శ్రీగురుభ్యో నమః
రేపటి నుంచి అనగా 14 జూలై 2015 నుండి మొదలై 11 ఆగస్ట్ 2016 వరకు బృహస్పతి అనగా గురుగ్రహము సింహరాశి యందు ఉంటారు అని పంచాంగములో, ఆధ్యాత్మిక వార్తలలో చూసి ఉంటారు. సింహరాశిలో ఈ గురు సంక్రమణం యొక్క ఫలితములను గురించి ప్రస్తావించడం నా ఈ టపా ఉద్దేశ్యం కాదు. అలా అయితే అందరికీ జాతకరీత్యా ఒకే గురుబలం ఉంటుంది అని చెప్పలేము, అందరూ ఒకేలా గురువు అనుగ్రహాన్ని కలిగి ఉండకపోవచ్చు. వ్యక్తులకు వారి వారి జాతకాలలో గురువు ఉన్న స్థానము బట్టి, వివిధ ఫలితములు చెప్పబడ్డాయి. జ్యోతిష్యశాస్త్ర పరంగా పెద్దగా అవగాహన లేకపోయినా, పూజ్య గురువు గారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి వాక్కుల నుంచి విన్నంతవరకు తెలుసుకున్నది ఏమిటంటే, మనం జీవితంలో ఏమి సాధించాలన్నా గురు అనుగ్రహం తప్పని సరిగా ఉండాలి. జాతకరీత్యా మిగతా గ్రహాలు దుష్ఫలితాలను ఇచ్చేట్టుగా ఉన్నా, ఒక్క గురుబలం ఉంటే, మిగతా అన్ని గ్రహాలు కూడా చెడు ఫలితాన్ని కాకుండా, మంచి దృష్టితో చూస్తాయి అని చెప్పారు గురువు గారు. జాతకంలో ఎలా ఉన్నా, అందరూ గురువు అనుగ్రహం పొందడానికి జగద్గురువులచే ఇవ్వబడిన స్తోత్రములు, కీర్తనలను పఠించిన మాత్రాన, జాతకంలో వ్యతిరిక్త ఫలితాలను ఇచ్చేలా ఉన్నా, గురువు అత్యంత కారుణ్యమూర్తి కావున, ఆయన అత్యంత తేలికగా ప్రసన్నం అవుతారు, ఆయన ప్రసన్నం అయితే, ఇక మనకి అన్నీ సత్ఫలితాలే, విజయాలే. కాబట్టి, అవ్యాజకారుణ్య మూర్తి అయిన గురువు గారి అనుగ్రహమును అపేక్షించి, ఈ క్రింద ప్రస్తావించిన గురుసంబంధ వాఙ్మయమును స్తోత్ర/పారాయణ/గానము చేసి, అందరమూ గురుకటాక్షము పొందగలము.
జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదులు మనలాంటి ఎంతో మంది పిల్లల కోసం, గురువు అనుగ్రహాన్ని అత్యంత సులభంగా పొందడానికి శ్రీదక్షిణామూర్తి స్తోత్రం ఇచ్చి ఉన్నారు. పూజ్య గురువు గారు ఎన్నో మార్లు ప్రవచనములలో చెప్పి ఉన్నారు. గురుబలం పెరగాలన్నా, ఇతర దుష్టగ్రహముల ఫలితం ఉపశమించాలన్నా, జీవితంలో అనుకున్న కార్యములు సాధించాలన్నా, సమాజమునందు గొప్ప ఉన్నత స్థాయి, కీర్తి ప్రతిష్ఠలు కలగాలన్నా, ఒక్క గురుబలం ఉంటేనే సాధ్యం అనీ, దక్షిణామూర్తి స్తోత్రం భక్తి శ్రద్ధలతో పారాయణ చేసిన వారికి అటువంటి గురుబలం కలుగుతుంది అనీ చెప్పారు. దక్షిణామూర్తి స్తోత్రం తెలియని వారు, చదవని వారు మన సభలో ఉండరని నా ప్రగాఢ విశ్వాసం. దక్షిణామూర్తి స్తోత్ర వైభవం, అందులో శంకరులు మనకి ఏం ఉపదేశిస్తున్నారో వగైరా వివరాలు, పెద్దల వ్యాఖ్యానాల నుండి, పూజ్య గురువు గారి వాక్కుల నుండి తెలుసుకున్నది మన సభలో మరోసారి చర్చిద్దాము.
అలాగే, ఒకసారి పూజ్య గురువు గారు వాగ్గేయకారుల వైభవం ప్రవచనం చేస్తూ, అందులో ముత్తుస్వామి దీక్షితార్ గారు చేసిన కొన్ని అత్యద్భుతమైన కీర్తనలను గురించి వివరించారు. దీక్షితార్ చేసిన నవగ్రహ కృతులలో ఒకటైన బృహస్పతి కీర్తన - "బృహస్పతే తారాపతే - బ్రహ్మజాతే నమోऽస్తుతే" అని ప్రారంభం అవుతుంది ఈ కీర్తన. శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న వారైతే, నిత్యం ఈ కీర్తన ఇంట్లో పాడుకుంటే, గురు అనుగ్రహం కలుగుతుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. కానీ పూజ్య గురువు గారు మరొక మాట కూడా చెప్పారు 'ఒకవేళ సంగీతం రానివారైనాసరే, ప్రతీ రోజూ, పూజాగృహములో ఈ కీర్తన యొక్క సాహిత్యం ఒక స్తోత్రంలా చదువుకున్నా సరే, గురు అనుగ్రహం లభిస్తుంది' అని.
1. బృహస్పతే తారాపతే
రాగం: అఠాణ తాళం: త్రిపుట
II పల్లవి II
బృహస్పతే తారాపతే బ్రహ్మజాతే నమోಽస్తుతే
II అనుపల్లవి II
మహాబలవిభో గీష్పతే మంజు ధనుర్మీనాధిపతే
మహేంద్రాద్యుపాసితాకృతే మాధవాదివినుత ధీమతే
II చరణం II
సురాచార్యవర్య వజ్రధర శుభలక్షణ జగత్రయగురో
జరాదివర్జితాక్రోధ కచజనకాశ్రితజన కల్పతరో
పురారి గురుగుహసమ్మోదిత పుత్రకారక దీనబంధో
పరాది చత్వారి వాక్స్వరూప ప్రకాశక దయాసింధో
నిరామయాయ నీతికర్త్రే నిరంకుశాయ విశ్వభర్త్రే
నిరంజనాయ భువన భోక్త్రే నిరంశాయ మఖప్రదాత్రే II
ఈ కీర్తన చేసిన క్షేత్రం - తిరువారూర్
2. దక్షిణా మూర్తే
రాగం: శంకరాభరణం తాళం: ఝంప
II పల్లవి II
దక్షిణామూర్తే విదళిత దాసార్తే
చిదానంద పూర్తే సదా మౌన కీర్తే
II అనుపల్లవి II
అక్షయ సువర్ణ వట వృక్ష మూలస్థితే
రక్షమాం సనకాది రాజయోగిస్తుతే
(మధ్యమకాల సాహిత్యమ్)
రక్షిత సద్భక్తే శిక్షిత దుర్యుక్తే
అక్షరానురక్తే అవిద్యా విరక్తే
II చరణం II
నిఖిల సంశయహరణ నిపుణతర యుక్తే
నిర్వికల్పసమాధి నిద్రా ప్రసక్తే
అఖండైకరస పూర్ణారూఢశక్తే
అపరోక్ష నిత్యబోధానంద ముక్తే
(మధ్యమకాల సాహిత్యమ్)
సుఖతర ప్రవృత్తే స్వాజ్ఞాన నివృత్తే
స్వ-గురుగుహోత్పత్తే స్వానుభోగ తృప్తే II
ఈ కీర్తన చేసిన క్షేత్రం - తిరువారూర్
3. శ్రీదక్షిణామూర్తిం సదా
రాగం: అఠాణ తాళం: ఖండ ఏకమ్
II పల్లవి II
శ్రీదక్షిణామూర్తిం సదాచింతయేಽహం
సదానంద విద్యాప్రద గురుగుహ కీర్తిమ్
II సమిష్టిచరణమ్ II
వేదాంతబోధకం విజయ చిన్ముద్రాంకం
నాదాంత వేదితం నిజ సనకాదినుతమ్
(మధ్యమకాల సాహిత్యమ్)
వదనారవిందవహ్ని రవిశశిలోచనం
వాసుదేవకుమార మారహరనందనమ్
II చరణం II
నిఖిల సంశయహరణ నిపుణతర యుక్తే
నిర్వికల్పసమాధి నిద్రా ప్రసక్తే
అఖండైకరస పూర్ణారూఢశక్తే
అపరోక్ష నిత్యబోధానంద ముక్తే
(మధ్యమకాల సాహిత్యమ్)
సుఖతర ప్రవృత్తే స్వాజ్ఞాన నివృత్తే
స్వ-గురుగుహోత్పత్తే స్వానుభోగ తృప్తే II
ఈ కీర్తన చేసిన క్షేత్రం - తిరువారూర్
4. శ్రీగురుణా పాలితోಽస్మి
రాగం: పాడి తాళం: రూపకమ్
II పల్లవి II
శ్రీగురుణా పాలితోಽస్మి సచ్చిదానంద నాథేన
II అనుపల్లవి II
అగమాది సన్నుతేన అఖిల విశ్వవందితేన
త్యాగరాజ విభాతేన తాపత్రయాతీతేన
II చరణం II
వేదాంతార్థవేద్యేన వికల్పరోగవైద్యేన
నాదామృత సుపాద్యేననవనాథేనాద్యేన
సాదాఖ్య కళాకరేణ సదాశివావతారేణ
నాదాంత విహారేణ నవచక్రాధారేణ
(మధ్యమకాల సాహిత్యమ్)
పాదాంబుజేన పరేణ భేదాదివిదారేణ
ఆదిగురుగుహవరేణ కాదిమతానుసారేణ II
ఈ కీర్తన చేసిన క్షేత్రం - తిరుత్తణి
రేపటి నుంచి గురువు గారు సింహరాశి యందు ఒక సంవత్సరం పై దాకా ఉంటారు అని జ్యోతిష్య పెద్దలు చెబుతున్నారు. ఈ సమయంలో గురు సంబంధ స్తోత్రములు (దక్షిణామూర్తి స్తోత్రం, గురుగుహా కీర్తనలు, గురుగీత, శృంగగిరి పీఠాధీశులు ఇచ్చిన గురుపాదుకాస్తోత్రం వగైరా....) అలాగే, గురుచరిత్ర (అనగా దత్తాత్రేయుల వారి చరిత్ర, సాయి చరిత్ర, శంకరవిజయములు, ఎందరో జగద్గురువుల జీవిత చరిత్రలు మొదలైనవి..) పారాయణ ఎక్కువ చేసి, గురుకటాక్షమును పొందుదాము.
సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు
ఈ బ్లాగు మన తెలుగు బ్లాగులలో అత్యుత్తమమైనవాటిలో ఒకటి అనడములో ఎటువంటి సందేహమూ లేదు.
రిప్లయితొలగించండిధన్యోస్మి ... సురేష్ బాబు గారూ!
రిప్లయితొలగించండి