిచందన వృక్షముల వరుసలయందు, నభశ్శ్రీముఖ్యైః - శ్రావణమాస లక్ష్మి మొదలైన, తరుణీవర్గైః - యువతుల సమూహములతో, పరితః - చుట్టూ, సమన్వితః - కూడుకొన్నదియు, వజ్రాట్టహాస - పిడుగు యొక్క గొప్ప గర్జనతో, ముఖరః - శబ్దము చేయుచున్నది అయిన వర్షర్తుః - వర్ష ఋతువు, వాంఛాపూర్తిం - కోరికల పూరణమును, తనోతు - చేయుగాక !!
ఆ హరిచందన వృక్షముల వరుసల యందు శ్రావణమాస లక్ష్మి మొదలగు యువతులతో కూడుకొన్న, పిడుగుల గర్జనములతో ఉన్న శ్రావణ, భాద్రపద మాసములతో కూడిన వర్ష ఋతువు, మా కోరికలను నెరవేర్చుగాక !!
II ఆర్యా ద్విశతి - 19వ శ్లోకము II
మారుతయోజనదూరే మహనీయస్తస్య చోత్తరభాగే I
భద్రం కృషీష్ట షష్ఠః ప్రాకారః పంచలోహధాతుమయః II ౧౯
తాః తస్య - దానికి (ఇత్తళి ప్రాకారమునకు), ఉత్తరభాగే - పై భాగమునందు, మారుతయోజనదూరే - ఏడు యోజనముల దూరమునందు ఉన్న, మహనీయమైన పంచలోహసారముచేత చేయబడిన ఆరవ ప్రాకారము, మాకు క్షేమమును చేయుగాక !!
II ఆర్యా ద్విశతి - 20వ శ్లోకము II
అనయోర్మధ్యే సంతతమంకూరద్దివ్య కుసుమగంధాయామ్ I
మందారవాటికాయాం మానసమంగీకరోతు మే విహృతిమ్ II ౨౦
తాః అనయోర్మధ్యే - ఆ రెంటిమధ్య (ఇత్తళి ప్రాకారమునకు, పంచలోహమయ ప్రాకారమునకు నడూమ ఉండు), అంకూరత్ - పూయుచున్న/మొలకెత్తుచున్న, దివ్యకుసుమ - ఇంపైన పుష్పముల, గంధాయాం - వాసనలు గల, మందారవాటికాయాం - మందారవ్క్షముల వరుసల యందు, సంతతం - ఎల్లప్పుడూ, మే మానసం - నా మనస్సు, విహృతిం - విహరించుటను, అంగీకరోతు - ఒప్పునుగాక !!
ఇత్తళి మరియు పంచలోహ ప్రాకారముల మధ్య ఉన్న మందారవృక్షముల వనమును నేను ఎల్లప్పుడూ ధ్యానించుచుందునుగాక !!
(సశేషం....)
సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి