16, జులై 2014, బుధవారం

గురుగుహాయ భక్తానుగ్రహాయ - శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ కీర్తన



శ్రీగురుభ్యో నమః
గురుగుహాయ భక్తానుగ్రహాయ
రాగం: సామ                తాళం: ఆది
II పల్లవి II
గురుగుహాయ భక్తానుగ్రహాయ కుమారాయ నమో నమస్తే
II అనుపల్లవి II
గురుగుహాయ భక్తానుగ్రహాయ గుణాతీతాయ రూపరహితాయ
హరిహరవిరిఞ్చి రూపాయ సచ్చిదానన్దస్వరూపాయ శివాయ
II చరణమ్ II
సకలాగమ మంత్ర సారజ్ఞాయ సత్సంప్రదాయ సర్వజ్ఞాయ
సకలనిష్కళ ప్రకాశకాయ సామరస్య సంప్రదాయకాయ
వికళేబర కైవల్యదానాయ వికల్పహీనాయ విజ్ఞానాయ
శుక వామదేవ వందిత పదాయ శుక వామదేవ ముక్తిప్రదాయ

ఈ కీర్తన చేసిన క్షేత్రంతిరుత్తణి

ఈ కీర్తన యొక్క అర్ధం
ఓ గురుగుహ స్వామీ! భక్తులను అనుగ్రహించేవాడా! కుమారా! (కుమారా అంటే శివశక్తుల కుమారుడు అని, అసలు కుమార అనే శబ్దం ఒక్క సుబ్రహ్మణ్యస్వామి వారికి మాత్రమే వర్తిస్తుంది అని అమరకోశం చెబుతుంది) నమో నమస్తే!!

గుణములకు అతీతమైన పరబ్రహ్మస్వరూపమా! రూపము లేని వాడా! త్రిమూర్త్యాత్మకా! త్రిమూర్తుల రూపములో ప్రకాశించే వాడా!! సత్, చిత్, ఆనంద స్వరూపుడా!! ఎల్లప్పుడు మంగళములను మాత్రమే చేయు వాడా!!

సకల ఆగమములు, మంత్రముల యొక్క సారమైన వాడా! అనగా ఆగమాలు, మంత్రాలు ఏ పరబ్రహ్మాన్ని స్తుతిస్తున్నాయో, ఆ పరబ్రహ్మ స్వరూపమా!! సత్సాంప్రదాయములను అవలంబింప చేసే వాడా !! (ఇక్కడ సత్సంప్రదాయములు అంటే వేద విహిత కర్మాచరణ అని అర్ధం. కర్మసిద్ధంతాన్ని పునరుద్ధరించడానికి సుబ్రహ్మణ్యుడే కుమరిలభట్టు రూపములో అవతరించారు). అన్ని కళలను (రూపాలను) తానే అయి ఉన్నవాడు, ఏ కళలు (రూపము) లేనివాడా!! కైవల్యానందము ప్రసాదించువాడా!! నాశము లేనివాడా, సర్వజ్ఞత్వము కలిగిన వాడా!! శుక వామదేవాది మహర్షులచే పూజింపబడే వాడా!! శుక వామదేవులకు ముక్తిని ప్రసాదించినవాడా!!
సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి