2, జనవరి 2015, శుక్రవారం

కామాక్షీ సౌందర్యలహరి – 3వ శ్లోకము - అమ్మవారి పాదధూళి మహిమ

శ్రీ గురుభ్యో నమః


II కామాక్షీ సౌందర్యలహరి – 3వ శ్లోకము - అమ్మవారి పాదధూళి మహిమ II
అవిద్యానా మన్తస్తిమిర మిహిరద్వీపనగరీ
జడానాం చైతన్య స్తబక మకరంద స్రుతి ఝరీ I
దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ
నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి II 3 II

తాత్పర్యముః అమ్మా! నీ పాదధూళి ఎంత మహిమాన్వితమైనది అంటే - ఊహాత్మకముగా సముద్రగర్భములో ఉన్న ఒక ద్వీపనగరము ఉండి, అందులోంచి పైకి అప్పుడే ఉదయిస్తున్నట్లు కనబడు సూర్యభగవానుని కిరణములు ఏ విధంగా చీకట్లను పారద్రోలునో అలా, నీ యొక్క (అంటే అమ్మవారి) చరణకమలములనంటిన పాదధూళి మహిమ, మాలోని అజ్ఞానమును (అవిద్యను) నశింపచేయును. అలాగే పూవుల గుత్తి నుంచి వచ్చే మధువు యొక్క ప్రవాహము వలె, చైతన్యరహితులు, మందబుద్ధులు, జడులకు, నీ పాదధూళి మహిమ వల్ల జ్ఞానము కలిగి చైతన్యవంతులౌతారు. లేమితనముతో, దరిద్రమును అనుభవించే వారి పట్ల నీపదరజస్సు చింతామణుల వరుసవలె సకల అభీష్టాలను తీర్చగలదు. సంసారసాగరంలో మునిగిన వారిని రక్షించడంలో ముర అనే రాక్షసుడిని చంపిన విష్ణువు అవతారమైన ఆదివరాహమూర్తి కోర వంటిదిమ్మా నీ పాదపద్మములను అంటిన రజస్సు !


భావార్ధముః  ఈ మూడవ శ్లోకములో కూడా అమ్మవారి పాదధూళి మహిమనే ఇంకా విపులంగా వివరించారు ఆదిశంకరులు. ఈ శ్లోకము నాలుగవపాదంలో ‘భవతి’ అనే పదాన్ని అంటే అమ్మవారి నామముగా అన్వయించుకోకుండా, ‘అయిఉన్నది’ అని అర్ధం చేసుకోవాలి. అంటే రెండవ శ్లోకములో ‘తనీయాంసం పాంశుం తవచరణ పఞ్కేరుహభవం’ అని అమ్మవారి యొక్క పాదధూళియే ఇందులో శ్లోకమునకు కూడా ప్రథాన విషయముగా (subject) అర్ధం చేసుకోవాలి.
ఈ శ్లోకంలో ఏ స్థాయిలో ఉన్నవారినైనా అమ్మవారి పాదధూళి ఏవిధంగా కామ్యార్ధములను ప్రసాదించి, గొప్ప తేజస్సుని ఇచ్చి, జ్ఞానాన్ని ఇచ్చి, చివరికి జననమరణ సంసార చక్రం నుండి పైకి లేపి మోక్షం వైపు తీసుకువెళ్ళగలదో చెప్తున్నారు శంకరులు. ఇందులో సాధారణంగా మనందరికీ ఉండే సమస్యలను నాలుగు రకాల భూమికలలో ప్రతిపాదించారు. ఒకటి – అవిద్య/అజ్ఞానము, రెండవది – జడత్వం, మూడవది – దరిద్రం, నాలుగవది – సంసారమగ్నత.

ఈ నాలుగు రకాల సమస్యల నుండీ అమ్మవారి పాదధూళి ఎలా రక్షిస్తుందో నాలు ఉపమానాలు వేసి చెప్పారు శంకరులు. ఆ ఉపమానాలు వరుసగా….
1.     అవిద్య/అజ్ఞానానికి à మిహిరద్వీపనగరము
2.     జడులు/చైతన్యరహితులకు à చైతన్యవంతమైన పూవుల మకరంద స్రుతి ఝరీ
3.     దరిద్రమునకు à చింతామణుల వరుస
4.     సంసారమగ్నులకు à ఆదివరాహమూర్తి కోర వంటిది.

ఇందులో ఒక్కో అంశాన్ని బాగా పరిశీలన చేద్దాం. అవిద్య అంటే లౌకికమైన అక్షరాస్యత లేకపోవడం కాదు. మనం చదివే లౌకిక చదువులను కూడా మర్యాదకోసం విద్య అని అంటాము కానీ, మన ఈ లౌకిక చదువులు అసలు విద్య కానేకాదు. ఇవన్నీ కడుపు నింపడం కోసం నేర్చుకునే కొన్ని గారడీలు అంతే. మరి విద్య అంటే ఏమిటి? ఏది తెలుసుకుంటే ఇక ఏమీ తెలుసుకోవలసిన అవసరం ఉండదో అది జ్ఞానము/విద్య. అది లేకపోవడమే అజ్ఞానము/అవిద్య. ఇలా అజ్ఞానములో ఉన్నవారి కొరకు అమ్మవారు మిహిరద్వీపనగరి వంటిది. మిహిర అంటే ద్వాదశాదిత్యులుగా చెప్తారు అవి వరుసగా – ధాత, మిత్ర, అర్యముడు, రుద్ర, వరుణ, సూర్య, భగ, వివస్వత, పూషా, సవితృ, త్వష్ట మరియు విష్ణు.

ద్వీపనగరి అంటే ఈ పన్నెండు మంది సూర్యులు సముద్రగర్భంలో ఒక నగరంలో కొలువై ఉండి, అవి అన్నీ ఒక్కసారి ఉదయించే దృశ్యం ఎలా ఉంటుందో ఊహాత్మకముగా దానిని ‘ద్వీపనగరి’ అని సంబోధించారు శంకరాచార్యులవారు. అటువంటి ద్వీపనగరంలోంచి వచ్చిన సూర్యకాంతి ఎలాగైతే మూలమూలలలో ఉన్న చీకట్లను ఎలా పారద్రోలి వెలుగుని నింపుతుందో, అలా అమ్మవారి పాదధూళి ఎంత శక్తివంతమైనది అంటే, కొన్ని కోట్ల కోట్ల కోట్ల జన్మల తరబడి మనలో నిండిన అజ్ఞానము అనే చీకట్లను తొలగించివేస్తుంది.

    

​ 
ఇలాంటి దృశ్యం కన్యాకుమారిలో సముద్రం దగ్గర సూర్యోదయం చూస్తే బాగా అర్ధం అవుతుంది. నిజానికి సూర్యభగవానుడు అంతరిక్షంలో ఎప్పుడూ ఉదయిస్తూనే ఉంటాడు. ఆయనకి సూర్యోదయ సూర్యాస్తమయాలు అనేవి ఉండవు. కానీ భూమి నిరంతరం తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం వలన మరియు భూమి గోళాకారంలో ఉండడం వలన మనకి పగలు, రాత్రి అనేవి ఏర్పడుతున్నాయి. భూమి మీద నుంచి సముద్రం ఒడ్డు దగ్గర నుంచి సూర్యోదయం చూస్తే అప్పుడే ఉదయించే బాలసూర్యుడు ఏ రంగులో కనిపిస్తాడో, అది అమ్మవారు. అందుకే ఎప్పుడూ అమ్మవారు ఎరుపు ఎరుపు అని చెప్తారు పూజ్య గురువు గారు. సూర్యోదయ అరుణకాంతి ఒక్కసారి పడిందా అప్పటి వరకు ఉన్న చీకటి మాయం అయిపోయి, అంతా ఆ ఎర్రని కాంతి వ్యాపిస్తుంది. అలా, అజ్ఞానంలో పడి ఉన్నవారికి అమ్మవారి పాదధూళిని శిరస్సుపై వేసుకున్న మాత్రాన, అమ్మవారు జ్ఞానమును ప్రకాశింపచేస్తారు. పూజ్య గురువు గారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు లలితా సహస్రనామస్తోత్ర ప్రవచనంలో చెప్పారు, ఎవరికి ఇలా ధ్యానములో ఆ ఎరుపు కాంతి కనబడుతుందో, అమ్మవారి అనుగ్రహం కలిగింది అని గుర్తు. లలితాసహస్రనామస్తోత్రంలో ఈ విషయాన్నే వ్యాసుల వారు ‘ఉద్యద్భానుసహస్రాభా’ అనే నామంతో వర్ణించారు.

ఇక రెండవ సమస్య - జడత్వం. అంటే దేనికీ స్పందించకపోవడం. ఈ జడత్వం దేనికి ఉంటుంది? మనసుకి. మనస్సుకి జడత్వం లేకపోతే ఏ పని చెయ్యడానికీ ఉత్సాహం ఉండదు. మనసుకి ఆ జడత్వం పోయి జవం/బలం కలిగి ఉత్సాహం పొందాలంటే అమ్మవారి పాదధూళియే శరణ్యం. అమ్మవారి పాదధూళి ఒక్కసారి మనపై పడిందా అది ‘చైతన్యస్తబక మకరంద స్రుతి ఝరి’ అవుతుంది అని చెప్పారు శంకరులు. స్తబకము అంటే పూవుల గుర్తి. చైతన్య స్తబక అంటే చైతన్యము కలిగిన పుష్పముల గుర్తి అని. అంటే ఎవరు అమ్మవారి పాదధూళిని శిరస్సుపై వేసుకుంటారో వారి మనస్సు జడత్వం కోల్పోయి చైతన్యం పొంది, ఆ చైతన్యం పొందిన మనసే పుష్పమై అందులో ఎప్పుడూ మకరందం (తేనె)/మంచి భావములు స్రవించే ప్రవాహమై ఉంటుంది.

ఈ విషయాన్నే వ్యాసుల వారు లలితాసహస్రంలో ‘చైతన్యార్ఘ్యసమారాధ్యా’, ‘చైతన్యకుసుమప్రియా’ అనే నామాలతో వివరించారు. చైతన్య పుష్పాలచే అర్చింపబడడం అమ్మవారికి ప్రీతికరము. చైతన్యముతో కూడిన పుష్పములంటే ఇష్టమైనది, చైతన్య పుష్పములచే అర్చింపబడుట అమ్మవారికి ప్రాతి. సాధారణంగా పుష్పాలకు మంచి అందం, సువాసన, మకరందం, మృదుత్వము, మాధుర్యము ఇవన్నీ ఉంటాయి. కానీ చైతన్యము కూడా కలిగిన పుష్పము ఒక్క మన మనస్సే. దీనినే హృత్పద్మం అని సంబోధించారు శంకరులు శివానందలహరిలో.

గభీరే కాసారే విశతి విజనే ఘోరవిపినే
విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధం జడమతిః
సమర్ప్యైకం చేతస్సరసిజం ఉమానాథ భవతే
సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో II9
వటుర్వా గేహీవా యతి రపి జటీ వా తదితరో
నరో వా యః కశ్చిద్భవతు భవ కిం తే న భవతి
యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే
తదీయస్త్వం శంభో భవసి భవ భారం చ వహసి II11

పైన ‘గభీరే కాసారే’ అనే శ్లోకంలో శంకరులు అన్నారు --- “ఓ పశుపతీ! స్వామీ! నీకు పూజ చేయడం కోసం అని లోతైన సరస్సులలో దిగి తామరపువ్వులు తెస్తున్నారు, అడవులలోకి వెళ్ళి మారేడు పత్రాలు బస్తాలకొద్దీ తెస్తున్నారు! అలాగే కొండలూ కోనలూ తిరిగి కుసుమాలు తెస్తున్నారు! కానీ ఉమానాథా! ఈ జనులు వాళ్ళ మనస్సనే పుష్పాన్ని నీకు సమర్పిస్తే అన్నిటికన్నా నీవు ఎక్కువ సంతోషిస్తావు అని ఎందుకు తెలుసుకోలేకపోతునారు స్వామీ?
అలాగే వటుర్వా గేహీవా అనే రెండవ శ్లోకంలో శంకరులు అంటారు “నీవు బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్న వటువివా? లేక గృహస్థువా లేక జటలు ధరించిన సన్యాసాశ్రమంలో ఉన్న యతివా లేక మరెవరైనా సరే, నీ మనస్సనే పుష్పాన్ని ఉమానాథుడికి సమర్పించరా, నీ హృత్పద్మం పశుపతి అధీనంలో ఉంచావా, నీ భారాన్ని మొత్తం ఆ శంభుదేవుడే వహిస్తాడు రా”.
అంటే అమ్మవారికి/అయ్యవారికి చైతన్యకుసుమాలంటే ఇష్టం. కాబట్టి మన మనస్సులు చైతన్యం పొంది, అలా చైతన్యం పొందిన హృత్పద్మంతో పరమేశ్వరుడిని అర్చించాలి అంటే మన జడత్వం పోవాలి, అది ఒక్క అమ్మవారి పాదపద్మములనంటిన పరాగముమాత్రమే చేయగలదు. జడత్వం పోవాలంటే అమ్మవారి పాదధూళి, అలాగే హనుమ పాదములు పట్టుకున్నా, మనకున్న జడత్వం పోతుంది – “బుద్ధిర్బలం నిర్భయత్వమరోగతాః అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్” అని చెప్తారు కదా!!

మూడవ సమస్య – దరిద్రం. సరే, ఇంతవరకు బావుందండీ, కానీ మాకు పూర్వ కర్మఫలం వల్ల దరిద్రం అనుభవిస్తున్నాము, ముందు ఈ దరిద్రం పోతే కదా, అప్పుడు జ్ఞానం గురించి అయినా, మోక్షం గురించి అయినా ఆలోచించగలిగేది అని అనుకుంటారా? అయినా ఏమీ భయం లేదు. ఎవరికి లేమితనం ఉంటుందో, వారికి అమ్మవారి పదరజస్సు చింతామణుల వరుస వంటిది. దరిద్రము/లేమితనము అంటే కేవలం ధనము లేకపోవడం ఒక్కటే కాదు. ఆరోగ్యం, భౌతికమైన ఐశ్వర్యము, సంతానము, బంధు మిత్రులు, యశస్సు, ఉన్నది అనుభవించలేకపోవడం వగైరా వీటిలో ఏది లేకపోయినా దరిద్రమే. ఒక్క చింతామణి ఉంటేనే ఏ కోర్కెలైనా తీరుతాయి. అలాంటిది చింతామణి గుణనికా అని చెప్పారు శంకరులు. అంటే ‘Multiples of Chintamani’ అని. ఎన్ని చింతామణులు అని చూస్తే, ‘గుణనికా’ అనే పదాన్ని సంఖ్యలలోకి మారిస్తే …
గు                ణ                 ని                కా
3                 5                 0                 1
నాలుగు సంఖ్యలను కలిపి చదివితే 3501. కానీ సంస్కృతములో కుడి నుంచి ఎడమకి సంఖ్యలను చెప్తారు. అందుకే 108 నామాలు చెప్పడానికి అష్టోత్తరశతనామస్తోత్రం అంటారు. అలాగే గుణనికా అంటే 1053 అనే సంఖ్య వస్తుంది.
అమ్మవారి పాదధూళి దరిద్రులకు 1053 చింతామణుల మాలయై, వారికి ఇహమునందు కావలసిన వన్నీ సమకూర్చగలదు అని అర్ధం. లలితాసహస్రంలో అమ్మావారి నామాలను 1053 నామాలుగా విడదీసి ‘గుణనికా’ అని వ్యాఖ్యానం చేశారు. ఇట్టి గుణనికా వ్యాఖ్యానాన్ని ‘కళ్యాణ శ్రీకళ’ అనే పేరుతో శ్రీశ్రీశ్రీ కళ్యానానంద భారతీ మాంతాచార్య మహాస్వామి వారు ఇతఃపూర్వం వ్రాసి ఉన్నారు. ఒక్క చింతామణి ఉంటేనే, మనకి తీరని కోర్కెలు ఉండవు. అలాంటిది చింతామణి గుణనికా అని శంకరులు చెప్పడంలో అర్ధం, సకల లోకాలలో ఉన్న అన్ని జీవులకి కావలసిన కోర్కెలను అనంతముగా కటాక్షించగల అనంతమైన శక్తి అమ్మవారికి ఉంది. లలితాసహస్రంలో ‘చింతామణి గృహాంతస్థా’ అనే నామంతో అనుసంధానం చేసుకోవచ్చు.

ఇక నాలుగవ సమస్య – సంసారమగ్నత. పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఈ భూమి మొత్తాన్ని చాప కిందచుట్టి సముద్రగర్భంలో దాచేస్తే, అప్పుడు శ్రీమహావిష్ణువు ఆదివరాహమూర్తిగా అవతరించి ఆయన యొక్క కోరతో సముద్రంలో మునిగి ఉన్న భూమిని పైకి లేపి రక్షించారు. అలా, ఎవరైతే జననమరణచక్రంలో పడి కొట్టుకుంటూ, పైకి లేవలేక, నిరంతర సంసారమగ్నులై ఉంటారో, వారిని అమ్మవారి పాదధూళి ఆదివరాహ మూర్తి కోర వలే పైకి లేపి, ఇక మళ్ళీ జన్మలు ఎత్తవలసిన అవసరంలేకుండా మోక్షాన్ని కటాక్షిస్తుంది. ఈ అర్ధాన్ని లలితా సహస్రనామస్తోత్రంలో ‘సంసారపంకనిర్మగ్నసముద్ధరణపండితా’, ‘జన్మమృత్యుజరాతప్తజనవిశ్రాంతిదాయినీ’ అనే నామములతో అనుసంధానం చేసుకోవచ్చు.

కామేశ్వరసూరి వ్యాఖ్యానము ప్రకారము త్రిపురార్ణవములో వర్ణింపబడిన ‘త్రయీమయీ విద్య’గా పేర్కొనబడిన వాగ్భవ-కామరాజ-శక్తి బీజములలో మొదటిదైన వాగ్భవ బీజం మరియు కామరాజ బీజము సౌందర్యలహరలోని ఈ మూడవ శ్లోకములో నిగూఢంగా ఇచ్చారు శంకరులు. అంటే ఈ శ్లోకాన్ని బాగా అనుష్టానం చేస్తే, గొప్ప పండితులు, వేదవేత్తలు అవ్వడమే కాక, సకల ఐశ్వర్యాలని కూడా అమ్మవారు కటాక్షిస్తారు.



ఈ శ్లోకం భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తే వేదవేత్త, గొప్ప పండితులు అవుతారని మరియు ఐశ్వర్యము కావలసిన వారికి ఐశ్వర్యము, మనోజవం కావలసిన చైతన్యవంతులు, ఉత్సాహవంతులు అయి చేపట్టే అన్నికార్యములలోనూ జయం లభిస్తుంది అని పెద్దల వ్యాఖ్యానము. అంతేగాక అమ్మవారి అనుగ్రహంతో ధర్మ, అర్ధ, కామ, మోక్షములు అనే నాలుగు పురుషార్ధాలనూ పొందగలరు.

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి