19, జూన్ 2016, ఆదివారం

కామాక్షీ సౌందర్యలహరి – 7వ శ్లోకము – అమ్మవారి సగుణరూప ధ్యానం


శ్రీ గురుభ్యో నమః

II కామాక్షీ సౌందర్యలహరి7 శ్లోకముఅమ్మవారి సగుణరూప ధ్యానం II
క్వణత్ కాంచీదామా కరికలభ కుంభస్తననతా
పరిక్షీణామధ్యే పరిణత శరచ్చంద్రవదనా I
ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః
పురస్తా దాస్తాం నః పురమథితురాహోపురుషికా II 7 II
 తాత్పర్యముః అమ్మా!! త్రిపురాసురసంహారం చేసిన పరమశివుని యొక్క అహంకార స్వరూపిణి అయిన జగన్మాతా!! కింకిణీ రవములు చేయు బంగారు చిరుగంటలను మొలనూలుగా (నడుముకి ఆభరణముగా) కలిగి, గున్నఏనుగుల కుంభస్థలమును పోలియున్న మాతృసంపద (స్తనములు) కలిగి, బాగా కృశించిన సన్నని నడుము కలిగి, శరత్కాలములో పున్నమి చంద్రుని వంటి ముఖము కలిగి, ధనుస్సు, పుష్పబాణములు, పాశము మరియు అంకుశము అనే నాలుగు ఆయుధములను నీయొక్క నాలుగు చేతులలో ధరించిఅమ్మ మా యెదుట సాక్షాత్కరించుగాక !!



భావార్ధముః
సౌందర్యలహరి ఒక్క మొదటి శ్లోకములో - శివశక్త్యైక రూపాన్ని అభివర్ణించారు శంకరులు.
రెండవ మరియు మూడవ శ్లోకాలలో  - అమ్మవారి పాదధూళి మహిమ
నాలుగవ శ్లోకములో అమ్మవారి పాదపద్మముల మహిమను
ఐదవ అమ్మవారి అనుగ్రహం పొందిన దేవీఉపాసకులయిన విష్ణువుమన్మథుల విజయముల గురించి వర్ణించారు.
ఆరవ శ్లోకములో ఎటువంటి ఆయుధములూ పెద్ద బలసంపత్తీ లేకుండానే, కేవలం శ్రీలలితాపరమేశ్వరీ అమ్మవారి అపాంగ వీక్షణము చేత మాత్రమే, మన్మథుడు ఏ విధంగా జగత్తులను జయించగలుగుతున్నాడో చెప్పారు శంకరులు.

ఇక్కడ వరకూ అమ్మవారి పాదముల గురించి తప్ప స్థూలముగా అమ్మవారి రూపవర్ణన ఎక్కడా చేయలేదుఈ ఏడవ శ్లోకములో మొదటిసారి అమ్మవారిని గురించి స్థూలరూపంలో వర్ణిస్తూమనందరమూ ఈ శ్లోకము పఠించి ధ్యానములో అమ్మవారి దర్శనము పొందగలిగే ధ్యానమూర్తిని మనకి అందించారు శంకరులు. అయితే ఇక్కడ విశేషమేమంటే, అమ్మవారి యొక్క దర్శనం ఎలా ఉంటుందో , ధ్యానం చెయ్యడానికి చెప్పారు కానీ, అమ్మవారి నామం ఏమీ చెప్పలేదు. ఇది గురువుల అనుగ్రహంతో ధ్యానంలో పట్టుకోవాలన్నమాట.

ఈ శ్లోకములో ఆదిశంకరులు ‘కాంచీ’ అనే పదం ద్వారాఇందులో వర్ణింపబడిన స్వరూపం ఎవరో చెప్పకనే చెప్తున్నారుఅది సాక్షాత్తు లలితా పరాభట్టారికా స్వరూపం అయిన కంచి కామాక్షీ అమ్మవారేమన దేశంలో కాశ్మీరు నుంచీ కన్యాకుమారి దాకా అమ్మవారిని అనేక నామరూపాలలో కొలవడం మనం చూస్తూ ఉంటాముఒకే అమ్మవారిని కాశ్మీరులో క్షీరభవానిగాకేరళలో భగవతిగాకర్ణాటకలో చాముండేశ్వరి మరియు శారదాంబగాతెలుగునాట జ్ఞానప్రసూనాంబికాభ్రమరాంబికాకనకదుర్గగామహారాష్ట్రలో తులజాభవానిగా,  గుజరాత్ లో అంబికగాఉత్తర్ ప్రదేశ్ లో అన్నపూర్ణేశ్వరివింధ్యవాసినిగాపశ్చిమబెంగాల్ లో కాళికగాఅస్సామ్ లో కామాఖ్యగాజమ్మూలో వైష్ణవిగాతమిళనాట అఖిలాండేశ్వరిమీనాక్షిధర్మసంవర్ధినికమలాంబబాలాంబశివకామసుందరి మరియు కామాక్షిగా అనేక రూపాలలో కొలుస్తూ ఉన్నారు.

ఇలా అమ్మవారిని అనేక రూపాలలో కొలుస్తూ ఉన్నాఅమ్మవారి ఉపాసనలో సర్వోత్కృష్టమైన శ్రీవిద్యాసాంప్రదాయములో చెప్పబడిన లలితాత్రిపురసుందరీ అమ్మవారికి అభేదమైన రూపం కంచిలోని కామాక్షీ అమ్మవారుతత్వతః ఇతర రూపాలలో ఉన్న అమ్మవార్లు అందరూ ఒకే అమ్మ అయినా.... ఉపాసనా పరంగా శ్రీవిద్యాతంత్రములో తెలుపబడిన లలితాత్రిపురసుందరీ అమ్మవారి యొక్క రూపము లక్షణములతో సరిపోయే స్వరూపం – ఒక్క కంచికామాక్షీ అమ్మవారేకామాక్షీ అమ్మవారు సాక్షాత్ లలితాత్రిపురసుందరీ పరాభట్టారికా స్వరూపంఈ విషయాన్ని చెప్పడానికి ఈ శ్లోకంలో ‘కాంచీ దామా’ అని సూచించారు శంకరులు. ఎందుకు సౌందర్యలహరిలో మొదటిసారి అమ్మవారి ధ్యానరూపాన్ని చెప్తూ కామాక్షీ అమ్మవారి రూపాన్నే ఎందుకు చెప్పారు జగద్గురు శంకరులు అని ఆలోచిస్తే - కాంచీపురం మన భారతదేశానికంతటికీ నాభి స్థానంలో ఉంది, మనందరమూ అమ్మ కడుపులో ఉన్నప్పుడు తల్లి యొక్క నాభిగొట్టం ద్వారానే పోషణాశక్తిని పొందాము. అలాగే ఈ సకల జగత్తుకీ మాత అయిన పరమేశ్వరికి జగత్తుకీ సంబంధం మొదట నాభిస్థానంలోనే మొదలవుతుంది కదా !! అందుకని శంకరులు కంచి కామాక్షీ అమ్మవారిని ధ్యానమూర్తిగా ఈ శ్లోకంలో అందించారు.

క్వణత్కాంచీదామా - ఇక్కడ ‘దామా’ అంటే మెలిపెట్టిన త్రాడు/మొలత్రాడు అని అర్ధంకాంచీదామా అంటే నాభికి పై స్థానము నందు అంటే నడుముకి కట్టబడిన మొలత్రాడు అని భావంచిన్ని కృష్ణుడిని యశోదమ్మ నడుముకి త్రాడు పట్టి కట్టిన కారణంగా ఆయనకి ‘దామోదరుడు’ అని నామం వచ్చిందిఇక్కడ క్వణత్ కాంచీదామా అంటే అమ్మవారి నడుముకి ఉన్న మొలత్రాడు/ఆభరణం బంగారు చిరుగంటలతో ఉండి సవ్వడి చేస్తూ ఉంటుంది అని అర్ధం. చిరుగంటల శబ్దం లేకపోతే దానిని మేఖలా అంటారు. చిరుగంటలతో కూడిన మొలనూలుని రణత్కింకిణిమేఖలా అని లలితాసహస్రంలో చెప్పబడినది. అలాగే లలితాసహస్రనామస్తోత్రంలో రత్నకింకిణికారమ్యరశనాదామభూషితా’ అనే నామంతో కూడా అనుసంధానం చేసుకోవచ్చు. అదేవిధంగా ఆదిశంకరాచార్యుల వారు ఇచ్చిన సుబ్రహ్మణ్య భుజఙ్గములో...
సువర్ణాభదివ్యాంబరైర్భాసమానాం క్వణత్కింకిణీమేఖలా శోభమానామ్
లసద్ధేమపట్టేన విద్యోతమానాం కటిం భావయే స్కంద తే దీప్యమానామ్
అనే శ్లోకములో సుబ్రహమణ్య స్వామి వారి నడుముకి ఉన్న క్వణత్కింకిణిమేఖలా అనే చిరుగంటల సవ్వడిచేసే ఆభరణమునుఆ ఆభరణము వల్ల దివ్యముగా మెరుస్తూ ఉన్న స్వామి యొక్క కటి భాగాన్ని ధ్యానం చేశారుఇక్కడ మేఖలా అంటే వడ్డాణము/మొలనూలుమేఖలా అంటే మంత్రసంకేతాన్ని తెలియజేస్తుందిఈ వడ్డాణమునకు చిరుగంటలు కూడా ఉంటే దానిని రణత్కింకిణీమేఖలా అంటారుఇక్కడ రణత్కింకిణీ అనే పదాలు ఆ చిరుగంటలు చేసే శబ్దాన్ని సూచిస్తాయిదీనినే శంకరులు సౌందర్యలహరిలోని ఈ ఏడవ శ్లోకంలో ‘క్వణత్ కాంచీదామా’ అన్నారు.

అసలు అమ్మవారు నడుముకి ఈ ఆభరణము ఎందుకు ధరిస్తారుస్త్రీలందరూ కూడా ఇటువంటి ఆభరణము ఎప్పుడూ ధరించాలి అని పెద్దలవాక్కుకానీ నేటి కాలమానపరిస్థితులలో ఇది అన్నివేళలా సాధ్యం కాదు కనుకకనీసం వివాహ సమయంలో వరుడి చేత వధువు యొక్క నడుముకి దర్భతో చేయబడిన త్రాడుని ధరింపచేసి ఒక మంత్రము చెప్పిస్తారు.

వివాహంలో ఆశాసానా అను మంత్రం చేత వధువు నడుమునకు దర్భత్రాడు కడతారుదీనిని యోక్త్ర బంధనం అంటారుఈ యోక్త్రబంధనంలో చెప్పే మంత్రానికి అర్ధం – తన పత్ని అగ్నికి అనువ్రతురాలవుతూఅనుసారిని అవుతూ సౌమనస్యాన్నిసంతానాన్నిసౌభాగ్యాన్నిశోభన సన్నివేశమైన శరీరాన్ని పొందుట కొరకు,  పత్నిని శోభన కర్మకు సుఖమయ్యేలా యోక్త్రం చేత ఆ భర్త బంధించునుయోక్త్ర బంధనసమయంలో పై మంత్రాన్నుచ్చరిస్తూ ఉండడం చేత  పత్నిని యజ్ఞ యోగ్యురాలుగానూపాప రహితురాలుగానూ చేసి సత్యమైన ఆశీస్సుతో సంసిద్ధురాలిని చేయుచున్న వాడవుతాడు విషయంలోవిద్యారణ్యులవారు వివాహములో స్త్రీ కంఠమునందు మంగళసూత్రం ఎంత పవిత్రమో అలాగేఈ యోక్త్ర బంధనం అంతే పవిత్రము అనీఇది అనువ్రత స్వీకార చిహ్నమనీ” వివరించారు.

లౌకికమైన స్త్రీపురుషుల వివాహ ప్రక్రియలో నడుముకి ట్టే దర్భసూత్రానికి అంత ప్రాధాన్యత ఉంటేఇక జగజ్జనని కామాక్షీ అమ్మవారి మొలనూలుఅమ్మవారు మందగమనం చేస్తూ ఉంటే ఆ చిరుగంటల సవ్వడి ఎంత మహిమాన్వితమో అర్ధం అవుతాయి. పూజ్య గురువులు చెప్పినట్లు, మనం అమ్మవారి గురించి ధ్యానం చేస్తూ ఉంటే ఈ మొలనూలు శబ్దం వినబడడం పరమప్రయోజనం. ఆ విధంగా ఉపాసన చెయ్యాలి.
అలాగే క్వణత్ కాంచీదామా అంటే మరొక సూక్ష్మార్థం కూడా ఉన్నదిక్వణత్ అంటే లయబద్ధముగా వచ్చే శబ్దంఅనగా సకల వేదములు అమ్మవారి నుంచే ఉద్భవించాయికనుక ఆ వేదనాదమే అమ్మవారి నడుముకి ధరింపబడిన ఆభరణము నుండీ వచ్చే రమ్యమైన శబ్దములు.

కరికలభకుంభస్తననతా -
ఆ తర్వాత శంకరులు ఈ శ్లోకంలో అమ్మవారి కటి ఆభరణ వర్ణన చేశాక ‘కరికలభకుంభస్తననతా’ అన్నారుఅంటే అమ్మవారి యొక్క స్తనములు – పిల్లఏనుగు కుంభస్థలమును పోలిఉండివాటి బరువుకి కించిత్ వంగినట్లుగా అమ్మవారు కనబడుతున్నారు అని అర్ధంఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటంటేఅమ్మవారి యొక్క ఏ స్వరూపంలో చూసినా ఋషులు/జగద్గురువులు/దేవీఉపాసకులు అందరూ అమ్మవారి ఉపాసనలో కేశాది పాదముల వరకు చేసే సగుణోపాసనలో అమ్మవారి యొక్క స్తనమండలములను గురించి అనేక ఉపమానములతో వర్ణించారుఇది ఏమాత్రమూ అనౌచిత్యము కాదుఅంతేగాక అమ్మవారి యొక్క మాతృత్వమునకు కృతజ్ఞతలు ఆవిష్కరించడం అని మనం అర్ధం చేసుకోవాలిఅందుకే పూజ్య గురువుగారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరశర్మగారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు .. ‘అమ్మవారి యందు అమ్మతనాన్ని చూశావా – ఉద్ధరింపబడతావుఅదే అమ్మయందు ఆడతనాన్ని చూశావా – అది దోషభూయిష్టమైన చూపురావణుడి పదితలలు పడిపోయినట్లు నశించిపోతావుతస్మాత్ జాగ్రత్త!!’ అని.

ఇక్కడ శంకరులు అమ్మవారి స్తనములను గున్నఏనుగుల కుంభములతో పోల్చారుస్తనములు మాతృత్వాన్ని సూచిస్తాయిమనం అందరము ఈ లోకములో పుట్టిబ్రతికి బట్ట కట్టాము అంటే,చిన్నతనములో అమ్మ తన రక్తాన్ని పాలగా మార్చిఎంతో నొప్పి పుడుతున్నా కేవలం కారుణ్యంతో పిల్లవాడికి స్తన్యం ఇవ్వడం వలన మాత్రమే మనం బ్రతికిఉన్నాముఅలాగే జగములను కన్న ఆబ్రహ్మకీటజనని అయిన కామాక్షీ అమ్మవారి స్తనములు ఈ జగత్తు మొత్తాన్ని పోషిస్తున్నాయిఇక్కడ అమ్మవారి స్తనములను ఏనుగు కుంభస్థలముతో పోల్చడానికి మరొక రహస్యం కూడా ఉంది.. ఏనుగు కుంభస్థలము అనగానే మనకి గుర్తుకు వచ్చేది ఎవరుఆయనే మన బుజ్జి బొజ్జ గణపతిఅమ్మఅయ్యల మొదటి సంతానంఅంటే కరికలభకుంభస్తననతా అనగానేఅమ్మవారి స్తనములనుండి పాలు త్రాగుతున్న బుజ్జి గణపతి మనకి కనబడతారుఅంటే అమ్మవారి స్తనములు తల్లీ బిడ్డల సంబంధాన్ని, పరిపూర్ణ మాతృతత్త్వాన్ని సూచించేవి అని జగద్గురువులు శంకరులు మనకి అంతర్లీనంగా బోధిస్తున్నారు.

అమ్మవారి స్తనమండలము గురించిశ్రీవిశ్వనాథ సత్యనారాయణ గారి శిష్యులు శ్రీపేరాల భరత శర్మ గారు ‘శారదానందలహరిలో ఒక అద్భుతమైన పద్యం ఇచ్చారు అని పూజ్య గురువు గారి ప్రవచనములలో చెప్తూ ఉంటారునాకు ఆ పద్యం యథాతథంగా గుర్తులేదు కానీఆ పద్యం సారాంశం మాత్రం ఈ విధంగా ఉంటుంది..
అమ్మవారి రెండు స్తనములలో ఒకస్తనమును అమ్మవారి పుత్రుడు అయిన ఏనుగు ముఖమువాడు-విఘ్నేశ్వరుడురెండవ స్తనము నుండి ఆరుముఖముల సుబ్రహ్మణ్యుడు పాలు త్రాగుతున్నారుట.  భరత శర్మగారు అన్నారు.. ‘విఘ్నేశ్వరుడు చూస్తే ఏనుగు ముఖము వాడు ఆయనకి ఎప్పటికి కడుపు నిండేనో.. పోనీ సుబ్రహ్మణ్యుడిని చూస్తే ఆరు ముఖములతో ఒక ముఖము తర్వాత మరొక ముఖముతో పాలు త్రాగుతున్నాడుఅమ్మా!! మేము కూడా నీ పిల్లలమే కదమ్మా.. మరి మాకు ఎప్పుడు నీ స్తన్యం నుంచి పాలు ఇస్తావమ్మాఅని అడిగిఓ మాకు అర్ధం అయ్యింది అమ్మా!! లోకంలో ఉన్న పిల్లలందరినీ పోషించడానికి నువ్వు సూర్యచంద్రులనే నీ స్తనములుగా చేసుకుని ఈ జగత్తుకి కావలసిన పోషణాశక్తిని సూర్యుని ద్వారా సకల జగత్తు కావలసిన శక్తినిపంటలనువర్షాలనుఅలానే చంద్రుని ద్వారా ఓషధులను ఈ జగత్తుకి అనుగ్రహిస్తున్నావు” అని చెప్పారు ఆ పద్యంలో.

అలాగే అమ్మవారి స్తనముల యొక్క బరువు వలన కించుక వంగినట్లుగా కనబడడం ఉత్తమ సాముద్రిక లక్షణంగా చెప్తారుదీనినే లలితాసహస్రనామస్తోత్రంలో ‘స్తనభారదళన్మధ్యపట్టబంధవళిత్రయా’ అనే నామంతో చెప్పారు వ్యాసులవారుఅమ్మవారి స్తనముల భారము చేత కించిత్ వంగిన నడుము కారణంగానడుము ప్రదేశంలో మూడు ముడతలు కలది అని అర్దంనుదుటి మీద కంఠము వద్దనడుము దగ్గర ఈ మూడు చోట్లా మూడు ముడతలు ఉండడం స్త్రీపురుషులిద్దరికీ ఉత్తమ సాముద్రిక లక్షణంసుందరకాండలో సీతమ్మ తల్లి స్వామి హనుమని, “ఏదీ నా రాముడు ఎలా ఉంటాడో చెప్పు” అని అడిగితే స్వామి హనుమ శ్రీరాముడి కేశాదిపాదముల వరకు మొత్తం వర్ణిస్తారుశ్రీరాముడు సాక్షాత్తు లలితాపరాభట్టారికా స్వరూపమే కదాసుందరకాండ 35వ సర్గ 18వ శ్లోకంలో అంటారు..
త్రివలీవాంస్త్ర్యవనతః చతుర్వ్యంగస్త్రిశీర్షవాన్ I
చతుష్కలశ్చతుర్లేఖః చతుష్కిష్కుశ్చతుస్సమః II

పరిక్షీణామధ్యే పరిణత శరచ్చంద్రవదనా -
తరువాత సౌందర్యలహరిలోని ఈ శ్లోకం రెండవపాదంలో శంకరులు అన్నారు – ‘పరిక్షీణామధ్యే పరిణత శరచ్చంద్రవదనా’ అనిపరిక్షీణా అంటే బాగా కృశించినమధ్యే అంటే నడుము కలది అనిఅంటే అసలు నడుము ఉందా లేదా అని సందేహించేంత సన్నని నడుము కలది అనిస్త్రీలకి నడుము బాగము ఎంత సన్నగా ఉంటే అంత తేలికగా పిల్లలను ప్రసవించ గలుగుతారు అని అంటారుఇది కూడా ఉత్తమ సాముద్రిక లక్షణముదీనినే లలితాసహస్రంలో ‘లక్ష్యరోమలతాధారతాసమున్నేయమధ్యమా’ అనే నామంలో అమ్మవారి యొక్క నాభి అనే పాదు నుండి పుట్టిన సన్నని నూగారు అనే లతకు ఆధారమై ఉండీ లేనట్టు కనబడేంత సన్నని బాగుగా ఉద్ధరింపబడిన నడుము కలిగిన ఓ అమ్మాఅని అర్ధంఅలాగే లలితాసహస్రంలోనే శాతోదరీ’ అనే నామంతో కూడా అనుసంధానం చేసుకోవచ్చుఅమ్మవారి నడుము సన్నగా ఉండడం వల్లనే సకల జగత్తుకి జగన్మాత / ఆబ్రహ్మకీటజనని అయింది ఆ తల్లి

తరువాత ‘పరిణత శరచ్చంద్రవదనా’ అంటే అమ్మవారి ముఖము బాగాపరిణతి చెందిన శరత్కాలమునాటి పున్నమి చంద్రుని వలె ఉన్నది అని అర్ధం. ఇక్కడ శంకరులు రెండు సార్లు పరి - పరి అని వేశారు (పరిక్షీణా/పరిణతి). అది శ్లోకాన్ని ఉచ్ఛరించడంలో అందం తెస్తుంది. అంతేగాక శ్లోకాన్ని పురశ్చరణ చేయడం తేలిక. అందుకే బహుభంగిమల సౌందర్యలహరి.

 శరదృతువులో వచ్చే ఆశ్వయుజ పౌర్ణమి నాటి చంద్రుడు ఎంత నిండుగా ఉంటాడో అమ్మవారి యొక్క వదనము అంత పూర్ణముగా ఉంటుంది అని అర్థంఅమ్మవారు షోడశకళాపూర్ణకాబట్టి పదహారు కళలు నిండిన చంద్రుని వలే అమ్మవారి వదనము ఉంటుంది.

అమ్మవారి యొక్క అటువంటి తేజోమయమైన పరిపూర్ణ చంద్రబింబమును పోలిన ముఖమును ధ్యానించడం వల్లభక్తులుగా మనకి కలిగే ప్రయోజనం ఏమిటి అని ఆలోచిస్తే - భౌతికముగా సూర్య చంద్రులను చూస్తేచంద్రుడు ప్రకాశించడానికి కారణం - సూర్య కాంతి ప్రతిబింబించడం వలనపున్నమి నాడు చంద్రుడి మీద ఆ సూర్యకాంతి సంపూర్ణముగా ప్రసరించి పూర్తి తేజస్సుతో కనబడతాడు. శరత్కాలములో వచ్చి పున్నమి చంద్రుడు అత్యంత తేజోమయంగా ఉండి, అమృతకిరణాలను వెదజల్లుతూ ఉంటాడు. అలాగే ఆంతములో సూర్యుడు అనగా మన ఆత్మశక్తికి ప్రతిరూపంచంద్రుడు మన మనస్సుకి సంకేతంమన మనస్సు ఎలా ఉంటుందో మన ముఖ కవళికలు కూడా అలానే ఉంటాయి. (Face is the index of the mind అని ఆంగ్లములో చెప్తారు కదా). బాహ్యములో శరత్కాల చంద్రుడు ప్రకాశించినట్లుగా, ఆంతరములో మన మనస్సు కూడా గొప్ప తేజస్సుతో వెలుగుతూ సంతోషంగా ఉండాలి అంటే, మనలోని సూర్యశక్తి/ఆత్మశక్తి నుంచే సాధ్యం. అటువంటి అమ్మవారి శరచ్చంద్రవదనమును బాగా ధ్యానము చేయడం వలనమన యొక్క ఆత్మ శక్తి బాగా పెరిగిఆ ఆత్మశక్తి తేజస్సు వలన మనస్సు కూడా ప్రశాంతతనుతేజస్సును పొందిఅమ్మవారి అనుగ్రహముతో సంతోషముగా ఉంటాము. మనం ఎటువంటి కష్టంలో ఉన్నా, ఆ కష్టానికి ఓదార్పుని ఇవ్వగలిగేది అమ్మయొక్క ముఖం.

ధనుర్బాణాన్ పాశం సృణిమపి దధానా కరతలైః
ఇక్కడ అమ్మవారి నాలుగు చేతుల యందు ధరించిన వస్తువులను గురించి చెప్తున్నారు శంకరులు.
కామాక్షీ అమ్మవారి నాలుగు చేతులలో ధనుస్సు, బాణములు, పాశము, అంకుశము ధరించియున్నది.
అసలు అమ్మవారికి నాలుగు చేతులు అని ఎందుకు చెప్పారు శంకరులు? రెండు చేతులు చెప్పవచ్చు, ఎనిమిది, పద్ధెనిమిది చేతులు ఇలా ఏదైనా ఎందుకు చెప్పారు? ఎందుకంటే - ఇక్కడ ధ్యానం చేయిస్తున్నది కంచిలో ఉన్న కామాక్షీ అమ్మవారి స్వరూపాన్ని. కామాక్షీ అమ్మవారు శ్రీమహారాజ్ఞీ. మహారాజ్ఞీ అంటే అన్నిటినీ పాలించే తల్లి. రక్షకత్వం సూచించడానికి ధనుస్సు, బాణములను ఆయుధములుగా ధరించినది. అలాగే అమ్మవారు జ్ఞానమును కూడా కటాక్షించే గురుమండల రూపిణి, మనలోని రాగపాశములను ధ్వంశం చేసి, జ్ఞానమును కటాక్షించగలదు కాబట్టి రాగద్వేషాలను అణచివేసే రాగపాశము, క్రోధాంకుశములను పట్టుకుని ఉంది.

లలితాసహస్రనామము ప్రారంభంలోనే వ్యాసుల వారు - చిదగ్నికుండమునుంచి అమ్మవారు భండాసురసంహారానికై ఉద్భవించిన తర్వాత వెంటనే అమ్మవారి యొక్క నాలుగు చేతులలో ఉన్న ఆయుధాలను వర్ణించారు.
ఉద్యద్భానుసహస్రాభా - చతుర్బాహుసమన్వితారాగస్వరూపపాశాఢ్యా - క్రోధాకారాంకుశోజ్జ్వలా - మనోరూపేక్షుకోదండా - పంచతన్మాత్రసాయకా అనే నామముల ద్వారా అమ్మవారు ధరించిన ఆయుధముల/వస్తువుల గురించి చెప్పారు.

అమ్మవారికి ఎడమవైపు పై చేతిలో రాగపాశముఎడమవైపు క్రింది చేతిలో చెఱకువిల్లుఅలాగే కుడివైపు పైచేతిలో అంకుశముక్రిందచేతిలో పుష్పబాణములు పట్టుకొని ఉంటారుఅమ్మవారు కానీమరే ఇతర దేవతా స్వరూపమైన సరే ఒక ఆయుధము లేదా వస్తువు చేతిలో పట్టుకున్నారు అంటేలోకానికి (అనగా మనకిఒక ప్రయోజనము కలుగజేయడం కొఱకు అలా పట్టుకుంటారుఈ ఆయుధములన్నిటికీస్థూల రూపము, మంత్రమయ (సూక్ష్మ) రూపము మరియు వాసనామయ (కారణ) రూపములు ఉంటాయి. స్థూలముగా మనలోని కొన్ని దుర్గుణములను అణచివేయడం కొరకు

·         ధనుః (మనోరూపేక్షుకోదండా) - మనస్సుకి ప్రతిరూపమైన ఇక్షు కోదండం అనగా చెఱుకువిల్లు. చెఱుకులో ఎక్కడ చూసినా అంతా తీపిదనమే ఉంటుంది, అలాగే మన మనస్సు ఎప్పుడూ సుఖాన్నే వెతుక్కుంటూ ఉంటుంది. ఇంద్రియ సుఖములకోసం నిరంతరం వెంపర్లాడుతూ, ఒకదాని తర్వాత మరొకటి మార్చి మార్చి అనుభవింపచేయాలని చూస్తుంది. ఈ మనస్సు అనే చెఱుకు విల్లు అమ్మవారు పట్టుకుంటే, అనగా మన మనస్సుని అమ్మవారి పాదముల వద్ద కేంద్రీకరించడం మొదలుపెడితే, ఇప్పటివరకు సుఖం, దుఃఖమని లోకంలో తిరిగిన మనస్సు మారి, అమ్మవారి యందు భక్తి కలిగేలా చేస్తుంది. స్థూల రూపంలో చెఱుకువిల్లు, ఈ ధనుస్సు సూక్ష్మరూపంలో ప్రణవ బీజాక్షరాన్ని సంకేతిస్తుంది. వాసనారూపం మనస్సు. అందుకే ఈ ఇక్షుకోదండం అనే ధనుస్సు మన్మథుడి చేతిలో ఉంటే చిత్తచాంచల్యము, అమ్మవారి చేతిలో ఉంటే సంకల్పబుద్ది, మనోజవము కలుగుతాయి. ధీశక్తి పెరుగుతుంది.

·         బాణాన్ (పంచతన్మాత్రసాయకా) - ఐదవ శ్లోకములో మన్మథుడు పట్టుకొనే ఐదు పుష్పబాణముల గురించి శంకరులు చెప్పారు. అవి వరుసగా అశోకము, అరవిందం, చూతం, నీలోత్పలం మరియు నవమల్లిక. ఈ ఐదు పుష్పములే ఐదు తన్మాత్రలుగా ఉంటాయి. తన్మాత్ర అనగా ఆయా ఇంద్రియము ద్వారా కలిగే కలిగే అనుభూతిని తెలుసుకొనే జ్ఞానం. ఈ ఐదు పుష్పబాణములు శబ్ద, స్పర్శ, రూప, రస గంధములనే ఐదు ఇంద్రియముల నుంచీ అనుభవించే సుఖాన్ని సూచిస్తాయి. ఈ తన్మాత్రలను సూచించడానికి పుష్పములనే ఎందుకు చెప్పారు? పుష్పములకు స్పర్శ ఉంటుంది కనుక స్పర్శేంద్రియము, పూవులలో తేనె ఉంటుంది కనుక రసేంద్రియము, పువ్వుని చూడగానే దాని రంగు/అందము వ్యక్తము అవుతాయి కనుక రూప ఇంద్రియము, పూవులకు సువాసన ఉంటుంది కనుగ వాసనేంద్రియము (గంధము) సరిపోయాయి. మరి పువ్వులకు శబ్దం అనే ఇంద్రియ తన్మాత్రని ఎలా పోల్చారు అని ఆలోచిస్తే, పువ్వులలో ఉన్న మకరందమును త్రాగడానికి వచ్చే తుమ్మెదల నుండీ వచ్చే ఝుంకారము చేస్తాయి కనుక, ఆ శబ్దం పువ్వుకోసమే వచ్చింది కనుక, శబ్ద తన్మాత్ర కూడా పుష్పముగా సూచించవచ్చు. మన్మథుడి దగ్గర ఉండే ఈ ఐదు బాణాలే అమ్మవారు కూడా పట్టుకుంది. ఇప్పుడు మనల్ని ఇంద్రియ లౌల్యములో పడిపోకుండా, అవే ఇంద్రియములను ధర్మబద్ధముగా అనుభవింపజేస్తూ, భక్తిని కలిగించి, ఆత్మోన్నతి వైపు నడిచేలా చేస్తుంది అమ్మవారు. ఒకే ఆయుధము/వస్తువు అది ఉన్న స్థానాన్ని బట్టి దాని విలువ/స్థాయి మారిపోతాయి. ఒక తుపాకీని దేశాన్ని రక్షించే సైనికుడో లేక సమాజాన్ని రక్షించే రక్షకభటులో పట్టుకుంటే ఎంతో ధైర్యంగా ఉంటాము, అదే ఇంకెవరైనా ఆ తుపాకీ పట్టుకుని తిరిగితే… అనుక్షణం భయమే. అలా, మనం ఏ ఇంద్రియ సుఖములకు బానిసలమై బాధపడుతున్నామో, అవే ఇంద్రియ తన్మాత్రలను అమ్మవారు తన అధీనంలో ఉంచుకొని, మనల్ని రక్షిస్తుంది. స్థూలములో ఈ ఆయుధము - ఐదు పుష్పబాణములు, సూక్ష్మములో కామరాజ బీజాక్షరమును, వాసనాపరముగా పంచ ఇంద్రియముల తన్మాత్రలను సూచిస్తుంది. ఈ పుష్పబాణములు అనే ఆయుధమును మన్మథుడు పట్టుకుంటే మనకి ఇంద్రియలౌల్యము, అమ్మవారు పట్టుకుంటే ఇంద్రియనిగ్రహము, లక్ష్యసిద్ధి కలుగుతాయి.

·         పాశము (రాగస్వరూపపాశాఢ్యా) - రాగము అనగా అరిషడ్వర్గములలో మొదటిదైన కామము అనే లక్షణము. కామము అంటే స్త్రీ పురుష సంబంధమైన శారీరిక కామము అని మాత్రమే కాదుఏ కోరికనైన కామము అనే వ్యవహరిస్తారు. ఈ రాగము/కోరిక అనేది ఉన్నంత వరకు మోక్షం వైపు అడుగులు వేయలేముమనల్ని మన రాగద్వేషాలే బంధించి మరల మరల ఈ జనన మరణ చక్రములో తిరిగేటట్లు చేస్తాయి. ఇక్కడ అమ్మవారు ఈ రాగము అనే లక్షణాన్ని సూచించే పాశము పట్టుకోవడానికి కారణం - మనల్ని ఇప్పటిదాకా బాధించిన ఈ రాగము/ఒకదాని వెంట మరొకటి పుడుతున్న కోర్కెలనెడి పాశము నుండీ విడిపించడానికి అమ్మ రాగపాశమును ధరించినది. అమ్మవారి చేతిలో ఈ రాగపాశము చూసి నమస్కరించి ధ్యానము చేశామా… అదే రాగమును మన ఆత్మోన్నతికి దోహదపడేలా చేస్తుంది అమ్మవారు. ఇప్పటి వరకూ తాత్కాలిక సుఖముల యందు ఉన్న రాగము/కోరికలను త్రిప్పిఉన్నతమైన విషయముల వైపు మన మనస్సును త్రిప్పుతుంది. సమయం దొరికితే గురువుల వాక్కులు వినాలి అనోగురువు గారి పాదసేవ చెయ్యాలి అనో.. అలాగే ఇంతకు పూర్వం నేను నా కుటుంబమునా కూతురునా గోవులు అనే వలయములో మాత్రమే ఉన్న రాగము నుంచి ఉన్నతివైపు నడిపించిలోకంలో లోకేశ్వరుడిని చూసే బుద్ధిప్రచోదనాన్ని ఇచ్చిలోకాన్ని లోకక్షేమాన్ని కోరే రాగము కలిగేలా చేస్తుంది అమ్మవారు. పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర శర్మ గారి అమృత వాక్కులలో చెప్తే - ఇతః పూర్వం వేటివలన బాధపడుతున్నామో వాటిని అమ్మ తీసుకుని చేతిలో ధరించింది. ఇప్పుడు నేను అమ్మ పాదములు పట్టుకుంటేఆ రాగము/క్రోధము మొదలగు లక్షణములు నన్ను బాధించకుండా,ఎంతవరకు నాకు అవసరమో అంతే ఇచ్చి అమ్మవారు రక్షిస్తుంది. స్థూలముగా పాశము, సూక్ష్మరూపములో ‘ఆం’ అనే బీజాక్షరమును, వాసనాపరముగా మనకి ఇష్టమైన విషయముల పట్ల ఉండే అనురాగాన్ని సంకేతిస్తుంది.
·         సృణి అనగా అంకుశము (క్రోధాకారాంకుశోజ్జ్వలా) - క్రోధాన్ని సంకేతించడానికి అంకుశమును పట్టుకుంది అమ్మవారు. కామము/ కోరికలు తీరకపోతే అది పోయి పోయి క్రోధముగా మారుతుంది. భగవద్గీతలో కృష్ణపరమాత్మ వీతారాగభయక్రోధా మన్మయాః మాముపాశ్రితాః అన్నారు కదాఅంటే రాగముక్రోధము అనేవి పోతేనే కానీ మనం మోక్షం పొందలేము. ఇప్పటి వరకూ ఏ క్రోధం వల్ల మనం పతనం అవుతున్నామోఅమ్మ క్రోధాకారాంకుశమును చేతిలో ధరించడం వల్లమనకి క్రోధం మీద క్రోధం కలిగిఅమ్మవారి యందు అయ్యవారి యందు భక్తి పెరుగుతుంది. స్థూలరూపములో అంకుశము, సూక్ష్మరూపములో ‘క్రోం’ అనే బీజాక్షరమును, వాసనా పరముగా మనలోని కామ/క్రోధములను సంకేతిస్తుంది.

పురస్తా దాస్తాం నః పురమథితురాహోపురుషికా -

పైన వివరించినట్లు, చిరుగంటల శబ్దం వస్తున్న మొలనూలు ధరించినది, ఏనుగుకుంభస్థలములను పోలిన గొప్ప మాతృసంపద కలిగినది, సన్నని నడుము కలిగినది, నాలుగు చేతుల యందు చెఱకువిల్లు, పుష్పబాణములు, పాశము, అంకుశము ధరించి, పురములను మథించిన పరమశివుడి యొక్క రాశీభూతమైన అహంకార స్వరూపం - మా ఎదుట ప్రత్యక్షమగు గాక !!

కామాక్షీ సౌందర్యలహరి వ్యాఖ్యానములో మొదటి శ్లోకములో వివరించినట్లుగా స్వామివారికి అహం’ స్ఫురణ కలిగింది అంటే అది అమ్మవారు. అహం స్ఫురణ లేని కామేశ్వర తత్త్వాన్ని అనహన్తా’ అనీ,కామేశ్వరీ-కామేశ్వర తత్త్వాన్ని కలిపి పరహన్తా’ అనీఅన్ని అర్ధములు నా స్వరూపములే అని భావించుట అహన్తా’ అనీ అంటారు – అమ్మవారు అహన్తా స్వరూపిణి. అంతా మాయాస్వరూపిణి అయిన అమ్మవారే అహం స్ఫురణ కలిగించిఈశ్వరుడి చేత సృష్ఠిస్థితి లయములు చేయిస్తుంది. అలా పరమశివుడి నుంచి అభిన్నమయిన శివశక్తీ, శివచైతన్య స్వరూపురాలా, అమ్మా ! మా కన్నులముందు ఒక్కసారి కనపడమ్మా అని ప్రార్థించారు శంకరులు. అయితే ఇక్కడ శంకరులు ఎక్కడా అమ్మవారి పేరు చెప్పలేదు. ఇది మనం ధ్యానంలో తెలుసుకోవాలి. ఆమెయే శ్రీలలితాంబిక, కాంచీపురము నందు కొలువై ఉన్న కామాక్షీ పరదేవత. అదీ సౌందర్యలహరి.

ఈ శ్లోకమును భక్తిశ్రద్ధలతో పారాయణ చేస్తే, శతృజయము కలుగుతుంది అని పెద్దల వ్యాఖ్యానము. ప్రథానంగా అంతః శతృవులను జయించడం అని మనం అన్వయం చేసుకోవాలి. ఎందుకంటే బాహ్య శతృవులకన్నా అంతః శతృవులు అత్యంత ప్రమాదకరం, ఎప్పుడైనా మనల్ని పడగొట్టే ప్రయత్నం చేస్తాయి, కనుక ఈ శ్లోకంలో శంకరులు చెప్పినవిధంగా ధ్యానం చేస్తే, అంతః శతృజయం కలిగి, అమ్మవారి అనుగ్రహకటాక్షం లభిస్తుంది. 

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి