31, జనవరి 2015, శనివారం

కామాక్షీ సౌందర్యలహరి – 5వ శ్లోకము – అమ్మవారి అనుగ్రహం పొందిన ఇద్దరు దేవీఉపాసకులు

శ్రీగురుభ్యో నమః

II కామాక్షీ సౌందర్యలహరి – 5వ శ్లోకము – అమ్మవారి అనుగ్రహం పొందిన ఇద్దరు దేవీఉపాసకులు II

హరిస్త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్య జననీం
పురా నారీభూత్వా పురరిపుమపి క్షోభమనయత్ I
స్మరోపి త్వాం నత్వా రతినయనలేహ్యేన వపుషా
మునీనామప్యన్తః ప్రభవతి హి మోహాయ మహతామ్ II 5 II

 తాత్పర్యముః అమ్మా! నమస్కరించిన జనులకు సౌభాగ్యములను, మంగళములను ప్రసాదించే ఓ జగజ్జననీ! హరి (విష్ణువు) నిన్ను ఆరాధించిన ఫలితముగా, పూర్వమొకనాడు స్త్రీరూపమును ధరించినవాడై, త్రిపురాసురసంహారం చేసిన పరమశివుడికి సైతం మోహాన్ని కలిగించి, ఆయన యొక్క మనస్సును క్షోభ (కలవరపరచడం) పెట్టగలిగాడు. అలాగే మన్మథుడు కూడా నీకు నమస్కరించి, నిన్ను ఆరాధించిన ఫలితముగా, నీ అనుగ్రహం పొందిన కారణంగా, రతీదేవి యొక్క కన్నులకు ఆనందాన్ని కలిగించే స్వరూపము గలవాడై, మౌనముగా తపస్సు చేసుకునే మునీశ్వరుల యొక్క మనసులలో కూడా మోహాన్ని, కామవికారాన్ని కలుగజేయుటలో సమర్ధుడగుచున్నాడు తల్లీ !!

భావార్ధముః ఈ ఒక్క శ్లోకములోనే, ఆదిశంకరాచార్యులవారు ఎన్నో పురాణ ఆఖ్యానములను, అమ్మవారి ఆరాధనా రహస్యాలను అందించారు.

అమ్మవారి గొప్ప దేవీఉపాసకులలో ఇద్దరైన శ్రీమహావిష్ణువు మరియు మన్మథుడి గురించి, శంకరాచార్యుల వారు ఈ శ్లోకములో ప్రస్తుతించారు. ఆ పన్నెండు మంది దేవీఉపాసకులు వరుసగా, విష్ణువు, శివుడు, సుబ్రహ్మణ్యుడు, నందీశ్వరుడు, ఇంద్రుడు, కుబేరుడు, మన్మథుడు, సూర్యుడు, చంద్రుడు, లోపాముద్ర, అగస్త్య మహర్షి మరియు దూర్వాసో మహర్షి.  వీరిలో విష్ణువు, మన్మథులు అమ్మవారి ఉపాసన వలన ఎంత గొప్ప అసాధ్యములైన కార్యములు చేయగలిగారో వివరించారు. అదే విధముగా శ్రీవిద్యోపాసనలో కూడా విష్ణువు ఒక ప్రస్తారానికి ఋషి/మంత్రద్రష్ఠ అనీ మరియు మన్మథుడు ఇచ్చిన విద్యనే కాదివిద్య అనీ పెద్దలు చెప్తారు.

ఈ శ్లోకం యొక్క భావార్ధము గమనిస్తే, ముందుగా అమ్మవారిని “ప్రణతజన సౌభాగ్య జననీం” అని సంబోధించారు శంకరులు. అనగా నమస్కరించిన జనులకు సౌభాగ్యములను (శుభగత్వము), మంగళములను, శుభములను చేకూర్చే జననీ/తల్లీ అని భావము. నమస్కరించడం అంటే మనసా, వాచా కర్మణా మూడు విధాలలో అమ్మకి ఎలా నమస్కరించినా, అవ్యాజకరుణామూర్తి అయిన అమ్మవారు సకల శుభములను వర్షిస్తుంది. దీనినే శ్రీరామాయణం సుందరకాండలో సీతమ్మ తల్లి గురించి, త్రిజటా స్వప్నవృత్తాంతము నందు వాల్మీకి మహర్షి అంటారు
“ప్రణిపాత ప్రసన్నా హి మైథిలీ జనకాత్మజా
అలమేషా పరిత్రాతుం రాక్షస్యో మహతో భయాత్” – సుందరకాండ 27వ సర్గ 46వ శ్లోకం.

జనకమహారాజు గారి కూతురు, మైథిలిగా పిలువబడే మా సీతమ్మ తల్లికి ప్రణిపాతం చేసి అనగా నమస్కరించిన మాత్రాన ప్రసన్నురాలై, ఎటువంటి ఆపదలు/భయాల నుంచి మనలను రక్షించగల దయాస్వరూపం అని త్రిజట అనే రాక్షసి చెప్పింది. సీతమ్మ తల్లి సాక్షాత్ లలితాపరాభట్టారికాస్వరూపం కదా. సౌందర్యలహరిలోని ‘ప్రణతజన సౌభాగ్య జననీం’, సుందరకాండలోని ‘ప్రణిపాతప్రసన్నా హి మైథిలీ జనకాత్మజా’ ఒకే అర్ధాన్ని, అమ్మవారి కారుణ్యాన్ని సూచిస్తాయి. ‘అమ్మా !! మేమంతా నీ బిడ్డలమమ్మా’ అని అమ్మకి ప్రణిపాతం చేసినంత మాత్రాన, సకల శుభములను అమ్మ ఇస్తుంది. అమ్మ ఆరాధన చేసినవారికి, శుభములతో పాటుగా, అమ్మ ఇచ్చే మరొక గొప్ప వరం భయాన్ని మరియు ఆపదలను తొలగించడం. ఇక్కడ నమస్కరించడం అంటే శరణాగతి చేయడం.  

తరువాత ఈ శ్లోకంలో మొదటి రెండు పాదములలో శంకరులు అంటున్నారు – ‘హరిస్త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్య జననీం – పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్’ అని. హరి అనగా విష్ణువు - అమ్మ వారిని ఆరాధించిన ఫలితంగా, అమ్మ అనుగ్రహం పొందాడు అని ఒక అర్ధం. ఈ మొదటి పాదంలో హరిస్త్వామారాధ్య ప్రణతజనసౌభాగ్య జననీం అనే పదములలో, శాక్తేయమునకు చెందిన ప్రణవం కూడా ఉన్నది అని పెద్దల వ్యాఖ్యానము. అలాగే శ్రీసూక్తము నందలి ‘తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే’ అనే మంత్రములో ఉన్న బీజాక్షరమే ఈ శ్లోకములో ‘ప్రణతజన సౌభాగ్యజననీం’ లో ఉన్నదని పెద్దల వ్యాఖ్యానము. లలితా త్రిపురసుందరీ ప్రస్తారభేదములలో ఒక ప్రస్తారానికి ఋషి విష్ణువు. అలాగే అమ్మవారి ఉపాసనలో వైష్ణవీ మంత్రానికి విష్ణువు ఋషి.

మొదటి పాదానికే మరొక అర్ధం కూడా కలదు. హరి అమ్మవారిని ఆరాధించి అమ్మవారిగా మారిపోయిన సౌభాగ్యమును పొందెను అని మరొక అర్ధం. అంటే, మనం ఎవరిని ఉపాసన చేస్తే వారిగా మారిపోతాం అని పెద్దలు/గురువులు చెప్తారు. దీనికి ఒక ఉదాహరణ పరమ పూజ్యులు, సాక్షాత్తు బాలాత్రిపురసుందరీ స్వరూపులు అయిన బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు పడక కుర్చీలో కూర్చొని ఉండగా, వారి ఇంటికి వచ్చిన వారికి శాస్త్రిగారిగా కాక, ఒక పెద్ద ముత్తైదువగా కనబడే వారని, ఒకనాడు ఒకతల్లి వెళ్ళి శాస్త్రిగారు ఉన్నారా అమ్మా! అని ఆ పడక కుర్చీలో కూర్చున్న అమ్మవారిస్వరూపంలో ఉన్న శాస్త్రి గారిని అడిగితే, ఆయన లేచి, “ఏమి.. నేను శాస్త్రినే కనబడట్లేదా!!” అని అడిగేవారుట. అంటే అమ్మవారి ఉపాసన చేయడం వలన ఆయనయే అమ్మగా మారిపోయే సౌభాగ్యం పొందారు. అందుకే బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణశాస్త్రిగారు శరీరం విడిచిపెట్టినప్పుడు, ఆయన శరీరం అగ్నిలో వ్రేలుస్తూ ఉండగా సాక్షాత్తు బాలాత్రిపురసుందరీ అమ్మవారు బయటకి వెళ్ళిపోవడం అక్కడ ప్రత్యక్షంగా చూసినవారు ఉన్నారు, అప్పట్లో వార్తాపత్రికలలో కూడా వేశారు. అదేవిధంగా, శ్రీమహావిష్ణువు కూడా అమ్మవారి ఉపాసన చేసి, అమ్మవారిగా అయిపోయాడు అని దీనికి అన్వయం చేసుకోవాలి. మామూలుగా త్రిమూర్తులకు మధ్య సంబంధం చెబితే, నారాయణ-నారాయణి ఇద్దరూ అన్నాచెల్లెళ్ళుగా చెప్తారు. అంటే, పరబ్రహ్మములోని సృష్ఠి స్థితి లయములు చేసే శక్తి స్వరూపాన్ని స్త్రీ రూపంగా కొలిస్తే అది అమ్మవారు, పురుషరూపంగా కొలిస్తే అది నారాయణుడు/విష్ణువు.

పురా నారీభూత్వా పురరిపుమపి క్షోభమనయత్ – అంటే పూర్వం ఒకనాడు హరి స్త్రీ రూపం ధరించాడు. క్షీరసాగర మథనం జరిగినప్పుడు అమృతం పుడితే, అది రాక్షసులకి దక్కకుండా ఉండడం కోసం స్వామి మోహినీ అవతారంలో వచ్చిన సంగతి అందరికీ తెలిసినదే కదా. ఒకనాడు కైలాసంలో శంకరుడు అడిగాడు.. ఒకసారి ఆ మోహినీ రూపాన్ని చూపమని. అంతట విష్ణువు వద్దులే బావా అని చెప్పినా, శంకరుడు ఒకసారి చూపమని పట్టుబడితే, అప్పుడు విష్ణువు ఒక నవయవ్వన సౌందర్యవతిగా పరమశివుని ముందు ప్రత్యక్షమయ్యాడు. అంతట, విష్ణువు మోహినీ రూపముతో సాక్షాత్తు త్రిపురాసురసంహారము చేసిన పరమశివుడికి కూడా చిత్తక్షోభము కలిగించుటలో సమర్ధుడయ్యాడు. అప్పుడే హరిహరసుత అయిన ధర్మశాస్త-అయ్యప్పస్వామి వారి అవతారం వచ్చింది. త్రిపురాసురసంహారము చేసిన పరమశివుడు అనగా జితేంద్రియుడు/త్రిగుణాతీతుడు అని భావము. అటువంటి పరమశివుడికే చిత్తక్షోభమును కలుగజేయగలిగాడు హరి. విష్ణువు స్త్రీరూపంలో వచ్చి పరమశివునికి మోహం కలిగించగలిగాడు అంటే దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే హరి ఆరాధించేది అమ్మవారినే కాబట్టి, ఆయన సాక్షాత్తు అమ్మవారి స్వరూపమే పొందాడు. త్రిగుణములకు అతీతుడైనవాడైన అయ్యవారిని కూడా మోహపెట్టడం అంటే అది ఒక్క మాయమ్మ కామాక్షీతల్లికి మాత్రమే సాధ్యం. అయ్యవారిచేత సృష్ఠి చేయించడమైనా, స్థితి చేయించడమైనా, లయము చేయించినా అన్నీ మా అమ్మ కామాక్షీ పరదేవత వల్లనే కదా సాధ్యం. అందుకే మూకపంచశతిలో అమ్మవారిని –
·        ఆమ్రతరుమూలవసతేః ఆదిమపురుషస్య నయనపీయూషం – మామిడి చెట్టు మూలము నివాసముగాగల ఆదిమపురుషుడైన పరమశివుని యొక్క నేత్రములకు అమృతము అనీ,
·        పురవైరివిమర్ధ పులకితాంగలతామ్ – పురవైరి అంటే త్రిపురాసుర సంహారం చేసిన పరమశివుని కౌగిలింతచేత పులకించిన తీగవంటి శరీరము కలది అనీ,
·        శంభు సుకృతసంభారైః - అనగా పరమశివుని పుణ్యాల పంట అమ్మవారు అనీ,
·        ఊష్మలఫాలేన లాలితం పుంసాం - అనగా అగ్నినేత్రం కలిగిన శివుని చేత ఎప్పుడూ లాలింపబడే దానా అనీ,
·        పినాకిమూలధనం – పినాకి అనగా పరమశివుని యొక్క మూలధనం అమ్మవారు అనీ,
·        శంకరనయనామృతాయ – అనగా శంకరుడి నయనములకు అమృతము అమ్మవారు అనీ..
ఇలా ఎన్నో కోణాలలో అమ్మవారి యొక్క వైభవాన్ని, అయ్యవారితో అనుసంధానం చేస్తూ అత్యద్భుతంగా చెప్పారు మూకశంకరులు. కాబట్టి త్రిపురములను జయించిన మరియు కాముడ్నే కాల్చిన అయ్యవారు అమ్మవారి దగ్గరకి వచ్చేసరికి మాత్రం – ఆయన కళ్లు పక్కకి త్రిప్పలేడు. ఎందుకంటే అమ్మవారి సౌందర్యం అటువంటిది. మనందరికీ అమ్మ యొక్క అమ్మతనమే సౌందర్యము, కానీ ఈ లోకంలో ఒక్క అయ్యవారికి మాత్రం అమ్మ యొక్క సౌందర్యం – అంతటి పరమశివుడికి కూడా మోహాన్ని కలిగించే సౌందర్యం. అటువంటి సౌందర్యరాశి అయిన అమ్మవారితో కూడిన అయ్యవారు మనందరికీ సర్వత్రా శుభములను చేకూర్చే శంకరుడైనాడు. అదే అమ్మ ప్రక్కన లేకపోతే స్వామి వీరభద్రుడౌతాడు. అటువంటి ఉగ్రస్వరూపం శ్రీరాముడిలో కూడా సీతావియోగం చెందినప్పుడు మనం చూస్తాము. అందుకే పెద్దలు ఎప్పుడూ ‘శక్తితో కూడిన పరబ్రహ్మాన్ని మాత్రమే’ ఉపాసన చెయ్యమని చెప్తారు.

పరమశివుడంతటి వాడికి చిత్తక్షోభం కలిగించడం అంటే, అది ఎవరికి పడితే వాళ్ళకి సాధ్యమయ్యే విషయంకాదు. విష్ణువు మోహినీ రూపములో మోహం కలిగించగలిగాడు అంటే, నారాయణి అయిన అమ్మ యొక్క తేజస్సు లేకుండా అది సాధ్యం కాదు. విష్ణువు అమ్మవారిని ఆరాధించిన కారణముగా అమ్మరూపమును/అమ్మతేజస్సును పొందగలిగాడు. 

శ్రీమహావిష్ణువు పరమశివునితో ఎన్ని విధాలుగా అనుసంధానం అయి ఉంటాడో శివానందలహరిలో శంకరులు ఈ క్రింది శ్లోకములో అద్భుతముగా ఇచ్చారు.

బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే
ఘోణిత్వం సఖితా మృదంగవహతా చేత్యాదిరూపం దద్యౌ I
త్వత్పాదే నయనార్పణం చ కృతవాన్ త్వద్దేహభాగో హరిః
పూజ్యాత్పూజ్యతరస్స ఏవ హి న చేత్ కో వా తదన్యోధికః II 82 II

పై శ్లోకానికి తాత్పర్యం ఏమిటంటే – ఓ ఆర్యాపతీ ! పార్వతీపతీ ! పరమశివా!! శ్రీమహావిష్ణువు బాణంగానూ మరియు వృషభరూపములోనూ (త్రిపురాసుర సంహారములో), భార్యగా నీశరీరములో అర్ధభాగమును పొంది, వరాహ రూపమును (పరమశివుని పాదములను వెతుకుతూ – అరుణాచల వైభవం), స్నేహభావమును, మృదంగము వాయిస్తూ (నటరాజ తాండవం చేసేటప్పుడు) మొదలైనవేగాక, నీ పాదముల యందు ఆయన నయనమును కూడా ఒక పుష్పముగా అర్పించి (నేత్రార్పణేశ్వర లింగము), నీ దేహములో భాగమైన హరి – లోకంలో బ్రహ్మాది పూజనీయులకన్నా మిక్కిలి పూజనీయుడైనాడు. అలాకాకపోతే ఆయన (విష్ణువు) కన్నా గొప్పవాడు అధికుడు ఎవరున్నారు !!

పూర్వం ఒకనాడు శ్రీమహావిష్ణువు పోగొట్టుకున్న చక్రాయుధాన్ని పొందడానికి పరమశివుని 1008 పద్మములతో సహస్రార్చన చేయడం ప్రారంభిస్తే, విష్ణువును పరీక్షించడానికి శివుడు ఒక పద్మాన్ని మాయం చేస్తారు, అప్పుడు ఆఖరి పద్మం అక్కడ కనబడకపోతే, విష్ణువు పుండరీకాక్షుడు కదా ఆయన కన్నులే పద్మముల వలె ఉంటాయి కదా కాబట్టి ఆయన ఎడమ నేత్రాన్నే తీసి పద్మంగా శివలింగముపై వేసి పూజ చేశాడు హరి. తత్ఫలితముగా విష్ణువుకి సుదర్శన చక్రాయుధాన్ని ప్రసాదించాడు పరమశివుడు. ఇలా పూజ చేసిన ఆ శివలింగాన్ని ‘నేత్రార్పణేశ్వర లింగము’ అని పిలుస్తారు. ఈ క్షేత్రం ఇప్పటికీ తమిళనాడులోని ‘తిరువీళిమిళలై’ అనే ఊర్లో తిరువారూరు దగ్గరలో కొలువై ఉంది. ఇక్కడ అయ్యావారిని కళ్యాణసుందరేశ్వరుడు అనీ, అమ్మవారిని సుందరకుశాంబిగై అనీ పిలుస్తారు. ఈ క్షేత్రములోనే అమ్మవారు కాత్యాయినీ అమ్మవారిగా వచ్చి పరమశివుడిని పరిణయమాడింది. ఈ క్షేత్రంలోనే అప్పార్, సంబంధార్, సుందరార్ అనేక పత్తిగాలు చేశారు. ఈ క్షేత్ర వైభవం చెప్పుకోవాలంటే చాలా ఉంది. కనుక నేత్రార్పణేశ్వర లింగము ఉన్న ఈ క్షేత్రవైభవం మరొక ప్రత్యేక టపాలో పంచుకుంటాను.

ఆదిశంకరులు ఈ శ్లోకములో ‘పురరిపుమపి’ అని త్రిపురాసుర సంహారాన్ని ఉటంకించారు కదా. త్రిపురాసుర సంహారం గురించి మహాశివపురాణం నుండి లఘువుగా ఇక్కడ స్మరిద్దాము.

త్రిపురాసురసంహారముః        
 ​
        
పూర్వము తారకాసుర సంహారము చేయడానికి శివశక్తుల కలయికతో శరవణతటాకము(రెల్లుదిబ్బల) నుండి ఆరుముఖములతో శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి జననం జరగడం, షడాననుడు దేవసేనాద్యక్షుడై తారకాసుర సంహారం చేసిన ఘట్టం అందరికీ తెలిసినదే. తారకాసురుడికి ముగ్గురు కొడుకులు ఉండేవారు. ఒకడి పేరు తారకాక్షుడు, రెండోవాడు కమలాక్షుడు, మూడో వాడు విద్యున్మాలి. అయితే ఈ ముగ్గురు వాళ్ల తండ్రి మరణం తర్వాత కూడా నేర్చుకోవలసిన పాఠం నేర్చుకోలేదు. తారకాసురుడిలానే వీళ్ళు కూడా అనంత శక్తులకోసం మరణం లేకుండా ఉండాలని సాధారణంగా అందరు రాక్షసులూ కోరుకునే విధంగా ఉగ్ర తపస్సు చేయడం ప్రారంభించారు. వీరి తపస్సుకి మెచ్చి బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమంటే ‘మరణం ఉండకూడదు’ అని అడుగుతారు. దానికి బ్రహ్మగారు ‘ఇది కుదరదు, ఎవరైనా సరే పుట్టడం అంటూ ఉంటే మరణం అనేది తప్పదు కాబట్టి ఇంకేమైనా కోరుకో’మని చెప్తారు. సరే అని ఈ ముగ్గురు రాక్షసులు రెండు వరములు అడుగుతారు. ఒకటి బ్రహ్మగారు సృష్ఠిలోని ఈ లోకంలో ఎవరిచేతా వారికి మరణం రాకూడదు అని. రెండవ కోరిక వాళ్ళకి బంగారము, వెండి, ఇనుములతో చేసిన మూడు పురములను ఇమ్మని. ఈ పురముల సహాయముతో ఈ బ్రహ్మాండములో ఎక్కడైనా విహరించగలిగేలా ఉండి, కొన్ని లక్షల సంవత్సరాలలో ఒక్కసారి మాత్రమే ఈ మూడు పురములు ఒకే సరళరేఖలోకి వచ్చేట్లుగానూ, అలా ఒకే రేఖలో ఉన్నప్పుడు + చంద్రుడు పుష్యమీ నక్షత్రములో ఉండగా + అభిజిత్ లగ్నం ఉండగా + ఆకాశంలో పుష్కలావర్త మేఘం నుండీ వర్షం పడుతూ ఉండగా + దైవగణములందరికన్నా గొప్పవాడు + లోకంలో ఎవరూ ఉపయోగించని ఒక కొత్తరథం ఎక్కి + ఒకే ఒక్క బాణం వేస్తే అప్పుడు మాత్రమే మేము ముగ్గురము ఒకేసారి మరణిస్తాము అని కోరుకుంటారు. బ్రహ్మగారు సరే అని వరమిస్తారు.

ఇక లోకంలో వీళ్ల ఆగడాలకి అంతులేకుండా పోవడంతో దేవతలు, మునులు వెళ్ళి బ్రహ్మ గారికి మొరపెట్టుకోగా, శ్రీమహావిష్ణువు సృష్ఠించిన ‘అరిహన్’ అనే గురువు రూపంలో వెళ్లి, త్రిపురాసురులకి ధర్మవిరుద్ధమైన వితండవాదముతో కూడిన తత్త్వాన్ని బోధచేయడంతో, అప్పటిదాకా చేస్తూ ఉన్న ఉగ్ర తపస్సు పూజలు అన్నీ ఆపేసి, ఇంకా దురాగతములు చేయడం ప్రారంభిస్తారు ఈ ముగ్గురు రాక్షసులు. (ఇక్కడ చిన్న ధర్మసూక్ష్మము ఏమిటంటే – ఒక పెద్ద ధర్మాన్ని నిలబెట్టడం కోసం చిన్న అధర్మం చేయడం తప్పుకాదు. దానికోసమే శ్రీమహావిష్ణువు సృష్ఠించిన ఈ అరిహన్ అనే గురువు వెళ్లి త్రిపురాసురులకు ధర్మంలా అనిపించే అధార్మిక తత్త్వాన్ని బోధచేశారు. తదనుగుణంగా సంహరింపబడడానికి వాళ్ల పాపం పక్వానికి వచ్చింది. కాబట్టి ‘అరిహన్’ అనే రూపము మనందరము ఆచరించకూడని గురుస్వరూపము).

ఇక ఈ త్రిపురాసురులను సంహరించవలసిన సమయము ఆసన్నమయిందని విష్ణువు, బ్రహ్మాది దేవతలు వెళ్ళి పరమశివుని కోరగా, పరమశివుడు సరేనని అంగీకరిస్తారు. అప్పుడు ఈ పృథ్వియే రథంగా సూర్య చంద్రులు ఆ రథానికి చక్రాలుగా నాలుగు వేదములు అశ్వములుగా మేరు పర్వతము ధనుస్సుగా, ఆదిశేషుడు వింటినారిగా సాక్షాత్తు విష్ణువు బాణముగా, అగ్ని దేవుడు ఆ బాణము యొక్క శిఖగా సిద్ధమవ్వగా, పరమశివుడు ఒక చిరునవ్వు నవ్వి, సరేనని ఆ రథాన్ని అధిరోహిస్తారు. అంతట ఆ రథం ముందుకు వెళ్లలేక నేలకొరిగిపోతుంది. ‘యతో వాచో నివర్తన్తే అప్రాప్య మనసా సహ’ అని కదా వేదం. అలాగే పరబ్రహ్మాన్ని వహించడం సాధ్యపడదు కదా. అందుకే రథం ముందుకు వెళ్లలేదు. అప్పుడు పరమశివుడికి అభేదమైన విష్ణువు వృషభరూపం ధరించగా, ఆయనయే బాణముగా కూడా మారి శివుని చేతిలోకి వస్తే, అప్పుడు త్రిపురాసురులను ఒకే ఒక బాణముతో సంహరించెను. తమిళనాడులో కడ్డలూరు జిల్లాలోని పన్ఱుటి అనే ఊరి దగ్గరలో ‘తిరువాడిగై’ అనే క్షేత్రం ‘త్రిపురాసుర సంహార ఘట్టాన్ని ప్రతిబింబిస్తూ ప్రసిద్ధి చెందిన పుణ్య క్షేత్రం. ఇక్కడ స్వామి వారు వీరట్టేశ్వరస్వామి గానూ, అమ్మవారు త్రిపురసుందరీ అమ్మవారి గానూ కొలువై ఉన్నారు. ఇక్కడే స్వామి వారిని త్రిపురారి, త్రిపురాన్తక అని పిలుస్తారు. ఈ క్షేత్రవైభవాన్ని మరింత విపులంగా మరొక టపాలో చర్చించుకుందాము.

అమ్మవారి అనుగ్రహం పొందిన మన్మథుడుః
ఈ శ్లోకములో చివర రెండు పాదములలో శంకరులు అన్నారు – “స్మరోపి త్వాం నత్వా రతినయన లేహ్యేన వపుషా మునీనామప్యన్తః ప్రభవతి హి మోహాయ మహతామ్” అని. స్మరోపి అంటే స్మరుడు కూడా. స్మర అంటే కామానుభూతిని మరల మరల జ్ఞప్తిలో ఉండేలా మనసును మథించేవాడు – మన్మథుడు అని అర్ధం. “స్మరోపి - మన్మథుడు కూడా” అని అనడంలో అర్ధం మన్మథుడు కూడా హరి వలె అమ్మవారి గొప్ప ఉపాసకులలో ఒకరిగా చెప్తున్నారు. శ్రీవిద్యాసాంప్రదాయములో మన్మథుడు ఇచ్చిన విద్యనే కాదివిద్యగా వ్యవహరిస్తారు. లోపాముద్ర అమ్మ ద్వారా వచ్చినది హాది విద్యగా పేర్కొంటారు.

మన్మథుడు కూడా అమ్మవారిని ఆరాధించిన ఫలితముగా రతీదేవి కన్నులకు మాత్రమే సుందరముగా కనబడతాడు, ఇతర ప్రపంచానికంతటికీ ఆయన స్థూలరూపములో కనబడడు. అందుకే ఆయనను అనంగుడు – అనగా అంగములు లేనివాడు అని పిలుస్తారు. అసలు మన్మథుడికి శరీరం ఎలా పోయింది అంటే తారకాసుర సంహారం జరగాలి అంటే శివశక్తుల కలయికతో వచ్చే తేజస్సు మాత్రమే సంహరించగలదు. శివశక్తులు కలవాలంటే శివుడికి కామం కలగాలి, కాబట్టి ఇంద్రాది దేవతలందరూ ప్రోత్సహించి, తపస్సు చేసుకుంటున్న పరమశివుడికి కామప్రచోదనం కలిగించమని మన్మథుడిని ప్రేరేపిస్తారు. అప్పుడు కామవికారమును కలిగించే పుష్పబాణము వేద్దామని మన్మథుడు సంసిద్ధమవ్వగా అంతట పరమశివుడు ఆయన యొక్క మూడవ కంటి మంటతో కాముడ్ని చూడగా, మన్మథుడు భస్మం అయిపోయాడు. అప్పుడు రతీదేవి అమ్మవారిని పతిభిక్ష పెట్టమని ప్రార్ధించగా, అమ్మవారు మన్మథుడిని తిరిగి బ్రతికించి, ఆయనకి శరీరం లేకుండా, కేవలం ఆయన భార్య రతీదేవికి మాత్రమే కనబడే వరాన్ని ఇచ్చారు. అప్పటినుంచీ మన్మథుడిని అనంగుడు/దేహము లేని వాడు అని పిలువబడుతున్నాడు.

ఇక్కడ రతీ మన్మథులు అంటే తత్వం పరిశీలిస్తే  - ప్రతీ వ్యక్తిలో ఉండే కోరిక/ఆసక్తి/కుతూహలమునకు ప్రతీక మన్మథుడు. కోరిక తీరడం ద్వారా పొందే అనుభూతియే రతీదేవి. ఒకరికి మామిడిపండు తినాలని అనిపించడం మన్మథబాణం పడడం. పండు తిన్నాక వచ్చే తృప్తి అనుభవంలోకి రావడం రతీదేవి. అంటే ఆ కోరిక ఫలించినదో లేదో ఆ అనుభవము ఒక్క రతీదేవి కన్నులకు తప్ప ఇతరులకు తెలియదు. అందుకనే మన్మథుడు కేవలం రతీదేవి కన్నులకు మాత్రమే కనబడతాడు అని శంకరులు చెప్పడంలో అంతరార్ధం.

అటువంటి మన్మథుడు అమ్మవారి ఆరాధన చేసిన ఫలితముగా, లోకములో తపస్సు చేసుకునే మునులకు సైతం వారి మనస్సులలో కామవికారాన్ని, మోహాన్ని కలుగజేయడంలో మన్మథుడు సమర్ధుడగుచున్నాడు.

అయితే ఇక్కడ మనకి ఒక సందేహం రావచ్చు. అసలు పరమశివుడి మూడవకంటి మంటకి కాలిపోయిన మన్మథుడిని మళ్లీ అమ్మవారు ఎందుకు బ్రతికించారు. సరే బ్రతికించారు అనుకున్నా, ఆ మన్మథుడు లోకంలో అందరినీ ఆయన యొక్క పుష్పబాణములు వేసి మోహాన్ని, కామాన్ని కలుగజేయడం ఎందుకు? అని సందేహం మనకి కలుగవచ్చు. దీని వెనుక రహస్యం ఏమిటంటే – లోకంలో సకల జీవకోటికి కోరికలు లేకపోతే అనగా కామవాంఛ లేకపోతే జగత్తంతా నిర్వీర్యమైపోతుంది, జీవులయందు పునరుత్పత్తి ఉండదు. జీవులు ఉత్సాహాన్ని కోల్పోతాయి. అలాగే ఇతఃపూర్వం కర్మలను అనుభవించడానికి జీవులు తిరిగి తిరిగి వివిధ ఉపాధులలో జన్మించాలి. ఇవన్నీ చేయాలంటే మన్మథుడు లోకానికి అవసరం. కాబట్టి, అటు పరమశివుడి మూడవకంటి మంటకి కాలిపోయిన శరీరాన్ని తిరిగి ఇవ్వకుండా, రతీదేవి కంటికి మాత్రం కనబడే వరాన్ని అమ్మవారు ఇచ్చారు. అప్పటి నుంచీ మన్మథుడు కేవలం రతీదేవి కన్నులకు మాత్రమే అనుభవం అవుతూ, లోకంలో అందరి మీదా అందునా తపస్సు చేసుకొనే మునుల మనస్సులలో సైతం మోహాన్ని కలుగజేయగలుగుతున్నాడు అంటే అది అమ్మవారి అనుగ్రహం వలన మాత్రమే. మౌనముగా ఉన్న మునీశ్వరులకి కూడా కామాన్ని/మోహాన్ని కలిగించడం మన్మథుడు చేయగలుగుతున్నాడు అంటే, అది పరాదేవత యొక్క అనుగ్రహం మన్మథుడికి ఉండడం వల్ల మాత్రమే. అసలు శరీరమే లేని మన్మథుడు ఎలా లోకాల్ని జయించగలుగుతున్నాడో, ఆయన ఆయుధాలు, ఆయన బలం ఏమిటో ఆదిశంకరులు సౌందర్యలహరిలో ఆరవ శ్లోకంలో (ధనుఃపౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా… ) అద్భుతంగా వర్ణించారు. ఆ శ్లోక వివరణ వ్రాసుకునేటప్పుడు మన్మథుడు ఎలా లోకాలని జయిస్తున్నాడో తెలుసుకుందాము.

లలితాసహస్రనామస్తోత్రములోని ‘వైష్ణవీ’, విష్ణురూపిణీ, ‘విష్ణుమాయా’, ‘విలాసినీ’ అనే నామములతోనూ మరియు లలితాష్టోత్తరశతనామావళిలోని ‘అనంగజనకాపాంగవీక్షణాయై నమః’ అనే నామాలతోనూ ఈ ఐదవ శ్లోకాన్ని సమన్వయం చేసుకోవచ్చు.

సౌందర్యలహరిలోని ఈ ఐదవ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తే, భార్యా భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది అనీ, ప్రత్యేకంగా స్త్రీ ఆమె భర్త యొక్క ప్రేమాభిమానన్ని పొందగలుగుతుంది (ఆమె యొక్క పురుషుడు అనగా భర్త ఆమె వశం అవుతాడు) అనీ పెద్దల వ్యాఖ్యానము.


 సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి