28, జూన్ 2016, మంగళవారం

భగవాన్ క్రోధభట్టారక విరచిత శ్రీ ఆర్యాద్విశతి తాత్పర్యము - 26


శ్రీ గురుభ్యో నమః

II ఆర్యా ద్విశతి - 132వ శ్లోకము II (సప్తమపర్వము - సర్వసంక్షోభణచక్రస్థిత గుప్తతరయోగినీ ధ్యానము)
తస్యోపరి మణిఫలకే తామ్రాంభోరుహదళప్రభాశోణాః I
ధ్యాయామ్యనంగకుసుమాప్రముఖా దేవీశ్చ విధృతకూర్పాసాః II ౧౩౨

తాః తస్యోపరి - దానికి మీద (సర్వాశాపరిపూరక చక్రమునకు పైన), మణిఫలకే - మణిపీఠము నందు, తామ్రాంభోరుహ - ఎఱ్ఱని తామరల యొక్క, దళప్రభా - రేకుల కాంతి వలె, శోణాః - ఎఱ్ఱనివారును, విధృతకూర్పాసాః - రవికలు తొడిగినవారునూ అగు, అనంగకుసుమప్రముఖాః - అనంగకుసుమ మొదలగు గుప్తతర యోగినులు అని పేరుగల, దేవీ - దేవతలను (శక్తులను), ధ్యాయామి - ధ్యానించుచున్నాను !!

సర్వాశాపరిపూరకచక్రమునకు పై భాగమున మణిపీఠము నందు ఎఱ్ఱని తామరరేకుల కాంతి వలె ఉన్నవారును, రవికలు ధరించినవారు అయిన అనంగకుసుమ మొదలగు గుప్తతర యోగినీ దేవతలను ధ్యానించుచున్నాను !!

వివరణః
సర్వాశాపరిపూరక చక్రమునకు పైన సర్వసంక్షోభణ చక్రము గలదు. ఇది సప్తమపర్వము. దీని యందు అనంగకుసుమాదేవి మొదలగు గుప్తతర పేరుగల ఎనిమిది మంది శక్తులు నివసింతురు. వీరికి అధిష్ఠానదేవత త్రిపురసుందరీదేవి. 

సప్తమేపర్వణికృతవాసా గుప్తతరాభిదాః I
అనంగశక్తయస్త్వష్టౌ తాసాం నామానిమచ్ఛృణు I
అనంగకుసుమానంగమేఖలా చ ద్వితీయకా I
అనంగమదనానంగ మదనాతురయా సహా 
అనంగరేఖాచానంగవేగానంగాంకుశాపి చ I
అనంగమాలిన్యపరా ఏతాదేవ్యో  జపాత్విషః II (లలితోపాఖ్యానము 24వ అధ్యాయము, 25-27 శ్లోకములు)

II ఆర్యా ద్విశతి - 133వ శ్లోకము II (సంక్షోభకారకచక్రాధిష్ఠాన దేవత శ్రీత్రిపురసుందరీ ధ్యానము)
సంక్షోభకారకే౨స్మిన్ చక్రే శ్రీత్రిపురసుందరీ సాక్షాత్ I
గోప్త్రీ గుప్తతరాఖ్యా గోపాయతు మాం కృపార్ద్రయా దృష్ట్యా II ౧౩౩

తాః అస్మిన్ - ఈ, సంక్షోభకారకే చక్రే - సంక్షోభకారకమనే చక్రము నందు, గుప్తతరాఖ్యా - గుప్తతరయను పేరుగల, గోప్త్రీ - రక్షించునట్టి దేవతయగు, శ్రీత్రిపురసుందరీ సాక్షాత్ - సాక్షాత్తుగా శ్రీత్రిపురసుందరీదేవత, కృపార్ద్రయా - దయారసముతో చల్లనైన, దృష్ట్యా - చూపుతో, మాం - మమ్మల్ని, గోపాయతు - రక్షించుగాక !!

ఈ సంక్షోభకారక చక్రమునందు, గుప్తతర అను యోగినీదేవతలకు అధిష్ఠానదేవత, రక్షించునట్టి దేవతయగు, సాక్షాత్తుగా శ్రీత్రిపురసుందరీ అమ్మవారు, దయారసముతో నిండిన చల్లని చూపుతో మమ్మల్ని రక్షించుగాక !!

( సశేషం .... )


సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి