14, జనవరి 2016, గురువారం

భగవాన్ క్రోధభట్టారక విరచిత శ్రీ ఆర్యాద్విశతి తాత్పర్యము - 2


శ్రీగురుభ్యో నమః

II ఆర్యా ద్విశతి - 6వ శ్లోకము II
ప్రథమం సహస్రపూర్వక షట్ఛతసంఖ్యాయోజకం పరితః I
వలయీకృత స్వగాత్రం వరణం శరణం వ్రజామ్యయోరూపమ్ II ౬ 

తాః దాని చుట్టునూ (అనగా శ్రీపురమునకు), పదహారు వందల యోజనముల కలిగిన చుట్టబడిన గుడ్రమగు శరీరము గల, అయోరూపం - ఇనుముతో చేయబడిన, ప్రథమ వరణం - మొదటి ప్రాకారమును, శరణం వ్రజామి - నేను శరణు వేడుచున్నాను, ధ్యానించుచున్నాను. 
ఆదివిద్యానగరమునకు చుట్టూ గల 1600 యోజనముల విస్తీర్ణముగల ఇనుప ప్రాకారమును నేను సేవించుచున్నాను. (ఈ ప్రాకారమునకు నాలుగు దిక్కులయందు ద్వారములు, గోపరములు కలవు).

II ఆర్యా ద్విశతి - 7వ శ్లోకము II
తస్యోత్తరే సమీరణయోజనదూరే తరంగితచ్ఛాయః I
ఘటయతు ముదం ద్వితీయో ఘంటాస్వనసార నిర్మితస్సాలః II ౭

తాః ఆ ఇనుప ప్రాకారమునకు పైభాగము నందు, సమీరణయోజనదూరే - ఏడు యోజనముల దూరమునందు (సమీరణ అనగా వాయువు, వాయువులు ఏడు కనుక ఏడు యోజనములు), తళతళలాడు ప్రకాశముగలదియు, ఘంటానాదము యొక్క సారము చేత (కంచు చేత), నిర్మింపబడినదియు, ద్వితీయ ప్రాకారము, మాకు సంతోషమును కూర్చుగాక !!

II ఆర్యా ద్విశతి - 8వ శ్లోకము II
ఉభయోరంతరసీమన్యుద్దామ భ్రమరకూజితోదారమ్ I
ఉపవనముపాస్మహే వయమురరీకృత మందమారుతస్పందమ్ II ౮

తాః పైన చెప్పబడిన రెండు ప్రాకారముల (ఇనుము మరియు కంచు) అంతరసీమని - మధ్యభాగము నందు, అధికమైన తుమ్మెదల ఝుంకారముచేత, గొప్పది, మహిమ గలదియు, ఉరరీకృత - అంగీకరింపబడిన, మందమారుతము యొక్క కదలిక కలిగినదియు అయిన, ఉద్యానవనమును మేము ధ్యానించుచున్నాము !!

II ఆర్యా ద్విశతి - 9వ శ్లోకము II
ఆలింగ్య భద్రకాళీమాసీనతత్ర హరిశిలాశ్యామామ్ I
మనసి మాహాకాళో మే విహరతు మధుపానవిభ్రమన్నేత్రః II ౯

తాః తత్ర - ఆ ఆరామమునందు ఉండు, హరిశిలాశ్యామాం - ఇంద్రనీలమణివలె నీలమైన దేహకాంతి గల, భద్రకాళి అను దేవతను, కౌగలించుకుని కూర్చున్నవాడును, మధుపానవిభ్రమన్నేత్రః అనగా మధుపానము చేత తిరుగుచున్న కనులు కలవాడును అయిన, మహాకాళుడను (శివభటుడను దేవత), నా మనసునందు సంచరించుగాక !! (భద్రకాళీ సమేతుడైన మహాకాళుడిని ధ్యానించుచున్నాను.

II ఆర్యా ద్విశతి - 10వ శ్లోకము II
తార్తీయికో వరణస్తస్యోత్తరసీమ్ని వాతయోజనతః I
తామ్రేణ రచితమూర్తిస్తనుతాదాచంద్రతారకం భద్రమ్ II ౧౦


తాః ఆ కంచు ప్రాకారమునకు పై భాగమునందు, వాతయోజనతః - ఏడు యోజనముల దూరమునందు ఉండు, తామ్రేణ - రాగి చేత చేయబడిన రూపము కల, తార్తీయికః - మూడవదియగు, వరణ - ప్రాకారము, ఆచంద్రతారకం - చంద్రుడు నక్షత్రములుండువరకు శాశ్వతముగా, భద్రం - శ్రేయస్సును, తనుతాత్ - చేయుగాక !!

(సశేషం ....)

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు. 

12, జనవరి 2016, మంగళవారం

భగవాన్ క్రోధభట్టారక విరచిత శ్రీ ఆర్యాద్విశతి తాత్పర్యము - 1




అస్మద్ శ్రీగురుభ్యో నమః
శ్రీ గణేశాయ నమః
శ్రీ వల్లీదేవసేనాంబికాసమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః
శ్రీ మాత్రే నమః
నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే 


II ధ్యానం II
ఆదిమ రసావలమ్బా
మనిదం ప్రథమోక్తి వల్లరీ కలికామ్ I
ఆబ్రహ్మ కీట జననీ
మన్తః కలయామి సున్దరో మనిశమ్ II
నతజన సులభాయ నమో
నాళీక సనాభి లోచనాయ నమః I
నన్దిత గిరిశాయ నమో
మహ్సే నవనీప పాటలాయ నమః II
పవనమయి పావకమయి
క్షోణిమయి వ్యోమయి కృపీటమయి I
రవిమయి శశిమయి దిఙ్మయి
సమయమయి ప్రాణమయి  శివే పాహి II
కాళీ ! కపాలని ! శూలిని !
భైరవి ! మాతఙ్గీ ! పఞ్చమీ ! త్రిపురే !
వాగ్దేవీ ! విన్ధ్యవాసిని !
బాలే ! భువనేశి ! పాలయ చిరం మామ్ II
శ్రీలలితామ్బాయై నమః

II ఆర్యా ద్విశతి - 1వ శ్లోకము II
వందే గజేంద్ర వదనం వామాంకారూఢవల్లభా౨౨శ్లిష్టమ్ I


కుంకుమపరాగశోణం కువలయినీజారకోరకాపీడమ్ II

ఎడమతొడయందు కూర్చున్న వల్లభాదేవి చేత కౌగిలింపబడిన వాడు, కుంకుమ పువ్వు పొడి వలె ఎర్రని కాంతి కలవాడు, కలువకొలనుకు విటుడగు చంద్రుని శిరోభూషణముగా కలవాడు, ఏనుగు ముఖము గల విఘ్నేశ్వరుని నేను నమస్కరించుచున్నాను !!

విఘ్నేశ్వరుడు శ్రీలలితాదేవి స్మితము వలన పుట్టాడు అని, విఘ్నేశ్వరుడి పత్ని సిద్ధలక్ష్మి అని లలితోపాఖ్యానములో చెప్పబడినది.

స్మితాద్విఘ్నేశ్వరో జాతో మదక్లిన్న కటస్థలః
సిద్ధలక్ష్మ్యం కితోత్సంగో బాలార్క సదృశ ద్యుతిః II 


II ఆర్యా ద్విశతి - 2వ శ్లోకము II

స జయతి సువర్ణ శైలః సకలజగచ్చక్రసంఘటితమూర్తిః I
కాంచననికుంజవాటీ కందళదమరీ ప్రపంచసంగీతః II ౨

తాత్పర్యముః సమస్త లోకముల చేత కూర్పబడిన స్వరూపము గలది, బంగారుపొదరుల వరుసలయందు విస్తరించుచున్న దేవతాస్త్రీల సమూహముల యొక్క గానములు కలది, అటువంటి మేరుపర్వతము జయముతో వర్తిల్లుచున్నది. 


II ఆర్యా ద్విశతి - 3వ శ్లోకము II

హరిహయ నైరృతమారుత హరితామంతేష్వవస్థితం తస్య I


వినుమస్సానుత్రితయం విధిహరిగౌరీశవిష్టపాధారమ్ II ౩

తాః ఆ మేరు పర్వతం యొక్క తూర్పు, నైరృతి, వాయువ్య దిశల మధ్యలయందు ఉన్నట్టి బ్రహ్మ, విష్ణు, శివుల లోకములకు ఆధారమైనది అయిన సానుత్రితయం అనగా మూడు శిఖరములను స్తోత్రము చేయుచున్నాము.


II ఆర్యా ద్విశతి -  4వ శ్లోకము II

మధ్యే పునర్మనోహరరత్నరుచి స్తబకరంజిత దిగంతమ్ I
ఉపరి చతుశ్శతయోజన ముత్తుంగ శృంగపుంగవముపాసే II ౪


తాః పైన చెప్పిన శిఖరముల నడుమ, పై భాగము నందు ఉండు రమణీయమైన మనీకాంతుల, స్తబక అనగా గుత్తుల చేత, వన్నెపెట్టబడిన, దిక్కులు గలదియు, నాలుగు వందల యోజనముల పొడవైన శృంగపుంగవం-శ్రేష్ఠమగు శిఖరమును నేను ధ్యానించుచున్నాను. 

II ఆర్యా ద్విశతి -  5వ శ్లోకము II

తత్ర చతుశ్శతయోజన పరిణాహం దేవశిల్పినా రచితమ్ I
నానాసాలమనోజ్ఞం నమామ్యహం నగరమాదివిద్యయాః II ౫ 


తాః ఆ శిఖరము నందు ఉండు, నాలుగు వందల యోజనముల వైశాల్యము గలదియు, దేవశిల్పినా రచితమ్ - విశ్వకర్మచే నిర్మింపబడినదియు, అనేక ప్రాకారములచేత రమ్యమైనదియు అయిన, ఆదివిద్యాయాః - పురాతన, సనాతన విద్యాస్వరూపిణి అయిన పరాదేవత యొక్క నగరమునకు, అనగా శ్రీపురమునకు, నేను నమస్కరించుచున్నాను. 

(సశేషం ....)

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.