శ్రీ గురుభ్యో నమః
II ఆర్యా ద్విశతి - 121వ శ్లోకము II
పరితో దేవీధామ్నః ప్రణీతవాసా మనుస్వరూపిణ్యః I
కుర్వంతు రశ్మిమాలాకృతయః కుశలాని దేవతా నిఖిలాః II ౧౨౧
తాః దేవీధామ్నః - ఆ చింతామణి గృహమునకు, పరితః - చుట్టును, ప్రణీతవాసాః - వసించుచున్నట్టి, మనుస్వరూపిణ్యః - మంత్ర స్వరూపులైన, రశ్మిమాలాకృతయః - కిరణముల వరుసలే స్వరూపముగా గలవారగు, నిఖిలాః - సమస్తమైన, దేవతాః - దేవతాస్త్రీలు, కుశలాని - క్షేమములను, కుర్వంతు - చేయుదురుగాక !!
చింతామణిగృహమునకు చుట్టూ వసించుచున్న మంత్రస్వరూపులు, తేజోమయులు అయిన సమస్త దేవతలు మాకు క్షేమమును కలిగించెదరుగాక !!
II ఆర్యా ద్విశతి - 122వ శ్లోకము II
ప్రాగ్ద్వారస్య భవానీధామ్నః పార్శ్వద్వయా౨రచితవాసే I
మాతంగీకిటిముఖ్యౌ మణిసదనే మనసి భావయామి చిరమ్ II ౧౨౨
తాః భవానీధామ్నః - పరమేశ్వరి యొక్క నివాసమగు, మణిసదనే - చింతామణి గృహము నందు, ప్రాగ్ద్వారస్య - తూర్పు వాకిలి యొక్క, పార్శ్వద్వయ - రెండు ప్రక్కలందు, అరచితవాసే - నివసించుచున్న, మాతంగీకిటిముఖ్యౌ - మాతంగి, వారాహి అమ్మవార్లను (మాతంగి అమ్మవారే సంగీతమాతృకాదేవి, శ్యామల సంగీతయోగిని) మనసి - మనసునందు, భావయామి - ధ్యానించుచున్నాను !!
శ్రీలలితాపరమేశ్వరి అమ్మవారి నివాసమగు చింతామణి గృహమునకు తూర్పు వాకిలి యొక్క రెండు ప్రక్కల నివసించుచున్న, మాతంగీ మరియు వారాహీ అమ్మవార్లను మనసునందు ధ్యానించుచున్నాను !!
శ్యామలాకోలముఖ్యౌ ద్వేతయోరాద్యాంతు దేవతామ్ II
ప్రధానమంత్రిస్థానీయమభిషి చ్య సుధారసైః I
శక్తిరాజ్యస్య సర్వస్వభర్త్రీం సా లలితాకరోత్ II
అథ ద్వితీయాకోలస్యా భుజార్జిత పరాక్రమా I
యాస్తితాం లలితాదేవీ దండనాథామకల్పయత్ II (లలితోపాఖ్యానము, 22వ అధ్యాయము, 86-89 శ్లోకములు)
II ఆర్యా ద్విశతి - 123వ శ్లోకము II
యోజనయుగళాభోగా తద్వత్పరిణాహవలయమణిభిత్తిః I
చింతామణిగృహభూమి ర్జీయాదామ్నాయమయ చతుర్ద్వారా II ౧౨౩
తాః యోజనయుగళాభోగా - రెండు యోజనముల వైశాల్యము కలిగినదియు, తద్వత్ - అంతటి, పరిణాహ - వైశాల్యము గల, వలయ - చక్రాకారమైన, మణిభిత్తిః - రత్నమయమైన గోడ కలిగినదియు, ఆమ్నాయమయ - చతుర్వేదమయమగు, చతుర్ద్వారా - నాలుగు వాకిళ్ళు కలిగినదియు అగు, చింతామణిగృహభూమిః - చింతామణిగృహము యొక్క ప్రదేశము, జీయాత్ - సర్వోత్కృష్టముగా వర్తించుగాక !!
రెండు యోజనములు వైశాల్యము కలిగి, చక్రాకారములో ఉండి, రత్నమయమైన గోడలు కలిగి, నాలుగు వేదములను నాకు ద్వారములుగా కలిగిన చింతామణి గృహము -- దిగ్విజయముగా వర్ధిల్లుగాక !!
II ఆర్యా ద్విశతి - 124వ శ్లోకము II
ద్వారే ద్వారే ధామ్నః పిండీభూతా నవేన బింబాభాః I
విదధతు విమలాం కీర్తిం దివ్యా లౌహిత్యసింధవో దేవ్యః II ౧౨౪
తాః ధామ్నః - ఆ చింతామణి గృహము యొక్క, ద్వారే ద్వారే - ప్రతీ ద్వారము నందు, పిండీభూతా - గుంపులుగా ఉన్నవారును, నవేన బింబాభాః - క్రొత్తగా ఉదయించుచున్నట్టి సూర్యబింబ కాంతి గలవారును, లౌహిత్యసింధవః - ఎఱ్ఱదనమునకు సముద్రము వంటి వారును (ఎఱ్ఱని కాంతిపుంజము వంటివారు), దివ్యాః - ప్రకాశించుచున్నవారును అగు, దేవ్యః - దేవతాస్త్రీలు, విమలాం కీర్తిం - నిర్మలమైన యశస్సును, విదధతు - కలిగింతురుగాక !!
చింతామణి గృహమునకు ప్రతీద్వారము నందు గుంపులుగా ఉన్న, సూర్యకాంతి తేజస్సు కలిగిన దేవతా స్త్రీలు మాకు నిర్మలైన యశస్సును కలిగింతురుగాక !!
II ఆర్యా ద్విశతి - 125వ శ్లోకము II
మణిసదనస్యాంతరతో మహనీయే రత్నవేదికామధ్యే I
బిందుమయ చక్రమీడే పీఠానాముపరి విరచితావాసమ్ II ౧౨౫
తాః మణిసదనస్య - ఆ చింతామణి గృహము యొక్క, అంతరతః - నడుమ ఉన్నట్టి, మహనీయే - మహిమాన్వితమైన, రత్నవేదికా మధ్యే - మణినిర్మితమైన వేదిక నడుమ, పీఠానాముపరి - పీటల మీద, విరచితావాసాం - కల్పింపబడిన (రచింపబడిన), బిందుమయచక్రం - బిందుమయమైన చక్రమును, ఈడే - స్తుతించుచున్నాను !!
చింతామణి గృహము మధ్యన ఉన్నట్టి, మహిమాన్వితమైన మణిమయ వేదిక నడుమ పీటల మీద రచింపబడిన బిందుమయ శ్రీచక్రమును స్తుతించుచున్నాను !!
వివరణః బిందుమయచక్రము - శ్రీలలితాదేవి యొక్క చక్రము - దీనికి చక్రరాజ రథమని పేరు. ఈ చక్రము నందు తొమ్మిది పర్వములు (దొంతులు) గలవు. వానిలో అడుగున ఉండు తొమ్మిదవ పర్వమును - త్రైలోక్యమోహన చక్రము అని పిలువబడును. దానియందు మూడు అంతస్థులు గలవు. మొదటి అంతస్థులో అణిమాది దశ సిద్ధి దేవతలును, దానికిపైన రెండవ అంతస్థులో బ్రాహ్మి మొదలగు అష్టమాతృక దేవతలును, దానికిపైన మూడవ అంతస్థులో సంక్షోభిణి మొదలగు దశముద్రాదేవతలును నివసించుచుందురు. వీరికందరికిని ప్రకటశక్తులని పేరు. వీరికి యజమానురాలు త్రిపురాదేవి.
సిద్ధి బ్రాహ్మ్యాది ముద్రాశ్చ ఏతా ప్రకటశక్తయః I
భండాసురస్య సంహారం కర్తుం చక్రే రథే స్థితాః II (లలితోపాఖ్యానము)
( సశేషం .... )
సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి