II శంకరభగత్పాదాచార్య విరచిత సౌందర్యలహరి II
శ్రీ గురుభ్యో నమః
శ్రీ మహాగణాధిపతయే నమః
శ్రీ వల్లీదేవసేనాంబికాసమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామినే నమః
శ్రీమాత్రే నమః
నమః శివాయ సాంబాయ
శాంతాయ పరమాత్మనే
శ్రీసీతారామాభ్యాం నమః
శ్రీరామదూతం శిరసా
నమామి
శృతి స్మృతి పురాణానాం
ఆలయం కరుణాలయం
నమామి భగవత్పాద శంకరం
లోకశంకరమ్ II
సదాశివ సమారంభాం శంకరాచార్య
మధ్యమాం
అస్మదాచార్య పర్యంతాం
వందే గురుపరంపరాం II
II జయ
జయ శంకర
హర హర
శంకర II
II గురుమూర్తే
త్వాం నమామి
కామాక్షీ II
అపర కైలాసశంకరుడు, జగద్గురువులు
ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మనకి అందించిన అత్యద్భుతమైన స్తోత్రం సౌందర్య లహరి. ఆదిశంకరులు
మొట్టమొదట కనకధారాస్తవంతో మొదలుకొని ఎన్నో స్తోత్రాలను మనకి అందించారు. కానీ, శంకరులు
ఇచ్చిన అన్ని స్తోత్రాలలోకి తలమానికం ఈ ‘సౌందర్యలహరి’.
సౌందర్యం అంటే అమ్మతనం. సౌందర్య-లహరి అంటే
అమ్మవారి సౌందర్యమును వర్ణించే ఆనంద తరంగాలు. అమ్మ సౌందర్యం అంటే ఏమిటి? లోకంలో ఎవరైనా మా అమ్మ అందంగా ఉంటుంది
లేదా అందవిహీనంగా ఉంటుంది అని అనరు కదా! ఇక్కడ అమ్మసౌందర్యం అంటే బాహ్యసౌందర్యం కాదు.
అమ్మయొక్క అంతఃసౌదర్యం. లోకంలో మనం చూసే బాహ్యసౌందర్యం ఒకప్పుడు ఉంటుంది, ఒకనాడు పోతుంది.
ఏది కాలము నందు నశించదో, దేనిని గురించి తెలుసుకోవడం వల్ల సకల జీవులకు అన్ని కాలములలోనూ
క్షేమాన్ని హితమును కలిగించి ఉద్ధరించగలదో అదియే నిజమైన సౌందర్యము. అది కేవలం అమ్మతనమే.
శ్రీలలితాత్రిపురసుందరీ అమ్మవారి యొక్క అమ్మతనము గురించి వర్ణించే ఆనంద అమృత తరంగాలే
సౌందర్యలహరి. లోకంలో సౌందర్యంగా
కనబడేవి అన్నీ మనకి హితము చేసేవి, క్షేమకరములైనవి అని చెప్పడం
కష్టం. కానీ లోకానికంతటికీ క్షేమకరమైనది అభయప్రదాయిని “అమ్మవారి
యొక్క మాతృత్వ సౌందర్యము”. అదే శ్రీమాతా, లోకమాతా, విశ్వమాతా, జగజ్జననీ, ఆబ్రహ్మకీటజననీ, జగన్మాత
యొక్క అమ్మతనముము వర్ణించే అద్భుత స్తోత్రమే సౌందర్యలహరి.
సౌందర్యలహరిలో ప్రతీ శ్లోకములోనూ అమ్మా నేను దీనుడినమ్మా, అజ్ఞానంతో ఉన్నవాడిని
అని భక్తితో శరణాగతి చేశారు శంకరులు. నిజానికి శంకరులు రాశీభూతమైన జ్ఞానస్వరూపము. కానీ వారు
జగద్గురువులుగా మనం కూడా ఈ శ్లోకాలు చదివినప్పుడు, ఆ శ్లోకం మనమే అమ్మవారి ఎదుట విన్నవించినట్టు
అవుతుందని ఎక్కడా ఈ శ్లోకం శంకర కృతము అనే భావం వచ్చేలా వ్రాయలేదు. అంతేకాక సౌందర్యలహరిలో
బీజాక్షరములు, మంత్ర, తంత్ర
యంత్ర యోగ రహస్యాలు, శ్రీవిద్యామంత్ర రహస్యాలు ఎన్నో ఇచ్చారు ఆదిశంకరులు. మన చేత
ధ్యానం చేయించడం కోసం శంకరులు సృష్ఠించిన నాటకీయ సన్నివేశాలు, శంకరులు
వాడిన సంస్కృతము, ఈ శ్లోకాలను ఉచ్ఛరించ మాత్రాన ఉత్పన్నమయ్యే శక్తివంతమైన మరియు
పవిత్రమైన శబ్ద తరంగాలు ఇలా ఏ కోణంలో చూసినా సౌందర్యలహరి అత్యద్భుతం. అత్యంత
సరళమైన సంస్కృతములో చెప్పాలన్నా, అత్యంత జటిలమైన భావనిక్షిప్త
పదప్రయోగం చెయ్యాలన్నా రెండిటికీ జగద్గురువులు ఆదిశంకరులు వారికి వారే సాటి. మరొక విశేషమేమంటే సౌందర్యలహరిలో ఒక్క శ్లోకములో కూడా అమ్మవారి
రాక్షస సంహార లీలలను గురించి ఆదిశంకరులు చెప్పలేదు. కేవలం అమ్మవారి అవ్యాజమైన కరుణతో
కూడిన మాతృత్త్వం గురించి, అమ్మవారి యొక్క ప్రహృష్ట వదనంతో కూడిన స్వరూపాన్ని మాత్రమే
వర్ణించారు. అందుకే ఇది సౌందర్యలహరి. పూజ్య గురువు గారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర శర్మ గారి ప్రవచనములలో
చెప్తూ ఉంటారు, మన వైదిక వాఞ్మయములో అత్యంత శక్తివంతములైనవి రెండు – ఒకటి సుందరకాండ, రెండవది – సౌందర్య
లహరి.
సుందరే సుందరో రామ: సుందరే సుందరీ కథ:
సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం
సుందరే సుందరం కావ్యం,సుందరే సుందరం కపి:
సుందరే సుందరం మంత్రం, సుందరే కిం న సుందరం?
అని సుందరకాండ గురించి
చెప్పినట్లుగా, సౌందర్యలహరిని కూడా ఏ కోణంలో చూసినా అంతా సౌందర్యమే. ‘శాంతం శివం సుందరం’ అని పరమశివుడి గురించి చెప్తారు, ఆయనయే
సుందరేశ్వరుడు. అలాగే ‘సుందరస్య పత్నీ సుందరీ’ అనే మాటలో సుందరేశ్వరుడి పత్ని అమ్మవారు
సుందరీ – లలితాత్రిపురసుందరీ. ఈ రకముగా సౌందర్యలహరి అమ్మవారికి అయ్యవారికి అభేదమైన
పరబ్రహ్మ తత్త్వం యొక్క సౌందర్యమును వర్ణించే లహరి – ఆనంద తరంగాలు.
ఈ సౌందర్య లహరి మొత్తం
నూరు శ్లోకములలో ఉంటుంది. మొదటి 41 శ్లోకములను కలిపి ‘ఆనందలహరి’ అనీ, చివర 59
శ్లోకములను
కలిపి ‘సౌందర్యలహరి’ అని పిలుస్తారు. కానీ మొత్తం
నూరు శ్లోకాలను కలిపి సౌందర్యలహరి గానే పిలుస్తారు. ఆనందలహరిలో
అమ్మవారి యొక్క నిర్గుణ తత్త్వము, కుండలినీ
యోగ రహస్యాలు వివరించారు శంకరులు. చివరి యాభైతొమ్మిది శ్లోకాలలో
అమ్మవారి సగుణ రూప సౌందర్యమును (ఇక్కడ సగుణ సౌందర్యం అంటే
అమ్మతనం-జగన్మాత యొక్క కేశాదిపాదాది సౌందర్యం) గురించిన
వివరణ ఇచ్చారు శంకరభగవత్పాదులు.
భక్తి శ్రద్ధలతో పారాయణ చేసినవారికి, జీవితంలోని ఐహిక కష్టాలను అలాగే ఆధ్యాత్మిక
సాధనలో వచ్చే అవరోధాలను రెంటినీ తొలగించి, ఇహములో సుఖసంతోషాలను, పరమునందు
మోక్షాన్ని రెండిటినీ ఇవ్వగల అమృతభాండం ఆదిశంకరులు ఇచ్చిన సౌందర్యలహరి. భక్తి శ్రద్ధలతో సౌందర్యలహరి పారాయణ చేస్తే తీరని
ధర్మబద్ధమైన కోర్కే లేదు. అందుకే ప్రపంచ వాఞ్మయములో సౌందర్యలహరి మరియు సుందరకాండలకు
అంత గొప్ప స్థానం.
సౌందర్యలహరి శంకరులు ఎలా వ్రాశారు అనే విషయం కొంచెం కొంచెం తేడాలతో వ్యాఖ్యానకర్తలు
వ్రాశారు. ఆదిశంకరులు అమ్మవారి ఉపాసన
గురించిన రహస్యాలు తెలుసుకోడానికి, వారి పరమగురువులైన
శ్రీగౌడపాదాచార్యుల వారిని ఆశ్రయిస్తే, గౌడపాదుల
వారు వ్రాసిన “శుభగోదయస్తుతి” అనే 52 శ్లోకములు
గల గ్రంధాన్ని ఆదిశంకరులకి ఇచ్చారని, అది చదివాక, అమ్మగురించి
మరింత తెలుసుకుని, లోకానికి అందివ్వడానికి
ఒకనాడు శంకరభగవత్పాదులు కైలాసం వెళ్ళగా పరమశివుడు ఐదు ఆత్మలింగాలను ఆదిశంకరులకి
ఇచ్చారని, అమ్మవారే సౌందర్యలహరిని శంకరులకి ఉపదేశం చేశారని ఒకచోట చదివాను. వాటినన్నిటినీ
శంకరులు వ్రాసుకుని కైలాసం నుండి తిరిగి వస్తూ ఉండగా, దారి మధ్యలో
నందీశ్వరుడు అడ్డుకొంటారు. అమ్మవారి గురించిన ఎన్నో
రహస్యాలను తెలిపే ఈ సౌందర్యలహరిని కలియుగంలో మనుషులు అర్ధం చేసుకోలేరు అని నందీశ్వరుడు చెప్తారు. కాబట్టి వాటిని తీసుకువెళ్ళడం కుదరదు అని, వాటిని
శంకరుల నుంచి లాక్కోవడానికి ప్రయత్నిస్తాడు. నందీశ్వరుడు
ఈ విధంగా లాక్కోవడంలో ఆదిశంకరులు
మొదట 41 శ్లోకములు ఉన్న ఆనందలహరి మాత్రమే భూలోకానికి తీసుకుని వచ్చారు. మిగతా 59 శ్లోకాలను, శంకరులే
వారి తపోశక్తితో కైలాసం నుండి తిరిగి వచ్చాక వ్రాశారు. పూజ్య
గురువు గారు చెప్పిన ఒక అద్భుతమైన విషయం ఇక్కడ నేను స్మరించాలి. అదేమిటంటే, ఆదిశంకరులు
అంటే ఎవరో కాదు సాక్షాత్తు కైలాస శంకరుడే. సౌందర్యలహరిలోని
ఆనందలహరి గా పిలవబడే మొదటి 41 శ్లోకాలను మాత్రమే శంకరులు కైలాసం నుండి తీసుకురావడం ఏమిటి? అమ్మ వారి
కేశాదిపాదాది సగుణ రూపసౌందర్యము
గురించి వర్ణించే మిగతా 59 శ్లోకములు మాత్రమే నందీశ్వరుడు లాక్కోవడమేమిటి? స్వయంగా
అమ్మవారు అయ్యవారే ఆశీర్వదించి ఉపదేశం చేసిన సౌందర్యలహరిని మధ్యలో నందీశ్వరుడు ఆపి
తీసుకోవడం విచిత్రంగా లేదూ? ఇక్కడ మనం అర్ధం చేసుకోవాల్సి ఉంది ఏమిటంటే, అమ్మవారి
యొక్క సగుణ సౌందర్యాన్ని వర్ణించడం ఒక్క పరమశివుడికి తప్ప ఈ లోకంలో ఎవరికీ సాధ్యం కాదు. కానీ ఆదిశంకరులు, మిగతా 59 శ్లోకములు
వ్రాయగలిగారు అంటే, వారు సాక్షాత్తు పరమశివస్వరూపులు కాబట్టి మాత్రమే వ్రాయగలిగారు. కాకపోతే
ఇక్కడ ఆదిశంకరులు పార్వతీపరమేశ్వరుల బిడ్డడిగా, అమ్మవారి
మాతృసౌందర్యాన్ని వర్ణించగలిగారు. బహుశా ఈ విషయం లోకానికి
బోధపరచడం కోసమే అమ్మవారు నందీశ్వరుడి చేత ఈ లీల చేయించారు. పరమశివుడే ఆదిశంకరులుగా కలియుగంలో రాబోతున్నారు అని యజుర్వేదం కూడా ‘వ్యుప్తకేశాయ
చ’ అని కీర్తించింది కదా. మరొక వ్యాఖ్యానంలో, మొత్తం సౌందర్యలహరిలోని నూరు శ్లోకాలు
ఉమామహేశ్వరుల ఆశీస్సులు పొందిన శంకరులే స్వయంగా వ్రాశారని ఉన్నది. ఆంగ్లేయుడైన సర్
ఆర్థర్ ఎవలాన్ వ్రాసిన ‘ది సర్పెంట్ పవర్’లో మొదటి నలభైఒక్క శ్లోకముల ఆనందలహరి మాత్రమే
పరిగణించి, వ్యాఖ్యానము కూడా ఆనందలహరికి మాత్రమే వ్రాశారు.
సరే, ఆ శ్లోకములు ఎలా వచ్చాయి అనే చరిత్ర శోధన కంటే, అమ్మవారి అనుగ్రహంతో ఆదిశంకరభగవత్పాదులు మనకోసం ఇచ్చిన పరమ శక్తివంతమైన స్తోత్రం సౌందర్యలహరి అనే పూనిక కలిగి, ఆ శ్లోకాలలో ఉన్న అమృతాన్ని
కొంతైనా గ్రహించగలిగితే మన జన్మ ధన్యమయినట్లే నా అభిప్రాయము.
లలితా సహస్రనామస్తోత్రము, సౌందర్యలహరి, మూకపంచశతి
ఈ మూడూ పరాదేవత ఉపాసనలో అత్యంత ప్రాధాన్యత వహించిన స్తోత్రాలు. సహస్రనామాలలోకెల్లా
తలమానికం లలితాసహస్రం. వ్యాసమహర్షి ఇచ్చిన
లలితాసహస్రనామస్తోత్రంలో ఎన్నో రహస్యాలను మనం అర్ధం చేసుకోవాలంటే సౌందర్యలహరి తప్పనిసరిగా
చదివి తీరాలి. సౌందర్యలహరి స్తోత్రం – మంత్ర, యంత్ర, తంత్ర, యోగ, శ్రీవిద్యా/శ్రీచక్ర రహస్యాలతో
నిండి ఉంటుంది. శంకరాచార్యులవారు సౌందర్యలహరిలో
శ్లోకములన్నిటినీ శిఖరిణీ వృత్తములో వ్రాశారు. మరి మంత్రోపదేశము లేనివారు ఇంత పరమ పవిత్రమైన ‘సౌందర్యలహరి’ స్తోత్రాన్ని చదవవచ్చునా
అని సందేహం కలుగవచ్చు. కనీస శౌచనియములు
పాటిస్తూ, ఉచ్ఛారణ దోషము లేకుండా, చాతుర్వర్ణములవారు స్త్రీపురుష భేదం లేకుండా, శంకరాచార్యులవారినే తమ గురువుగా స్మరించి ఈ సౌందర్యలహరి స్తోత్రాన్ని
నిత్యమూ పారాయణ చేయవచ్చు అని పెద్దల మరియు గురువుల వాక్కు.
అసలు జగద్గురు ఆదిశంకరులు ఈ స్తోత్రాన్ని అందించడానికి ప్రయోజనమే
అది కదా. ప్రతీరోజూ కనీసం మూడు లేదా
ఆరు శ్లోకములు….ఇలా మూడు గుణింపగా వచ్చే
సంఖ్య శ్లోకములు పారాయణ చేస్తే మంచిది అని, ప్రత్యేకంగా ప్రతీ నెలలో వచ్చే రెండు అష్టమి తిథులలో సంపూర్ణముగా అనగా నూరు
శ్లోకములు పారాయణ చేస్తే మరీ మంచిది అని స్వామి సత్యసంగానంద సరస్వతీ అమ్మ వ్రాసిన వ్యాఖ్యానములో తెలియజేశారు.
ఇతఃపూర్వం సౌందర్యలహరిపై చేసిన వ్యాఖ్యానముల వివరములు
ఇతఃపూర్వం సౌందర్యలహరికి
అనేకమంది పెద్దలు ఎన్నో వ్యాఖ్యానాలు (భాష్యం) వ్రాశారు. వీటిలో 32 వ్యాఖ్యానాలు
బాగా లోకప్రసిద్ధి. వాటిలో ప్రముఖమైనవి
·
లొల్ల
లక్ష్మీధరుడు వ్రాసిన - లక్ష్మీధరవ్యాఖ్య
·
కైవల్యాశ్రమ
విరచిత – సౌభాగ్యవర్ధని
·
అరుణమోదిని వ్యాఖ్య
·
కామేశ్వరసూరి
వ్యాఖ్య
·
డిండిమ
వ్యాఖ్య
·
ప్రవరసేనుడు
వ్రాసిన సుధావిద్యోతిని మొదలగునవి.
·
శ్రీవిద్యాసాంప్రదాయములో
ప్రస్థానత్రయముగా పిలువబడే మూడు గ్రంధాలను శ్రీభాస్కరరాయల
వారు అందించారు.
o
ఒకటి లలితాసహస్రనామ
భాష్యం,
o
రెండవది – వరివస్యా
రహస్యం,
o
మూడవది – సేతుబంధనం.
·
ఈ మూడు
అమ్మవారి ఉపాసన గురించి అత్యంత సాధికారికత కలిగిన అపురూపమైన గ్రంధములు. కానీ వీటిలో
ఒక్క లలితాసహస్రనామ భాష్యం (శ్రీపొంగూరు సూర్యనారాయణ శర్మ గారు తెలుగులో అనువదించినది) తప్ప, మిగతా
రెండూ ప్రస్తుతానికి నాకు లభించలేదు.
ఇవి కాక, నవీన కాలంలో, ఆంగ్లములో
ఈ క్రింది వ్యాఖ్యానములు బాగా పండితాదరణ పొందినవి.
·
Arthur
Avalon – అవలానందనాథ అనే
దీక్షానామము కలిగిన
Sir John Woodroffe అనే
ఆంగ్లేయుడు వ్రాసిన
‘The Serpent Power’ అనే పుస్తకంలో
మొదటి 41 శ్లోకములతో కూడిన
‘ఆనందలహరి’ వ్యాఖ్యానము మాత్రమే ఇచ్చారు. అలాగే వీరే
‘Shakti & Shakta’,
‘Hymns to Goddess’, ‘Mahanirvana Tantra’, ‘The Garland of Letters’ మొదలైన
అనేక అమ్మవారి
ఉపాసనా సంబంధమైన
పుస్తకములు వ్రాశారు.
జన్మరీత్యా వీరు
ఆంగ్లేయులైనా సరే,
వీరు వ్రాసిన
ఆనందలహరి వ్యాఖ్య
అత్యంత పండితాదరణ
పొందినది. ఈ
మధ్య కాలంలో
తెలుగులోనూ లేదా
ఆంగ్లములోనూ సౌందర్యలహరిపై వ్యాఖ్యానము వ్రాసిన
ఎవరూ కూడా
Arthur Avalon గారి
పుస్తకముల గురించి
ఉటంకించకుండా, వారి
వ్యాఖ్యానము పూర్తిచేయలేదు.
·
‘The
Chakras’ by C.W.Leadbeater (ఇది సౌందర్య
లహరి వ్యాఖ్యానము
కాదు కానీ,
అమ్మవారి ఉపాసన
గురించి తెలుసుకునే
వారు చదవగలిగిన
ఒక మంచి
పుస్తకం)
·
అలాగే డాక్టర్.
అనంతకృష్ణశాస్త్రి గారు
ఆంగ్లములో వ్రాసిన
వ్యాఖ్యానము (గణేష్
& కో. పబ్లిషర్స్)
·
‘The
Saundarya Lahari – The Descent’ by Swami Satyasangananda Saraswati, Yoga
Publications Trust, Munger, Bihar, India.
·
Saundarya
Lahari of Shankaracharya by Swami Tapasyananda (RK Mutt, Chennai)
·
Saundarya
Lahari (The Ocean of Beauty) by Pandit S. Subrahmanya Sastri & T.R.
Srinivasa Ayyangar, The Theosophical Publishing House, Adyar, Madras.
అలాగే సౌందర్యలహరికి
తెలుగులో కూడా అనేక మంది పెద్దలు టీకా తాత్పర్య సహితముగానూ లేక కేవలం వచనరూప వివరణ
తోనూ, వ్యాఖ్యానాలు వ్రాసి ఉన్నారు. వాటిలో
కొన్ని..
·
శ్రీచదలువాడ జయరామశాస్త్రి గారు వ్రాసిన వ్యాఖ్యానము
·
శ్రీఈశ్వర
సత్యనారాయణ శర్మ గారు – తెనాలి గ్రంధ మండలి ద్వారా ప్రచురించిన వ్యాఖ్యానము
·
శ్రీతుమ్మలపల్లి
రామలింగేశ్వర శర్మ గారు వ్రాసిన వ్యాఖ్యానము
·
శ్రీ డా.గొర్తి
లక్ష్మీనారాయణ శాస్త్రి గారు వ్రాసిన సౌందర్యలహరి మరియు లలితాసహస్రనామ వ్యాఖ్యానము (World Teacher Trust, Vishakhapatnam)
·
నిత్యసౌందర్యలహరి
అనే శీర్షికన జంధ్యాల వేంకటేశ్వరశాస్త్రి గారు పద్యగద్యానువాదము ఇచ్చారు.
·
భవానీసౌందర్యలహరి
అనే శీర్షికన శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు వ్రాసిన వ్యాఖ్యానము.
II కామాక్షీ సౌందర్యలహరి II
జగద్గురు ఆదిశంకరులు
ప్రారంభ శ్లోకములోనే అంటారు, పూర్వకృత పుణ్యము ఉంటేనే కానీ, అమ్మవారికి
నమస్కరించడం కానీ, స్తోత్రం చేయడం కానీ ఈ లోకంలో ఎవరూ చేయలేరు అని. పూర్వం
నాకు తెలిసి నేను ఏమి పుణ్యము చేశానో నాకు తెలియదు, కానీ అమ్మ అవ్యాజకరుణామూర్తి కదా, కామాక్షీ అమ్మవారి నిర్హేతుక కృపాకటాక్షవీక్షణముల వలన మరియు
పూజ్య గురువు గారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర శర్మ గారి ఆశీస్సుల కారణంగానూ, సౌందర్యలహరి
బాగా పారాయణ చేయాలని అమ్మవారు బుద్ధిప్రచోదనం ఇచ్చింది. ఆపైన అమ్మవారు
నాకు కలిగించిన గురువాక్య శ్రవణ భాగ్యము మరియు అనేక వ్యాఖ్యాన పుస్తక పఠనము నుంచి నాకు అవగతం అయిన మేరకు, సౌందర్యలహరి
వ్యాఖ్యానం ఒక చిన్న నోట్స్ గా వ్రాసుకోవాలి అని అమ్మవారు ఇచ్చిన సంకల్పంతో 'కామాక్షీ సౌందర్యలహరి' అనే శీర్షికన వ్రాయడం ప్రారంభిస్తున్నాను.
నిజంగా చెప్పాలి అంటే, సౌందర్యలహరికి
వ్యాఖ్యానము వ్రాయడం అనేమాట నాబోటి వాడికి తగని చాలా పెద్దమాట. భాష యందు
పాండిత్యమూ లేదు, ఏమీ సాధనా బలమూ లేదు. అందుకే
ఇది వ్యాఖ్యానము అని అంటే ధూర్త సాహసమే. కేవలం
అమ్మవారు నా బుద్ధికి అర్ధం
అయ్యేలా అందించిన వ్యాఖ్యాన సారాంశాన్నంతటినీ క్రోడీకరించి, మరల మరల పునశ్చరణ చేసుకోవడానికి నాకోసం వ్రాసుకుంటున్న ఒక సారాంశపుస్తకమే
ఈ ‘కామాక్షీ సౌందర్యలహరి’.
అమ్మవారి యొక్క వైభవాన్ని, సగుణ నిర్గుణ
తత్త్వాన్ని, అమ్మవారి రూపగుణ మాతృత్వ సౌందర్యాన్ని, ప్రతీ శ్లోకం ఎంత మహిమాన్వితమైనది ఆయా శ్లోకములు పారాయణ చేయడం
వలన కలిగే ఫలితములను ఒకచోట క్రోడీకరించి అమ్మవారే నాచేత వ్రాయిస్తున్న సంకలనమే ఈ ‘కామాక్షీ సౌందర్యలహరి’.
ఒక ముఖ్యమైన విషయం
ఏమిటంటే, సౌందర్యలహరిలో ప్రతీ శ్లోకములోనూ బీజాక్షరాలు, శ్రీవిద్యా మంత్రాలు
నిగూఢంగా ఉన్నాయి. అలాగే ప్రతీ శ్లోకానికీ ఒక ప్రత్యేక యంత్రము, తాంత్రిక
పద్ధతిలో ఉపాసనా విధానము ఏ కామ్యము
కొఱకు ఎలా అనుష్ఠించాలి మొదలైన అనేక వివరములు కూడా పూర్వ వ్యాఖ్యానములలో పెద్దలచేత
ఇవ్వబడ్డాయి. కానీ అసలు ఆదిశంకరుల
దృష్ఠిలో సిద్ధులు అనేవి కాకిరెట్టతో సమానం. మనకి కావలసినది
అమ్మవారి అనుగ్రహ కటాక్షములు. అవి ఉంటే మనకి ఎప్పుడు ఏమి
కావాలో (కామ్యార్ధముల
నుంచి మోక్షము వరకు) అమ్మవారే
ఇస్తారు. కాబట్టి
ప్రాథమిక స్థాయిలో ఉన్న ఒక సాధకుడిగా, భక్తి శ్రద్ధలతో సౌందర్యలహరి పారాయణ చేసినంత
మాత్రాన అమ్మవారు సకల అభీష్టాలను తీర్చి, చతుర్విధ పురుషార్ధాలను కటాక్షిస్తారు అని
మనం నమ్మితే చాలు.
ముఖ్యమైన గమనిక ఏమిటంటే ఎవరూ పుస్తకాలు చదివి యంత్ర, తంత్రములతో ఉపాసన చేయకూడదు. పుస్తకాలు కేవలం
ఆయా శ్లోకాల భావం తెలుసుకోవడం కోసమే తప్ప, ప్రత్యక్ష గురువు లేకుండా వాటిని అనుష్ఠానము చేయకూడదు. పూజ్య గురువు గారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు సౌందర్యలహరి
ప్రవచనములో చెప్పారు – “గురువు యొక్క ఉపదేశము/పర్యవేక్షణ లేకుండా కుండలినీ శక్తిని
కదపడానికి ప్రయత్నం చేయడం లేదా బజారునుంచి కొనుక్కొని వచ్చి శ్రీచక్రార్చన చేయడం వంటి
సాహసం ఎన్నడూ చేయవద్దు” అని. ఆంతరంగికముగా చేసే కుండలినీ యోగం అయినా బాహ్యముగా చేసే
శ్రీచక్రార్చన అయినా ఇవి కేవలం
ఒక గురువుని ఆశ్రయించి, గురుముఖతగా నేర్చుకుని ఆచరించవలసిన ఉపాసనా పద్ధతులు కాబట్టి అటువంటి వాటికి జోలికి అందరూ వెళ్లరాదు అని గురువాక్యం.
నా వరకు పూర్వ వ్యాఖ్యాన
పుస్తకములు చదవడం వెనుక ముఖ్యోద్దేశము - ప్రతీ
శ్లోకములో శంకరులు జగత్తుకి ఏమి బోధిస్తున్నారో, వాటి
భావార్ధము లేశమాత్రమైనా అమ్మవారి అనుగ్రహంతో గ్రహించగలిగితే, పారాయణ చేసేటప్పుడు, అమ్మవారి యందు ధ్యానం కుదరడానికి మరింత దోహదపడుతుంది
అనే కోరిక మాత్రమే!! ఆపైన సాధనలో ఎంతవరకు
ముందుకు వెళతాము అనేది కేవలం పరాదేవత యొక్క అనుగ్రహం మీద ఆధారపడుతుంది.
అసలు సౌందర్యలహరి గురించి ఆలోచన రావడానికి,
అమ్మవారి గురించి తెలుసుకోవాలనే ఆర్తి కలగడానికి మూల కారణం పూజ్య గురువు గారు బ్రహ్మశ్రీ
చాగంటి కోటేశ్వరశర్మ గారి అనుగ్రహ ఆశీస్సులు. మొదట నాకు భగవంతుడి మీద గురిని కలుగజేసి,
భక్తి అంటే ఏమిటో, విహిత కర్మాచరణ ఏమిటో, ఇలవేల్పు ఆరాధన ఎంత ముఖ్యమైనదో, మన సనాతన
ధర్మ వాఞ్మయము గురించి, ఆదిశంకర భగవత్పాదాది గురుపరంపర వైభవం గురించి … ఇలా ఎన్నో ఎన్నో
ధార్మిక జ్ఞానామృతాన్ని పూజ్య గురువుగారి సింహనాదం ద్వారా విని నేర్చుకుంటున్న ఓ శిష్యపరాగము
నేను. నా జీవితాన్ని లౌకికముగానూ ఆధ్యాత్మికముగానూ ఉన్నతముగా నడిపించడానికి కారణమైన
పూజ్య గురువు గారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరశర్మ గారికి,
గురుపత్ని అమ్మకి సాంజలి బంధకముగా శతకోటి నమస్కారములు తెలియజేసుకుంటున్నాను.
అలాగే, కారుణ్యంతో నాకు మంత్రదీక్షనొసగి, నా జన్మ ధన్యము చేసుకోవడానికి మార్గం చూపించిన
అస్మద్గురువు గారు మరియు అస్మద్గురుపత్ని అమ్మ పాదపద్మములకు
శతకోటి ప్రణామములు తెలియజేసుకుంటున్నాను. చివరగా, మా ఇలవేల్పు నా బుజ్జితండ్రి శ్రీవల్లీదేవసేనాంబికాసమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి అనుగ్రహం
నా యందు లేకపోతే, అమ్మవారి స్తోత్రరాజం అయిన సౌందర్యలహరి గురించిన స్మరణ కూడా చేయలేను.కాబట్టి నా స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ నా యందు ప్రసరించాలని షడాననుడి పాదములు పట్టి ప్రార్ధిస్తున్నాను.
ఇందులో ఏమైనా అక్షర, భావ దోషములు ఉంటే కామాక్షీ అమ్మవారు నన్ను క్షమించి పెద్దలచేత
తద్దోషములను సరిచేయించాలని కోరుకుంటున్నాను. ఒక్కొక్క
శ్లోకం యొక్క వివరణ, భావార్ధములను ఒక్కో టపాగా వ్రాస్తున్నాను.
మన తెలుగువారిలో సౌందర్యలహరి బాగా ఉపాసన చేసిన/చేస్తున్న పెద్దలు ఎంతో
మంది ఉన్నారు. నాకు పెద్దగా సాధనా బలము లేకపోయినా, సౌందర్యలహరి వంటి సర్వోత్కృష్టమైన
స్తోత్రం గురించి ఇలా వ్రాయడం కేవలం అమ్మవారిచ్చిన బుద్ధిప్రచోదనం మేరకు మాత్రమే చేస్తున్నాను.
నా స్థాయికి మించిన సాహసంగా పెద్దలకి అనిపిస్తే మన్నించగలరు.
సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి