30, మే 2013, గురువారం

శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి గురుగుహా అనే నామం యొక్క విశిష్ఠత

"గురుగుహా" అనేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఉన్న అనంత నామాలలో ఒకటి. గురుగుహ అనే నామానికి స్థూల సూక్ష్మ కారణ అర్ధాలు మూడు ఉన్నాయి.

మొదటి స్థూల అర్ధం - గురుగుహా ఒక అర్ధం చెప్పాలంటే, మన హృదయ గుహలోనే ఉన్న గురుస్వరూపమైన సుబ్రహ్మణ్యుడు అని. ఇక్కడ గుహా అంటే మన హృదయ గుహ - హృదయాంతరాళము అని అన్వయించుకోవచ్చు.

శాస్త్రీయ సంగీత త్రయములో ఒకరు, ప్రఖ్యాత వాగ్గేయకారుడు, సుబ్రహ్మణ్యానుగ్రహ పాత్రుడు అయిన శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ చేసిన కీర్తనలు అన్నీ 'గురుగుహా' అనే మకుటంతో ఉంటాయి. అది ఏ దేవతా స్వరూపాన్ని ఉద్దేశించి చేసిన కీర్తన అయినా సరే, గురుగుహా అనే నామం ఉంటుంది. ముత్తుస్వామి దీక్షితార్ గారి జీవితంలో ఆయన గురువైన చిదంబరనాథ శాస్త్రి గారిని కాశీ పట్టణంలో విశ్వేశ్వరుని సన్నిధిలో ఐదు సంవత్సరాలు పాటు గురు సేవ చేస్తూ, అటు రోజూ విశ్వేశ్వరుని దర్శనం చేస్తూ గురువు వద్ద సంగీతం అభ్యసించారు. ఒకనాడు, ఈయన గురుభక్తికి మెచ్చిన వారి గురువు గారు, ఒకనాడు గంగా నదిలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు, శిష్యుడైన ముత్తుస్వామి దీక్షితార్ గారిని పిలిచి, కళ్ళుమూసుకుని, నదిలో మునిగి, చేతికి తగిలిన వస్తువు తీసుకోమని చెప్తారు. అప్పుడు దీక్షితార్ గారికి నదిలో ఒక అద్భుతమైన వీణ లభిస్తుంది, గురు అనుగ్రహం కలగడం చేత గంగా నది ఆయనకి ఆ వీణ బహూకరించినది. ముత్తుస్వామి దీక్షితార్ గారికి దొరికిన ఆ వీణ చాలా విలక్షణమైనది, అందులో యాళి పైకి ఉంటుంది. ఇక అలాంటి వీణ మరెక్కడా లేదు. ఇది జరిగిన తర్వాత ఆయన గురువు గారు శరీరం విడిచి, శివ సాయుజ్యం పొందుతారు. చివరలో ఆయన గురువైన శ్రీ చిదంబరనాథ శాస్త్రి గారు, తదనంతరం ముత్తుస్వామి దీక్షితార్ ని తిరుత్తణి వెళ్లమని ఆదేశిస్తారు.

అప్పుడు ముత్తుస్వామి దీక్షితార్ దక్షిణదేశం బయలుదేరి తిరుత్తణి అనే ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రం చేరుకుంటారు. తిరుత్తణి ఆలయ ప్రాంగణంలో కూర్చుని ఉండగా, అప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి వారే అక్కడికి వచ్చి ...."ముత్తుస్వామి దీక్షితార్!! ముత్తుస్వామి దీక్షితార్!! ఏదీ నీ నోరు తెరు..." అని ఆయన నోటిలో పటిక బెల్లం వేస్తారు. ముత్తుస్వామి దీక్షితార్ గారు కళ్ళు తెరిచి చూసే సరికి అక్కడ ఆ వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చిన సుబ్రహ్మణ్యుడు కనబడడు. అంతే అప్పుడు వెంటనే సుబ్రహ్మణ్యానుగ్రహంతో ఆయన నోటి నుండీ సుబ్రహ్మణ్యుడిపై అద్భుతమైన కీర్తనలు వచ్చాయి. వాటినే తిరుత్తణి కీర్తనలు అంటారు. ఇలా సుబ్రహ్మణ్య అనుగ్రహం ప్రత్యక్షంగా పొందినందుకు, ఆయన కీర్తనలన్నిటిలోనూ, 'గురుగుహా' అనే మకుటం వేసి కీర్తనలు చేశారు దీక్షితార్. దీక్షితార్ గారు కాశీలో ఆయన చేసిన గురు శుశ్రూషకి మెచ్చిన సుబ్రహ్మణ్యుడు దీక్షితార్ కి అఖండమైన సంగీత పరిజ్ఞానాన్ని కటాక్షించాడు. అందుకే ముత్తుస్వామి వారు తిరువారూర్ లో చేసిన పంచలింగ కృతులలో ఒక కృతిలో ఇలా అంటారు.."జ్ఞాన ప్రదాన గురుగుహ రూప చిదానందనాథ స్వరూప ప్రకాశేన" అని. అంటే ఆయన గురువు చిదానందనాథ స్వామి వారే గురుగుహుడు అని.

"గురు స్వరూపమైన సుబ్రహ్మణ్యుడు, సర్వ జీవుల హృదయములో కొలువై ఉన్న సుబ్రహ్మణ్యుడు, ఆయనయే గురు స్వరూపం. సుబ్రహ్మణ్యుడు గురువుగా కేవలం ముత్తుస్వామి దీక్షితార్ గారికే కాదు, సాక్షాత్తు శంకరుడికి కూడా గురువుగా ప్రణవార్ధం బోధించాడు. అందుకే ఆయనని స్వామినాథ అని కూడా అంటారు. ఇక్కడ శంకరుడికి తెలియదా ప్రణవార్ధం, సుబ్రహ్మణ్యుడు బోధించాడు అంటే అది శంకరుడికి అవమానం కదా అని అనుకోకూడదు. ఏ తండ్రికైనా తన పుత్రుడి చేతిలో పొందిన ఓటమి మరింత ఆనందాన్నిస్తుంది. పుత్రాదిచ్ఛేత్ పరాజయం అన్నారు కదా. ఆ విధంగా సుబ్రహ్మణ్యుడు సంపూర్ణ గురు తత్త్వంతో కూడిన సర్వ జీవుల జీవుల హృదయాలలో ఉన్నవాడు కనుక "గురుగుహ".

రెండవ సూక్ష్మ అర్ధమ్ -
గురు అంటే బాగా పెద్దదైన, గుహా అంటే చాలా చిన్నది సూక్ష్మమైనది. అంటే ఈ సృష్టిలో అన్నిటికన్నా పెద్దదైన వాడూ ఆయనే, అన్నిటికన్నా చిన్నదైన పరమాణువు స్వరూపం ఆయనే, అంటే సుబ్రహ్మణ్యుడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం అని అర్ధం, దీనినే అణుర్బృహత్కృశస్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ అని విష్ణుసహస్రంలో ఉంది, అన్నిటికనా బాగా పెద్దది, బాగా చిన్నది, బాగా చిక్కినది, బాగా లావైనది, అన్ని గుణములు కలవాడు, ఏ గుణములు లేనివాడు అని కదా. అంటే పరబ్రహ్మ తత్త్వాన్ని చెప్పడం.
దీనినే భగవద్గీతలో "కవిం పురాణమనుశాసితారం అణోరణీయఁసమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్యరూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్" అని కృష్ణ పరమాత్మ కూడా చెప్పారు కదా.

మూడవ కారణ అర్ధం -
గురుగుహా అంటే - గురు అంటే నిర్గుణమైన పరమశివునికి సంకేతం, గుహా అంటే గుహ్య శక్తి అయిన అమ్మవారికి సంకేతం, అమ్మ అయ్యవార్ల క్రీడా ఫలితం గురుగుహా. ఈ విశ్వం అంతా కూడా నిర్గుణమైన పరమశివుని మరియు గుహ్యమైన శక్తి స్వరూపిణి యొక్క క్రీడగా వర్ణించారు. అమ్మ అయ్యల క్రీడయే గురుగుహా, అందుకే స్కందః అని కూడా అన్నారు స్వామిని, స్కంద అంటే జారి పడినది అని అర్ధం. ఇక్కడ జారి పడడం అంటే source కి, destination కి లింక్ తెగిపోదు, ఉదాహరణకి సూర్య కిరణాలు. సూర్యుని కిరణాలు సూర్యుని నుంచి బయలు దేరి భూమిని తాకుతాయి, అంతే కానీ అక్కడ ఒక కిరణం బాణంగా బయలుదేరి భూమిమీద పడదు. సూర్య కిరణాలు ప్రసరిస్తాయి. అందుకే ఆదిత్య హృదయంలో కూడా శివః స్కందః ప్రజాపతిః అని సూర్యుని నామాలలో కూడా స్కంద నామం వచ్చింది.


సర్వం శ్రీగురుగుహాయార్పణమస్తు.

2 కామెంట్‌లు: