28, మే 2013, మంగళవారం

శ్రీ పరమాచార్య వాణి - జీవితం యొక్క లక్ష్యం ఎలా నిర్ణయించుకోవాలి


"సూర్యునికి అభిముఖంగా నడిస్తే, నీడ మన వెనుకనే మనకి తెలియకుండా మనతో వస్తుంది. సూర్యుని లక్ష్యంగా పెట్టుకుని నడిచినట్టుగా, అదే విధంగా శాస్త్రములు చెప్పిన లక్ష్యాలను సాధించడం కోసం మనం నడుస్తూ ఉంటే, ధనము, కీర్తి వాటంతట అవే మన వెనుక వస్తాయి. (సూర్యుని వైపు నడుస్తూ ఉండగా మన నీడ మనతో వచ్చినట్లు.) అలా కాకుండా, మనం సూర్యుడిని విడిచిపెట్టి, వెనుకకు తిరిగి నీడని అనుసరించడం మొదలు పెడితే, మనం ఆ నీడని ఎన్నటికీ పట్టుకోలేము. చివరికి ఆ నీడ మనల్ని వదిలేస్తుంది. అంటే మనం శాస్త్రములు విధించిన సూర్యుడి వంటి ఉన్నతమైన లక్ష్యాలను వదిలిపెట్టి, ధనము/కీర్తి అనే అల్పమైన (నీడ వంటి) లక్ష్యాల వెనుక పడితే, అవి ఒకనాడు మనల్ని విడిచిపెట్టి పోతాయి. కాబట్టి శాస్త్ర విహితమైన ఉన్నత లక్ష్యాలను మాత్రమే మనం జీవితం యొక్క ప్రథాన లక్ష్యాలుగా ఉంచుకుని నడవాలి, మిగతా ధనము, కీర్తి వగైరా అనుషంగికముగా, మనకి ఎంత అవసరమో ఈశ్వరుడే కటాక్షిస్తాడు".

శ్రీపరమాచార్య స్వామి వారి పై వాక్కులను చదివాక, పూజ్య గురువు గారు శ్రీ రామాయణం ప్రవచనం చేస్తూ ఉండగా ఒక అద్భుతమైన మాట చెప్పారు. అదేమిటంటే...
"నేను ధనము, కీర్తి, ఇంద్రియ సుఖాలు, సంసారము అనే గొడవలో పడి, నా జీవితపు ప్రథాన లక్ష్యం విస్మరిస్తున్నానా?? అని ప్రతీ మానవుడు తరచుగా ఆత్మపరిశీలన (self-check) చేసుకుంటూ ఉండాలి. ఒక్కోసారి మనం జీవితంలో ఒక ప్రత్యేకమైన ప్రయోజనాన్ని/లక్ష్యాన్ని సాధించడంలో, అసలు మన జీవిత ప్రథాన ప్రయోజనాన్ని విస్మరిస్తాము. మనం ఏదైతే లక్ష్యం కోసం అత్యధిక సమయం, శ్రమ, ఆలోచనలు ఖర్చు చేస్తున్నామో, అవి మనల్ని మన యొక్క పరమ ప్రయోజమైన ఆత్మోన్నతి వైపుకు తీసుకువెళ్ళేందుకు దోహదపడుతున్నాయా... అని ఆలోచించుకోవాలి.

ఇక్కడ పూజ్య గురువు గారు మరొక మాట కూడా చెప్పారు..."డబ్బు, కీర్తి సంపాదించవద్దని మన శాస్త్రం ఎన్నడూ చెప్పలేదు. ధర్మబద్ధముగా, నీతిగా డబ్బు సంపాదించమని మన శాస్త్రం చెప్పినది. అలాగే సత్కీర్తి సంపాదించడమూ తప్పు కాదు. కానీ శాస్త్రం అన్నిటినీ ధర్మంతో ముడివేయమని చెప్పినది. ధనం సంపాదించడం అనేది తృష్ణగా మారకూడదు, కీర్తి సంపాదించడం అనేది కీర్తి కండూతిగా మారకూడదు. ఇలా మారితే, ధనార్జన తృష్ణ వల్లన, కీర్తి కండూతి వలన, మనిషి తన యొక్క పరమ పద లక్ష్యాన్ని విస్మరించి, విచక్షణ కోల్పోయి, ఎంతో విలువైన ఈ మానవ జన్మ వృధా చేసుకుంటాడు.

అందుకనే ఎప్పుడూ గురువాక్య శ్రవణం చేస్తూ ఉంటే, మన జీవితానికి ఏది పరమ లక్ష్యమో, అలాగే ఇహములో కావలసిన విభూతులను కూడా ధర్మ బద్ధముగా ఎలా సంపాదించాలో, అలా సంపాదిస్తున్నా, ఆయా విభూతుల యందు లౌల్యం పెట్టుకుని క్రిందకి పడిపోకుండా ఉండగలిగే ఇంద్రియనిగ్రహాన్ని, తపో పటిమని గురువు గారు కటాక్షిస్తారు.

అందుకనే పెద్దలు గురువు యొక్క వాక్కులను సింహనాదం అన్నారు. అడవిలో సింహము యొక్క నాదం వింటే, మిగతా జంతువులన్నీ చెల్లాచెదురై పారిపోతాయి. అలానే గురువు యొక్క సింహనాదం విన్న శిష్యుడికి, అతనిలోని ఆసురీ గుణాలు (కామ,క్రోధ, మద మాత్సర్యాలు వగైరా..) దూరంగా వెళ్ళిపోతాయి, అంతే కాక, గురువు యొక్క పాదములు పట్టుకుంటే, గురువు యొక్క అనుగ్రహంతో, ఇహములో తనకి కావలసినవన్నీ ధర్మబద్ధముగా సమకూరుతాయి, గురువాక్యములను ఆచరణలో పెట్టి సాధన చేయగా చేయగా... ఒకనాడు అతనికి సంపూర్ణ జ్ఞానాన్ని కూడా గురువు కటాక్షిస్తాడు.

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి