2, జూన్ 2016, గురువారం

భగవాన్ క్రోధభట్టారక విరచిత శ్రీ ఆర్యాద్విశతి తాత్పర్యము - 21


శ్రీ గురుభ్యో నమః

II ఆర్యా ద్విశతి - 105వ శ్లోకము II
శృంగారవరణవర్యస్యోత్తరతస్సకలవిబుధ సంసేవ్యమ్ I
చింతామణిగణరచితం చింతాం దూరీకరోతు మే సదనమ్ II ౧౦౫

తాః శృంగారవరణవర్యస్య - శృంగారమయమైన శ్రేష్ఠమైన ప్రాకారమునకు, ఉత్తరతః - పై భాగము నందు ఉండు, సకలవిబుధ - సమస్త దేవతలచేత, సంసేవ్యం - ఆరాధింపదగినదియు, చింతామణిగణరచితం - చింతామణులచేత చేయబడినదియు అగు, సదనం - గృహము, మే చింతాం - నా యొక్క వ్యసనమును, చింతలను, దూరీకరోతు - పోగొట్టుగాక !!

శ్రేష్ఠమైన శృంగారమయ ప్రాకారమునకు పై భాగము నందు, సమస్తదేవతలచేత ఆరాధింపబడునది, చింతామణులచేత చేయబడినదియు అగు చింతామణి గృహము - నా యొక్క చింతలను దూరముచేయుగాక !!

II ఆర్యా ద్విశతి - 106వ శ్లోకము II
మణిసదనసాలయోరధిమధ్యం దశతాళ భూమిరుహదీర్ఘైః I
పర్ణైస్సువర్ణవర్ణైర్యుక్తాం కాండైశ్చ యోజనోత్తుంగైః II ౧౦౬

తాః మణిసదనసాలయోః - శృంగార, మణిమయ సాలములకు, అధిమధ్యం - మధ్య ప్రదేశమున, దశ - పది, తాళభూమిరుహ - తాటిమ్రాకుల అంతటి, దీర్ఘైః - పొడవైన, సువర్ణవర్ణైః - బంగారు వర్ణము కలిగిన, పర్ణైః - ఆకులతోనూ, యోజనోత్తుంగైః - ఒక యోజనము పొడవు కలిగిన, కాండైశ్చ - కాండములతో, యుక్తాశ్చ - కూడినదియు ...

శృంగారమయ, మణిసదన సాలములకు మధ్య ప్రదేశమునందు, పది తాటిమ్రాకుల అంతటి పొడవైన, బంగారు వర్ణములో ఉన్న ఆకులతోనూ, యోజనము పొడవైన కాండములతో కూడినదియు ....

II ఆర్యా ద్విశతి - 107వ శ్లోకము II
మృదుళై స్తాళీపంచకమానైర్మిళితాం చ కేసరకదంబైః I
సంతత గళిత మరందస్రోతో నిర్యన్మిళిందసందోహమ్ II ౧౦౭

తాః మృదుళైః - మృదులమైనదియు (మెత్తనివియు), తాళీపంచకమానైః - ఐదు తాటి ఆకుల పొడవైనదియు, సంతత - ఎల్లప్పుడూ, గళిత - స్రవించుచున్న, మరందస్రోతః - తేనె ప్రవాహములయందు ఉండి, నిర్యత్ - బయటకి వస్తున్న, మిళింద - తుమ్మెదల యొక్క, సందోహం - గుంపులు కలదియు, కేసరకదంబైః - కేసరముల గుంపుతో, మిళితాం - కూడినదియు...

మృదులమైనవియు, ఐదు తాటి ఆకుల పొడవు కలిగినవియు, ఎల్లప్పుడూ స్రవించుచున్న తేనె ప్రవాహములనుండి బయటకి వస్తున్న తుమ్మెదల గుంపులు కలదియు, కేసరముల గుంపుతో కూడినదియు....

II ఆర్యా ద్విశతి - 108వ శ్లోకము II
పాటీరపవనబాలక ధాటీనిర్యత్పరాగపింజరితామ్ I
పద్మాటవీం భజామః పరిమళ కల్లోల పక్ష్మలోపాంతామ్ II ౧౦౮

తాః పాటీర - చందనము వలె చల్లనిదియు, సువాసన గలదియు, పవనబాలక - మలయ మారుతములయొక్క, ధాటీ - వీచుటచేత, నిర్యత్ - ప్రసరించుచున్న, పరాగ - పుప్పొడుల చేత, పింజరితాం - పసుపువన్నె గలదిగా చేయబడినదియు, పరిమళ - సువాసనల యొక్క, కల్లోల - పరంపరచేత, పక్ష్మల - వృద్ధి పొందింపబడిన (నిండిన), ఉపాంతాం - సమీప ప్రదేశములు కలదియు అగు, పద్మాటవీం - కమలవనమును, భజామః - సేవించుచున్నాను !!

చందనము వలె చల్లనిదియు, చక్కని సువాసనలు కలిగినదియు, మలయ మారుతములు వీచుటచేత పుప్పొడిరాలి పుసుపు రంగులో చేయబడినదియు, సువాసనలచే నిండిన పద్మముల వనమును నేను సేవించుచున్నాను !!

II ఆర్యా ద్విశతి - 109వ శ్లోకము II
దేవ్యర్ఘ్యపాత్రధారీ తస్యాః పూర్వదిశి దశకలాయుక్తః I
వలయిత మూర్తిర్భగవాన్ వహ్నిః క్రోశోన్నత శ్చిరంజీయాత్ II ౧౦౯

తాః తస్యాః పూర్వదిశి - కమలవనమునకు తూర్పు దిక్కున ఉండు, దశకలాయుక్తః - దశ కళలతో ఉండు వాడును, దేవ్యర్ఘ్య పాత్రధారీ - పరమేశ్వరి యొక్క పూజా పాత్రలను ధరించినవాడును, వలయితమూర్తిః - గుండ్రమైన ఆకారము కలవాడును, క్రోశోన్నతః - ఒక క్రోశము (రెండు మైళ్ళ) పొడవైనవాడును, భగవాన్ - భగవంతుడు, మహిమవంతుడు అయిన, వహ్నిః -అగ్నిదేవుడు, చిరం - ఎల్లప్పుడూ, జీయాత్ - సర్వోత్కృష్టముగా వర్ధిల్లుగాక !!

కమలవనమునకు పూర్వ దిక్కులో, పది కళలతో కూడినవాడు, లలితాంబిక యొక్క పూజా పాత్రలను ధరించినవాడును, గుండ్రమైన ఆకారము కలవాడును, క్రోశము పొడవు కలవాడును, భగవంతుడు అయిన అగ్నిదేవుడు ఎల్లప్పొడూ వర్ధిల్లుగాక !!

అగ్నియొక్క పది కళలు - 
భూమార్చిరుష్ణాజ్వలినీ జ్వాలినీ విస్ఫులింగినీ I
సుశ్రీ సరూపా కపిలా హవ్యకవ్యవహే అపి II
ఏతా దశకళాప్రోక్తా వహ్నేరాధారరూపిణః II (లలితోపాఖ్యానము, 39వ అధ్యాయము, 90వ శ్లోకము)

II ఆర్యా ద్విశతి - 110వ శ్లోకము II
తత్రాధారే దేవ్యాః పాత్రీభూతః ప్రభాకరః శ్రీమాన్ I
ద్వాదశకలాసమేతో ధ్వాంతం మమ బహుళ మాంతరం భింద్యాత్ II ౧౧౦

తాః తత్రాధారే - ఆ పూజాపాత్రా ధారయందు, దేవ్యత్ - ప్రకాశించుచున్నవాడును, పాత్రీభూతః - పాత్రముగా అగుచున్నట్టివాడునూ, శ్రీమాన్ - సంపదలతో కూడినవాడును, ద్వాదశకలాసమేతః - పండ్రెండు కళలతో కూడినవాడు అగు, ప్రభాకరః - సూర్యుడు, మమ - నా యొక్క, ఆంతరం - మనస్సునందలి, బహుళం - అధికమైన, ధ్వాంతం - చీకటిని (అజ్ఞానమును), భింద్యాత్ - నశింపజేయుగాక !!
ఆ పూజాపాత్రా ధార యందు ప్రకాశించుచున్నవాడును, పాత్రముగా అవుతున్నట్టి వాడునూ, సంపదలతో కూడిన వాడునూ, పన్నెండు కళలతో కూడిన సూర్యభగవానుడు నా మనస్సునందలి చీకటిని, అజ్ఞానాన్ని నశింపజేయుగాక !!

సూర్యుని ద్వాదశ కళలు - 
వర్తంతే ద్వాదశకలా రవేర్బాస్వరరోచిషః I
తపినీ తాపినీ ధూమ్రా మరీచిర్జ్వాలినీ రుచిః II
సుషుమ్నా భోగదా విశ్వబోధినీ ధారిణీ క్షమా I
తస్మిన్ పాత్రే మాహానందకారణం పరమామృతమ్ II 

తదర్ఘ్య మమృతం ప్రోక్తం నిశాకరకళామయమ్ II (లలితోపాఖ్యానము 39వ అధ్యాయము, 94-95, 98వ శ్లోకములు)

(సశేషం .... )

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి