13, ఫిబ్రవరి 2015, శుక్రవారం

కామాక్షీ సౌందర్యలహరి – 6వ శ్లోకము – అమ్మవారి కటాక్షమహిమ (నాల్గవ-చివరి భాగము - ఫలసృతి)

శ్రీ గురుభ్యో నమః

II కామాక్షీ సౌందర్యలహరి – 6వ శ్లోకము – అమ్మవారి కటాక్షమహిమ II (నాల్గవ-చివరి భాగము - ఫలసృతి)


ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః
వసన్తః సామన్తో మలమరుదాయోధనరథః I
తథా౽ప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపామ్
అపాఙ్గాత్తే లబ్ధ్వా జగదిద మనఙ్గో విజయతే II 6 II

అమ్మవారి అపారకరుణా కటాక్షమహిమను తెలిపే ఈ ఆరవ శ్లోకము పరమ శక్తివంతమైనది. ఈ శ్లోకమునందు  శ్రీవిద్యాసాంప్రదాయములోని బాలమంత్రములోని కామరాజబీజాన్ని ఇచ్చారు శంకరులు. పరమపవిత్రమైన ఈ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో 10,500 సార్లు పారాయణ చేస్తే సాక్షాత్తు రాజరాజేశ్వరీ అమ్మవారి దర్శనం కలుగుతుంది మరియు సంతానము లేనివారికి సత్సంతానము-సుపుత్రప్రాప్తి కలుగుతుంది అని పెద్దల వ్యాఖ్యానము. మన సనాతన ధర్మములోని గొప్ప గొప్ప విషయాలను, మన వాఙ్మయాన్ని, నేటి కాలంలో మన దేశస్థుల కంటే, విదేశీయులు విశేషమైన పరిశోధన చేశారు. జర్మనీ దేశమునకు చెందిన కొందరు ఔత్సాహికులు 1950 లలో సౌందర్యలహరి లోని ఈ ఆరవ శ్లోకం యొక్క ఫలశృతిని నిర్ధారించుకోడానికి ఒక ప్రయోగం చేశారు. ఒక సంస్కృత పండితుడి చేత ఈ శ్లోకాన్ని పఠింపచేసి, ఆ ఆడియోని ఒక టేప్ రికార్డర్లో అదే పనిగా ప్లే చేయడం ప్రారంభించారు. సరిగ్గా 10500వ సారి శ్లోకం ప్లే అవ్వగానే టేప్ రికార్డర్ పాడడం మానేసింది. ఏమి జరిగిందా అని తీసి చూస్తే, లోపల టేప్ అంతా కాలిపోయి, ఆ కాలిన టేప్ అంతా రాజరాజేశ్వరీ అమ్మవారి రూపం దాల్చి కనబడిందని, అప్పట్లో హిందూ దినపత్రికవారు ఈ వార్తని ప్రచురించారని పెద్దల వ్యాఖ్యానములో పేర్కొన్నారు.

ఇంతటి అమృతభాండమైన శ్లోకాలను సౌందర్యలహరి రూపములో మనకి భిక్షపెట్టిన జగద్గురు ఆదిశంకరాచార్యులకు మనం ఏమి ఇచ్చి ఋణము తీర్చుకోలేము. భక్తితో జగద్గురువుల పాదములకు నమస్కరించి, అమృతభాండమైన ఈ శ్లోకాలను పారాయణ చేసి, అమ్మవారి కరుణాకటాక్షవీక్షణమునకు పాత్రులమవుదాము!!

జయ జయ శంకర హర హర శంకర!!

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.

4 కామెంట్‌లు:

  1. చాలా బాగున్నాయి. ఎదురు చూస్తున్నా, మిగిలినవానికోసం.

    రిప్లయితొలగించండి
  2. ధన్యవాదములు శర్మ గారూ! మిగత శ్లోకాలు కూడా వ్రాసే పనిలో ఉన్నాను. త్వరలో పోస్ట్ చేయగలను.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మొదలు పెట్టినవారంతా మొదటి నాలుగైదు శ్లోకాలు రాసి ఆ తరవాత బద్ధకిస్తున్నారు.....ఒకరైనా పూర్తి చేయకపోతారా అని మా తపన. :)

      తొలగించండి
    2. లేదు శర్మ గారూ, కామాక్షీ అమ్మవారి అనుగ్రహంతో పూర్తిచేయాలనే నాకూ ఉంది. ఆపైన అమ్మవారి కటాక్షం.

      స్వామి హనుమ అంతటి వారికి నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై అని ప్రార్ధించాక, సీతమ్మ దర్శనం అయింది. అలాంటిది నాలాంటి పిల్లవానరానికి సౌందర్యలహరి వంటి సర్వోత్కృష్టమైన స్తోత్రం గురించి వ్రాయడానికి, అమ్మవారు ఎంత సాధన చేయించాక కుదురుతుందో..

      మీవంటి పెద్దల ఆశీస్సులు కూడా చాలా అవసరం.

      తొలగించండి