7, జనవరి 2015, బుధవారం

కామాక్షీ సౌందర్యలహరి – 4వ శ్లోకము - అమ్మవారి పాదపద్మముల మహిమ

శ్రీగురుభ్యో నమః

II కామాక్షీ సౌందర్యలహరి – 4వ శ్లోకము - అమ్మవారి పాదపద్మముల మహిమ II

త్వదన్యః పాణిభ్యా మభయవరదో దైవతగణః
త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయా I
భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికమ్
శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ II 4 II

 తాత్పర్యముః అమ్మా! సకల లోకములకు శరణ్యము/దిక్కైన ఓ జగదంబికా! నీవు తప్ప ఇతరములైన దేవతాగణములు అందరూ, వారి వారి భక్తుల యొక్క కోర్కెలు తీర్చుటకు వామహస్తముతో వరద ముద్ర, అలాగే భయమును తీర్చుటకు కుడివైపు చేతితో అభయ ముద్ర పడతారు తల్లీ, కానీ నీవు మాత్రం ఆ విధంగా వర, అభయ ముద్రలను ప్రకటించవలసిన అవసరం లేకుండా, భక్తుల యొక్క భయమును తీర్చుటకైనా, అలాగే భక్తులు కోరిన దానికన్నా ఎక్కువ ఫలాన్ని ఇవ్వడానికైనా, పరమపావనమైన నీయొక్క చరణములే సమర్ధములై ఉన్నాయి అమ్మా!


భావార్ధముః  ఈ శ్లోకములో అమ్మవారి యొక్క చరణకమలముల యొక్క వైభవాన్ని వివరిస్తున్నారు శంకరులు. మొదటగా ఇక్కడ అమ్మవారిని ‘శరణ్యే లోకానాం’ అని సంబోధించారు. అంటే సకల భువనభాండాలకి కూడా అమ్మవారే దిక్కు. సకల జీవకోటికి, దేవతలకు సైతం శరణ్యం అమ్మవారే. అంటే అమ్మవారు పరాశక్తి స్వరూపిణి కదా. అమ్మవారు అనుగ్రహించకపోతే, యావత్ జగత్తు అస్థిత్వం కోల్పోతుంది. ఇక దేవతలకైనా సరే – అమ్మవారి శక్తి లేకపోతే, బ్రహ్మ విష్ణు రుద్రులు కూడా వారి కర్తవ్యములను నెరవేర్చలేరు. ఆఖరికి అమ్మ శక్తి లేకపోతే, సాక్షాత్ పరమశివుడే అయినా స్పందించలేడు అని శంకరులు అమ్మవారి శక్తి వైభవాన్ని మొదటి శ్లోకములోనే వివరించారు. శరణ్యే లోకానాం అంటే, జగజ్జనని అయిన అమ్మవారి పాదములు సకల లోకాలకు దిక్కు.

అమ్మవారు తప్ప ఇతరములైన దేవతాగణములందరూ వారి భక్తులను అనుగ్రహించడానికి వరదముద్ర, అభయ ముద్రలను అభినయిస్తున్నారు అని చెప్తున్నారు శంకరులు. భగవత్స్వరూపములు భక్తులను అనుగ్రహించడానికి, వివిధ ముద్రలను, ఆయుధాలను చేత పట్టుకుని ఉంటారు. ఉదాహరణకి బాలాత్రిపుర సుందరీ అమ్మవారు ఆమె నాలుగు చేతులలో ఒక చేతిలో జపమాల, ఒక చేతిలో పుస్తకము, ఒక చేతితో అభయ ముద్ర, మరొక చేతిలో వరద ముద్ర పట్టుకుని ఉంటుంది. అలాగే, దుర్గా అమ్మవారిని చూస్తే, అమ్మవారు త్రిశూలము, ఖడ్గము, శంఖము, పద్మము, గద, ధనుస్సు పట్టుకుని, కుడి చేతితో అభయముద్రని పట్టి ఉంటుంది. దక్షిణామూర్తి స్వామి వారిని చూస్తే, ఆయన చతుర్బాహువులలో, ఒక చేతిలో ఢమరుకము, జపమాల, అగ్నిశిఖ, పుస్తకము ధరించి, కుడిచేతితో చిన్ముద్ర పట్టి ఉంటారు. ఇలా ప్రతీ దేవతా స్వరూపానికీ, ఒక్కో సగుణరూపమును, ప్రతీ రూపము/అవతారముకి ఒక్కో విధమైన ముద్రలు మరియు ఆయుధములు ధరించి ఉండడం మనం చూసి ఉంటాము. భక్తులను వివిధ రీతులలో రక్షించడానికి, మన కామ్యములు తీర్చుటకొరకు, మనలోని అంతఃశత్రువులను జయించడానికి, దుష్ట శిక్షణ –శిష్ట రక్షణ చూపడానికి సంకేతముగా ఈ ముద్రలుగానీ, ఆయుధములు కానీ భగవంతుడు ధరిస్తాడు. సౌందర్యలహరిలోని నాలుగవ శ్లోకం యొక్క భావార్ధం వివరించేటప్పుడు, మొత్తం ముద్రల గురించి, ఆయుధముల గురించిన వివరణలోకి వెళితే బాగా ఎక్కువ వ్యాఖ్యానం అవుతుంది. కాబట్టి ఇక్కడ కేవలం అభయ, వరద ముద్రలను గురించి మాత్రం పెద్దల వ్యాఖ్యానము నుంచి తెలుసుకున్నది వ్రాస్తున్నాను.

ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే – లలితా పరాభట్టారికా స్వరూపంలో ఉన్న అమ్మవారు నాలుగు చేతులలో పాశము అంకుశము, చెరుకు విల్లు, ఐదు పుష్పాలు మాత్రమే పట్టుకుంటుంది తప్ప, ముద్రలు ఏమీ పట్టదు. అమ్మవారి నాలుగు చేతులలో ఉన్న పాశాంకుశపుష్పబాణముల ప్రాశస్త్యం గురించి సౌందర్యలహరిలో రాబోయే శ్లోకాలలో శంకరులు ఇచ్చి ఉన్నారు. కాబట్టి వాటి వివరణ కూడా ఇక్కడ ప్రస్తావించడం లేదు.

ఎవరైనా దేవతా మూర్తి వరద ముద్ర పడితే దానర్ధం – భక్తుల యొక్క కామ్యార్ధములను తీర్చగల సమర్ధతను వ్యక్తం చేయుట. అంటే ఇది పోషణ శక్తిని సూచిస్తుంది. అమ్మవారు వామభాగమునందు ఉంటుంది కనుక, వరద ముద్ర ఎడమ చేతితో పడతారు.

అలాగే, అభయ ముద్ర అంటే – భయమును తీసివేయునది, రక్షణ కలిగించునది. భయం దేనికి – ఉన్నది పోతుందేమో, లేనిది రాదేమో అనే భయం దగ్గర నుంచి, అందరికీ ఉండే అతిపెద్ద భయం మృత్యు భయం. మృత్యుభయం ఎందుకు కలుగుతుంది? అజ్ఞానం వల్ల, ఈ శరీరమే నేను అనే తాదాత్మ్యత ఉండి, ఈ శరీరం ఒకనాడు పడిపోతుంది అని తెలిసినా, శరీరం వెళ్ళిపోతుందంటే, ఇక నేను ఉండను అనే భయం. మరి మనకి ఉండే ఆ భయాన్ని భగవంతుడు ఎలా తీసేస్తాడు? అభయ ముద్ర పట్టి, “ఒరేయ్ నాన్నా నీకేమీ భయం లేదురా, నిన్ను నేను రక్షిస్తాను, జ్ఞానభిక్ష పెట్టి మన భయాన్ని తీసేస్తారు”. ఇదే అభయ ముద్ర. ఇది రక్షణ సామర్ధ్యం కాబట్టి కుడి చేతితో ఈ ముద్ర పడతారు.

జ్యోతిశ్శాస్త్ర ప్రకారం కూడా,  శుక్ర, కుజ గ్రహములు స్త్రీ తత్త్వమును, పురుష తత్త్వమును సూచిస్తాయి. శుక్ర గ్రహం సంపద కారకం, కుజ గ్రహం సత్త్వమును సంకేతిస్తాయి. శుక్ర గ్రహానికి సంకేతం మరియు కుజ గ్రహానికి సంకేతం పరస్పరం వ్యతిరేకముగా ఉంటాయి. కాబట్టి, వరద ముద్ర ఎడమ చేతితోనూ, అభయముద్ర కుడి చేతితోనూ సమన్వయము కుదురుతోంది కదా.

ఈ నాలుగవ శ్లోకములో శంకరభగవత్పాదుల వారు అంటున్నారు – “అమ్మా!! ఇతర దేవతా గణములు ఆ విధంగా ఒక చేతితో వరద ముద్ర ఒక చేతితో అభయముద్ర పడతారమ్మా, కానీ నీవు మాత్రం అలా అభినయించవలసిన అవసరం లేదు తల్లీ, నీ చరణ కమలములే ఆ రెంటినీ ఇవ్వడానికి సమర్ధమై ఉన్నాయి” అని. అంటే అమ్మవారి పాదపద్మములకు నమస్కరిస్తే చాలు, అమ్మ పాదములే మనకి అభయమును, మరియు వరప్రదానము రెండూ ఇవ్వగలవు. అమ్మవారి పాదముల నుంచి వచ్చే కాంతి ఒక్కసారి మనమీద పడిందా, వాడికి జ్ఞానము కలిగి, భయం అన్నది పోయి, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని శాశ్వత శివసాయుజ్య స్థితిని కలుగజేస్తుంది అమ్మ. అలాగే, అమ్మవారి పాదపద్మములకు భక్తితో నమస్కరిస్తే చాలు, ఇహములో మనకి కావలసిన సకల కామ్యములు అమ్మ ఇస్తుంది.

దేవతలలో కొందరు భోగాన్ని, కొందరు మోక్షాన్ని మాత్రమే ఇస్తారు. కానీ అమ్మవారి చరణకమలములను నమ్మిన వాడికి అమ్మ ఇహములో భోగాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చి, పరములో మోక్షసుఖాన్ని కూడా ఇవ్వగలదు.

లలితాసహస్రనామస్తోత్రంలో ‘వాంఛితార్థప్రదాయినీ’ అనే నామం ఇచ్చారు వ్యాసుల వారు. శంకరులు ఇంకా ముందుకు వెళ్ళి, ‘భయా త్రాతుం దాతుం ఫలమపిచ వాంఛాసమధికం’ అన్నారు. అంటే అమ్మ పాదములు భయాన్ని తొలగించి, మనం కోరినదానికన్నా ఎక్కువ ఫలాన్ని ఇస్తుంది అని. నిజమే కదా! లౌకికమైన మనల్ని కన్న అమ్మే, మనకి ఏదైనా ఇవ్వల్సి వస్తే, అన్నం పెట్టడం దగ్గర నుంచి, ఏదైనా సరే, మనం అడిగిన దాని కంటే, కోరిన దాని కంటే ఎక్కువ కొసరి కొసరి బలవంతపెట్టి మరీ తినిపిస్తుంది. మరి సకల జీవకోటికి మాత, జగదంబిక మనం కోరిన దానికంటే ఎక్కువ ఫలాన్నిస్తుంది అనడంలో ఆశ్చర్యం ఏముంది!

ఒకసారి పూజ్య గురువు గారు అమ్మవారి యొక్క మాతృప్రేమ చెప్తూ ఒక మాట చెప్పారు. “అమ్మవారిని నమ్మిన వాడికట – అమ్మవారు ఇహములో కావలసిన అన్నీ ఇచ్చి, పుత్రపౌత్రాదులను సుఖశాంతులను అనుభవైక ఐశ్వర్యమును, యశస్సును ఇచ్చి, సంపూర్ణ ఆయుర్దాయము ఇచ్చి, అంత్యమున పరమశివుడితో కలిసి, మోక్షం ఇవ్వడానికి వచ్చి, అమ్మవారితో అయ్యవారితో కలిపి పుష్పకవిమానం ఎక్కించుకుని, తీసుకువెళుతూ ఉంటే, అమ్మవారు మెల్లగా ఓ ప్రక్కకి ఒదిగి, కళ్లవెంట నీళ్లు పెట్టుకుంటుందిట… ఎందుకు పార్వతీ అని అయ్యవారు అడిగితే, “పాపం వాడు నా పాదాలను నమ్ముకుంటే, నేను వాడికి ఇంతకన్నా ఏమీ ఇవ్వలేకపోతున్నానండీ” అని చెప్పి, తన పాదాలనే నమ్మిన ఆ భక్తుడికి ఇహము+పరములో రెండిటిలోనూ అన్నీ ఇచ్చినా, అమ్మవారు తృప్తి చెందరుట. ఇంకా నేను ఏమి ఇవ్వగలను వాడికి అని !!

                
​                   శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ


అంటే శంకరులు ‘దాతుం ఫలమపిచ వాంఛా సమధికం’ అని ఎందుకు అమ్మవారి పాదపద్మ మహిమని వివరించారో అర్ధం అవుతుంది కదా!!

ఈ శ్లోకముని, లలితాసహస్రంలో ఇచ్చిన ‘వాంఛితార్థప్రదాయినీ’, ‘భయాపహా’, ‘వరదా’, ‘నిరపాయా’ అనే నామాలతో కలిపి అనుసంధానం చేసుకుని చదువవచ్చు. అంతేకాక ఈ శ్లోకము నందు శ్రీవిద్యా సాంప్రదాయములోని బాలమంత్రము నిగూఢంగా ఇచ్చారని పెద్దల వ్యాఖ్యానము.


ఈ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తే ‘సామ్రాజ్య సిద్ధి’, మోక్షసిద్ధి కలుగుతాయి.

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.

4 కామెంట్‌లు: