శ్రీగురుభ్యో నమః
గురుగుహాదన్యమ్
రాగం: బలహంస తాళం: ఝంప
II పల్లవి II
గురుగుహాదన్యం న జానేఽహం
గుప్తాగమార్థ తత్వప్రబోధినో
II అనుపల్లవి II
అరుణోదయానంత కోటిబ్రహ్మాండాకార
శివాది ధరాన్త తత్వస్వరూపిణో
II చరణమ్ II
సహస్రదళ సరసిజ మధ్యనివాసినః
సకల చంద్రభాస్కర తేజః ప్రకాశినః
సహజానన్దస్థిత దాస విశ్వాసినః
సచ్చిత్సుఖాత్మక విశ్వవిలాసినో
అహరహః ప్రబలహంస ప్రకాశాత్మనో
దహరవిద్యా ప్రదాయక పరమాత్మనో
జహదజహల్లక్షణయా జీవైక్యాత్మనో
రహః పూజిత చిదానన్దనాథాత్మనో
ఈ కీర్తన చేసిన క్షేత్రం – తిరుత్తణి
ఈ కీర్తన యొక్క అర్ధం
నాకు గురుగుహ స్వామీ తప్ప వేరు దైవం ఎరుగను. ఆగమముల
అర్ధమును ప్రబోధించిన ఓ గురుగుహ స్వామీ, నీవు తప్ప నేను ఎవరినీ ఎరుగను. నీవే నాకు
దిక్కు.
అరుణోదయ అంటే, ఎర్రని కాంతి స్వరూపము, అగ్ని
స్వరూపము కలవాడా, మొట్ట మొదట ఏకముగా ఉన్న శివతత్వము నుండి, పృథ్వీ తత్వము, అనంత
కోటి బ్రహ్మాండ ఆకారములను నీలోనే నింపుకున్న తత్వము కలవాడా!! అనగా ఒక్కడే ఉన్న
పరమశివ స్వరూపం దగ్గర నుంచి, నేను అనేకమౌదును గాక వ్యాప్తి చెందిన యావత్ విశ్వం
(అనంత కోటి బ్రహ్మాండాలు), మనకి కనబడే ఈ పృథ్వీ అన్నిటిలోనూ ఉన్నది, ఒక పరబ్రహ్మ
స్వరూపము.
సహస్రదళములు కలిగిన పద్మము మధ్యలో నివాసము
ఊండే వాడా!! (సహస్ర దళ పద్మం ఎక్కడో లేదు, మన సహస్రార చక్రాన్నే యోగ పరిభాషలో అలా
చెప్తారు అని విన్నాను. ఒక వ్యక్తి శరీరంలో ఉండగానే కైవల్యానంద స్థితిని
పొందినప్పుడు, ఆ సహస్రదళపద్మంలో కొలువై ఉన్న స్వామి దర్శనం అవుతుంది), సూర్య
చంద్రులను ప్రకాశింపజేయువాడా!! (అనగా సూర్యుడికి ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది?
సూర్యమండలాంతర్వర్తి అయిన పరమాత్మ సూర్య ప్రకాశానికి కారణం. అలాగే చంద్రుని కాంతి.
సూర్య చంద్రుల ప్రకాశానికి కూడా మూలకారణం, ఎవరి ఆజ్ఞానుసారం అవి ప్రకాశాసిస్తున్నాయో
- ఆయనయే పరబ్రహ్మస్వరూపుడైన
గురుగుహస్వామి), సహజానంద స్థితిలో ఉండే భక్తులను విశ్వసించే వాడా!! సత్, చిత్,
ఆనంద స్వరూపుడా!! దహరవిద్యను ప్రబోధించిన వాడా!! జహల్లక్షణ, అజహల్లక్షణ ల ద్వారా
జీవ బ్రహ్మైక్య సిద్ధి కారణమైన వాడా! (ఇవి వేదాంత పరిభాషలో వాడే పదాలు), వైదిక
కర్మల ద్వారా ఆరాధింపబడే ఓ చిత్స్వరూపా, శివసుతా!!
సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి