6, జూన్ 2016, సోమవారం

భగవాన్ క్రోధభట్టారక విరచిత శ్రీ ఆర్యాద్విశతి తాత్పర్యము - 22


శ్రీ గురుభ్యో నమః

II ఆర్యా ద్విశతి - 111వ శ్లోకము II
తస్మిన్ దినేశపాత్రే తరంగితామోద మమృతమయమర్ఘ్యమ్ I
చంద్రకళాత్మకమమృతం సాంద్రీకుర్యాదమందమానందమ్ II ౧౧౧

తాః తస్మిన్ - ఆ, దినేశపాత్రే - సూర్యుడనెడు పూజాపాత్రమునందు, తరంగిత - ప్రసరించుచున్న, ఆమోదం - పరిమళముగల, అమృతమయం - అమృతమయమైన, అర్ఘ్యం - పూజ్యాద్రవ్యమును, చంద్రకళాత్మకం - చంద్రకళలమయమైన, అమృతం - అమృతమును, అమందం -అధికమైన, ఆనందం - సంతోషమును, సాంద్రీకుర్యాత్ - అతిశయింపజేయుగాక !!
ఆ సూర్యుడనెడు పూజాపాత్రయందు ప్రసరించుచున్న పరిమళములుగల అమృతమయమైన పూజాద్రవ్యము (అర్ఘ్యము), చంద్రకళాత్మకమైన అమృతమును, అధికమైన సంతోషములను కలుగజేయుగాక !!

II ఆర్యా ద్విశతి - 112వ శ్లోకము II
అమృతే తస్మిన్నభితో విహరంత్యో వివిధమణి తరణిభాజః I
షోడశకలాస్సుధాంశోశ్శోకాదుత్తారయంతు మామనిశమ్ II ౧౧౨

తాః తస్మిన్ - ఆ, అమృతే - అమృతమునందు, అభితః - చుట్టునూ, విహరంత్య - విహరించుచున్నవారునూ, వివిధ - నానా విధములైన, మణితరణి - రత్నములు చెక్కిన పడవలను, భాజః - కలవారును, సుధాంశోః - చంద్రుని యొక్క, షోడశకలాః - పదహారు కళలు, మాం - నన్ను/మమ్మల్ని, అనిశం - ఎల్లప్పుడూ, శోకాదుత్తారయంతు - దుఃఖము నుండి తరింపజేయుగాక !!

ఆ అమృతము నందు చుట్టూ విహరించుచున్నవారును, నానావిధములైన మణులచేత, రత్నములచేత పొదగబడిన పడవలు కలవారును అయిన చంద్రుని యొక్క పదహారు కళలు మమ్మల్ని ఎల్లప్పుడూ దుఃఖముల నుండీ తరింపజేయుగాక !!

అమృతా మానదా పూషా పుష్టిస్తుష్టీ రతిర్ధృతిః I
శశినీ చంద్రికా కాంతిర్జ్యోత్స్నా శ్రీః ప్రీతిరంగదా I
పూర్ణా పూర్ణామృతాచేతిః కళాః పీయూషరోచిషః II (లలితోపాఖ్యానము, 38వ అధ్యాయము, 100వ శ్లోకము)

II ఆర్యా ద్విశతి - 113వ శ్లోకము II
తత్రైవ విహృతిభాజో ధాతృముఖానాం చ కారణేశానామ్ I
సృష్ట్యాదిరూపికాస్తాశ్శమయంత్వఖిలాః కలాశ్చ సంతాపమ్ II ౧౧౩

తాః తత్త్రైవ - అచటనే, విహృతిభాజః - విహరించుచున్న, కారణేశానాం - సృష్ట్యాది కారణములకు అధిపతులగు, ధాతృముఖానాం - బ్రహ్మ మొదలైన వారి యొక్క, సృష్ట్యాదిరూపికాః - సృష్టి మొదలగు రూపములు గల (సృష్టి, స్థితి, లయ రూపములు), తాః - ఆ, అఖిలాః - సమానమైన, కలాశ్చ - విద్యలును, సంతాపం - కష్టమును, శమయంతు - పోగొట్టుదురుగాక !!
అచటనే విహరించుచున్న, సృష్ట్యాది కారణములకు అధిపతులగు బ్రహ్మ మొదలైన వారియొక్క రూపములు గల విద్యలు, మా యొక్క కష్టములను/సంతాపమును పోగొట్టుదురుగాక !!

II ఆర్యా ద్విశతి - 114వ శ్లోకము II
కీనాశవరుణ కిన్నరరాజదిగంతేషు రత్నగేహస్య I
కలయాన్వితాన్యజస్రం కలయం త్వాయుష్య మర్ఘపాత్రాణి II ౧౧౪

తాః కీనాశ - యముడు, వరుణ - వరుణుడు, కిన్నరరాజ - కుబేరుడు (వీరియొక్క), దిగంతేషు - దిక్కులకొనలయందు (దక్షిణ, పడమర, ఉత్తర దిశలయందు), కలయా - కళలతో, అన్వితాని - కూడిన, అర్ఘపాత్రాణి - పూజాద్రవ్యములు గల పాత్రలు, అజస్రం - ఎల్లప్పుడూ, ఆయుష్యం - దీర్ఘాయుష్షును, కలయంతు - ఇత్తురుగాక !!

యముడు, వరుణుడు, కుబేరుని దిక్కుల యందు (దక్షిణ, పడమర, ఉత్తర) కళలతో కూడిన పూజాద్రవ్యములు గల పాత్రలు, ఎల్లప్పుడూ మాకు దీర్ఘాయుష్షును ఇచ్చెదరుగాక !!

అర్ఘములు (పూజాద్రవ్యములు) ఎనిమిది రకములుః
ఆపః క్షీరం కుశాగ్రం చ దధి సర్పిస్సతండులమ్ I
యవస్సిద్దార్ధకశ్చైవ అష్టాంగోర్ఘః ప్రకీర్తితః II

II ఆర్యా ద్విశతి - 115వ శ్లోకము II
పాత్రస్థలస్య పురతః పద్మారమణ విధి పార్వతీశానామ్ I
భవనాని శర్మణే నో భవంతు భాసా ప్రదీపితజగంతి II ౧౧౫

తాః పాత్రస్థలస్య - ఆ పాత్రలు గల ప్రదేశమునకు, పురతః - ఎదుట ఉండు, భాసాప్రదీపితజగంతి - జగత్తులను ప్రకాశింపజేయుచున్న, పద్మారమణ - విష్ణువు, విధి - బ్రహ్మ, పార్వతీశానాం - శివుడు (వీరియొక్క), భవనాని - గృహములు, నః - మాకు, శర్మణే - క్షేమమును, భవంతు - అగుదురు గాక (అనుగ్రహింతురుగాక) !!

 ఆ పాత్రలు గల ప్రదేశమునకు ఎదుట ఉండు, జగత్తులను ప్రకాశింపజేయుచున్న, బ్రహ్మ విష్ణు శివుల గృహములు మాకు క్షేమమును కలుగజేయుదురుగాక!! 

(సశేషం .... )

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి