28, జూన్ 2016, మంగళవారం

కామాక్షీ సౌందర్యలహరి – 8వ శ్లోకము – అమ్మవారి నివాస స్థాన వర్ణన


శ్రీగురుభ్యో నమః
Iకామాక్షీ సౌందర్యలహరి – 8 శ్లోకము – అమ్మవారి నివాస స్థాన వర్ణన II
సుధాసిన్ధోర్మధ్యే సురవిటపివాటీపరివృతే
మణిద్వీపే నీపోవనవతి చిన్తామణిగృహే I
శివాకారే మఞ్చే పరమశివ పర్యఙ్కనిలయాం
భజన్తి త్వాం ధన్యాః కతిచన చిదానన్దలహరీమ్ II 8 II

 తాత్పర్యముః సుధా సింధోః - అమృత సముద్రము లేదా క్షీర సముద్రముమధ్యే - మధ్య ప్రదేశము నందుసురవిటపి - కల్ప వృక్షముల యొక్కవాటీపరివృతే - వరుసలతో చుట్టబడినమణిద్వీపే -మణిమయమైన దీవి యందునీపః - కదంబ వృక్షముల యొక్కఉపవనవతి - ఉద్యానవనము నందుచిన్తామణిగృహే - చింతామణులచే నిర్మింపబడిన గృహము నందుశివాకారే మంచే - శివాత్మకమైన మంచము నందు (బ్రహ్మవిష్ణురుద్రశానులనే నలుగురు బ్రహ్మలచే మోయబడుచున్న మంచము), పరమశివ - పరమశివుడి యొక్కపర్యఙ్కనిలయాం - తల్పము లేదా తొడని నెలవుగా గలిగిన,చిదానందలహరీం - చిత్ శక్తి యొక్క ఆనంద తరంగములుగా యున్నత్వాం - నిన్నుకతిచన - కొద్దిమందిధన్యాః - ధన్యులు మాత్రమేభజన్తి - సేవించుచున్నారు !

అమృత/క్షీర సముద్రము యొక్క మధ్య ప్రదేశము నందుకల్పవృక్షముల వరుసలచేత చుట్టబడిన మణిమయ మైన దీవి యందుకదంబ వృక్షముల ఉద్యానవనములో చింతామణులచే నిర్మింపబడిన గృహము నందుశివాత్మకమైన మంచము మీదపరమశివుడినే తల్పముగా లేదా పరమశివుడి యొక్క తొడనే నెలవుగా కలిగినచిత్ శక్తి యొక్క ఆనంద తరంగములుగా యున్న శ్రీలలితాపరమేశ్వరీ అమ్మానిన్ను బహుకొద్దిమంది పుణ్యాత్ములు/ధన్యులు మాత్రమే సేవించి తరించుచున్నారు !!

భావార్థముః
ఈ శ్లోకము బహుభంగిమలలో అత్యంత సౌందర్యమైనపరమశక్తివంతమైన శ్లోకము. ఉచ్ఛారణ చేసే శబ్దపరముగా, బాహ్యము నందు శ్రీచక్రనగరము నందలి పరబ్రహ్మస్వరూపిణి గురించిన, ఆంతరమున యోగస్థితిలో సాధకుడు అనుభవించే బ్రహ్మానందస్థితి వరకు... అనేక కోణాలలో అత్యంత సుందరమైన శ్లోకం ఇది. ఆరవ శ్లోకములో అమ్మవారిని ఎలా ధ్యానంచెయ్యాలో సగుణ రూపమును వర్ణించారు జగద్గురు ఆదిశంకరులుఈ శ్లోకములో అమ్మవారి నివాసస్థానం గురించి వర్ణించారుఈ శ్లోకము యొక్క సంపూర్ణ సాధనా పరమైన/తత్త్వపరమైన భావార్థము గ్రహించాలంటేమొదట అమ్మవారి యొక్క శ్రీనగర వర్ణన కొంత అర్ధం కావాలిశ్రీచక్రనగరము నందు ఉన్న వివిధ ఆవరణలుమధ్యలో మేరువుఆపైన ఉన్న చింతామణిగృహముఅందులో కొలువై ఉండే సకల పరివారదేవతలుఅమ్మవారి నివాసస్థానము వగైరా పరిశీలించి అప్పుడు సాధనాపరంగానూ మరియు తత్త్వపరముగానూ ఈ శ్లోకమును ఎలా అన్వయించుకోవాలోశంకరులు ఇచ్చిన అద్భుతమైన ఈ అమృతభాండాన్నిమ్మవారి అనుగ్రహంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము.

మొదట శ్రీలలితా సహస్రనామములోని ఈ క్రింది నామములను పరిశీలిద్దాము.
సుమేరుమధ్యశృంగస్థా శ్రీమన్నగరనాయికా I
చింతామణిగృహాంతఃస్థా పంచబ్రహ్మాసనస్థితా II
మహాపద్మాటవీసంస్థా కదంబవనవాసినీ I
సుధాసాగరమధ్యస్థా కామాక్షీ కామదాయినీ II

సుమేరుమధ్యశృంగస్థా - శ్రీమన్నగరనాయికా అనగామేరుపర్వతము యొక్క మధ్య శృంగము మీద నిర్మింపబడిన శ్రీనగరము నందు మహాకామేశ్వరుడితో కూడి అమ్మవారు కొలువై ఉంటుంది.
చింతామణిగృహాంతఃస్థా  - ఆ సుమేరు యొక్క మధ్య శృంగము మీద చింతామణులతో నిర్మింపబడిన గృహము నందు కొలువై ఉంటుంది అమ్మవారు..
పంచబ్రహ్మాసనస్థితా - చింతామణిగృహములో బిందుపీఠము నందు లేదా సర్వానందమయ చక్రము నందు బ్రహ్మవిష్ణురుద్రఈశానులే నాలుగు కోళ్ళగా మ్రోయుచున్న గొప్ప మంచము ఉన్నదిదీనినే శంకరులు శివాకారే మంచే అన్నారు పై శ్లోకములోఈ మంచమునకు నాలుగు వైపులా నలుగురు (బ్రహ్మవిష్ణురుద్ర ఈశానులుకోళ్ళగా ఉంటేపరమశివుడు ఆ మంచము మీద పానుపుగా అన్నట్టుశయనించి ఉంటారుఅమ్మవారు అలా శయనించి పరుపుగా ఉన్న పరమశివుని యొక్క అంకముమీద కూర్చొని ఉంటారుఇక్కడ నలుగురు బ్రహ్మలతో పాటుసదాశివునితో కలిపి ఐదుగురు అమ్మవారికి ఆసనం అయ్యారు కనుక పంచబ్రహ్మాసనస్థితా అని పిలువబడినది అమ్మవారు.
మహాపద్మాటవీ సంస్థా - శ్రీచక్ర నగరంలో శృంగారమయ ప్రాకారము దాటిన తర్వాత - అమ్మవారు నివాసం ఉండే చింతామణి గృహము యొక్క తొమ్మిది ఆవరణలలో మొదటిదైన త్రైలోక్యమోహన చక్రములోకి ప్రవేశించే ముందుచింతామణి గృహము చుట్టూ పద్మముల వనం ఉంటుందిఈ వనం దాటి వెళ్తేనే శ్రీచక్రము నందు ఉన్న తొమ్మదవ ఆవరణలోకి వెళ్ళగలము. లలితాసహస్రనామస్తోత్రంలోని ఈ నామాలు పూర్తిగా అర్థం కావాలి అంటే శ్రీపురము యొక్క వర్ణన సంపూర్ణముగా ఇవ్వబడిన ఆర్యాద్విశతికానీ లేదా లలితోపాఖ్యానమును కానీ లేదా దేవీభాగవతంలో చెప్పబడిన మణిద్వీపవర్ణన కానీ పరిశీలించాలి.

భగవాన్ క్రోధభట్టారక శ్రీదుర్వాసో మహర్షి ఇచ్చిన ఆర్యాద్విశతిలో ఇవ్వబడిన శ్రీచక్రనగర వర్ణనని లఘువుగా ఇక్కడ స్మరిద్దాము - (లఘువుగా అంటే చిన్నగా అని కాదు, instant గా అని అర్థం, శ్రీచక్రనగర వర్ణన విస్తారంగానే ఉంటుంది).

శ్రీచక్రనగరము - మానసిక విహంగవీక్షణముః
·         మొదటగా వల్లభాదేవితో కూడిన శ్రీవిఘ్నేశ్వరుడికి నమస్కరించుచున్నాను.
·         పదునాలుగు లోకములచేత నిండి, బంగారు ఇండ్ల వరుసలు కలిగి, దేవతల గానములు గల మేరు పర్వతము..      
·         మేరు పర్వతమునకు తూర్పునైరుతి వాయువ్య దిశలలో బ్రహ్మవిష్ణుశివుని లోకములైన మూడు శిఖరములు
·         పై మూడు శిఖరముల మధ్యలో ఉన్నతమైన 400 యోజనముల పొడవైనమణికాంతుల మయమైన శృంగపుంగవము (శ్రేష్ఠమైన శిఖరము)
·         ఈ శిఖరము నందునాలుగు వందల యోజనముల వైశాల్యము కలిగివిశ్వకర్మచే నిర్మింపబడినఅనేక ప్రాకారముల చేత ప్రకాశించుచున్న ఆదివిద్యా స్వరూపిణి కొలువై ఉన్న శ్రీపురము/శ్రీనగరము -
·         ఈ శ్రీచక్రనగరములో ఇరవై ఐదు ప్రాకారములు ఉన్నాయి (మణిద్వీపములో నవావరణలు వేరు - ఈ ఇరవై ఐదు ప్రాకారములు దాటిన తర్వాతమణిద్వీపముఅందులో తొమ్మిది చక్రముల/ఆవరణల వర్ణన వస్తుంది). ముందుగా ఈ ఇరవై ఐదు ప్రాకారముల వివరములు విహంహవీక్షణంలో ధ్యానం చేద్దాముః
1)     ప్రథమ ప్రాకారము - ఇనుముతో చేయబడినది -1600 యోజనముల చుట్టుకొలత
1.1 ఇనుము-కంచు ప్రాకారముల మధ్య ప్రదేశములో మందమారుత ఉద్యానవనము, ఈ ఉద్యానవనము నందు భద్రకాళీ సమేత మహాకాళుడు (ప్రతీ రెండు ప్రాకారములకు మధ్యన ఏడు యోజనముల దూరము గలదు)
2)     ద్వితీయ ప్రాకారము - కంచు
2.1 కంచు-రాగి ప్రాకారముల మధ్య ప్రదేశములో కల్పవృక్ష వాటిక - అందులో     చైత్ర/వైశాఖ మాసలక్ష్ములతో కూడిన మన్మథునితో కూడిన వసంత ఋతువు (ఋతుపురుషుడు)
3)     తృతీయ ప్రాకారము - రాగి
3.1 రాగి-సీసపు ప్రాకారముల మధ్య ప్రదేశము - సంతాన వృక్షవాటిక - జ్యేష్ఠ/ఆషాఢ మాసలక్ష్ములతో కూడిన గ్రీష్మ ఋతువు
4)     చతుర్థ ప్రాకారము - సీసము
4.1 సీసపు-ఇత్తడి ప్రాకారముల మధ్య ప్రదేశము - హరిచందన వృక్షవాటిక - ఈ వాటికలో శ్రావణ/భాద్రపద మాసలక్ష్ములతో కూడిన వర్ష ఋతువు
5)     పంచమ ప్రాకారము ఇత్తడి
5.1 ఇత్తడి-పంచలోహ ప్రాకారముల మధ్య ప్రదేశము - మందార వృక్షవాటిక - ఈ వాటికలో ఆశ్వయుజ/కార్తీక మాస లక్ష్ములతో కూడిన శరదృతువు
6)      షష్ఠమ ప్రాకారము- పంచలోహ
6.1 పంచలోహ-వెండి ప్రాకారముల మధ్య ప్రదేశము - పారిజాత వృక్షవాటిక - ఈ వాటికలో మార్గశీర్ష-పుష్య మాస లక్ష్ములతో కూడిన హేమంత ఋతువు    
7)     సప్తమ ప్రాకారము వెండి
7.1 వెండి-బంగారు ప్రాకారముల మధ్య ప్రదేశము - కదంబ వృక్షవాటిక - ఈ వాటికలో మాఘ/ఫాల్గుణ మాసలక్ష్ములతో కూడిన శిశిర ఋతువు - ఏడు ఆవరణలతో కూడిన మంత్రిణీ దేవత యొక్క గృహము - ఆ గృహము నందు మంత్రిణీ దేవి వసించును. ఈ తల్లికే సంగీతమాతృకా/శ్యామలాదేవి అను పేర్లు గలవు.
8)     అష్టమ ప్రాకారము - బంగారు
8.1 బంగారు-పుష్యరాగ ప్రాకారముల మధ్య ప్రదేశము - సింహాసనేశ్వరి అయిన శ్రీలలితాదేవిని నిరంతరము ఏమరుపాటులేకుండా ఉపాసించుచున్న/ జపించుచున్న సిద్ధ పురుషులు
9)     నవమ ప్రాకారము -  పుష్యరాగమయ
9.1 పుష్యరాగ-పద్మరాగ ప్రాకారముల మధ్య ప్రదేశము - ఏకాగ్రచిత్తులై చక్రేశీ అనగా శ్రీలలితాదేవి పాదములను ఆరాధించుచున్న చారణులు
10) దశమ ప్రాకారము - పద్మరాగ
10.1                      పద్మరాగ-గోమేదక ప్రాకారముల మధ్య ప్రదేశము - వటువుల చేతయోగినుల చేత పూజింపబడుచున్న సంకర్షిణీ దేవత
11) ఏకాదశ ప్రాకారము - గోమేదక
11.1                     గోమేదక-వజ్రమణి ప్రాకారముల మధ్య ప్రదేశము - రంభ మొదలగు దేవకాంతలు మరియు అలల సమూహములతో ఎల్లప్పుడూ ప్రవహించే వజ్ర అను నదిఆ వజ్ర నదీ తీరము నందు దేవేంద్రాది దేవతలచేత కీర్తింపబడు వజ్రేశ్వరీ అను దేవత వసించును.
12) ద్వాదశ ప్రాకారము - వజ్రమణి
12.1                      వజ్రమణి-వైడూర్య ప్రాకారముల మధ్య ప్రదేశము - లలితాపరమేశ్వరి అమ్మవారి చరణముల యందు మనస్సు గలవారైన కర్కోటకాది నాగులు వసించును
13) త్రయోదశ ప్రాకారము - వైడూర్య
13.1                      వైడూర్య-ఇంద్రనీల ప్రాకారముల మధ్య ప్రదేశము - మనుమాంధాతభగీరథ, భరతపృథు.... మొదలైన భూపాలురు (రాజులు) వసించును.
14) చతుర్దశ ప్రాకారము - ఇంద్రనీలమణి
14.1                      ఇంద్రనీల-ముక్తామణి ప్రాకారముల మధ్య ప్రదేశము - ఐరావతమును అధిరోహించి ఉన్న దేవేంద్రుడుస్వాహా స్వధా దేవిలతో కూడిన అగ్నిదేవుడుయమధర్మరాజు,నైరృతివరుణుడుఇడా/పింగళ/సుషుమ్న అను ముగ్గురు పత్నులతో కూడిన వాయుదేవుడుకుబేరుడుకాత్యాయినీవల్లభుడైన ఈశానుడురుద్రాణీ దేవతలతో కూడిన రుద్రులు,గోరక్షనాథుడు మొదలగు ప్రముఖ యోగులుమణిభద్రుడు మొదలగు యక్షులు వసించును
15) పంచదశ ప్రాకారము - ముక్తామణి
15.1                      ముక్తామణి-మరకతమణి ప్రాకారముల మధ్య ప్రదేశము - బంగారు తాటి వృక్షవాటికఅందులో "మరకత మణులతో నిర్మింపబడినదండనాథాదేవి (అనగా వారాహీ అమ్మవారి) గృహముఆ గృహము నందు స్వప్నేశీదేవిఉన్మత్తభైరవీదేవిజృంభినీహేతుకుడుదశ భైరవులతో పరివృతమైన వారాహీ అమ్మవారు వసించును. ఈ అమ్మకే వార్తాళి/సమయేశి/పోత్రిణి అను నామములు కూడా కలవు.
16) షోడశ ప్రాకారము మరకతమణి
16.1                      మరకతమణి-పగడ ప్రాకారముల మధ్య ప్రదేశము - ఇక్కడ చతుర్ముఖ బ్రహ్మ గారు వసించును.
17) సప్తదశ ప్రాకారము - పగడమయ
17.1                      మరకతమణి-నానారత్న ప్రాకారముల మధ్య ప్రదేశము - మాణిక్య మంటపముఈ మాణిక్య మంటపము నందు శ్రీమహావిష్ణువు వసించును.
18) అష్టాదశ ప్రాకారము నానారత్నమయ ప్రాకారము
18.1                      నానారత్న-నానామణి ప్రాకారముల మధ్య ప్రదేశము - సహస్ర స్తంభ మంటపము - ఇక్కడ భృంగినంది మొదలగు ప్రమథ గణములతో కూడిన పార్వతీ సహిత శివుడు వసించును.
19) ఏకోనవింశతి ప్రాకారము - నానామణిమయ
19.1                      నానామణిమయ-మనోమయ ప్రాకారముల మధ్య ప్రదేశము - ఎర్ర కలువల గుంపులచేతగొప్ప పరిమళము కలిగిన అమృతపు బావిఈ అమృతబావి యందు శక్తీ దేవతలతో కూడి నావదాని యందు తారాదేవి వసించును.  (తారాదేవి అనగా మనలోని ఇడా నాడికి సంకేతము)
20) వింశతి ప్రాకారము మనోమయ
20.1                      మనోమయ-బుద్ధిమయ ప్రాకారముల మధ్య ప్రదేశము కెంపులచేత నిర్మింపబడిన ఆనంద బావి ఈ ఆనందబావి యందు రత్నములచే పొదగబడిన పడవ యందు దేవతా స్త్రీలతో కూడిన అమృతేశి (సుధామాలిని) మరియు వారుణీ దేవి అను దేవతలు వసించురు. (అమృతేశి మనలోని పింగళా నాడికి సంకేతము)
21) ఏకవింశతి ప్రాకారము బుద్ధిమయ
21.1                      బుద్ధిమయ-అహంకార ప్రాకారముల మధ్య ప్రదేశము - మలయ మారుతముఅక్కడే ఒక విమర్శపు బావిఆ బావి యందు కెంపులచేత చేయబడిన పడవఆ పడవ యందు కురుకుళ్లాదేవి (నౌకేశ్వరీదేవి) వసించును. (కురుకుళ్ళాదేవి మనలోని సుషుమ్నానాడికి సంకేతము)
22) ద్వావింశతి  ప్రాకారము అహంకారమయ
22.1                      అహంకార-రవిమయ ప్రాకారముల మధ్య ప్రదేశము - చక్ష్ముష్మతిప్రకాశశక్తి మరియు ఛాయాదేవి అను ముగ్గురు శక్తులతో కూడిన మార్తాండ భైరవుడు (సూర్యభగవానుడు) వసించును.     
23) త్రయోవింశతి ప్రాకారము రవిమయ
23.1                      రవిమయ-ఇందుమయ ప్రాకారముల మధ్య ప్రదేశము నందు చంద్రుడు
24) చతుర్వింశతి ప్రాకారము ఇందుమయ
24.1                      ఇందుమయ-శృంగారరస ప్రాకారముల మధ్య ప్రదేశము - శృంగార బావిఈ శృంగార బావి యందు శృంగారదేవతాస్త్రీలతో కూడి మణులతో నిర్మింపబడిన పడవఆ పడవ యందు మన్మథుడు వసించును.
25) పంచవింశతి ప్రాకారము శృంగార మయ ప్రాకారము
A.     శృంగారమయ ప్రాకారమునకు ై భాగమునందు సమస్తదేవతలచేత ఆరాధింపబడునది, చింతామణులచేత నిర్మింపబడిన చింతామణి గృహము కలదు.
B.     శృంగారమయ-మణిసదన సాలములకు మధ్య ప్రదేశమునందు - పదితాటి ఆకులంత పొడవైన, బంగారు వర్ణములో ఉన్న ఆకులతోనూ, యోజనపొడవైన కాండములతో, మృదులమైనవి, చందనము వలె చల్లనిది, దివ్యమైన సువాసనలు గలదియు, మలయమారుతము వీచుట చేత పుప్పొడిరాలి పసుపు రంగులో అయిన పద్మముల వనము కలదు. (మహాపద్మాటవీసంస్థా).
C.     ఈ పద్మవనమునందు పూర్వ దిక్కులో పదికళలతో కూడిన అగ్ని దేవుడు వసించును.
D.     అక్కడే పన్నెండు కళలతో కూడిన సూర్యభగవానుడు మరియు షోడశ కళలతో కూడిన చంద్రుడుబ్రహ్మవిద్యా స్వరూపిణులు వసించును.
E.     అక్కడే దక్షిణపడమరఉత్తర దిక్కులలో పూజాద్రవ్యములు గల పాత్రలు ఉంటాయి. ఈ పాత్రల ఎదుట బ్రహ్మవిష్ణుఈశ్వరుల గృహములు ఉంటాయి.
F.      చింతామణి గృహమునందు ఆగ్నేయ దిక్కులో అగ్నిదేవుడు ఉండును.
G.    చింతామణి గృహమునందు నైఋతి దిక్కులో పదియోజనముల పొడవు గలిగిన ఒక పెద్ద రథము గలదు.
H.     అదే నైఋతి దిక్కులోశ్రీలలితాపరమేశ్వరి అమ్మవారి యొక్క బంగారు ధ్వజముతోనూ మణిమయ శిఖరము గల మరొక రథము గలదు.
I.        వాయువ్య దిక్కులో - గేయచక్ర రథం
J.      ఈశాన్య దిక్కులో కిరిచక్ర రథం
K.     తూర్పు దిక్కులో రెండు ద్వారముల వద్ద మాతంగి మరియు వారాహి అమ్మవార్లు ఉంటారు
L.      మణిసదనము నందు మధ్యన రెండు యోజనాల వైశాల్యములో గుండ్రని ఆకారములో బిందు చక్రమును కలిగిన చింతామణి గృహ భూమి గలదు.
M.    ఈ గృహము చుట్టూ సకల దేవతలుసిద్ధులు ఉంటారు.

ఇక్కడ చింతామణి గృహము ప్రారంభం అయ్యిందిఇందులో మొత్తం తొమ్మిది ఆవరణలు గలవు.                               
"చింతామణి గృహము
·         తొమ్మిదవ ఆవరణ - త్రైలోక్యమోహన చక్రం - ఇందులో మూడు ఆవరణలు ఉంటాయిః
ఈ చక్రము నందు ప్రకటశక్తులైన అణిమాది అష్టసిద్దిదేవతలుబ్రాహ్మ్యాది అష్టమాతృదేవతలు మరియు సంక్షోభిణ్యాది దశముద్రాదేవతలు ఉంటారుఈ ప్రకటశక్తులకు అధిదేవత త్రిపురాదేవి
§  అష్ట సిద్ధులు అణిమమహిమలఘిమరిమాఈశితవశితాప్రాకామ్యపాప్తి
§  అణిమాది దేవతల పై భాగంలో అష్టమాతృదేవతలు - బ్రాహ్మీమాహేశ్వరీకౌమారీవైష్ణవీవారాహీ. మాహేంద్రీచాముండామహాలక్ష్మీ
§  బ్రాహ్మీ దేవతల పై భాగములో దశముద్రాదేవతలు సర్వసంక్షోభిణీసర్వవిద్రావిణీసర్వాకర్షిణిసర్వవశంకరీసర్వోన్మాదనముద్రాసర్వమహాంకుశాసర్వఖేచర ముద్రాసర్వబీజాసర్వయోని ముద్రా,సర్వత్రిఖండికా
           
·         ఎనిమిదవ ఆవరణ సర్వాశా పరిపూరక చక్రం            
ఈ చక్రము నందు కామాకర్షిణి మొదలగు షోడశ గుప్తయోగినులు ఉంటారువీరికి అధిదేవత త్రిపురేశి అమ్మవారు.
§  పదహారు మంది గుప్తయోగినులు - కామాకర్షిణిుద్ధ్యాకర్షిణిఅహంకారాకర్షిణిశబ్దాకర్షిణిస్పర్శాకర్షిణిరూపాకర్షిణిరసాకర్షిణిగంధాకర్షిణిచిత్తాకర్షిణిధైర్యాకర్షిణిస్మృత్యాకర్షిణినామాకర్షిణిబీజాకర్షిణి,ఆత్మాకర్షిణిఅమృతాకర్షిణినిత్యా & శరీరాకర్షిణి.       

·         ఏడవ ఆవరణ సర్వ సంక్షోభణ చక్రం
ఈ చక్రము నందు అనంగకుసుమ మొదలగు గుప్తతర యోగినులు ఉంటారువీరికి అధిదేవత - త్రిపురసుందరీదేవి.
§  అనంగకుసుమా దేవతలు - అనంగమేఖలాఅనంగమదనాఅనంగమదనాతురయాఅనంగరేఖఅనంగవేగాఅనంగాంకుశా & అనంగమాలిన్య.

·         ఆరవ ఆవరణ - సర్వ సౌభాగ్యదాయక చక్రం    
ఈ చక్రము నందు సంక్షోభిణి మొదలగు చతుర్దశ సంప్రదాయనామ శక్తులు ఉంటారువీరికి అధిష్టానదేవత త్రిపురవాసినీదేవి
§  పదునాలుగు సంప్రదాయనామ శక్తులు - సర్వసంక్షోభిణీసర్వవిద్రావిణీసర్వసమ్మోహినీశక్తిసర్వస్తంభనశక్తిసర్వజృంభణశక్తిసర్వవశంకరీసర్వరంజనశక్తిసర్వోన్మాదనశక్తిసర్వార్థసాధనీశక్తి,సర్వసంపత్తిపూరణీసర్వమంత్రమయీశక్తిసర్వద్వంద్వక్షయంకరీ.

·         ఐదవ ఆవరణ - సర్వార్థసాధక చక్రం
ఈ చక్రము నందు సర్వసిద్ధిప్రద మొదలగు దశ కులోత్తీర్ణ యోగినులు ఉంటారువీరికి అధిష్టానదేవత త్రిపురాశీ అమ్మవారు.
§  పదిమంది కులోత్తీర్ణ యోగినులు - సర్వసిద్ధిప్రదాసర్వసంపత్ప్రదాసర్వప్రియంకరీసర్వమంగళకారిణీసర్వకామప్రదాదేవీసర్వదుఃఖవిమోచనీసర్వమృత్యుప్రశమనీసర్వవిఘ్ననివారిణీ,సర్వాంగసుందరీదేవిసర్వసౌభాగ్యదాయిని" 

·         నాలుగవ ఆవరణ - సర్వరక్షాకర చక్రం
ఈ చక్రము నందు సర్వజ్ఞ మొదలగు దశ నిగర్భ యోగినులు ఉంటారువీరికి అధిష్టానదేవత త్రిపురమాలినీదేవి అమ్మవారు
§  పదిమంది నిగర్భ యోగినులు - సర్వజ్ఞసర్వశక్తిసర్వైశ్వర్యప్రదాయినీసర్వజ్ఞానమయీదేవిసర్వవ్యాధివినాశినీసర్వాధారస్వరూపసర్వపాపహరాసర్వానందమయీదేవిసర్వరక్షాస్వరూపిణీ.

·         మూడవ ఆవరణ - సర్వరోగహర చక్రం
ఈ చక్రము నందు వశిన్యాది అష్ట రహస్య యోగినులు ఉంటారువీరికి అధిష్టానదేవత త్రిపురాసిద్ధాదేవి అమ్మవారు.
§  ఎనిమిది మంది వశిన్యాది దేవతలు - వశినీకామేశీమోదినీవిమలాఅరుణాజయినిసర్వేశీకౌలినీ.
§  ఇక్కడ వశినీదేవతలు వసించు గృహమునకు ఇరవై మూరల పై భాగమున పార్వతీ పరమేశ్వరుల అస్త్ర సంపద కలదు.
§  ఈ ఆయుధముల గృహమునకు పై భాగము నందు కామేశ్వరి మొదలగు దేవతలు ఉంటారు.
·         రెండవ ఆవరణ - సర్వసిద్ధిప్రద చక్రం
ఈ చక్రము నందు కామేశి మొదలగు ముగ్గురు అతిరహస్య యోగినులు (వీరినే సమయేశీ దేవతలు అని అంటారుఉంటారువీరికి అధిష్టానదేవత త్రిపురాంబా అమ్మవారు.
§  సమయేశీ దేవతలని పిలువబడే ముగ్గురు అతిరహస్యయోగినులు - కామేశీవజ్రేశీభగమాలినీ.
§  పైన చెప్పిన కామేశ్వరీ గృహమునకు పై భాగములో - మిత్రేశానందనాథఉద్దీశానందనాథషష్ఠీశానందనాథచర్యేశానందనాథ నలుగురు యుగనాథులు గలరు. వీరు శ్రీవిద్యా గురువులు.
§  నాథభవనమునకు పై భాగములో కామేశి మొదలగు నిత్యాదేవతలు
o   నిత్యా దేవతలు - కామేశిభగమాలినిభేరుండనిత్యక్లిన్నావహ్నివాసినిమహావజ్రేశ్వరీదూతీత్వరితాదేవీకులసుందరీనిత్యానీలపతాకసర్వమంగళాజ్వాలామాలినిచిత్రా.
§  నిత్యాదేవతల గృహమునకు పై భాగములో            షడంగ దేవతలు
o   షడంగ దేవతలు - హృద్దేవిశిరోదేవిిఖాదేవివర్మదేవి (కవచదేవి)నేత్రదేవి మరియు శస్త్రదేవి.
§  షడంగదేవతల గృహమునకు పై భాగము - బిందు పీఠము / శ్రీపీఠము / మహాపీఠము / విద్యా పీఠము / ఆనంద పీఠము                                   
             
·         ప్రథమ ఆవరణ - సర్వానందమయ చక్రం
దీనినే బిందు పీఠము / శ్రీపీఠము / మహాపీఠము / విద్యా పీఠము / ఆనంద పీఠము అని పిలుస్తారుఈ చక్రము నందు
§  పంచబ్రహ్మలు కొలువై ఉన్న మంచం - పంచబ్రహ్మాసనం
§  పంచబ్రహ్మాసనమునకు చుట్టూ మాయాస్వరూపమగు నల్లని తెరలు           
§  మంచమునకు పైన వ్రేలాడుచున్న మల్లికాపున్నాగ పుష్పహారములచే నిండిన పచ్చని చాందిని
§  ఈ మంచమును బ్రహ్మవిష్ణువురుద్రుడుఈశానుడు ఈ నలుగురు నాలుగు కాళ్ళుగా మోయుచున్నారు.
§  ఈ మంచము పైనసదాశివుడు పానుపు వలె పడుకొని ఉంటారు. సదాశివఫలకంతో కలిపి మొత్తం ఐదుగురు కాబట్టి పంచబ్రహ్మాసనం అయ్యింది.
§  అంగదేవతల గృహము నుండిసదాశివ ఫలకం వరకు మొత్తం తత్త్వ సోపానాలు అనే మెట్లు గలవుఇవి మొత్తం ముప్ఫైఆరు.
o   భూమినీరుఅగ్నివాయువు, ఆకాశముశబ్దస్పర్శరసరూపగంధపాణివాఘ్రాణజిహ్వక్షుచర్మముఅహంకారంబుద్ధి, మనస్సు..
§  చింతామణి గృహము నందుబిందుపీఠమునందుపంచబ్రహ్మసనముపై హంసతూలికాశయనముపై సదాశివఫలకం అని చెప్పబడిన మహాకామేశ్వరుని యొక్క అంకముపై/ఎడమ తొడపై శ్రీలలితా త్రిపురసుందరీ అమ్మవారు కూర్చొని ఉంటారు. ఇదే శివశక్త్యైక్య స్వరూపమైన బిందుస్థానము.                  

ఇప్పుడు స్థూలముగా శ్రీచక్రనగరంలో ఎన్నెన్ని ప్రాకారములు ఉన్నాయోఅవి దాటుకుంటూ వెళ్ళాలి అంటే అక్కడ ఏఏ పరివార దేవతల అనుగ్రహం పొందాలోబాహ్య నగరంలోని ఇరవై ఐదు ప్రాకారములను దాటిన తర్వాత అమ్మవారు కొలువై ఉన్న శ్రీచక్రము నందు ఉన్న నవావరణల గురించిఅక్కడ నివాసం ఉండే పరివార/అధిష్టాన దేవతల గురించిఅమ్మవారు అయ్యవారు ఆసీనులై ఉన్న పంచబ్రహ్మాసనము గురించి సంగ్రహముగా స్మరించాము కదా !! ఇప్పుడు సౌందర్యలహరిలోని ఎనిమిదవ శ్లోకం ‘సుధాసిన్ధోర్మధ్యే సురవిటపివాటీపరివృతే…..” యొక్క భావార్థము గురించి పరిశీలిద్దాము.

అసలు ఈ శ్రీపురము ఎక్కడ ఉన్నదిబ్రహ్మాండములోనాబ్రహ్మాండములకు ఆవలాలేక మనలోనే ఉన్నదాఅన్ని సమాధానాలూ సరైనవేఈ జగములన్నిటినీ కన్న జగదంబిక యొక్క నివాస గృహము ఈ బ్రహ్మాండముల కన్నిటికీ ఆవల ఒక మహా అమృతసముద్రం మధ్యలో మణిమయద్వీపము నందుఅమ్మవారి యొక్క చింతామణి గృహము ఉన్నదిబ్రహ్మాండాలకి వెలుపల ఉన్న స్థానము అంటే మనం ఎవరమూ చూడలేముఅలాగే బ్రహ్మాండ పురాణము నందు ఉత్తరఖండములో శ్రీలలితోపాఖ్యానములో చెప్పిన విధముగాఒకనాడు భండాసురుడు అనే రాక్షసుడిని సంహరించాల్సి వస్తే,దేవతలందరూ ఒక మహాయజ్ఞం చేశారుఅప్పుడు అమ్మవారు చిదగ్నికుండములోంచి శ్రీలలితాపరమేశ్వరి గా ఆవిర్భవించారుఅప్పుడు అమ్మవారు ఈ లోకంలో నివాసం ఉండుట కొఱకుఅమ్మవారి ఆజ్ఞమేరకువిశ్వకర్మ అక్కడ బయట ఉన్నమాదిరిగానే ఇక్కడ మరొక శ్రీచక్రనగరము/శ్రీపురము నిర్మించారు. ఇప్పుడు శంకరాచార్యుల వారు ఈ శ్లోకము నందు సుధాసింధువు నందు ఉన్న అమ్మవారి యొక్క మణిద్వీపము, చింతామణి గృహముల గురించే ఉటంకించారు అని పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారి  అనుగ్రహ భాషణములలో చెప్పబడి ఉన్నది. అయితే శ్రీచక్ర నిర్మాణం ఎక్కడైనా ఒక్కలాగానే ఉంటుంది, బ్రహ్మాండాలకి ఆవల సుధాసింధువులో ఉన్న శ్రీపురము, ఇక్కడ విశ్వకర్మ మేరు పర్వతము మీద నిర్మించిన శ్రీపురము - రెండూ సమానమే.

ఈ శ్లోకములో శంకరాచార్యుల వారు బ్రహ్మాండములకు అవతల ఉన్న శ్రీపురము గురించి చెప్పారు అని చెప్పడానికి కారణం - ఈ సుధాసింధోర్మధ్యే అనే పదం వెయ్యడం వల్ల. బ్రహ్మాండములకు  అవతల అమృతముతో నిండిన ఒక మహాసముద్రముని ఊహించుకోవాలి. ఆ సముద్రము మధ్యలో సురవిటపి వాటీ పరివృతే - అనగా కల్పవృక్షముల వరుసలచేత పరివృతమైన ఒక ద్వీపము , ఆ ద్వీపము నానారకముల మణులచేత నిర్మింపబడినది కావున మణిద్వీపము, ఆ మణిద్వీపము నందు, నీప చెట్లు అనగా కదంబ వృక్షముల వనము సమీపములో (నీప + ఉపవనవతి), కోరిన కోర్కెలను తీర్చే చింతామణి గృహము గలదు అని చెప్పారు శంకరులు.

సుధాసిన్ధోర్మధ్యే -
సుధాసింధువు అనగా అమృత సముద్రము లేదా క్షీర సముద్రము. సకల లోకాలన్నిటినీ కన్నతల్లి, పూర్వజ, కాలానికి అతీతమైన పరబ్రహ్మ మహిషి అయిన శ్రీలలితా పరాభట్టారికా అమ్మవారు ఉండే గృహము అమృత సముద్రము నందు నివాసం ఉంటుంది అనడంలో ఆశ్చర్యమేమీ లేదు. అంతేకాదు,సముద్రము  అనగా ముద్రలను తనయందు గలది, ముద్ర అనగా అచ్చులు (Moulds). ప్రతి సృష్టికి అవసరమగు మౌళికమైన అచ్చులను అన్నిటిని వినాశనము కాకుండా ఉంచగలుగు సముద్రము కాబట్టి దీనిని ‘అమృత సముద్రము’ అందురు. చక్కగా ధారణ చేసి వినాశనము కాకుండా ఉంచునది అని అర్థం కూడా ఉండడం వలన సుధా అను పదమునకు అమృతము అను అర్థం వచ్చినది.

మహానారాయణోపనిషత్తు లో ఈ క్రింది మంత్రము ఉన్నది…
తం చI త్యం చాభీIIద్ధాత్తసోధ్యIజాయత I తతో రాత్రిIరజాయ తతఃI సముద్రో అIర్ణవః II సముద్రాదIర్ణవాదధిI సంవథ్సరో అIజాయత I అహోరాత్రాణిI విద్విశ్వIస్య  మితో శీ I సూర్యాచన్ద్రమసౌI ధాతా యIథాపూర్వమIకల్పయత్ I దివంI చ పృథివీం చాన్తరిIక్షథో సువఃI II

పై యజుర్వేద మంత్రమునకు క్లుప్తముగా అర్థం - అంతటా ప్రకాశించుచున్న పరమాత్మ ఋతమును, సత్యమును కలిగించెను (జ్ఞానోదయము కలుగు వరకు సత్యముగా గోచరించు పృథివ్యాది పంచ భూతములు ఋతముగానూ, పదునాలుగు భువనభాండములను సత్యముగానూ చెప్పుదురు). ఆ పరమాత్మ నుండి సముద్రము, వాపీకూపతతటాకాదులు పుట్టెను. విశాల సముద్రము పుట్టిన తర్వాత సంవత్సరము పుట్టెను. ఆ తరువాత జగన్నిర్మాతయగు పరమాత్మ చరాచర జగత్తును, దివారాత్రములను, సూర్యచంద్రులను, భూమ్యాకాశాలను, ఊర్థ్వ అధోలోకములను …. పూర్వకల్పము నందు వలె పుట్టించెను. ఈ మంత్రములో ప్రత్యేకంగా సముద్రము అనగా భూత సముదాయము అనీ, అర్ణవము అనగా బ్రహ్మాండములు అనీ, సముద్రము నుండీ బ్రహ్మాండమూ, ఆ బ్రహ్మాండము నుండీ సంవత్సరాత్మకమైన బ్రహ్మాండాధిపతి యగు ప్రజాపతి పుట్టెను అని చెప్పబడినది.

పైన ఉదహరించిన వేదవాక్యముననుసరించి, సుధాసింధువు అనగా బ్రహ్మాండనిర్మాణము పరంగా - సకల జీవకోటి యొక్క కర్మఫలములను నిక్షిప్తము చేసి, కల్పాంతము తరువాత పూర్వకల్పములో వలె తిరిగి సకల జీవులను సృష్టించడానికి అవసరమైన బీజములను తనయందు దాచిఉంచునది. అదే సుధాసింధువు.

మనలో కూడా ఒక సుధాసింధువు ఉన్నది. మనము గుర్తుపెట్టుకోవలసిన సన్నివేశములు, సంఘటనలు, వ్యక్తులు మొదలైనవి అన్నియు మెదడులో బిందు రూపముద్రలలో ఉంటాయి. ఈ బిందురూప ముద్రలకు ఉత్పత్తి స్థానమును ‘యోని’ (Place of Birth/Origin/Source) అని అందురు. మెదడులో ఈ యోని ఉండే ప్రదేశమునే యోని అనవచ్చును. ‘సుధా’ అనగా చక్కగా ధారణ చేయుట లేక ధరించుట అని అర్థము. విత్తనము వలె సూక్ష్మ స్థితిలో మనస్సులో ఉన్నవి తరువాత స్థూలస్థితిలో బయటకు వ్యక్తమగును. (The potential spots of information within the mind will manifest outward physically afterwards). కాబట్టి, సుధాసింధుస్థానము మనలో మానసిక లేదా బుద్ధి స్థానము అని అన్వయించుకోవచ్చు.  అమ్మవారు సహస్రారము నందు అయ్యవారి పర్యంకముపై ఆసీనురాలగుటకు ముందు, ఆసీనురాలైనప్పుడు కూడా ఈ ఆజ్ఞాచక్ర స్థానము అను పీఠముపై పాదములు మోపును. అందువలన చర్మ చక్షువులు మూసి ఆజ్ఞా చక్రస్థానమును ధ్యానించినచో అమ్మవారి పాదములను ధ్యానించినట్లే అవుతుంది. తత్ఫలితముగా జ్ఞప్తికి రావలసిన, అర్థం కావలసిన విషయములను అమ్మవారు స్ఫురింపజేస్తారు.

మన వెన్నెముకను బ్రహ్మదండము లేదా మేరుదండము అని కూడా అందురు. ఈ వెన్నెముకపైకొనని మేరు శృంగము అంటారు. భూగోళము యొక్క ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపు ధ్రువాక్షము (Polar Axis), భూగోళమునకు మేరు దండము అగును. ఇది భూమి మీద ఉన్న సకల జీవకోటి యొక్క సామూహిక మేరువును సూచించును. అలాగే అంతరిక్షములో గ్రహములన్నిటి యొక్క సామూహిక మేరుదండమును ఊహించినచో అది సూర్యమండలానికి మేరుదండమగును. ఇంకా పై స్థాయిలో ఊహిస్తే అన్ని పాలపుంతలకు ఒక సామూహిక మేరుదండము యొక్క ఉత్తర కొన బ్రహ్మాండములో అమ్మవారు ఉండు స్థానముగా సమన్వయం చేసుకొనవలెను. ఉత్తరదిశవైపు ఉన్న మేరువు కొనను శిఖరము లేదా శృంగము అని కూడా అంటారు.  

సురవిటపివాటీపరివృతే -
సురలనగా దేవతలు. సుర అనగానే దేవతలు సురాపానము చేయుదురు కాబట్టి సురలు అయినారు అనే ఆలోచన వస్తుంది. కానీ ఇక్కడ సురాపానం అంటే నాడీ మండలానికి ఉత్తేజాన్ని తగ్గించి మత్తును కలుగజేసే తుచ్ఛమైన మద్యము అని కాదు అర్థం. సురాపానము అనగా నిరంతర బ్రహ్మానందామృతమును అనుభవించే వారు అని సంకేతము.  విటపి  అనగా వృక్షములు. దేవతల వృక్షములు అనగా కల్పవృక్షములు. అనగా మనస్సు కోరిన వాటిని కల్పించి మనకి దర్శింపజేయ శక్తి గల కల్పవృక్షములన్నియు లలితాంబిక ఉన్న గృహము చుట్టునూ ఉండును.

మణిద్వీపము -
మణి అనగా రత్నము. రత్నము అనగా స్వయంప్రకాశ, ప్రసార, ప్రచోదన లక్షణములు (Self or auto radiating, communicating and stimulating characteristics) కలది. ద్వీపము అనగా చుట్టును నీరు లేదా జలము గల ప్రదేశము.

మహానారాయణోపనిషత్తు నందు, సర్వాదేవతా ఆపః అనే మంత్రము లో…
“ఆపో వా దగ్౦ ర్వం విశ్వాI భూతాన్యాపఃI ప్రాణా వా ఆపఃI వః ఆపోన్నమాపోమృIమాపఃI మ్రాడాపోI విరాడాపఃI స్వరాడాశ్ఛన్దాగ్శ్యాపో జ్యోతీగ్ష్యాపో యజూగ్ష్యాపఃI త్యమాపః సర్వాI దేతాపో భూర్భువః సురా ఓమ్”
ఈ కనబడుతున్న శరీరములన్నియు, ప్రాణములు, పశువులు, అన్నము, అమృతము, సూత్రాత్మ యగు హిరణ్యగర్భుడు, బ్రహ్మండమే దేహముగా గల విరాట్ పురుషుడు, స్వరాట్ - స్వయంగా ప్రకాశించుచున్న ఈశ్వరుడు, గాయత్ర్యాది ఛందస్సులు, ఆదిత్యాది జ్యోతులు, యజుర్ మంత్రములు, సత్యము, దేవతలందరూ, భూర్భువస్సువర్లోకములు అన్నియు జలములే కదా !! ఓం కార స్వరూపమయిన పరమాత్మ కూడా జలమే !! అందుకే నారయణ/నారాయణి. వర్షాభావము వలన కలుగు పీడను పోగొట్టుటకు జలదేవతానుగ్రహము కొఱకు చెప్పే మంత్రము ఇది. అనగా సృష్టికర్త్రి అయిన జగజ్జనని సృష్టి ప్రక్రియకు అవసరమైన ఆపస్సులచే పరివేష్ఠింపబడి, స్వయం ప్రకాశ, ప్రసార, ప్రచోదన లక్షణములు గల మణిద్వీపము నందు ఉండును. మణులు అనగా మనలోని అంతఃస్ఫురణను, మేధాశక్తిని, తేజస్సును సూచించును.

నీపోపవనవతి -
అనగా కడిమి చెట్ల (కదంబం) ఉద్యానవనము నందు అమ్మవారి చింతామణి గృహము ఉన్నది. వర్షముతోను మబ్బులతోను ప్రత్యేక సంబంధాన్ని కలిగి ఉండేవి - చెంగల్వ, కడిమి, నెమలి. వీటిలో కడిమి చెట్లు ముఖ్యమైనవి. దివిని, భువిని వర్షధారలు కలుపుతాయి. ఈ వర్షధారలలోని ఆపస్సులు సృష్టికి దోహదపడతాయి. ఈ సత్సంబాధాన్ని నిరంతరం కోరుకునేవి కడిమి చెట్లు. మనలో జలధాతువుల ఉనికిని, ఉత్పత్తిని ఈ కడిమిచెట్లు సూచించును. అందుచేతనే సృష్టిస్వరూపిణి అయిన అమ్మవారికి ఈ చెట్లుగల ఉద్యానవనము ఇష్టము. ఈ కడిమి వృక్షాలతోట మధ్యలోనే చింతామణి గృహము ఉంటుంది.

చింతామణిగృహము -
అమ్మవారు ఉండే ఇంటి గోడలన్నీ చింతామణులే ! కోరినవి ఇచ్చు గుణము కలవి చింతామణులు. అమ్మవారి ఇంటి ఇటుకలు కూడా కోరికల్ను తీర్చు దానగుణము కలదు. అలాంటిది ఆ ఇంటి ఇల్లాలైన లలితాపరమేశ్వరి అమ్మవారిక్కి ఎంత దయ కలిగి ఉన్నదో, ఎటువంటి అనుగ్రహం వర్షించునో ఊహించుకొనవచ్చును. చింతామణి అనగా మరొక సూక్ష్మమైన అర్థం కూడా ఉన్నది, చింతా అనగా ఆలోచన, మన చింతలన్నీ (అనగా ఆలోచనలన్నీ) కేవలం అమ్మవారి గురించినవే అయితే, పరాదేవత యొక్క చింతనలనే ఒక మనసులో ఒక మందిరముగా నిర్మిస్తే అదే అసలైన చింతామణి గృహము, అందులో అప్పుడు అమ్మవారు, అయ్యవారితో కలిసి నివసిస్తారు. శ్రీచక్రనగరము నందు ఈ చింతామణి గృహమును ఎలా చేరుకోవాలో, మధ్యలో ఎన్ని ప్రాకారములు ఉన్నాయో ముందు తెలిపిన శ్రీపుర మానసిక విహంగవీక్షణలో చూశాము కదా !!

శివాకారేమంచే -
శివాకారే అనగా మంగళకరమైన ఆకృతి గల, ఆనందకారకమైన మంచము. శ్రీచక్రము నందు బిందు స్థానములో ఉంటుంది ఈ శివాకార మంచము. ఇది శివ శక్తుల సమాగ సంయోగ స్థానము. మనలో సహస్రార చక్రమును సూచించును. ఈ మంచమునకు నాలుగు కోళ్ళు గలవు - బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశానుడు. మంచముపై ఉన్న తల్పమును పరమశివునిగా సంకేతించి చెప్పుట శ్రీవిద్యా సాంప్రదాయము.
మంచము యొక్క అంతరార్థము - నాలుగు కోళ్ళ మంచము అనగానే మనకి తెలిసిన నిద్రించే మంచము అనుకోవడం సహజము, లలితాఅమ్మవారి యొక్క చిత్రపటములో కూడా అలానే కనబడుతుంది. కానీ, ఈ మంచము లౌకికమైన తమోగుణమును కలిగించే మంచము కాదు, దాని వెనుక ఒక సంకేతార్థము ఉన్నది. శివాకారమంచము అనగా కుండలినీ శక్తి.
వెన్నెముకలోని సుషుమ్న ద్వారా ఊర్ధ్వగతిని పొందుచున్నప్పుడు,
        I.            మూలాధార, స్వాధిష్ఠానములకు సంబంధించిన బ్రహ్మగ్రంథి (Brain of Instincts and Desires),
      II.            మణిపూర-అనాహతములకు సంబంధించిన విష్ణుగ్రంథి (Brain of Emotions or Affections),
    III.            విశుద్ధి-ఆజ్ఞా చక్రములకు సంబంధించిన రుద్రగ్రంథి (Brain of Intellect or Wisdom),
   IV.            లలాటమునకు శిరోమధ్యభాగమునకు సంబంధిచిన ఈశ్వర స్థానమును అధిగమించును.
అనగా సుషుమ్నా మార్గములో ఇవి మైలు రాళ్ళ వంటివి (Cardinal Points). రైల్వే పరిభాషలో చెప్పాలంటే ఇవి ముఖ్యమైన స్టేషన్ ల వంటివి. ఈ నాల్గింటిని నాలుగు మంచపు కోళ్లతో సూచించిరి. ఇక మనలోని సహస్రార కమల స్థానము నందు ఉండు సదాశివుని మంచముపై ఉండు తల్పముగా (పరుపుగా) సూచించిరి. మేరు అను పదములో ‘మ్ + అ + ఇ + ర్ + ఉ” అను ఐదు అక్షరములు/వర్ణములున్నవి. సుమేరు అనగా సువర్ణములు, వీటిలో ‘మ్, అ, ర్, ఉ’ లు బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులను, మధ్యనున్న ‘ఇ’ అమ్మవారి నివాసమును సూచించును. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశానులు నలుగురు కల్పాంతములలో అమ్మవారి యందు విలీనమైపోతారు. కానీ ఒక్క సదాశివుడు మాత్రం ఎప్పుడూ అమ్మతో కూడి ఉంటాడు. అది సూచించడానికే పరమశివుని తల్పముగా చూపించడం, మరొక సూక్ష్మం కూడా ఉన్నది. పరమశివుడు/సదాశివుడు ఎల్లప్పుడూ అనహన్తా స్థితిలో ఉంటారు, కాబట్టి శయనించినట్లుగానూ, అమ్మవారు అయ్యవారి అహంకార స్వరూపిణి కనుక అమ్మవారు కూర్చుని కనబడతారు, అయినా అమ్మ-అయ్య ఇద్దరూ ఒక్కటే, వేరు కాదు. పరబ్రహ్మం బాహ్యంగా ప్రకటం కాకుండా ఉంటే అది తల్పముగా ఉన్న పరమశివుడు, ప్రకటం అయ్యే పరబ్రహ్మం పరమశివుడనే పానుపుమీద / పరమశివుడి ఒళ్ళో కూర్చొని ఉన్న అమ్మవారు. అమ్మే అయ్య, అయ్యయే అమ్మ.. అసలు ఇద్దరు లేరు. ఉన్నది ఒక్కటే.

పరమశివ పర్యంకము -
పరమశివుడు ప్రపంచమునకే ప్రథముడు. సంఖ్యాత్మకముగా అమ్మవారు అయ్యవారి నుండి విశ్వముగా విస్తరిల్లినదను విషయము ఈ ‘పరమశివ పర్యంకనిలయాం’ అను పదములలో నిగూఢముగా గలదు. పరమశివుడు అంకెలలో 1 (ఒకటి)ని సూచించును. అంకము అనగా అంకె, పర్యంకము అనగా పరి + అంకము = పరిపూర్ణమైన అంకె, అంకెలలో పరిపూర్ణమైనది 9 (తొమ్మిది). కాబట్టి పరమశివ పర్యంకనిలయాం అను పదములకు - ‘సృష్టిగా విచ్చుకొనుటలో ఒకటి నుండి తొమ్మిది వఱకు గల నవబ్రహ్మలను (నవ ప్రజాపతులను), అంకెలలోకములో తన నిలయముగా కలిగినది అని అర్థము. ‘సోకామయత బహుస్యాం ప్రజాయేయేతి….’ అని తైత్తరీయోపనిషత్తు చెప్తున్నది. అనగా ఒంటి గింటి రామలింగము వలె నున్న పరమశివుడికి ఎక్కువ మందిగా అవ్వవలెనని కోరిక కలిగినదిట, ఇలా కోరిక కలగని శివుడిని సున్నా తోనూ, కోరిక కలిగిన లక్షణము నందున్న శివుడిని ఒకటి తోనూ సంకేతించవచ్చు. అన్నిరకముల జీవులతో పూర్తి ప్రపంచముగా  విచ్చుకొనబోవు స్థితిలో ఉన్న పరమశివుడిని కోరిక పూర్తిగా నిండిన లేదా కామము పూర్తిగా నిండిన ఈశ్వరుడు లేదా కామేశ్వరుడు అని సంకేతించును.

చిదానందలహరీమ్ -
సుధాసింధువు నందు, కల్పవృక్షముల మధ్యన ఉన్న మణిద్వీపములో, కదంబవృక్షముల ఉద్యావనము నందు ఉన్న చింతామణి గృహములో పంచబ్రహ్మాసము మీద ఆసీనమై ఉన్న తల్లిని ‘చిదానందలహరీమ్’ అని చెప్పారు శంకరులు. ఇక్కడ అమ్మవారికి ఏ ఇతర నామములు చెప్పలేదు. ఇక్కడ అమ్మవారిని చిత్ + ఆనంద + లహరీం అన్నారు, పరమేశ్వరుని యొక్క అహంకార స్ఫురణకే చిత్ శక్తి అని పేరు, ఆమెయే అమ్మవారు, ఆ చిత్ శక్తి యొక్క ఆనంద తరంగాలు (అలల) స్వరూపమే ఆ పంచబ్రహ్మాసనము మీద ఆసీనురాలై ఉన్నది. అమ్మవారిని ఒక్కసారి ఇలా తలచుకున్నా, మన యొక్క మానస సరోవరము నందు ‘ఆనంద బిందువు’ (అనగా సహస్రారచక్రము/బిందుస్థానములో) ఆనందతరంగాలను కలుగజేయును… ఆ ఆనందతరంగాలు శరీరములోని నాడులన్నిటియందు, షట్చక్రముల యందు ధారగా కురియును.. అందుకే అటువంటి ఆనందామృతరసమును కురిపించే అమ్మవారు కనుకనే లలితాసహస్రనామస్తోత్రంలో ‘సుధాసారాభివర్షిణీ’ అనే నామం చెప్పారు వ్యాసుల వారు. ఇది యోగ స్థితిలో కుండలినీ శక్తి సహస్రారమును చేరిన యోగి యొక్క సర్వోత్కృష్ట స్థితిని తెలియజేస్తుంది. ప్రస్తుతం మనం ఇంకా ఆ ఆనందస్థితి ‘అనుభవం’లోకి వచ్చే స్థితిలో ఉన్నా, అమ్మవారిని అటువంటి చిదానందలహరి/అమృతవర్షిణి గా ధ్యానంలో చూడడానికి ప్రయత్నం చేయాలని శంకరులు ఇంత అద్భుతమైన శ్లోకాన్ని ఇచ్చారు.

భజన్తి త్వాం ధన్యాః కతిచన
పైన తెలిపిన విధంగా అమ్మవారిని అంతర్ముఖంగా ధ్యానించి సేవించి తరించగలిగే ధన్యులైన వారు బహుకొద్ది మంది మాత్రమే ఉంటారని శంకరులు చెప్తున్నారు. ఆత్మోన్నతి పొందాలంటే - ఆడంబరములతో పనిలేదని, అమ్మవారి యందు నిజమైన భక్తి ప్రపత్తులు కలిగి అంతర్ముఖత్వంతో ధ్యానం చేస్తే అమ్మని దర్శించవచ్చు అని శంకరుల పరోక్ష సందేశం.

ఈ శ్లోకములో సాధనా/తత్త్వపరమైన రహస్యాలు -
ఈ శ్లోకము నందు శంకరులు ఇచ్చిన అమ్మవారి నివాసస్థానము యొక్క వివరణ శ్రీవిద్యా సాంప్రదాయములోని ‘సమయాచారము’ ననుసరించి ఉన్నదని పెద్దల వ్యాఖ్యానము. సమయాచారము నందు అమ్మవారిని దహరాకాశములో అంతర్ముఖులై ధ్యానం చేసి పూజిస్తారు. శ్రీచక్రపురమును కూడా హృదయము నందు భావన చేసి పూజ చేస్తారు. చిత్ శక్తి స్వరూపము నిశ్చల పరబ్రహ్మముతో ఐక్యము అగుటయే సమయాచార తత్త్వము (శివశక్త్యైక్య స్వరూపము). అయ్యవారు సమయ, అమ్మవారు -సమయా. అమ్మవారికి, అయ్యవారికి అభేదాన్ని ఐదురకముల సామ్యముతో చెప్తారు…
a)     అధిష్టాన సామ్యము - ఇద్దరూ బిందు స్థానములో పంచబ్రహ్మాసము మీద కొలువై ఉంటారు.
b)     అనుష్టాన సామ్యము - ఇద్దరూ సృష్టి/స్థితి/లయములు చేస్తారు.
c)     అవస్థ సామ్యము - అయ్యవారు తాండవం చేస్తారు, అమ్మవారు లాస్యం చేస్తారు.
d)     నామ సామ్యము - శివ/శివాని, భవ/భవాని, శర్వ/శర్వాణి, రుద్ర/రుద్రాణి, శంకర/శాంకరి
e)     రూపసామ్యము - ఇద్దరూ త్రినేత్రములు కలవారు, ఇద్దరూ చంద్రవంకను ధరిస్తారు.
ఈ సమయాచార విధానము గురించి రుద్రయమల తంత్రము నందు విస్తారముగా చెప్పబడినది. రుద్రయమల తంత్రము నందు అమ్మవారి నివాసస్థానము గురించి ఈ విధంగా చెప్పబడినది…
సుధాబ్ధౌ నన్దనోద్యానే రత్నమండపమధ్యగామ్
బాలార్కమండలాభాసాం చతుర్బాహుం త్రిలోచనామ్
పాశాంకుశ శరాంస్చాపం ధారయన్తీం శివాం శ్రియమ్
ధ్యాత్వా చ హృద్గతం చక్రం వ్రతస్తః పరమేశ్వరీమ్
పూర్వోక్త ధ్యానయోగేన చిన్తయన్ జపమాచరేత్
ఈ విధంగా సమయాచారం ప్రకారం అమ్మవారి శ్రీచక్రోపాసన చేయాలి అంటే గొప్ప ఏకాగ్రత, ఇంద్రియనిగ్రహము కావలెను. మొత్తం అనుష్టానం అంతా హృదయము నందు జరుగుతుంది. ఈ శ్లోకము నందు చెప్పబడిన అమ్మవారి చిదానంద స్వరూపము, భైరవ యమల తంత్రము నందు చెప్పబడిన కుండలినీ శక్తి వర్ణనతో సరిపోతుంది. కుండలినీ శక్తి (అగ్ని తత్త్వము), దహరాకాశము నందు ఉన్న సూర్య శక్తిని ఛేదించి, సహస్రార చక్రమును చేరి, సహస్రారము నందు ఉన్న ఘనీభవించిన చంద్రమండలాన్ని కరిగింపజేస్తుంది. అలా కరిగిన సహస్రారము నందున్న సుధారసము (అమృతము) శరీరము నందలి నాడులన్నిటినీ, షట్చక్రములను ఆనందామృతముతో తడిపివేయును. (సుధాసారాభివర్షిణీ).
కౌళాచారము నందు, శ్రీచక్రమును పలకలమీదనో లేక భూర్జ పత్రము మీదనో, బంగారు/వెండి పళ్ళెం మీదనో లిఖించి, భౌతికమైన ద్రవ్యములతో, బాహ్యము నందు శ్రీచక్రార్చన చేస్తారు.

సగుణరూపములో అమ్మవారి సౌందర్యముకి పోలికే లేదు. అంత గొప్ప సౌందర్యరాశి, సదాశివపతివ్రత, కారుణ్యముతో కూడిన జగములను కన్న పెద్దమ్మ తల్లి. కానీ ఈ శ్లోకము నందు శంకరులు, అయ్యవారి (పరబ్రహ్మము/సత్యము) నుంచి విడదీయలేని చిత్ శక్తి ఆనంద తరంగములుగా, నిర్గుణ తత్త్వాన్ని చెప్పారు. ఈ శ్లోకములో ఇచ్చిన అమ్మవారి చింతామణి చిరునామా రీత్యా సగుణోపాసనగా కనిపించినా, తత్త్వపరముగా, దహరాకాశము నందు యోగ స్థితిలో అనుభవమయ్యే చిదానందతరంగముల అమృతరస పరతత్త్వాన్ని ఆవిష్కరించారు శంకరాచార్యుల వారు. శివశక్త్యైక్య రూపములో ఉన్న చిదానందలహరిలో మునకలు వేయడం అంటే అమ్మవారి సాయుజ్యాన్ని పొందడమే. నాలుగు రకాల మోక్ష స్థితులను చెప్తారు,
·         సాలోక్యం - ఇష్ట/కుల దేవతల లోకాలను చేరడం
·         సామీప్యం - రెండవ పద్ధతిలో మనం ఎక్కడున్నా అన్నీ ఆ దేవతా నివాసముగా, మనతో ఎప్పుడూ ఆ దేవతని సమీపంలో ఉపాసించుట సామీప్య మోక్షం
·         సారూప్యం - మనం దేని గురించి ధ్యానిస్తూ ఉంటామో, అది మనమై పోయే లక్షణము. మారీచుడు రాముడిని (భయముతో) ఉపాసన చేసి రాముడి లక్షణము (స్వరమును) పొందుటలాంటిది సారూప్య మోక్షం అంటే.
·         సాయుజ్య ముక్తి - అన్నిటికంటే ఉత్కృష్టమైనది. అహం బ్రహ్మాస్మి స్థితి, అనగా ధ్యానధ్యాతృధ్యేయరూపాలు మూడూ కలిసి ఉన్నది ఒక్కటే, ఆ ఒక్కటీ మనమే అయిపోవడం, పరబ్రహ్మముతో ఏకత్వ స్థితి, అద్వైత స్థితి.
ఈ శ్లోకములో శంకరులు చిదానందలహరీమ్ అని చెప్పడం వలన, అమ్మవారితో మరియు అయ్యవారితో ఏకమయ్యే సాయుజ్య మోక్ష స్థితిని వర్ణించారు అని పెద్దల వ్యాఖ్యానము.
శ్రీచక్రనిర్మాణము గురించి, శ్రీచక్రోపాసన గురించి, మనలోని షట్చక్రము గురించి సౌందర్యలహరిలో రాబోయే శ్లోకాలలో శంకరులు అనేక సాధనా/మంత్ర/తత్త్వ రహస్యాలను ఇచ్చారు. ఆయా శ్లోకముల వివరణలో మరింత విపులంగా వాటిని చర్చించబడినది.

ఒక ముఖ్యమైన గమనిక - బాహ్యము నందు శ్రీచక్ర పూజైనా, ఆంతరము నందు కుండలినీ శక్తిని ఉపాసించి, షట్చక్ర భేదనము చెయ్యాలన్నా, సరిఅయిన గురువుల నుంచి దీక్షని పొంది, గురువులు చెప్పినంతవరకూ మంత్రజప సాధన చేసి, గురువు సమక్షంలో చెయ్యవలసిన సాధనలు. శ్రీచక్రోపాసన/కుండలినిని కదపడమ్ మొదలైనవి పుస్తకాలను చదివి చేసే సాహసం ఎన్నడూ చేయరాదు అని పూజ్య గురువుల వాక్కు.

సౌందర్యలహరిలోని ఈ ఎనిమిదవ శ్లోకాన్ని భక్తిశ్రద్దలతో పారాయణ చేస్తే జననమరణ చక్రము నుండీ విముక్తి లభిస్తుందనీ, అలాగే కామ్యము కొఱకు పారాయణ చేసేవారికి, పన్నెండు రోజులపాటు నిత్యం 2200 సార్లు జపం చేస్తే, అకారణమైన కారాగారవిముక్తి, సకల కార్యములు/వ్యాపారములో విజయము లభిస్తుంది అని పెద్దల వ్యాఖ్యానము.

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.