"ఒక కోరిక తీరగానే వెనువెంటనే మరో కోరిక పుడుతుంది, అదే ఏదైనా కోరిక నెరవేరకపోతే, ఆ కోరిక తీరకపోవడం వల్ల వచ్చిన దుఃఖం క్రోధంగా పరిణమిస్తుంది. ఈ కామక్రోధాల వలలో చిక్కిన వ్యక్తి నెమ్మదిగా విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి, పోను పోను అతను చేసే అన్ని పనులు కూడని రీతిలో/చెడుగా చేసే దిశగా వెడతాడు. ఎవరైతే ఈ కామాన్ని, ఒక యజమాని సేవకుడిని అదుపులో పెట్టినట్లు, అదుపులో పెట్టుకుంటాడో, వాడు మాత్రమే, ఆత్మ దర్శనం వైపు అడుగులు వేయగలుగుతాడు".
ఇక్కడ శ్రీ పరమాచార్య స్వామి వారు చెప్పిన వాక్కులతో పాటు, పూజ్య గురువుగారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన కొన్ని మాటలు కూడా స్మరిద్దాము...
"మొదటగా ఇక్కడ కామం అంటే ఎల్లప్పుడూ స్త్రీ పురుష సంబంధమైన తుచ్ఛ కామం ఒక్కటే కాదు అని మనం అర్ధం చేసుకోవాలి. అన్ని రకాల కోరికలను కామం అనే అంటారు. ఈ కామాన్ని ఎవడు అదుపులో పెట్టుకుంటారో వాడు ఆత్మ దర్శనం పొందే దిశగా అడుగులు వేస్తాడు. అదుపులో పెట్టడం అంటే త్రొక్కిపెట్టడం కాదు. (కామాన్ని త్రొక్కిపెడితే, అది ఒకనాడు ప్రతిఘటించి త్రాచుపాములా కాటువేయగలదు, అప్పుడు ఇన్నాళ్ల తపస్సు కూడా వ్యర్ధం అవుతుంది. దీనికి ఉదాహరణ రావణాసురుడు) అందుకే మన శాస్త్రం, దీనిని ధర్మంతో ముడి వేసింది. ధర్మముతో కూడిన కామము, ధర్మముతో కూడిన అర్ధములను, శాస్త్రం/వేదం చెప్పినట్లుగా అనుభవించవచ్చు. ఈ ధర్మము, అర్ధము, కామము అనే మూడు పురుషార్ధాలను పట్టుకుంటే, నాలుగవ పురుషార్ధమైన మోక్షం అనుషంగికము.
అర్ధ, కామములను రెండిటినీ ధర్మముతో ముడి వేసి పట్టుకున్నవాడికి, మోక్షం అడగకుండానే వస్తుంది అని పూజ్య గురువు గారి వాక్కు.
అందుకే పూజ్య గురువు గారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు, మనం ధర్మబద్ధముగా అర్ధమును సంపాదిస్తూ, ధర్మబద్ధముగా కామము అనుభవిస్తూ ఉంటే, నెమ్మదిగా మనలో ఒక విచారణ మొదలవుతుంది, మనం ఏదైతే సుఖము అనుకుని దీనిని పట్టుకున్నామో .. ఇది అసలు సుఖమా? అని. ఉదాహరణకి నాకు చక్కెర పొంగలి తినడం అనే కోరిక పుట్టింది, నా ధర్మపత్నికి ఈ రోజు, స్వామి వారికి నివేదన కోసం చక్కెర పొంగలి చేయమని చెప్పాను, తీరా భార్య ప్రసాదం తీసుకువచ్చి కంచంలో వడ్డిస్తే, ఒకసారి తినగానే సంతోషం, ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ భార్య తీసుకువచ్చి అదే చక్కెరపొంగలి వడ్డించేస్తోందనుకోండి, అప్పుడు వెగటు పుడుతుంది... అప్పుడు ఇప్పటిదాకా చక్కెర పొంగలి కావాలి అన్నవాడు, వెగటు పుట్టి వద్దంటాడు.
అంటే ఏమిటి దానర్ధం, ఈ క్షణానికి 'సుఖము'గా కనబడినది, కాస్సేపటికి 'దుఃఖము'గా పరిణమించినది. అంటే నేను దేనినైతే సుఖము సుఖము అనుకుని తిరుగుతున్నానో అది నిజమైన సుఖము కాదు అన్న భావన మనసులో స్థిరీకరింపబడి, ఒకనాడు వైరాగ్యం కలుగుతుంది. ఆ వైరాగ్యం కలగడమే, జ్ఞానమును పొంది, తనలోనే ఉన్న భగవంతుడిని దర్శించి, తరగని ఆత్మానంద స్థితిని అనుభవిస్తాడు.
అలా ఆత్మ స్థితిని చేరుకోవాలంటే ప్రథానమైన మెట్టు ధర్మము. ధర్మముతో అర్ధ, కామములను పట్టుకుని, ఈశ్వరుడు ఇచ్చిన దానిలో, శాస్త్రము, గురువు చెప్పినట్లుగా జీవితాన్ని గడపితే, గురువు అనుగ్రహంతో, మళ్ళీ ఈ జననమరణ చక్రములో పడకుండా పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుజ్య సన్నిధిని పొందుతాము.
సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.
Hi Sir,
రిప్లయితొలగించండిI haven't got a chance to hear Sri GuruVaani in live but As He is the ultimate PARABRAHMAM , His speeches are ROARING in my mind and heart with your posts.
What I can give you sir? A bowing Thank you .