శ్రీ గురుభ్యో నమః
II కామాక్షీ సౌందర్యలహరి – 2వ శ్లోకము - అమ్మవారి పాదధూళి మహిమ II
ఈ శ్లోకాన్ని ప్రతీ రోజూ భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తే సర్వలోకవశ్యము
సిద్ధిస్తుంది. సర్వలోకవశ్యము అనగా మన మనస్సే ఒక లోకం, ఇందులో ఇంద్రియములు నిరంతరం
మనల్ని భోగాలవైపు లాగుతూ ఉంటాయి, అలాగే కామక్రోధాది అరిషడ్వర్గములు నిరంతరము మన మనస్సుని
ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఈ శ్లోకం పునశ్చరణ చేయడం ద్వారా మనలోని ఇంద్రియముల తాకిడి
తగ్గి, మనం ఏ పరబ్రహ్మం నుండి విడివడి ఈ శరీరమే నేను అనే భ్రాంతిలో కొట్టుకుంటున్నామో
ఆ భ్రాంతి తగ్గి, అమ్మవారి పాదములను శరణవేడే బుద్ధిప్రచోదనం కలగడమే ‘సర్వలోకవశ్యము’
అని పెద్దల వ్యాఖ్యానము.
సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు
II కామాక్షీ సౌందర్యలహరి – 2వ శ్లోకము - అమ్మవారి పాదధూళి మహిమ II
తనీయాంసం పాంశుం తవచరణ పఙ్కేరుహభవమ్
విరిఞ్చి స్సంచిన్వన్ విరచయతి లోకానవికలమ్ I
వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం
హరః సంక్షుద్యైనం భజతి భసితోద్ధూళనవిధిమ్ II 2 II
తాత్పర్యముః అమ్మా! నీ పాదపద్మములనంటిన లేశమాత్ర ధూళిని గ్రహించి బ్రహ్మ
ఈ లోకాలన్నింటినీ ఏ విధమైన లోపములు లేకుండా సృష్ఠి చేయగలుగుతున్నాడు. అలాగే శ్రీమహావిష్ణువు
కూడా నీపాదపద్మముల నంటిన లేశమాత్ర ధూళిని గ్రహించి ఆదిశేషుడి సహాయంతో ఈ లోకాలన్నిటినీ
అతికష్టం మీద మోయుచున్నాడు. నీపాద ధూళి మహిమచే సృష్ఠింపబడిన ఈ లోకాలన్నిటినీ హరుడు
(శివుడు) బాగా మెదిపి, ఆయన ఒళ్ళంతా విభూతిగా పూసుకొంటున్నాడు.
భావార్ధముః మొదటి
శ్లోకములో హరి హర విరించాదులు సైతం అమ్మవారిని పూజిస్తారు అనే భావాన్ని ఈ రెండవ శ్లోకములో
మరింత విపులంగా చెప్పారు శంకరులు. లోకంలో త్రిమూర్తులుగా ఆరాధింపబడే బ్రహ్మ, విష్ణు,
మహేశ్వరులు సృష్టి స్థితి లయములు చేయగలుగుతున్నారు అంటే అది అమ్మవారి యొక్క పాదధూళి
మహిమయే. ఇక్కడ ఈ శ్లోకార్ధం రెండు కోణాలలో అర్ధం చేసుకోవచ్చు.
మొదటి కోణంలో అమ్మవారి పాదధూళియే త్రిమూర్తులకు
ముడిపదార్ధం – సృష్టి నిర్మాణపరంగా
అమ్మవారి
పాదపద్మములను అంటిన లేశమాత్ర ధూళిని (తనీయాంసం పాంశుం) గైకొని బ్రహ్మ గారు పదునాలుగు
లోకాలను సృష్టి చేయగలిగారు. అంటే మనకు కనబడే ఈ మొత్తం జగత్తంతా అమ్మవారి పాదపద్మరేణువు
నుండీ వచ్చింది అని అర్ధం. ఇందులో అమ్మవారి మూలప్రకృతి తత్త్వాన్ని వివరించారు. జగత్తు
అంటే, కేవలం మనం ఉండే ఈ భూలోకం ఒక్కటే కాదు. భూ లోకం ఆపైన భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం,
జనలోకం, తపోలోకం, సత్యలోకం మొత్తం ఏడు ఊర్ధ్వ లోకాలు. అలాగే, అతల, వితల, సుతల, రసాతల,
తలాతల, పాతాళ అని అథో లోకాలు ఏడు మొత్తం కలిపి పద్నాలుగు లోకములు.
దీనిలో
భౌతికశాస్త్రపరమైన రహస్యం దాగి ఉంది. పదార్ధం యొక్క నిర్మాణం అణువులతోనూ, ఇంకా లోపల
చూస్తే పరమాణువులతోనూ, ఇంకా చిన్న స్థాయిలో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ లతోనూ
కూడి ఉంటుంది అని మనం చదువుకుని ఉంటాము. అంటే సకల జగత్తు ఒక చిన్న పరమాణువు కన్నా సూక్ష్మ
కణంలోంచి ఆవిర్భవించింది. అమ్మవారి యొక్క పాదములను అంటిన లేశమాత్ర కణమే ఇన్ని లోకాలని
సృజించగలిగితే, ఇక అమ్మవారి శక్తి ఎంతటిదో మన ఊహకి కూడా అందదు.
విజ్ఞానశాస్త్ర
ప్రకారం ఈ శ్లోకాన్ని అన్వయించుకుంటే, బ్రహ్మగారు సృష్టి చేయడం అంటే విశ్లేషణ
(Analysis), మూలకణములలోని ప్రోటాన్ గా భావించవచ్చు. అలాగే స్థితికారకుడు విష్ణువు అంటే
Equilibrium, మూలకణములలోని న్యూట్రాన్ గా భావించవచ్చు. లయకారుడు హరుడు అంటే సంశ్లేషణ
(Synthesis), మూలకణములలోని ఎలక్ట్రాన్ గా భావించవచ్చు.
ఇక్కడ,
జగత్తు యొక్క నిర్మాణం జరగడానికి మూలప్రకృతి అయిన అమ్మవారి నుండే సకల లోకాలు వచ్చాయి
అని అర్ధం చేసుకోవచ్చు. అంటే, అమ్మవారి పరమాణువు మాత్ర పాదధూళి (తనీయాంసం పాంశుం) నుంచి
అంతరిక్షములో ఉన్న గలాక్సీలు, సకల నక్షత్రాలు, గ్రహమండలాలు అన్నీ వచ్చాయి అన్నమాట.
బహుశా దీనినే ఇప్పటి శాస్త్రవేత్తలు బిగ్ బ్యాంగ్ థియరీ గా చెప్తున్నారు అని నాకనిపిస్తుంది.
బ్రహ్మగారు
ఈ లోకాలన్నిటినీ ఎటువంటి లోపములు లేకుండా సృష్టి చేస్తున్నారు (విరచయతి లోకానవికలమ్)
అంటే దానర్ధం హరుడు ఈ లోకాలను లయం చేసే వరకు నిలిచే సామర్ధ్యం కలిగిఉన్న సృష్ఠిచేసే
నైపుణ్యం అని.
అలాగే
శౌరి అనగా శూరసేనుడి వంశమునందు పుట్టినవాడు విష్ణువు – ఇది విష్ణు సహస్రనామాలలో ఒక
నామం. శ్రీమహావిష్ణువు స్థితికారకుడిగా ఆదిశేషుడి సహాయంతో, వేయిపడగలతో ఈ లోకాలను ఎలాగోలా
అతికష్టం మీద మోయుచున్నాడు. ఎందుకని కష్టంమీద అని శంకరులు అన్నారు అంటే, భూమి సూర్యుని
చుట్టూ తిరిగేటప్పుడు నిలువుగా ఉండి తిరగదు, ఒకసారి కర్కటరేఖవైపు, మరోసారి మకరరేఖవైపు
వంగి తిరుగుతుంది. దీనివల్లనే, భూమి మీద ఋతుధర్మములు వర్ధిల్లి, సకలజీవకోటికి కావలసినవి
అన్ని సమకూరుతున్నాయి. ఈ పదునాలుగు లోకాలలోనూ భూమి నుంచి పైన ఉన్న ఏడు లోకాలకు విష్ణువు
మరియు భూమికి క్రింద ఉన్న ఏడు లోకాలకు విష్ణు శక్తితో శింశిమారుడు స్థితికారకుడిగా
ఉన్నారు.
అలాగే
హరుడు, ఈ లోకాలన్నిటిని అంత్యమున (అంటే ఆయా యుగాంతములలో), బాగా మెదిపి భస్మంగా చేసి,
ఆయన వంటికి విభూతిగా పూసుకొనుచున్నాడు అని. హరుడు లయకారుడు కానీ వినాశకారుడు కాదు.
లయం అనగా లీనమగుట. నిద్రాస్థితిలో మన అస్థిత్వమును కోల్పోయి ఎలా ఉంటామో, అలాగే హరుడు
ప్రళయం రూపంలో ఈ లోకాలన్నిటినీ మెదిపి, ఒక విభూతి పండులా చేసి, దాన్ని వంటికి పూసుకొంటాడు.
తిరిగి మళ్ళీ సృష్ఠి చేసినప్పుడు, సకల జీవులు తిరిగి వారి వారి కర్మ ప్ఫలమును అనుభవించడానికి
జన్మ ఎత్తుతాయి.
ఈ విధంగా
బ్రహ్మ విష్ణు హరులు వారి వారి కర్తవ్యములను నెరవేర్చి, లోకంలో త్రిమూర్తులుగా ప్రసిద్ధి
చెందారు అంటే అది కేవలం అమ్మవారి పాదధూళి మహిమ మాత్రమే.
రెండవ కోణంలో అమ్మవారి పాదధూళిని గైకొన్న త్రిమూర్తుల
వైభవం – అమ్మ పాదధూళి మహిమ:
అమ్మవారి
పదరజస్సు శిరస్సు మీద వేసుకొని, త్రిమూర్తులు సృష్టి స్థితి లయములు చేసి, లోక పూజ్యులు
అవుతున్నారు. ఇక్కడ అమ్మవారి పాదశూళి యొక్క మహిమను పదార్ధ నిర్మాణ స్థాయిలో కాకుండా,
అమ్మ యొక్క పదరజస్సు యొక్క మాహాత్మ్యం (పారమార్ధిక/ఆధ్యాత్మిక స్థాయిలో) ఆలోచిస్తే,
అమ్మవారి పదరజస్సు ఎంత శక్తివంతమైనదో మనకు అవగతమవుతుంది.
మన సనాతన
ధర్మమునందు గురువు యొక్క మరియు భగవంతుడి యొక్క పాదములను ఆరాధిస్తూ ఉంటాము. ఉదాహరణకి
కంచికామకోటి పీఠాధిపతులు నడిచే దేవుడిగా పేర్గాంచిన చంద్రశేఖర పరమాచార్య మహాస్వామి
వారి పాదపద్మములు ఎంత పూజనీయమో, వారు నడిచి వెళ్ళిన ప్రదేశము ఎంత పవిత్రమై, శక్తివంతమై,
పరమాచార్య స్వామి నడిచి వెళ్ళినచోట పడిఉన్న ఒక్క పరాగాన్ని మన శిరస్సు మీద వేసుకున్నంతమాత్రాన,
మనల్ని ఆ శక్తి ఎలా రక్షిస్తుందో, పరమాచార్య స్వామి వారి భక్తుల అనుభవాల్లో మనం వినిఉంటాము.
పరమాచార్యస్వామి వారి పాదపద్మములకు, ఆ పాదములనంటిన ధూళికి సైతం అంత శక్తి ఎక్కడి నుంచి
వచ్చింది – ఆయన పట్టుకున్న ధర్మము, తపశ్శక్తి వలన కదా!! అలాగే శ్రీరామాయణంలో రాముడి
పాదుకలు సింహాసనం మీద ఉంచి, భరతుడు పద్నాలుగేళ్ళు అయోధ్యని పాలించాడు. అలాగే శ్రీవిద్యాసాంప్రదాయంలో
గురుపాదుకలు అత్యంత శక్తివంతము మరియు పూజనీయమై, నిత్య ఆరాధనలో మృగముద్ర పట్టి శిరస్సు
మీద గురుపాదుకలను ఉంచినట్లుగా స్మరించి గురువు గారి పాదపద్మములకు నమస్కరిస్తాము. మొత్తం
శరీరంలో ఒక్క పాదములకే ఎందుకు ఇంత ప్రాధాన్యత వచ్చింది? మన ఇంటికి ఎవరైనా పూజ్యులు/పెద్దలు
వచ్చారనుకోండి, వారికి పాదపూజ చేస్తాము తప్ప, ప్రత్యక్షంగా శిరస్సుకో, చేతులకో పూజ
చేయము. దీనికి కారణం మన శరీరంలోని నాడీమండలము, గ్రంధులు, మెదడు అన్నీ పాదములతో అనుసంధానం
అయి ఉంటాయి. పూజనీయులు, తపస్సంపన్నులు అయిన గురువుల యొక్క శక్తి అంతా వారి పదకమలముల
యందు కేంద్రీకృతమై ఉంటుంది. అటువంటి పవిత్రమైన పాదములను భక్తుడు/శిష్యుడు తాకినప్పుడు
ఆ శక్తి వారిని రక్షిస్తుంది. కరచరణాదులతో మనం చూడగలిగే గురువుల యొక్క చరణాంబుజములకే
అంత శక్తి ఉంటే, ఇక అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అయిన జగదంబిక యొక్క పదరజస్సు
యొక్క శక్తి ఎంతటిదో ఊహచేయడం ఈ లోకంలో ఎవ్వరికీ సాధ్యం కాదేమో కదా!!
అంత శక్తివంతము
కదా అమ్మవారి పదరజస్సు, మరి కరచరణాదులతో మన ఈ మాంస నేత్రముతో అమ్మవారి యొక్క పాదపద్మములను
మనం ఎప్పుడైనా చూడగలిగి కాదు కాదు చూస్తాము … అలా అమ్మ మన ఎదుట కనబడినపుడు..
“ప్రాతఃస్మరామి లలితా చరణారవిందం భక్తేష్టదాన
నిరతం భవసింధుపోతం
పద్మాసనాది సురనాయక పూజనీయం పద్మాంకుశధ్వజ సుదర్శన
లాంఛనాఢ్యం” ….
అంటూ అమ్మపాదపద్మములకు నమస్కరించి, అమ్మవారి పాదపద్మములను
అర్చించి, అమ్మవారి పాదములను కడిగిన అభిషేకజలాన్ని మన శిరస్సు మీద ప్రోక్షించుకుని,
ఆ దివ్యమైన అమ్మ పాదములకు మన శిరస్సు తాకించి నమస్కరించి, అప్పుడు అమ్మవారి పాదములకు
అంటిన లత్తుక వాసన యొక్క దివ్యసుగంధపరిమళం వస్తూ, అప్పుడే అమ్మవారి చరణకమలములను దేవతాపుష్పములతో
పూజ చేసినటువంటి సువాసన వస్తూ, అమ్మవారి పాదములకు ఉన్న పారాణి ఎరుపు, అమ్మవారు పాదములకు
పెట్టుకున్న మంజీరముల కాంతిని చూస్తూ, అమ్మకి నమస్కరిస్తే, ‘అమ్మా ఒక్కసారి
నీ పాదములను నా శిరస్సు మీద పెట్టుకుంటానమ్మా అని ప్రార్ధిస్తే, అమ్మవారు అవ్యాజకరుణామూర్తి
కదా, వెంటనే మన యందు కారుణ్యంతో అలాగే నాన్నా అని అమ్మ నవ్వుతూ మనవంక చూస్తే, అప్పుడు
అమ్మవారి పాదపద్మములను రెండిటినీ మన అరచేతిలోకి తీసుకుని, ఒక్కసారి కళ్లకి అద్దుకుని,
అప్పుడు అమ్మవారి రెండు పాదములను ఒక్కసారి మన శిరస్సు మీద మోపితే, పరమ పూజ్యము పవిత్రము
శక్తివంతము అయిన, సుతిమెత్తని అమ్మవారి పాదముల స్పర్శ మన శిరస్సుని తాకితే, అప్పుడు
మనం ఎటువంటి దివ్యానుభూతి పొందుతామో కదా, అటువంటి అదృష్టం నాకెప్పుడు కలుగుతుందో! రైలు
ప్రయాణములో ప్రక్కనే వెళ్తున్న మరొక రైలు యొక్క పెద్ద ధ్వనికి భయపడిన చంటిపిల్లవాడిని
దగ్గరకి లాక్కుని గట్టిగా హత్తుకొని కొండంత ధైర్యాన్నిచ్చిన అమ్మలా, జనన మరణ చక్రములో
కొట్టుమిట్టాడుతూ, నిరంతరమూ మృత్యు భయముతోనూ, లేనిది రాదేమో, ఉన్నది పోతుందేమో అనే
భ్రాంతిలోపడి నలిగిపోతున్న నన్ను కూడా ఆ కామాక్షీ అమ్మవారి అనుగ్రహంతో అమ్మ యొక్క చరణకమలములకు
నా శిరస్సుతాకించిన మాత్రాన, నాకున్న సకలభయాలు పోయి, సుధాసారాభివర్షిణీ అయిన అటువంటి
పరమానందస్థితిని అమ్మ యొక్క పాదస్పర్శ ద్వారా ఎప్పుడు పొందుతానో కదా !!
ఇతఃపూర్వం
ఎవరైనా ఇలా కరచరణాదులతో ఉన్న అమ్మవారి దర్శనం పొంది, అమ్మ పాదపద్మములకు నమస్కరించే
అదృష్టాన్ని పొందారా? అని మనకి సందేహం రావచ్చు. ఎందుకు లేరు? మన స్వామి హనుమయే ప్రత్యక్ష
ఉదాహరణ. సాక్షాత్తు లలితా పరాభట్టారికా స్వరూపమైన సీతమ్మ తల్లి యొక్క దర్శనం పొందాక,
ఆపైన అమ్మవారి యొక్క శిరోభూషణము (అభిజ్ఞానము) స్వీకరించిన తర్వాత, స్వామి హనుమ ఎంత
శక్తివంతమైనదీ శ్రీరామాయణం సుందరకాండ చదివిన విన్న అందరికీ తెలుసుకదా! అమ్మ దగ్గర నుంచి
ఆభరణం తీసుకున్న తర్వాత స్వామి హనుమ చేసిన రాక్షస సంహారమూ, జయమంత్ర ఘోష, అమ్మని చూడని
క్రితం రావణాసురుడి తేజస్సుని చూసి ఒకింత చెట్టుచాటుకి ఒరిగిన స్వామి, అమ్మ ఇచ్చిన
అభిజ్ఞానము స్వీకరించిన తర్వాత, ఏకంగా రావణుడి సభలోకి వెళ్ళి, వాడికి నాలుగు మంచి మాటలు
చెప్తానని హనుమ ప్రదర్శించిన వీరోచితమైన కృత్యములు… ఇవన్నీ తలచుకుంటే ఆ ఆఖ్యానము విన్న
మనకే ఎంతో ధైర్యం వచ్చేస్తుంది. సీతమ్మతల్లి అనుగ్రహం లభించడం వల్లనే కదా, హనుమ భవిష్యద్బ్రహ్మ
అయ్యి, కథా పరంగా సీతారాములను కలిపినది హనుమయే అన్న శాశ్వత కీర్తిని గడించారు (కథాపరంగా
అని ఎందుకు వ్రాశానంటే నిజానికి సీతారాములు ఇద్దరూ ఎప్పుడూ ఒక్కటే, వారు ఇద్దరూ వేరు
వేరు అనుకుని సీతమ్మతో అనకూడని మాటలు అని మృత్యువు కొనితెచ్చుకున్నాడు రావణుడు. ఇదే
మన స్వామి హనుమకి సీతమ్మలో రాముడు కనబడ్డాడు. ప్రకృతి-పురుష, శివఃశక్త్యా, సీతా-రామ,
లక్ష్మీ-నారాయణ ఇలా ఏ నామంతో చెప్పినా అమ్మ-అయ్యలు అభేదం)
కాబట్టి,
అమ్మవారి యొక్క పాదములనంటిన రజస్సుకి ఎంతటి శక్తి ఉంటుందో సృష్టి నిర్మాణ పరంగానూ
(Speck of Dust from the Lotus feet of Kamakshi i.e., Atoms to the Whole
Universe) మరియు అమ్మవారి యొక్క పాదధూళి యొక్క మాహాత్మ్యాన్ని కూడా చెప్పి
(Parashakti is both transcendental and empirical), అటువంటి అమ్మవారి పాదములను మనం
ధ్యానం చేసి, అమ్మపాదధూళిని మనం కూడా మన శిరస్సుమీద వేసుకొనే అదృష్టం పొందాలని సౌందర్యలహరిలోని
ఈ రెండవ శ్లోకాన్ని మనకి కృపతో ఇచ్చారు ఆదిశంకర భగవత్పాదాచార్యులవారు.
ఈ శ్లోకాన్ని
లలితాసహస్రనామస్తోత్రంలోని ‘శృతిసీమంతసింధూరీకృతపాదాబ్జధూళికా’, ‘సృష్టికర్త్రీ’,
‘బ్రహ్మరూపా’, ‘గోప్త్రీ’, ‘గోవిందరూపిణీ’, ‘సంహారిణీ’, ‘రుద్రరూపా’, ‘మహాప్రళయసాక్షిణీ’
అనే నామాలతో కలిపి అనుసంధానం చేసుకోవచ్చు.
సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి