13, ఫిబ్రవరి 2015, శుక్రవారం

కామాక్షీ సౌందర్యలహరి – 6వ శ్లోకము – అమ్మవారి కటాక్షమహిమ (మొదటి భాగము)

శ్రీ గురుభ్యో నమః

I
I కామాక్షీ సౌందర్యలహరి – 6వ శ్లోకము – అమ్మవారి కటాక్షమహిమ II (మొదటి భాగము)


ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః
వసన్తః సామన్తో మలమరుదాయోధనరథః I
తథా౽ప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపామ్
అపాఙ్గాత్తే లబ్ధ్వా జగదిద మనఙ్గో విజయతే II 6 II

 తాత్పర్యముః అమ్మా!! హిమగిరిసుతే! పర్వతరాజపుత్రికా, హిమవంతుని కూతురా, హైమవతీ !! అత్యంత కరుణాపూరితమైన నీ యొక్క కడగంటి చూపుల వలన, నీ కృప చేత, అసలు శరీరమే లేని మన్మథుడు పుష్పములచే చేయబడిన ధనుస్సు తుమ్మెదల వరుసలతో నిర్మించిన వింటినారి, కేవలం ఐదే బాణములు కలిగినవాడై, సంవత్సరంలో కేవలం రెండు నెలలు మాత్రమే ఉండే వసంతుడు (వసంత ఋతువు) ఆయన సచివుడిగానూ, దక్షిణ దిక్కుగా వీచే మలయమారుతము మన్మథుని రథముగానూ.. యుద్ధం చేయడానికి ఏ మాత్రమూ సామర్ధ్యము లేని ఈ ఆయుధ సామాగ్రితో, అసలు శరీరమే లేనివాడు (అనంగుడు అనగా అంగములు లేనివాడు) అయిననూ, కేవలం నీ కటాక్షవీక్షణము లభించడం వలన మాత్రమే ఈ జగత్తంతటినీ జయిస్తున్నాడు తల్లీ!!

భావార్ధముః అమ్మవారిని ఆరాధించిన ఫలితముగా మౌనముగా తపస్సు చేసుకొనే మునులను సైతం మన్మథుడు ఎలా మోహపెట్టగలుగుతున్నాడో క్రిందటి శ్లోకంలో వివరించారు శంకరులు. దానికి కొనసాగింపుగా ఈ శ్లోకములో మన్మథుడు ఎలా ఈ లోకాలను జయిస్తున్నదీ, యుద్ధము చేయడానికి ఏమాత్రమూ పనికిరాని అత్యంత బలహీనమైన ఆయుధ సామాగ్రిని కలిగి, శరీరం కూడా లేకుండా ఉన్నాకూడా కేవలం కామాక్షీ అమ్మవారి కటాక్షవీక్షణమును పొందిన కారణంగా మాత్రమే స్మరుడు లోకాలన్నిటినీ జయిస్తున్నాడు అనే రహస్యాన్ని శంకరులు ఈ శ్లోకంలో మనకి బోధ చేశారు.

ఈ శ్లోకం యొక్క భావార్ధము పరిశీలిస్తే, ధనుః పౌష్పం అంటే పుష్పములతో చేయబడిన ధనుస్సు. అసలు లోకంలో ఎవరైనా యుద్ధం చేయాలంటే ఎంత గొప్ప ధనుస్సు అయి ఉండాలి, దాని వింటినారి ఎంత బలమైనది అయి ఉండాలి. శ్రీరామాయణంలో రామచంద్ర మూర్తి ధనుస్సు పట్టుకుంటే ఎలా ఉంటుందో, ఆయన చేసే ధనుష్ఠంకారము (అంటే వింటినారిని లాగి వదలడం) చేస్తే కొన్ని వేల మంది రాక్షసులు ఆ శబ్దానికే ప్రాణాలు విడిచిపెడతారుట. అంటే శ్రీరాముడి చేతిలో ధనుస్సు ఎంత శక్తివంతమో తెలుస్తుంది. అంత బలమైన ధనుస్సును వహించాలంటే రామచంద్రమూర్తి శౌర్యము ఎంతటిదో అర్ధం అవుతుంది. అదేవిధంగా అర్జునుడికి వరప్రసాదంగా లభించిన ధనుస్సు ‘గాండీవం’ కూడా అత్యంత శక్తివంతమైనది. అసలు ఆ ధనుస్సులను సామాన్య మానవులు ఎవరూ, కనీసం ఎత్తనైనా ఎత్తలేరు. యుద్ధం చేయాలంటే అంత గొప్ప శక్తివంతమైన ఆయుధ సామాగ్రి కలిగి ఉండాలి. కానీ ఇక్కడ మన్మథుడికి ఉన్న ఆయుధం ఏమిటి – పుష్పములతో చేయబడిన ధనుస్సు. ఒక రోజు కన్నా ఎక్కువ ఆయుష్షు లేని, పరమ సౌకుమార్యము కలిగినవి అయిన పుష్పములు. అంటే ఆ ధనుస్సే ఎంత బలహీనమైనదో త్తెలుస్తూనే ఉంది. పోనీ ఆ ధనుస్సుకి కట్టిన అల్లెత్రాడు (వింటినారి)ని చూస్తే, అది ‘మౌర్వీ మధుకరమయీ’ అన్నారు. మత్తుగా తేనెను త్రాగిన తుమ్మెదలవరుస మన్మథుడి ధనుస్సుకి కట్టిన అల్లెత్రాడుట. అత్యంత చపలత్వము కలిగిన తుమ్మెదలు అన్నీ ఒక వరుసలో కూడడమే కష్టము. ఇక ఆ అల్లెత్రాడుకు తన్యత (tension) ఎలా ఉంటుంది? ఇంక అటువంటి ధనుస్సుని ఎక్కుపెట్టడం ఎలా? సాధ్యమయ్యే పనేనా?
సరే ఆయనకున్న బాణాలని చూస్తే “పంచవిశిఖాః” అన్నారు శంకరులు. ఉన్నవి ఐదే ఐదు బాణాలట. ఈ జగత్తులో కొన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయి. వాటినట్టినీ కాముడు జయించాలి అంటే, ఎన్ని బాణాలు కావాలి. అలాంటిది కేవలం ఐదే బాణాలు ఉన్నాయి మన్మథుడి దగ్గర.

ఇక ఆయన దగ్గర ఉన్న ఇతర బలగాన్ని చూస్తే, ‘వసన్తః సామన్తో’ అన్నారు. అంటే సంవత్సరంలో కేవలం రెండు నెలలు మాత్రమే ఉండే వసంతుడు (వసంత ఋతువు అని అర్ధం) ఆయన యొక్క సచివుడు. అంటే ఎప్పుడు పడితే అప్పుడు యుద్ధం చేయాలన్నా వసంతుడు అన్ని సమయాల్లో ఉండడు. ఇక మన్మథుడి రథం ఏమిటని చూస్తే – ‘మలయ మరుదాయోధన రథః’ – అంటే దక్షిణ దిక్కునుంచి వచ్చే మలయమారుతము అనే గాలి. అసలు ఆ మలయ మారుతము ఎప్పుడు ఏ వైపు వీస్తుందో తెలియదు. అటువంటి రథాన్ని అధిరోహించి మన్మథుడు యుద్ధానికి ఎలా వెళ్తాడు? ఆయన ఒక దిక్కుకి వెళ్లాలనుకుంటే రథం మరో వైపుకు వెళ్లవచ్చు.

మన్మథుడికి ఉన్న ఆయుధములను ఒకసారి సంగ్రహంగా చెబితే
 - పుష్పములతో చేసిన ధనుస్సు,
- తుమ్మెదల వరుసతో ఉన్న వింటినారి
- ఐదే ఐదు బాణములు
- వసంత ఋతువే సచివుడు
- మలయమారుతమే రథము
- మన్మథుడికో అసలు శరీరమే లేదు.

ఇలా ఏ కోణంలో చూసిన ఎటువంటి బలమూ, పెద్ద బలగమూ లేకుండా ఒక్కడే అయి ఉండి మన్మథుడు ఈ లోకాలన్నిటినీ జయించగలుగుతున్నాడు అంటే కారణం – ‘హిమగిరిసుతే కామపి కృపామపాఙ్గాత్తే లబ్ధ్వా’ అన్నారు శంకరులు. హిమగిరిసుత – హిమవంతుడి పుత్రిక అయిన హైమవతి, పార్వతి అమ్మవారి అనిర్వచనీయమైన కృప వలన అమ్మవారి యొక్క అపాంగ వీక్షణము (అంటే క్రీగంటి చూపు) మన్మథుడికి లభించినది. కాబట్టి లౌకికముగా ఎటువంటి ఆయుధ సంపత్తి లేకపోయినా ‘జగదిద మనంగో విజయతే’ అంటే అసలు అంగములే లేని మన్మథుడు ఈ జగత్తునంతటినీ జయిస్తున్నాడు అని శంకరుల భావము. అంటే ఈ లోకములో ఎవరైనా, బాహ్యంలో ఎటువంటి బలమైన కారణములు లేకపోయినా, అమ్మవారి కటాక్షం కలిగితే ఎంతటి దుస్సాధ్యమైన కార్యములనైనా సాధించగలుగుతారు.


(సశేషం...)


సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి