శ్రీ గురుభ్యో నమః
II ఆర్యా ద్విశతి - 116వ శ్లోకము II
సదనస్యానలకోణే సతతం ప్రణమామి కుండమాగ్నేయమ్ I
తత్ర స్థితం చ వహ్నిం తరళశిఖాజటిల మంబికాజనకమ్ II ౧౧౬
తాః సదనస్య - ఆ చింతామణి గృహమునకు, ఆనలకోణే - ఆగ్నేయ దిక్కునందు, ఆగ్నేయం - అగ్నిమయమైన, కుండమ్ - పల్లమును (కుండమును), తత్రస్థితం - అచ్చటనున్న, తరళశిఖాజటిలం - చలించుచున్న జ్వాలలచేత పూర్ణమైనదియు, అంబికానజకం - పార్వతీదేవికి తండ్రియైనవాడును అగు (చిదగ్నికుండసంభూత అని శ్రీలలితాదేవి నామము), వహ్నిం చ - అగ్నిని, సతతం - ఎల్లప్పుడూ, ప్రణమామి - నమస్కరించుచున్నాను !!
చింతామణిగృహమునకు ఆగ్నేయ దిక్కునందు అగ్నిమయమైన కుండమును, అందులో చలించుచున్న అగ్నిశిఖలచేత పూర్ణమైనవాడును, చిదగ్నికుండసంభూత యొక్క తండ్రిగా పేర్కొనబడిన అగ్నిదేవుని ఎల్లప్పుడూ నమస్కరించుచున్నాను !
II ఆర్యా ద్విశతి - 117వ శ్లోకము II
తస్యాసురదిశి తాదృశ రత్నపరిస్ఫురిత పర్వనవకాఢ్యమ్ I
చక్రాత్మకం శతాంగం దశయోజనమున్నతం భజే దివ్యమ్ II ౧౧౭
తాః తస్య - ఆ చింతామణి గృహము యొక్క, ఆసురదిశి - నైఋతి దిక్కునందు ఉండు, తాదృశ - ఆ చింతామణి గృహము నందు ఉన్న, రత్నపరిస్ఫురిత - రత్నములు, మణులచేత గొప్పగా ప్రకాశించుచున్న, పర్వనవకాఢ్యం - తొమ్మిది వరుసలతో కూడిన, దశయోజనమున్నతం - పదియోజనముల పొడవు కలిగినదియు, చక్రాత్మకం - చక్రములు కలదియు అగు, దివ్యం - ప్రకాశించుచున్న, శతాంగం - రథమును, భజే - సేవించుచున్నాను !!
చింతామణి గృహమునకు నైఋతి దిక్కునందు ఉన్న రత్నములచేత పొదగబడి గొప్పగా ప్రకాశించుచూ, తొమ్మిది వరుసలతో కూడి పదియోజనముల పొడవు కలిగినది, చక్రములు కలిగిన రథమును సేవించుచున్నాను !!
II ఆర్యా ద్విశతి - 118వ శ్లోకము II
తత్రైవ దిశి నిషణ్ణం తపనీయధ్వజ పరంపరాశ్లిష్టమ్ I
రథమపరం చ భవాన్యా రచయామో మనసి రత్నమయచూడమ్ II ౧౧౮
తాః తత్రైవ దిశి - ఆ నైఋతి దిక్కునందే, నిషణ్ణం - ఉన్నదియు, తపనీయధ్వజ - బంగారు ధ్వజము(పతాకముల) యొక్క, పరంపరా - వరుసలచేత, ఆశ్లిష్టం - కూడినదియు, రత్నమయచూడం - మణులమయమైన శిఖరము కలదియు, భవాన్యాః - పరమేశ్వరి యొక్క, అపరం చ రథం - వేరొక రథమును, మనసిరచయామః - ధ్యానించునున్నాము !!
చింతామణి గృహము నందు, నైఋతి దిక్కునందే ఉన్న బంగారు ధ్వజముతో కూడి, మణిమయ శిఖరము కలదియు అయిన శ్రీలలితాపరమేశ్వరి అమ్మవారి మరొక రథమును ధ్యానించుచున్నాను !!
II ఆర్యా ద్విశతి - 119వ శ్లోకము II
భవనస్య వాయుభాగే పరిష్కృతో వివిధ వైజయంతీభిః I
రచయత్యు ముదం రథేంద్రః సచివేశాన్యాః సమస్తవంద్యాయాః II ౧౧౯
తాః భవనస్య - ఆ చింతామణి గృహము యొక్క, వాయుభాగే - వాయువ్య దిక్కునందు ఉండు, వివిధ వైజయంతీభిః - నానావిధములైన పతాకములచేత, పరిష్కృతః - అలంకరింపబడిన, సమస్తవంద్యాయాః - సర్వులచేత వినుతింపబడిన, సచివేశాన్యాః - మంత్రిణీదేవత యొక్క, రథేంద్రః - రథశ్రేష్టము (దీనికి గేయచక్ర రథమని పేరు), ముదం రచయతు - సంతోషమును కలిగించుగాక !!
చింతామణి గృహము యొక్క వాయువ్య దిక్కునందు, నానావిధములైన పతాకముల చేత అలంకరింపబడినదియు, అందరిచేత నమస్కరింపబడిన, మంత్రిణీదేవి యొక్క గొప్పరథము (గేయచక్ర రథము), మాకు సంతోషమును కలుగజేయుగాక !! (ఓం శ్రీ గేయచక్రరాథారూఢమంత్రిణీపరిసేవి తాయై నమః)
II ఆర్యా ద్విశతి - 120వ శ్లోకము II
రుద్రదిశి రత్నధామ్నో రుచిరపతాకా ప్రపంచకంచుకితమ్ I
కుర్మో౨ధిహృదయ మనిశం క్రోడాస్యాయాః శతాంగమూర్ధన్యమ్ II ౧౨౦
తాః రత్నధామ్నః - ఆ చింతామణి గృహమునకు, రుద్రదిశి - ఈశాన్య దిక్కునందు ఉండు, రుచిర - సుందరమైన, పతాకా - పతాకముల యొక్క, కంచుకితం - కప్పబడినది అగు, క్రోడాస్యాయాః - వారాహీ అమ్మవారి యొక్క, శతాంగమూర్ధన్యం - శ్రేష్ఠమగు రథమును (కిరిచక్ర రథమును), అనిశం - ఎల్లప్పుడూ, అధిహృదయం కుర్మః - హృదయము నందు ధ్యానించుచున్నాను !!
చింతామణి గృహమునకు ఈశాన్య దిక్కునందు, సుందరమైన పతాకములచేత శోభిల్లుచున్న వారాహీఅమ్మవారి రథమును (కిరిచక్ర రథమును) ఎల్లప్పుడూ నా హృదయమునందు ధ్యానించుచున్నాను !!
(ఓం శ్రీ కిరిచక్రరథారూఢదండనాథాపురస్కృతా యై నమః)
( సశేషం .... )
సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి