13, ఫిబ్రవరి 2015, శుక్రవారం

కామాక్షీ సౌందర్యలహరి – 6వ శ్లోకము – అమ్మవారి కటాక్షమహిమ (మూడవ భాగము)

శ్రీ గురుభ్యో నమః
II కామాక్షీ సౌందర్యలహరి – 6వ శ్లోకము – అమ్మవారి కటాక్షమహిమ II (మూడవ భాగము)


ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః
వసన్తః సామన్తో మలమరుదాయోధనరథః I
తథా౽ప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపామ్
అపాఙ్గాత్తే లబ్ధ్వా జగదిద మనఙ్గో విజయతే II 6 II

సౌందర్యలహరి 6వ శ్లోకంలో అమ్మవారి కృపని తెలియజేసే రెండు ముఖ్యమైన రహస్యాలు

ఈ శ్లోకం పారాయణ చేయడం ద్వారా అమ్మవారి యొక్క కృప ఎలా ఉంటుందో తెలియజేసే రెండు అతి ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాము. మొదటి రహస్యం - ఈ శ్లోకంలో అమ్మవారిని ‘హిమగిరిసుతే’ అని ఎందుకు సంబోధించారు శంకరులు. రెండవ రహస్యం – అమ్మవారి క్రీగంటి చూపు (అపాంగ వీక్షణము) వైభవం గురించి ఈ శ్లోకంలో ప్రస్తావించారు.

మొదటి రహస్యం – హిమగిరిసుతే అనే నామం ఎందుకు అన్నారో పరిశీలిద్దాము. అమ్మవారికి సహస్రనామాలు ఉన్నాయి. అంటే అనంతమైన నామములు కలిగినది. అన్ని నామాలు ఉండగా ‘హిమగిరిసుతే’ అని ఈ శ్లోకంలో ఎందుకు అన్నారు శంకరులు అని పరిశీలిస్తే – హిమవత్పర్వతము ఎప్పుడూ చల్లగా ఉంటుంది. హిమవంతుడి కూతురిగా వచ్చింది కదా. అంటే అమ్మవారి చల్లని చూపులు అంటే – మనలను చల్లగా చూసే తల్లి అని - భక్తులను రక్షించే తత్త్వాన్ని తెలియజేయడం. మరియు ప్రత్యేకంగా ఈ శ్లోకంలోనే ఎందుకు ఈ నామాన్ని వాడారు శంకరులు అని చూస్తే – పరమశివుడికి కామాన్ని కలిగిద్దామని ధూర్తప్రయత్నం చేసి, శివుడి మూడవ కంటి మంటకి మన్మథుడు కాలిపోయాడు కదా. దాని ఫలితముగా మన్మథుడి భార్య రతీదేవి పతివియోగ దుఃఖముతో అమ్మవారిని ప్రార్ధన చేసింది – తనకి పతిభిక్ష పెట్టమని. రతీదేవి ప్రార్ధనని మన్నించిన అమ్మవారు అపార కరుణతో మన్మథుడిని తిరిగి బ్రతికించింది. అయితే జగత్తుకే తండ్రి అయిన పరమశివుడికి కామం కలిగించే ధూర్తచేష్టితము వలన మన్మథుడు పోగొట్టుకున్న శరీరాన్ని మాత్రం అమ్మవారు ఇవ్వలేదు. రతీదేవికి పతిభిక్ష పెట్టి మన్మథుడిని తిరిగి బ్రతికించడంలో అమ్మవారి చల్లని చూపులు/రక్షకత్వము ఉన్నాయి. అందుకే ఈ శ్లోకంలో ఆ చల్లని తల్లి యొక్క రక్షకత్వాన్ని సూచించడానికే అమ్మవారిని ‘హిమగిరిసుతే’ అని సంబోధించారు శంకరులు. ఇంకొక విషయం మన్మథుడికి తిరిగి శరీరం ఇవ్వకపోవడంలో పరమశివుని ఇల్లాలుగా ఆయన గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవడంలో అమ్మవారి పాతివ్రత్యము కనబడుతుంది. (అంటే అయ్యవారు మన్మథుడిని శిక్షించడానికి ఏ శరీరాన్ని కాల్చారో, ఆ శరీరం తిరిగి ఇస్తే, అయ్యవారి యొక్క ఆజ్ఞని ధిక్కరించినట్టు అవ్వదూ… అందుకనే అమ్మవారు మన్మథుడికి శరీరం ఇవ్వకుండా అనంగుడిగా ఉండి కేవలం అతని భార్య రతీదేవికి మాత్రమే కనబడేలా అనుగ్రహించారు.) మా అమ్మ సదాశివపతివ్రతా కదా.
 
ఇంతేనా??  కాదు కాదు ఇంకా ఉంది – ఇంకో కోణంలో అర్ధం చేసుకుంటే పరబ్రహ్మస్వరూపమైన పరమశివుడికి కామం కలిగించడంలో విఫలమై శరీరాన్ని పోగొట్టుకున్న మన్మథుడి వృత్తాంతాన్ని తెలియజేస్తూనే మరొక ప్రక్క కాముడ్ని కాల్చిన పరమశివుడికి కామాన్ని కలిగించడంలో సఫలం అయ్యినది ఎవరు? హిమవంతుడి కూతురిగా వచ్చిన అమ్మవారే కదా!! హిమవంతుడి కూతురిగా వచ్చిన తర్వాతనే కదా అమ్మవారు తపస్సు చేయడం, పరమశివుడితో కళ్యాణం, ఆపైన శంకరుడికి కామాన్ని కలిగించి సుబ్రహ్మణ్యోత్పత్తి జరగడం – ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి? హిమవంతుడి కూతురిగా వచ్చిన అమ్మవారి వైభవం వల్లనే కదా. ఇదంతా సూచించడానికే ‘హిమగిరిసుతే’ అన్నారు శంకరులు.

ఈ విషయాన్నే మూకపంచశతి – కటాక్షశతకములో ఒక అద్భుతమైన శ్లోకంలో చెప్పారు మూకశంకరేంద్రులు.
          “శ్రీకామకోటి శివలోచన శోషితస్య
          శృంగారబీజ విభవ స్వపునః ప్రవాహే
          ప్రేమాంభసార్ద్రమచిరాత్ ప్రచురేణ శంకే
          కేదారమంబ తవ కేవల దృష్టిపాతమ్” II 19 II

పై శ్లోకంలో మూకశంకరులు అంటున్నారు – “శ్రీకామకోటి పీఠస్వరూపిణి అయిన ఓ కామాక్షీ అమ్మా!! శివలోచన శోషితస్య అంటే పరమశివుని కంటిచేత ఎండిపోయిన (ఆర్పివేయబడిన/నశించిన), శృంగారబీజ విభవస్య – శృంగారబీజములను కలిగించే వైభవము కలిగిన వాడు అనగా మన్మథుడు అనే బీజాన్ని, పునః ప్రవాహే – తిరిగి బ్రతికించుటలో - ప్రేమ అనే జలములచే తడిసిన నీ యొక్క కృపాకటాక్షము (దృష్టిపాతము) పొలముగా నేను భావిస్తున్నాను తల్లీ !!
 
అంటే శివుడి కంటి మంటకి ఎండిపోయిన మన్మథ బీజాన్ని తిరిగి మొలకెత్తించగలిగే పొలము ఏది – అది అత్యంత ప్రేమ అనే జలములతో బాగా తడిసిన అమ్మవారి దృష్టిపాతము అనే పొలముగా మూకశంకరులు పేర్కొన్నారు.

రెండవ రహస్యం – అమ్మవారి కడగంటి చూపు యొక్క వైభవం - అమ్మవారి యొక్క చల్లని అపాంగవీక్షణములను గురించి ఈ శ్లోకంలో ‘అపాఙ్గాత్తే’ అని ఇచ్చారు శంకరులు. అపాంగవీక్షణము అంటే కడగంటిచూపు. అమ్మవారి క్రీగంటి చూపు యొక్క ప్రత్యేకత ఏమిటి? పూజ్య గురువు గారు అనేకమార్లు ప్రవచనములో చెప్తూఉంటారు - ఎదురుగా చూసే చూపుకన్నా క్రీగంట చూసే చూపు మరింత ప్రేమను తెలియజేస్తుంది. క్రీగంటి చూపు అని అనడంలో మరొక ఔచిత్యం కూడా ఉన్నది. అమ్మవారు విశాలాక్షి కదా.. విశాలమైన కన్నులు కలది అంటే ఈ జగత్తులో ఉన్న సకల జీవకోటిని కనిపెట్టుకుని రక్షించే విశాలమైన చూపు ఉన్న అమ్మ అని.

 
శ్రీ గుణరత్న కోశంలో పరాశరభట్టరులు ఇచ్చిన ఈ అద్భుతమైన శ్లోకం గురించి పూజ్య గురువు గారు తరచు ఉటంకిస్తారు.
 
యద్భ్రూభఙ్గాః ప్రమాణం స్థిరచర రచనా తారతమ్యే మురారేః
 
వేదాన్తాస్తత్వ చిన్తాం మురభిదురసి యత్పాదచిహ్నైస్తరన్తి
 
భోగోపోద్ఘాత కేళీ చులుకిత భగవద్వైశ్వ రూప్యానుభావా
 
సా నః శ్రీరాస్తృణీతామమృత లహరి ధీ లఙ్ఘనీయైరపాఙ్గైః II
 
శ్రీమహావిష్ణువు ఈ సకల సృష్ఠిని చేయడానికి, ఆయన చేస్తున్న పని సరిగా ఉన్నదో లేదో తెలుసుకోవాలంటే ప్రమాణం ఒకటి కావాలి కదా. అది రంగనాయకి అమ్మవారి యొక్క కనుబొమ్మల కదలికల బట్టి చేస్తారు. అలాగే వేదములకు కూడా ప్రమాణం మురారి హృదయమున ఉన్న అమ్మవారి పాదపద్మముల చిహ్నము. అలాగే శ్రీమన్నారాయణుడు రంగనాయకి అమ్మవారి యొక్క సౌందర్యాన్ని చూసి, అమ్మ యొక్క స్వరూప గుణములను చూస్తూ ఆ భోగానుభవముతోనే ఆనందించి ఈ విశ్వరూపమును దాలుస్తున్నాడుట. అంటే క్లుప్తంగా చెప్తే అమ్మవారిని చూసిన ఆనందానుభవమే ఆయన విశ్వరూపం దాల్చడానికి కారణం అని. అటువంటి అనంత కళ్యాణ గుణములు కలిగిన శ్రీమురారి హృదయేశ్వరీ-రంగనాయకి అమ్మవారి కరుణాపూరిత క్రీగంటి చూపుల యొక్క అమృతలహరి నా మనసు యందు వర్షించుగాక అని అంటున్నారు పరాశరులు. ఇక్కడ ధీ అని అనడంలో అర్ధం- ఆ అమృత లహరిని బాహ్యము నందు గాక ఆంతరమున మనసులో అనుభవించాలి అని అర్ధం.

   
అలాగే మూకపంచశతి-ఆర్యాశతకములో మూకశంకరులు ఇచ్చిన ఈ క్రింది రెండు శ్లోకములు సౌందర్యలహరిలోని ధనుఃపౌష్పం మౌర్వీ అనే శ్లోకార్ధముతో అనుసంధానము చేసుకోవచ్చు…
          “కాంచీరత్న విభూషాం కామపి కందర్పసూతికాపాంగీమ్
          పరమాం కలా ముపాసే పరశివ వామాంక పీఠికాసీనామ్” II 11 II
 
కాంచీనగరమునకు రత్నవిభూషణము వంటిది, కందర్పుడు అంటే మన్మథుడికి జన్మగృహమైన కటాక్షము కలది (అంటే పరమశివుని కంటిమంటకి కాలిపోయిన మన్మథుడికి తిరిగి బ్రతికించడానికి కారణమైన అమ్మవారి క్రీగంటి చూపులను కందర్పసూతికాపాంగీమ్ – అమ్మవారి కడగంటి చూపులను మన్మథుడి పుట్టినిల్లుగా సంబోధించారు), పరమశివుని ఎడమతొడపై కూర్చొని ఉన్న ఒకానొక శ్రేష్ఠమైన కళను ఉపాసించెదను అని పై శ్లోకమునకు భావము. ఇక్కడ అమ్మవారిని పరమాం కలాం అని చెప్పడంలో రహస్యం – అమ్మవారిని మహాషోడశిగా చెప్తున్నారు. ఆ షోడశీ యే పరమకళ.

పై శ్లోకంలో అమ్మవారి దృష్టిపాతములను మన్మథుని పుట్టినిల్లుగా చెప్పారు. ఆ తర్వాత శ్లోకం చూద్దాం..
          “కంపాతీరచరాణాం కరుణాకోరకిత దృష్టిపాతానామ్
          కేలీవనం మనో మే కేషాం చిద్భవతు చిద్విలాసానామ్” II 12 II
కంపానదీతీరమున చరించు కరుణ మొగ్గతొడిగిన చూపుగల అనిర్వచనీయమైన చిద్విలాసములకు నా మనస్సు విహారోద్యానవనమగుగాక!! అని పై శ్లోకమునకు అర్ధము.

అలాగే అమ్మవారి కటాక్షవీక్షణముల గురించి వర్ణించే మరొక పరమాద్భుతమైన శ్లోకము మూకపంచశతి-కటాక్షశతకములో మూకశంకరులు ఇచ్చారు.
సంజీవనేజనని చూతశిలీముఖస్య
సమ్మోహనే శశికిశోరక శేఖరస్య
సంస్తమ్భనే చ మమతాగ్రహచేష్టితస్య
కామాక్షి! వీక్షణ కలా పరమౌషధం తే II 15 II

ఓ జననీ!! అమ్మా కామాక్షీ!! నీ యొక్క కరుణార్ద్ర వీక్షణములో పదహారవ భాగము – చూతలీముఖస్య అంటే మామిడిపువ్వు బాణముగా గల మన్మథుని యొక్క, సంజీవనే – బ్రతికించుట యందు, సమ్మోహనే శశికిశోరకశేఖరస్య – అంటే చంద్రవంకను తలపై ధరించిన పరమశివుని మోహింపజేయుట యందు, మమకారము+ఆగ్రహములనెడి (రాగద్వేషములు) దుర్గుణములను స్తంభింపజేయుట యందు గొప్ప ఔషధం అమ్మా నీ కటాక్షవీక్షణము!! అని అంటున్నారు మూకశంకరులు – అమ్మవారి కటాక్షం గొప్ప ఔషధం. ఇదే అర్ధం లలితాసహస్రంలో ‘హరనేత్రాగ్నిసందగ్ధకామసంజీవనౌషధిః’ అనే నామంలో మనం చూడవచ్చు. సృష్ఠిలో ఒకే ఔషధము – సంజీవని గానూ, సమ్మోహనం కలిగించేదిగానూ, సంస్తభనం కలిగించేది గానూ ఎక్కడా ఉండదు. అది ఒక్క అమ్మవారి కటాక్షము మాత్రమే. ఒకేసారి అమ్మ కటాక్షం మన్మథుడికి సంజీవని, కామమెరుగని శివుడికి సమ్మోహని, మన యొక్క రాగద్వేషములకు సంస్తంభని. ఇదే భావం సుందరకాండలో సీతమ్మతల్లి గురించి వాల్మీకి మహర్షి చెప్తారు. అక్కడ ఉన్న ఒకే అమ్మవారు శింశుపా వృక్షముపై కూర్చున్న స్వామిహనుమకి జగన్మాతలా, శ్రీరాముడికి అభేదమైన పరబ్రహ్మస్వరూపిణిగా దర్శనం ఇస్తోంది, అదే స్వరూపంతో దుష్టరావణుడికి అనుభవించాల్సినదిగా కనబడుతోంది, అదే అమ్మవారు ప్రక్కనే ఉన్న రాక్షస స్త్రీలకు భోజనానికి పనికి వచ్చే ఆహారంగా కనబడుతోంది. మహామాయాస్వరూపిణి కదా అమ్మవారు!! అమ్మవారి కటాక్షమనెడి ఔషధము మనందరి మీదా సదా ప్రసరించాలని కామాక్షీ అమ్మవారిని ప్రార్ధిద్దాము.

(సశేషం...)

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి