1, జూన్ 2016, బుధవారం

భగవాన్ క్రోధభట్టారక విరచిత శ్రీ ఆర్యాద్విశతి తాత్పర్యము - 20


శ్రీ గురుభ్యో నమః

II ఆర్యా ద్విశతి - 101వ శ్లోకము II
ఇందుమయసాలమీడే తస్యోత్తరతస్తుషారగిరిగౌరమ్ I
అత్యంత శిశిరమారుత మనయోర్మధ్యం చ చంద్రికోద్గారమ్ II ౧౦౧

తాః తస్యోత్తరతః - ఆ రవిమయప్రాకారమునకు పై భాగమునందు ఉండు, తుషారగిరిగౌరం - హిమవత్పర్వతము వలె తెల్లగానున్నట్టి, ఇందుమయసాలం - చంద్రమయమైన ప్రాకారమును, చంద్రికోద్గారం - వెన్నెల పుంజము గలదియు, అత్యంతశిశిరమారుతం - చల్లని గాలులు కలదియు అగు, అనయోర్మధ్యం - ఆ రెండు (రవిమయ, చంద్రమయ) ప్రాకారముల మధ్య ప్రదేశమును, ఈడే - వినుతించుచున్నాను !!
రవిమయ (24వ) ప్రాకారమునకు పై భాగము నందు, హిమవత్పర్వతము వలె తెల్లగా ఉన్నది, వెన్నెల కిరణాలు కలిగిన చంద్రమయ (25వ) ప్రాకారమును, ఈ రెండు ప్రాకారముల మధ్యన ఉండే చల్లని గాలులు కలిగిన ప్రదేశమును నేను వినుతించిచున్నాను !!

II ఆర్యా ద్విశతి - 102వ శ్లోకము II
తత్ర ప్రకాశమానం తారానికరైః పరిష్కృతోద్దేశమ్ I
అమృతమయకాంతికందళమంతః కలయామి కుందసితమిందుమ్ II ౧౦౨

తాః తత్ర - ఆ ప్రదేశమునందు, ప్రకాశమానం - ప్రకాశించుచున్నవాడును, తారానికరైః - నక్షత్రముల గణములచేత, పరిష్కృత - అలంకరింపబడిన, ఉద్దేశం - ప్రదేశము కలవాడును, అమృతమయ - అమృతస్వరూపమైన, కాంతి - కిరణముల యొక్క, కందళం - మొలకలు కలవాడు, కుందసితం - మల్లెపూవులవలె తెల్లని కాంతి కలవాడును అగు, ఇందుం - చంద్రుని, అంతః- మనస్సునందు, కలయామి - ధ్యానించుచున్నాను !!
ఇందుమయ ప్రాకారమునందు, నక్షత్రములచేత అలంకరింపబడిన ప్రదేశమునందు, అమృతస్వరూపమైన కాంతి కిరణములు కలవాడు, మల్లెపూవులవలె తెల్లని కాంతి కలవాడు అయిన చంద్రుని మనస్సునందు ధ్యానించుచున్నాను !

II ఆర్యా ద్విశతి - 103వ శ్లోకము II
శృంగారసాలమీడే శృంగోల్లసితం తదుత్తరే భాగే I
మధ్యస్థలే తయోరపి మహితాం శృంగారపూర్వికాం పరిఖామ్ II ౧౦౩

తాః తదుత్తరే భాగే - ఆ చంద్రమయ ప్రాకారమునకు పై భాగము నందు ఉండు, శృంగోల్లసితం - శిఖరములచేత ప్రకాశించునట్టి, శృంగారసాలం - శృంగార రసమయమైన ప్రాకారమును, తయోరపి - ఆ రెండు (చంద్రమయ, శృంగారమయ) ప్రాకారముల, మధ్యస్థలే - మధ్య ప్రదేశమునందు, మహితాం - మహిమ కలదియు, విపులాం - విశాలమైనదియు అగు, శృంగారపూర్వికాం పరిఖామ్ - శృంగారపు నడబావిని, ఈడే - నుతించుచున్నాను !!
చంద్రమయ (25వ) ప్రాకారమునకు పై భాగమునందు ఉండు, శిఖరములచేత ప్రకాశించునట్టిది, శృంగారరసమయ (26వ) ప్రాకారమును, ఆ రెండు ప్రాకారముల మధ్య ప్రదేశమునందు, గొప్ప మహిమ కలిగిన, విశాలమైనది అయిన శృంగార బావిని నేను నుతించుచున్నాను !!

II ఆర్యా ద్విశతి - 104వ శ్లోకము II
తత్ర మణినౌస్థితాభిస్తపనీయారచిత శృంగహస్తాభిః I
శృంగారదేవతాభిస్సహితం పరిఖాధిపం భజే మదనమ్ II ౧౦౪

తాః తత్ర - ఆ శృంగారపు బావియందు ఉన్న, మణినౌస్థితాభిః - మణులచే నిర్మింపబడిన పడవల యందు కూర్చున్న వారును, తపనీయరచిత - బంగారముచేత చేయబడిన, శృంగ - కొమ్ములు, హస్తాభిః - చేతులయందు ధరించినవారును అగు, శృంగారదేవతాభిః - శృంగారుదేవతా స్త్రీలతో, సహితం - కూడిన, పరిఖాధిపం - ఆ అగడ్తకు అధిదేవతయైన, మదనం - మన్మథుని, భజే - కొలుచుచున్నాను !!

ఆ శృంగారపు బావి యందు, మణులచేత నిర్మింపబడిన పడవలయందు కూర్చుని, బంగారు కొమ్ములను హస్తములయందు ధరించిన శృంగారదేవతా స్త్రీలతో కూడి ఉన్న, ఆ బావికి అధిదేవతయైన మన్మథుడిని నేను కొలుచుచున్నాను !!

(సశేషం .... )

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి