శ్రీ గురుభ్యో నమః
II ఆర్యా ద్విశతి - 56వ శ్లోకము II
వందే తదుత్తరహరిత్కోణే వాయుం చమూరువరవాహమ్ I
కోరకితతత్త్వబోధాన్ గోరక్షప్రముఖ యోగినో౨పి ముహుః II ౫౬
తాః తదుత్తరహరిత్కోణే - దానికి (వరుణుని స్థానమునకు) ఉత్తరదిశ మూలయందు ఉండు, చమూరువర - శ్రేష్టమైన జింకను, వాహం - వాహనముగా గల, వాయుం - వాయుదేవుని, కోరకిత - పుట్టిన, తత్త్వబోధాన్ - తత్త్వజ్ఞానము కలవారగు, గోరక్షప్రముఖయోగినో౨పి - గోరక్షనాథుడు మొదలైన ప్రముఖ యోగులను, ముహుః - పలుమార్లు, వందే - నమస్కరించుచున్నాను !!
వరుణుని స్థానమునకు ఉత్తరదిక్కులో ఉండు, శ్రేష్టమైన జింకను వాహనముగా కలిగిన వాయుదేవునికి, పుట్టినదాది తత్త్వజ్ఞానము కలిగిన గోరక్షనాథుడు మొదలైన ప్రముఖ యోగులకు పలుమార్లు నమస్కరించుచున్నాను.
II ఆర్యా ద్విశతి - 57వ శ్లోకము II
తరుణీ రిడాప్రధానాస్తిస్రో వా తస్య తత్ర కృతవాసాః I
ప్రత్యగ్రకాపిశాయన పానపరిభ్రాంతలోచనాః కలయే II ౫౭
తాః తత్ర కృతవాసాః - అచ్చటనే వసించుచున్నవారును, ప్రత్యగ్ర - క్రొత్త, కాపిశాయన - మద్యమును, పాన- త్రాగుటచేత, పరిభ్రాంత - తిరుగుడుపడుచున్న, లోచనాః - కన్నులు కలవారగు, ఇడాప్రధానాః - ఇడాదేవి మొదలగు, తస్య - అతని యొక్క (వాయువు), తిస్రః - ముగ్గురు (ఇడా, పింగళా, సుషుమ్నా అను ముగ్గురు వాయుదేవుని పత్నులు), తరుణీః - భార్యలను, కలయే - ధ్యానించుచున్నాను.
అచ్చటనే నివసించుచున్నవారును, క్రొత్త మద్యమును త్రాగుటచే తిరుగుడుపడిన కన్నులు కలిగిన వారును అయిన ఇడాదేవి మొదలగు వాయువు యొక్క ముగ్గురు పత్నులను (ఇడా, పింగళా, సుషుమ్నా) నేను ధ్యానించుచున్నాను !!
II ఆర్యా ద్విశతి - 58వ శ్లోకము II
తల్లోకపూర్వభాగే ధనదం ధ్యాయామి శేవధికులేశమ్ I
అపి మాణిభద్రముఖ్యానంబాచరణావలంబినో యక్షాన్ II ౫౮
తాః తల్లోక - ఆ ప్రదేశమునకు (వాయువ్య మూలకు), పూర్వభాగే - తూర్పు దిక్కునందు ఉండు, శేవధికులేశం - నిధుల సమూహమునకు ప్రభువగు, ధనదం - కుబేరుని, అంబాచరణావలంబిన - పరమేశ్వరి పాదములను ఆశ్రయించిన, మాణిభద్రముఖ్యాన్ - మణిభద్రుడు మొదలగు, యక్షాన్+అపి - యక్షులను, ధ్యాయామి - ధ్యానించుచున్నాను.
ఆ వాయువ్య మూలకు తూర్పు దిక్కున ఉండు, నిధులకు ప్రభువైన కుబేరుని, పరమేశ్వరి పాదపద్మములను ఆశ్రయించిన మణిభద్రుడు మొదలైన యక్షులను ధ్యానించుచున్నాను !!
II ఆర్యా ద్విశతి - 59వ శ్లోకము II
తస్యైవ పూర్వసీమని తపనీయారచితగోపురే నగరే I
కాత్యాయనీసహాయాం కలయే శీతాంశుఖండచూడాలమ్ II ౫౯
తాః తస్యైవ - దానికి, పూర్వసీమని - తూర్పుప్రదేశమునందు, తపనీయారచితగోపురే - బంగారముతో నిర్మింపబడిన గోపురము గల, నగరే - పట్టణమునందు, శీతాంశుఖండచూడాలం - బాలచంద్రుని శిరస్సున ధరించిన, కాత్యాయనీసహాయాం - పార్వతీదేవి పతియగు ఈశానుని, కలయే - ధ్యానించుచున్నాను !!
దానికి తూర్పు ప్రదేశమునందు ఉండు, బంగారు గోపురము గల పట్టణమునందు, బాలచంద్రుని శిరస్సున ధరించిన, కాత్యాయనీ పతియగు ఈశానుని నేను ధ్యానించుచున్నాను.
II ఆర్యా ద్విశతి - 60వ శ్లోకము II
తత్పురషోడశవరణ స్థలభాజ స్తరుణచంద్రచూడాలాన్ I
రుద్రాధ్యాయే పఠితాన్ రుద్రాణీసహచరాన్ భజే రుద్రాన్ II ౬౦
తాః తత్పుర - ఆ ఈశానుని పట్టణము యొక్క, షోడశవరణ - పదహారు ప్రాకారములను, స్థల ప్రదేశములను, భాజః - పొందినవారు (అందు నివసించువారు), తరుణచంద్రచూడాలాన్ - బాలచంద్రుని ధరించినవారును, రుద్రాధ్యాయే - శతరుద్రీయమునందు, పఠితాన్ - చెప్పబడినవారును, రుద్రాణీ సహచరాన్ - రుద్రాణీ దేవతలతో కూడిన వారును అగు, రుద్రాన్ - రుద్రులను, భజే - సేవించుచున్నాను.
ఆ ఈశానుని పురమునందు, పదహారు ప్రాకారములలో నివసించువారు, బాలచంద్రుని శిరస్సున ధరించువారు, రుద్రాధ్యాయము నందు చెప్పబడిన వారు, రుద్రాణీ దేవతలతో కూడిన వారును అయిన రుద్రులను నేను సేవించుచున్నాను.
(సశేషం .... )
సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు .