15, జనవరి 2016, శుక్రవారం

భగవాన్ క్రోధభట్టారక విరచిత శ్రీ ఆర్యాద్విశతి తాత్పర్యము - 3



శ్రీగురుభ్యో నమః

II ఆర్యా ద్విశతి - 11వ శ్లోకము II
మధ్యే తయోర్మణీమయపల్లవ శాఖాప్రసూనపక్ష్మళితామ్ I
కల్పానోకహవాటీం కలయే మకరందపంకిలావాలామ్ II ౧౧

తాః ఆ రెంటి (కంచు, రాగి ప్రాకారముల) నడుమ ఉండు, రత్నమయములగు చిగుళ్ళు, కొమ్మలు, పుష్పములచేత నిండినదియు, తేనెచేత బురదగా చేఅబడిన (నింపబడిన), ఆవాలాం - అనగా పాదులు కలిగినదియు అగు, కల్పవృక్షముల వరుసను (కల్పవృక్షముల వనమును) ధ్యానించుచున్నాను !!

II ఆర్యా ద్విశతి - 12వ శ్లోకము II
తత్ర మధుమాధవ శ్రీతరుణీభ్యాం తరళదృక్చకోరాభ్యామ్ I
ఆలింగితో౨వతాన్మామనిశం ప్రథమర్తురాత్తపుష్పాస్త్రః II ౧౨

తాః తత్ర - ఆ కల్పవృక్షముల వనమునందున్న తరళదృక్చకోరాభ్యాం  -  చలించుచుండు చకోరముల వంటి నేత్రములు కలిగిన, మధుమాధవశ్రీతరుణీభ్యాం  - చైత్ర, వైశాఖ మాసలక్ష్ములనెడు (సంపదలనెడు) యువతులచేత, కౌగిలింపబడిన ఆత్తపుష్పాస్త్రః - మన్మథునితో కూడిన, ప్రథమర్తుః - వసంత ఋతువు, అనిశం-ఎల్లప్పుడూ, మాం- నన్ను అనితాత్ - రక్షించుగాక.

ఆ కల్పవృక్షముల వనమునందున్న చకోరముల వంటి నేత్రములు కలిగిన చైత్ర, వైశాఖ మాసములనెడి యువతులతో కౌగిలింపబడి, మన్మథుడితో కూడిన వసంత ఋతువు నన్ను ఎల్లప్పుడూ రక్షించుగాక !!

II ఆర్యా ద్విశతి - 13వ శ్లోకము II
నమత తదుత్తరభాగే నాకిపథోల్లంఘశృంగసంఘాతమ్ I
సీసాకృతిం తురీయం సితకిరణాలోకనిర్మలం సాలమ్ II ౧౩

తాః తదుత్తరభాగే - తామ్ర ప్రాకారమునకు పై ప్రదేశమునందు ఉండు, నాకిపథ - దేవతల పథము/ఆకాశమును, ఉల్లంఘి -  దాటుచున్న (ఆకాశము కంటే పొడవుగా ఉన్న), శృంగసంఘాతం - శిఖరముల సమూహము కలదియు, సితకిరణ - చంద్రుని యొక్క ఆలోక - వెలుగువలె, నిర్మలం - స్వచ్ఛమైనదియు, సీసాకృతిం - సీసముతో చేయబడినదియు అయిన నాలుగవ ప్రాకారమునకు నమస్కరించుచున్నాను !! 

రాగి ప్రాకారానికి పై భాగములో, ఆకాశము కంటే పొడవుగా ఉన్న శిఖరములను కలిగినది, చంద్రుని వెలుగులా స్వచ్ఛమైనది అయిన సీసపు ప్రాకారమునకు నేను నమస్కరించుచున్నాను !!

II ఆర్యా ద్విశతి - 14వ శ్లోకము II

సాలద్వయాంతరాళే సరళాళికపోతచాటు సుభగాయామ్ I
సంతానవాటికాయాం సక్తం చేతో౨స్తు సతతమస్మాకమ్ II ౧౪

తాః సాలద్వయాంతరాళే - ఆ రెండు ప్రాకారముల మధ్యనందు (తామ్ర, సీస ప్రాకారముల నడుమ ఉండు), మనోహరమైన తుమ్మెదల, పావురముల ఇంపైన పలుకులచేత, సుభగాయాం - మనోజ్ఞమైనది అయిన, సంతానవృక్షముల వరుస యందు, మా యొక్క మనసు సతతం (ఎల్లప్పుడూ) ఉండుగాక !! సంతాన వృక్షములను మేము ధ్యానించుచుందుము గాక ! (కల్పవృక్షములు ఐదు రకములు - మందారము/పారిజాతము/సంతానము/కల్పము/హరిచందనము

II ఆర్యా ద్విశతి - 15వ శ్లోకము II
తత్ర తపనాతిరూక్షః సమ్రాజ్ఞీచరణసాంద్రితస్వాంతః I
శుక్రశుచిశ్రీసహితో గ్రీష్మర్తుర్దిశతు కీర్తిమాకల్పమ్ II ౧౫

తాః ఆ సంతాన వృక్షముల వనమునందు ఉండు, తపన - సూర్యుని వలె, అతిరూక్షః - మిక్కిలి ఉగ్రమైనదియు, సమ్రాజ్ఞీ - మహారాజ్ఞి (పరమేశ్వరి), చరణ - పాదములయందు, సాంద్రిత - ఆసక్తమయిన (లగ్నమయిన) స్వాంతః - హృదయము కలదియు (సదా పరమేశ్వరిని ధ్యానించుచున్నదియు), శుక్ర - జ్యేష్ఠ మాసము, శుచి -  ఆషాఢ మాసము, శ్రీ - ఈ మాసముల లక్ష్ములతో (సంపదలతో) కూడినది అయిన, గ్రీష్మర్తుః -  గ్రీష్మ ఋతువు, ఆకల్పం - కల్పాంతము వరకు (ఎల్లప్పుడూ), కీర్తిం - యశస్సును, దిశతు - ఇచ్చుగాక. గ్రీష్మ ఋతువును ధ్యానించుటచే అది ఎల్లప్పుడు మాకు శుభమునొసంగు గాక !!

(సశేషం ....)

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి