25, డిసెంబర్ 2012, మంగళవారం

ఆదిశంకర భగవత్పాదాచార్య విరచిత శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం

II శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్య విరచిత శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం II (సుబ్రహ్మణ్యాష్టకం)
శ్రీ గురుభ్యో నమః
ఈ రోజు మంగళవారము, కృత్తికా నక్షత్రము ఉన్న రోజు, ఇటువంటి రోజు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని స్మరించడం, సకల శుభకరం.

ఆదిశంకరభగవత్పాదులు ఒకటి లక్ష్మీనృసింహకరావలంబ స్తోత్రం చేశారు, రెండు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చేశారు. ఇంకా ఏమైనా వారు చేసిన కరావలంబ స్తోత్రం ఉన్నాయేమో నాకు తెలియదు. అసలు కరావలంబం అంటే ఏమిటి? స్వామి వారిని "మాకు సహాయం చేసే చేతులను ఇవ్వు..." అని వేడుకోవడం. అంటే ఈ సకల లోకాలనూ రక్షించే నీ బాహువులతో మమ్మల్ని రక్షించు అని. కరావలంబ స్తోత్రం చాలా చాలా శక్తివంతమైనది. ఆదిశంకరులు ఒక విపరీతమైన ఆపద సమయములో నరసింహస్వామి వారిని కరావలంబస్తోత్రముతో పిలిస్తే, స్వామి తత్క్షణమే వచ్చి ఆదిశంకరులను రక్షించారు. అందుకే వేదము కూడా స్వామి వారిని మొదట నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః అని వెంటనే నమ అస్తు ధన్వనే బాహుబ్యా ముతతే నమః అని చెప్పింది రుద్రం. అంటే స్వామీ మీ బాహువులకు నమస్కారము. లలితా సహస్రనామములలో కూడా అమ్మవారిని కేశాది పాదాది పర్యంతం వర్ణించాలి కదా, కానీ మొదట అమ్మవారి యొక్క బాహువుల గురించి చెబుతారు. చతుర్బాహు సమన్వితాయై నమః అని కీర్తించబడినది. ఎందుకు అమ్మవారిని ముందు పాదముల నుంచో లేక కేశాది పాదాది పర్యంతమో స్తోత్రం చేయకుండా ఎందుకు అమ్మవారి బాహువులను కీర్తించారు? అనే విషయానికి, పూజ్య గురువు గారు లలితా సహస్ర నామములపై ప్రవచనము చేస్తూ ప్రారంభములోనే చెప్పారు. అసలు రూపమే లేని వాడు, మనకోసం ఒక రూపం ధరించి, ఒక ఆయుధమో, ముద్రో పట్టి, మనల్ని అనుగ్రహించడానికి గుణములు పొందినవాడై, వస్తాడు. అటువంటి భగవత్స్వరూపాలను చూస్తే, భగవంతుని బాహువులు, ఆయన చేతులలో పట్టుకునే వాటికి విశేషమైన ప్రాశస్త్యమ్ ఉంటుంది అని గురువు గారు చెప్పారు.

అందునా శంకరులు మమదేహి కరావలంబం అని అంత అద్భుతమైన రెండు స్తోత్రాలు ఇచ్చారు అంటే, వాటిని ప్రతీరోజు మనం అనుసంధానం చేసుకుంటే, ఏ విధముగా ఆపదల నుంచి రక్షింపబడి, స్వామి యొక్క కృపకి పాత్రులము అవుతామో మన ఊహకి కూడా అందదు.

ఆదిశంకరులు అందించిన అటువంటి అద్భుతమైన మరియు శక్తివంతమైన స్తోత్రములలో ఒకటి ఈ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రము.


హే స్వామినాథ! కరుణాకర దీనబంధో శ్రీపార్వతీశ ముఖపంకజ పద్మ బంధో
శ్రీశాదిదేవగణపూజిత పాదపద్మ వల్లీశనాథ మమదేహి కరావలంబం II 1 II 


దేవాధిదేవనుత దేవగణాధినాథ దేవేంద్ర వంద్య మృదు పంకజ మంజు పాద
దేవర్షి నారద మునీంద్ర సుగీత కీర్తే వల్లీశనాథ మమదేహి కరావలంబం II 2 II

నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్ తస్మాత్ ప్రదాన పరిపూరిత భక్తకామ
శృత్యాగమ ప్రణవవాచ్య నిజస్వరూప వల్లీశనాథ మమదేహి కరావలంబం II 3 II

క్రౌంచామరేంద్ర పరిఖండన శక్తి శూల పాశాది శస్త్ర పరిమండిత దివ్యపాణే
శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ వల్లీశనాథ మమదేహి కరావలంబం II 4 II

దేవాధిదేవ రథమండల మధ్యవేద్య దేవేంద్ర పీఠనగరం ధృఢచాప హస్తం
శూరం నిహత్య సురకోటి భిరీడ్యమాన వల్లీశనాథ మమదేహి కరావలంబం II 5 II

హారాదిరత్న మణియుక్త కిరీటహార కేయూరకుండల లసత్కవచాభిరామ
హేవీర తారక జయామర బృందవంద్య వల్లీశనాథ మమదేహి కరావలంబం II 6 II

పంచాక్షరాది మనుమన్త్రిత గాంగతోయైః పంచామృతైః ప్రముదితేంద్ర ముఖైర్మునీంద్రైః
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ వల్లీశనాథ మమదేహి కరావలంబం II 7 II

శ్రీకార్తికేయ కరుణామృత పూర్ణదృష్ట్యా కామాదిరోగ కలుషీకృత దుష్ట చిత్తమ్
సిక్త్వాతు మామవ కళాధర కాంతి కాంత్యా వల్లీశనాథ మమదేహి కరావలంబం II 8 II

సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం యే పఠన్తి ద్విజోత్తమాః తే సర్వే ముక్తి మాయాన్తి సుబ్రహ్మణ్యప్రసాదతః
సుబ్రహ్మణ్యాష్టక మిదం ప్రాతరుత్ధాయ యః పఠేత్ కోటిజన్మ కృతం పాపం తత్క్షణా దేవనశ్యతి.

II ఇతి శ్రీసుబ్రహ్మణ్యాష్టకం (సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం) సంపూర్ణం II


భావార్ధము:

హే స్వామినాథ! కరుణాకర దీనబంధో శ్రీపార్వతీశ ముఖపంకజ పద్మ బంధో
శ్రీశాదిదేవగణపూజిత పాదపద్మ వల్లీశనాథ మమదేహి కరావలంబం II 1 II 



ఓ స్వామినాథా!! అంటే పరమశివునికే ప్రణవం బోధించాడు కాబట్టి, సుబ్రహ్మణ్యుడికి స్వామినాథ అనే నామం వచ్చినది. అంటే ఇక్కడ స్వామి వారిని గురుస్వరూపముగా చెప్పారు. ఓ స్వామినాథా, కరుణను చూపించేవాడా, దీనులను రక్షించేవాడా... ఇక్కడ దీనుడు అంటే ఎవరు? దీనుడు అంటే లౌకికముగా ఐశ్వర్యము లేనివాడు అని ఒక్కటే కాదు అర్ధం, ఎవరు తాము చెయ్యవలసిన పురుషప్రయత్నము చేసి, స్వామి వారి మీదే సంపూర్ణ భారము వేసి శరణాగతి చేస్తారో, వారు దీనులు. నీవే తప్ప ఇతఃపరంబెరుగను అని కరిరాజు ప్రార్ధించినట్లుగా చేస్తే, వాడు దీనుడు. ఎప్పుడూ నేను, ఇది నాది, నేను చేశాను ఇది అని విర్రవీగితే వాడు స్వామి వారి కరుణను ఒక్కనాటికి పొందలేడు.

శ్రీపార్వతీశ ముఖపంకజ పద్మ బంధో అంటే, సుబ్రహ్మణ్యుడు సాక్షాత్తు అమ్మ పార్వతీ అమ్మవారి రూపమే, అందుకే ఎప్పుడు మనం సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయానికి వెళ్ళినా, ఆయనని చూస్తే, నమస్కరించాలి అనే కన్నా, దగ్గరకి వెళ్ళి ఎవరూ చూడకపోతే ఒకసారి ముద్దుపెట్టుకోవాలనిపిస్తుంది. ముద్దుల మూటకట్టేస్తాడు స్వామి, సదా బాలరూపం కదా. ఎన్ని యుగాలైనా విఘ్నేశ్వరుడూ, సుబ్రహ్మణ్యుడూ ఇద్దరూ బాలస్వరూపమే. చిన్నపిల్లలని చూస్తేనే మనకి ఎంతో ముద్దుగా ఉంటుంది, అలాంటి సాక్షాత్తు శివగౌరీ సుతుడైన సుబ్రహ్మణ్యుడిని చూస్తే ఎంత ముద్దు కలుగుతుంది. అంతటి సమ్మోహనా రూపము స్వామిది. అమ్మవారి పద్మము వంటి ముఖమును పోలి ఉన్న ముఖము కలిగినవాడు అని అర్ధం.

శ్రీశాదిదేవగణపూజిత పాద పద్మ అంటే ... సకల దేవతలూ, సాక్షాత్ శ్రీమహాలక్ష్మీ అమ్మవారి చేత పూజింపబడిన పాదపద్మములు ఉన్నవాడు. అంటే లోకములో సకల ఐశ్వర్యాలకూ ఆలవాలము శంకరుడు. అటు మహాలక్ష్మీ అమ్మవారైనా, కుబేరుడైనా ఐశ్వర్యాన్ని శంకరుని అనుగ్రహముతోనే పొందారు. అటువంటి శంకరుడికి, సుబ్రహ్మణ్యుడికి అభేదము. శంకరుడు ఎప్పుడు పుట్టాడో ఎవరికీ తెలియదు, కాబట్టి ఆయన బాల్యంలో ఎలా ఉంటాడో తెలియాలి అంటే సుబ్రహ్మణ్యుడిని చూడాలి. ఇంకో విషయం, లక్ష్మీనారాయణులకి వరసగా చెప్తే సుబ్రహ్మణ్యుడు అల్లుడు. ఎందుకంటే, వల్లీదేవసేనా అమ్మవార్లు ఇద్దరూ మహావిష్ణువు కుమార్తెలే. అలాగే ఇతర దేవతలందరూ స్వామిని పూజిస్తారు. అంతెందుకు, సాక్షాత్ మహావిష్ణు స్వరూపమైన శ్రీరామచంద్రమూర్తికి బాల్యకాండలో విశ్వామిత్రుని చేత ఉపదేశింపబడిన ఆఖ్యానము "స్కందోత్పత్తి". ఆ తర్వాత, రాముడు రావణసంహారముకి వెళ్ళే ముందు, తిరుచెందూర్ క్షేత్రము నందు స్వామిని సేవించి వెళ్ళారు అని అక్కడి స్థల పురాణం చెబుతుంది. అసలు సుబ్రహ్మణ్యుడికి ఉన్న మరో నామమే దేవసేనాపతి, అంటే సకల దేవసేనలకూ అధిపతి. సకలదేవతలచే పూజింపబడిన పాద పద్మములు కల వాడా!! ఓ స్వామినాథా!!

ఇటువంటి స్వరూపము ఉన్న ఓ స్వామినాథా!! మాకు చేయూతనివ్వు, సహాయాన్నందించే చేతులనివ్వు అని ఈ మొదటి శ్లోకములో ప్రార్ధిస్తున్నాము.



దేవాధిదేవనుత దేవగణాధినాథ దేవేంద్ర వంద్య మృదు పంకజ మంజు పాద
దేవర్షి నారద మునీంద్ర సుగీత కీర్తే వల్లీశనాథ మమదేహి కరావలంబం II 2 II
ఈ శ్లోకములో...దేవాధిదేవసుత అని కూడా కొన్ని చోట్ల చదివాను, దేవాధిదేవసుత అంటే సకలదేవతలకు మహాదేవుడైన శంకరుని కుమారుడా అని అర్ధం. కానీ దేవాధిదేవనుత అనే సరి అయినది అని నా భావన.

దేవతలు, వారి అధిదేవతలచే కీర్తింపబడిన వాడా, ఇంద్రునిచే పూజింపబడిన పాదపద్మములు కలవాడా, నారదాది మునీంద్రులు, దేవర్షులచేత కీర్తించబడిన తండ్రీ, వల్లీనాథా మాకు చేయూత నిచ్చి మమ్మల్ని రక్షించు స్వామినాథా!!

నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్ తస్మాత్ ప్రదాన పరిపూరిత భక్తకామ
శృత్యాగమ ప్రణవవాచ్య నిజస్వరూప వల్లీశనాథ మమదేహి కరావలంబం II 3 II

స్వామి వారు, అనేక మంది అన్నార్తులకు, అన్నమును ప్రసాదించి, ఆ ప్రసాద రూపములో సర్వ రోగములను నివారించేవాడు. రోగములు అంటే భౌతికమైన రోగాలే కాక, భవరోగమును కూడా పరిహరించి, తనలో తీసుకునే కారుణ్యం కలిగిన వాడు. భక్తులు కోరిన కోరికలను (ధర్మబద్ధమైన కోర్కెలు) తత్క్షణమే తీర్చేవాడు. సకల వేదాలు, ఆగమాలు, ప్రణవములు ఏ పరబ్రహ్మ స్వరూపాన్ని కీర్తిస్తున్నాయో.... అటువంటి స్వరూపము ఉన్న ఓ వల్లీనాథా మాకు చేయూతనివ్వు, రక్షించు.


క్రౌంచామరేంద్ర పరిఖండన శక్తి శూల పాశాది శస్త్ర పరిమండిత దివ్యపాణే
శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ వల్లీశనాథ మమదేహి కరావలంబం II 4 II

క్రౌంచ పర్వతమును భేదించిన వాడివి, శక్తి, శూలము, ధనుస్సు, బాణములు చేత ధరించి, కుండలములను కర్ణాభరణములుగా కలవాడివై, అమితమైన వేగముతో పయనించే నెమలిని వహనముగా కల ఓ వల్లీనాథా!! మమ్మలను రక్షించు. ఇక్కడ బహుశా కుండలీశ అంటే కేవలం కుండలములను ధరించు వాడు అనే కాకపోవచ్చు, కుండలీ శక్తికి నాథుడు... అంటే వల్లీ అమ్మ వారిని కుండలినీ శక్తికి ప్రతీకగా పెద్దలు చెప్తారు, అటువంటి కుండలినీ శక్తికి ఈశా అంటే నాథుడైన వాడా అని అర్ధం కూడా కావచ్చు.
 
దేవాధిదేవ రథమండల మధ్యవేద్య దేవేంద్ర పీఠనగరం ధృఢచాప హస్తం
శూరం నిహత్య సురకోటి భిరీడ్యమాన వల్లీశనాథ మమదేహి కరావలంబం II 5 II

ఓ దేవాధిదేవా! అనేక మంది దేవసేనల నడుమ రథమును అధిష్ఠించిన వాడివై, ఇంద్రుని రాజ్యమును కాపాడుటకు పూనుకున్న వాడివై, చేత బాణములను, విల్లును పట్టుకుని,
ముఫ్ఫై మూడు కోట్ల మంది దేవతల ప్రార్ధనని మన్నించి సూరపద్మాసురుడు అనే రాక్షసురుడిని సంహరించిన ఓ వల్లీనాథా!! మమ్మల్ని నీ బాహువులచే రక్షించు తండ్రీ.

హారాదిరత్న మణియుక్త కిరీటహార కేయూరకుండల లసత్కవచాభిరామ
హేవీర తారక జయామర బృందవంద్య వల్లీశనాథ మమదేహి కరావలంబం II 6 II

హారములు, రత్నములు, మణులచే పొదగబడిన కిరీటమును ధరించినవాడా, భుజకీర్తులు, కర్ణములకు కుండలములు మరియు వక్షస్థలమునందు కవచమును ధరించినవాడా, తారకాసురుడిని జయించిన వాడా, దేవతలచేత ప్రార్ధింపబడే ఓ వల్లీనాథా! నీ చేతులతో సహాయమునివ్వు.


పంచాక్షరాది మనుమన్త్రిత గాంగతోయైః పంచామృతైః ప్రముదితేంద్ర ముఖైర్మునీంద్రైః
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ వల్లీశనాథ మమదేహి కరావలంబం II 7 II

పంచాక్షరి మొదలైన పవిత్రమైన మంత్రములతోనూ, గంగాది పవిత్ర నదీ జలాలతోనూ, పంచామృతాలతోనూ, ఇంద్రాది దేవతలూ, మునీంద్రులు స్తుతించబడుతూ ఉండగా, హరిహరులచే పట్టాభిషిక్తుడైన ఓ వల్లీనాథా! స్వామీ మాకు చేయూతనివ్వు.

శ్రీకార్తికేయ కరుణామృత పూర్ణదృష్ట్యా కామాదిరోగ కలుషీకృత దుష్ట చిత్తమ్
సిక్త్వాతు మామవ కళాధర కాంతి కాంత్యా వల్లీశనాథ మమదేహి కరావలంబం II 8 II

ఆరుగురు కృత్తికలు, స్తన్యము ఇచ్చిన కారణముగా, స్వామీ నీవు కార్తికేయ అనే నామముతో పిలువబడినావు. ఓ కార్తికేయా! నీ యొక్క కరుణతో కూడిన అమృత దృష్టి మాపై ప్రసరిస్తే చాలు, మాలోని కోరికలను, సకల రోగములను, దుష్ట చిత్తమును నిర్మూలించే వాడా, సకల కళలకూ నిధియైనవాడా, శివుని తేజస్సుతో వెలిగే ఓ వల్లీనాథా! మాకు చేయూతనివ్వు. మమ్మల్ని రక్షించు.
సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం యే పఠన్తి ద్విజోత్తమాః తే సర్వే ముక్తి మాయాన్తి సుబ్రహ్మణ్యప్రసాదతః
సుబ్రహ్మణ్యాష్టక మిదం ప్రాతరుత్ధాయ యః పఠేత్ కోటిజన్మ కృతం పాపం తత్క్షణా దేవనశ్యతి.

ఏ ద్విజులైతే ఈ పుణ్యప్రదమైన సుబ్రహ్మణ్యాష్టకమును నిత్యమూ చదువుతారో, వారికి సుబ్రహ్మణ్యుడు ముక్తిని ప్రసాదించును. ప్రతీ రోజూ ఉదయముననే ఈ అష్టకమును ఎవరైతే పఠిస్తారో, వారు కోటి జన్మలలో చేసిన పాపము, ఒక్క క్షణములో నశించును.

సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

24, డిసెంబర్ 2012, సోమవారం

భగవాన్ క్రోధభట్టారక విరచిత శ్రీఆర్యాద్విశతి - మొత్తం రెండు శతకములు

ఓం శ్రీశారదాయై నమః

 ఓం శ్రీ గురుభ్యో నమః
శ్రీ కామాక్షీ ఏకాంబరేశ్వరుల నిర్హేతుక కృపా కటాక్షముల వలన,  గత కొద్ది నెలలుగా పది భాగాలుగా తెలుగు లిపిలో వ్రాస్తున్న "భగవాన్ క్రోధభట్టారక విరచిత శ్రీఆర్యాద్విశతి" మొత్తం భాగాలు పూర్తి అయ్యాయి. ఇందులోని మొత్తం రెండు శతకాలు (200 శ్లోకాలు) కలిపి ప్రింట్ తీసుకుని పారాయణ చేయడానికి వీలుగా ఒకే PDF పుస్తకంగా చేసి ఈ క్రింద లంకెలో పొందుపరిచాను. కావలసిన వారు ఈ లంకె లోకి వెళ్ళి దానిని ప్రింట్ తీసుకోవచ్చు. 


 భగవాన్ క్రోధభట్టారక విరచిత శ్రీఆర్యాద్విశతి - తెలుగు లిపి
 
అమ్మ అనుగ్రహంతో ఆర్యాద్విశతి తెలుగులిపిలో వ్రాయడానికి సంకల్పించి, వ్రాయడం మొదలు పెట్టినప్పటి నుండి, నిరంతరం ప్రోత్సహిస్తూ, నాకు ఆశీస్సులు, అభినందనలు అందించిన పెద్దలందరికీ నా హృదయ పూర్వక కృతజ్ఞతలు.


ఈ జత చేసిన లిపిలో ఏమైనా అక్షర దోషములు ఉంటే, పెద్దలు తెలియజేయగలరు.

సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు


23, డిసెంబర్ 2012, ఆదివారం

శ్రీ ఆర్యాద్విశతి - 10వ (చివరి) భాగము

ఓమ్ శ్రీమాత్రే నమః
II భగవాన్ క్రోధభట్టారక విరచిత శ్రీ ఆర్యాద్విశతి – 10 (చివరి) భాగము II (శ్రీ లలితాస్తవరత్నమ్)

ఆసితకచ మాయతాక్షం
కుసుమశరం కూల ముద్వహకృపార్ద్రమ్ I
ఆదిమ రసాధిదైవత
మన్తః కలయే హరాఙ్కవాసి మహః II 181 II

కర్ణోపాన్త తరఙ్గిత
కటాక్ష నిష్యన్ది కర్ణదఘ్న కృపామ్ I
కామేశ్వరాఙ్క నిలయాం
కామపి విద్యాం పురాతనీం కలయే II 182 II

అరవిన్ద కాన్త్యరున్తుద
విలోచన ద్వన్ద్వ సున్దర ముఖేన్దుం I
ఛన్దఃకన్దళ మన్దిర
మన్తఃపుర మైన్దుశేఖరం వన్దే II 183 II

బిమ్బ నికురమ్బ డమ్బర
విడమ్బక చ్ఛాయ మమ్బర వలగ్నమ్ I
కమ్బుగళ మమ్బుద కచం
బిబ్బోకం కమపి చుమ్బతు మనోమే II 184 II

శమ్పారుచి చిర గర్హా
సమ్పాదకాన్తి కవచిత దిగ న్తమ్ I
సిద్ధాన్తం నిగమానాం
శుద్ధా న్తం కమపి శూలినః కలయే II 185 II

ఉద్యద్దిన కరశోణా
నుత్పల బన్ధు స్తనన్ధయా పీడాన్ I
కరకలిత పుణ్డ్ర చాపాన్
కలయేకానపి కపర్దినః ప్రాణాన్ II 186 II

రశనా లసజ్జఘనయా
రసనా జీవాతు చాప భాసురయా I
ఘ్రాణాయుష్కర శరయా
ఘ్రాతం చిత్తం కయాపి వాసనయా II 187 II

సరసిజ సహయుధ్వ దృశా
శమ్పాలతికా సనాభి విగ్రహయా I
భాసా కయాపి చేతో
నాసామణి శోభి వదనయా భరితమ్ II 188 II

నవ యావక భాసి
శయాన్వితయా గజయానయా దయావరయా I
ధృత యామినీశ కలయా
ధియా కయాపి క్షతామయా హి వయమ్ II 189 II

అలమల మకుసుమ బాణై
రబిమ్బశోణై రపుణ్డ్ర కోదణ్డైః I
అకుముద బాన్ధవ చూడై
రన్తైరిహ జగతి దైవతం మన్యైః II 190 II

కువలయ సదృక్ష నయనైః
కులగిరి కూటస్థ బన్ధు కుచభారైః I
కరుణాస్యన్ది కటాక్షైః
కవచిత చిత్తోస్మి కతిపయైః కుతుకైః II 191 II

నతజన సులభాయ నమో
నాళీక సనాభిలోచనాయ నమః I
నన్దిత గిరిశాయ నమో
మహసే నవనీప పాటలాయ నమః II 192 II

కాదమ్బ కుసుమ దామ్నే
కాయాచ్ఛాయా కణాయితార్యమ్ణే I
సీమ్నే చిర న్తనగిరాం
భూమ్నే కస్మైచిదాదదే ప్రణతిమ్ II 193 II

కుటిల కబరీ భరేభ్యః
కుఙ్కుమ సబ్రహ్మచారి కిరణేభ్యః I
కూలఙ్కష స్తనేభ్యః
కుర్మః ప్రణతిం కులాద్రి కుతుకేభ్యః II 194 II

కోకనద శోణవసనాత్
కోమల చికురాళి విజిత శైవలాత్ I
ఉత్పల సగన్ధి నయనా
దూరీకుర్మోన దేవతా మన్యామ్ II 195 II

ఆపాటలాధరాణా
మానీల స్నిగ్ధ బర్బర కచానామ్ I
ఆమ్నాయ జీవనానా
మాకూతానాం హరస్య దాసోస్మి II 196 II

పుఙ్ఖిత విలాస హాస
స్ఫురితాను పురాహితాఙ్క నిలయాసు I
మగ్నం మనో మదీయం
కాస్వపి కామారి జీవనాడీషు II 197 II


II లలితా కవచము II

లలితా పాతు శిరోమే
లలాట మమ్బా చ మధుమతీ రూపా I
భ్రూమధ్యం చ భవానీ
పుష్ప శరా పాతు లోచన ద్వన్ద్వమ్ II 1 II

పాయా న్నాసాం బాలా
సుభగా దన్తాంశ్చ సున్దరీ జుహ్వామ్ I
అధరోష్ఠ మాదిశక్తిః
చక్రేశీ పాతు మే సదా చుబుకమ్ II 2 II

కామేశ్వరీ చ కర్ణౌ
కామాక్షీ పాతు గణ్డయో ర్యుగళమ్ I
శృఙ్గార నాయికావ్యాద్
వక్త్రం సింహాసనేశ్వరీ చ గళమ్ II 3 II

స్కన్ద ప్రసూశ్చ పాతు
స్కన్ధౌ బహు చ పాటలాఙ్గీ మే I
పాణీ చ పద్మనిలయా
పాయా దనిశం నఖావళిం విజయా II 4 II

కోదణ్డినీ చ వక్షః
కుక్షిం చావ్యాత్ కులాచల తనూజా I
కల్యాణీ చ వలగ్నం
కటిం చ పాయాత్ కలాధర శిఖణ్డా II 5 II

ఊరుద్వయం చ పాయా
దుమా మృడానీ చ జానునీ రక్షేత్ I
జఙ్ఘే తు షోడశీ మే
పాయాత్పాదౌ చ పాశసృణిహస్తా II 6 II

ప్రాతః పాతు పరా మాం
మధ్యాహ్నే పాతు మణిగృహాధీశా I
శర్వాణ్యవతు చ సాయం
పాయాద్రాత్రౌ చ భైరవీ సాక్షాత్ II 7 II

భార్యాం రక్షతు గౌరీ
పాయాత్ పుత్రాంశ్చ బిన్దుగృహేపీఠా I
శ్రీవిద్యా చ యశోమే
శీలం చావ్యా చ్చిరం మహారాజ్ఞీ II 8 II

పవనమయి! పావకమయి!
క్షోణిమయి! వ్యోమమయి! కృపీటమయి!
రవిమయి! శశిమయి! దిజ్మయి!
సమయమయి! ప్రాణమయి! శివేపాహి II 9 II

కాళీ! కపాలిని! శూలిని!
భైరవి! మాతఙ్గి! పఞ్చమి! త్రిపురే!
వాగ్దేవి! విన్ధ్యవాసిని!
బాలే! భువనేశి! పాలయ! చిరం మామ్ II 10 II

II ధ్యాన భేదన ఫలభేదన కథనమ్ II
అభినవ సిన్దూరాభా
మమ్బ! త్వాం చిన్తయన్తి యే హృదయే I
ఉపరి నిపతన్తి తేషా
ముత్పల నయనా కటాక్ష కల్లోలాః II 1 II

వర్గాష్టక మిళితాభి
ర్వశినీ ముఖ్యాభి రావృతాం భవతీమ్ I
చిన్తయతాం సితవర్ణాం
వాచో నిర్యాన్త్యయత్నతో వదనాత్ II 2 II

కనక శలాకా గౌరీం-
కర్ణవ్యాలోల కుణ్డల ద్వితయామ్ I
ప్రహసిత ముఖీఞ్చ భవతీం
ధ్యాయ న్తే త ఏవ భూధనదాః II 3 II

శీర్షామ్భోరుహ మధ్యే
శీతల పీయూష వర్షిణీం భవతీమ్ I
అనుదిన మనుచి న్తయతా
మాయుష్యం భవతి పుష్కల మవన్యామ్ II 4 II

మధురస్మితాం మదారుణ
నయనాం మాతఙ్గకుమ్భ వక్షోజామ్ I
చన్ద్రావతంసినీం త్వాం
సవిధే పశ్యన్తి సుకృతినః కేచిత్ II 5 II

లలితాయాః స్తవరత్నం
లలితపదాభిః ప్రణీత మార్యాభిః I
అనుదిన మవనౌ పఠతాం
ఫలాని వక్తుం ప్రగల్భతే సైవ II 6 II

చతుర్భుజే! చన్ద్రకలావతంసే!
కుచోన్నతే! కుఙ్కుమరాగశోణే I
పుణ్డ్రేక్షు చాపాఙ్కుశ పుష్పబాణ
హస్తే నమస్తే జగదేకమాతః II 7 II

అరుణాం కరుణా తరఙ్గితాక్షీం
ధృత పాశాఙ్కుశ పుష్ప బాణ చాపామ్ I
అణిమాధిభి రావృతాం మయూఖై
రహ మిత్యేవ విభావయే భవానీమ్ II 8 II
  


ఇతి శ్రీమదాదిశైవైః తత్రభవద్భిః క్రోధభట్టారాకైః
శ్రీదుర్వాసోమహర్షిభిః సందృశ్య ప్రత్యక్షతః శ్రీపురం సంవర్ణితమ్.
శ్రీఆర్యాద్విశతీ స్తోత్రరత్నాఖ్యం శ్రీలలితా స్తవరత్నం సమ్పూర్ణమ్.


సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు 

 

18, డిసెంబర్ 2012, మంగళవారం

శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి - శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననము



II శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి - శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి జననము II

ఓం శ్రీ గురుభ్యో నమః
ఓం శ్రీ మహాగణపతయే నమః
ఓం శ్రీ వల్లీసేనాసమేత సుబ్రహ్మణ్యస్వామినే నమః
ఓం శ్రీమాత్రే నమః
ఓం నమః శివాయ
ఓం శ్రీసీతారామచంద్రపరబ్రహ్మణే నమః
ఓం శ్రీ హనుమతే నమః
“మాసానాం మార్గశీర్షోహమ్” అన్నాడు గీతాచార్యుడు. ఇలా అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఏకాదశీ దేవి యొక్క ఆవిర్భావము మార్గశీర్ష శుక్ల ఏకాదశినాడు. ఈ మార్గశీర్ష మాసములోనే శ్రీసుబ్రహ్మణ్యషష్ఠి వస్తుంది. ఈరోజు మార్గశీర్ష శుక్ల షష్ఠి. లోకసంరక్షణార్ధం, ఎప్పుడూ పరమశివుని తేజముగా ఉండే సుబ్రహ్మణ్యస్వామి వారు, ప్రకటముగా అవతారము దాల్చిన రోజు ఈ రోజు. ఇటువంటి పరమపవిత్రమైన రోజున స్వామి వారి ఆవిర్భావము ఎలా జరిగింది, సుబ్రహ్మణ్యుని నామముల గురించి స్మరించి స్వామి వారి కృపకి పాత్రులము అవుదాము.



సుబ్రహ్మణ్య జననము – షష్ఠి ప్రాశస్త్యముః
సుబ్రహ్మణ్య జననము, స్వామి తారకాసుర వధగావించడమూ మొదలైన ఘట్టాలు మనకు అనేక పురాణ, ఇతిహాస, ఉపనిషత్తులలో కనబడుతుంది. ప్రఖ్యాతముగా శ్రీరామాయణం బాలకాండలో విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తికి స్కందోత్పత్తి ఆఖ్యానము చెప్తారు. అలాగే మహాభారతములో శల్యపర్వములో కూడా సుబ్రహ్మణ్యుని ఆవిర్భావ ఘట్టం చెప్పబడినది. ఇవేకాక, మహాకవి కాళిదాసు గారు వ్రాసిన కుమార సంభవము అనే కావ్యము లోకప్రసిద్ధము. పూజ్య గురువు గారి ప్రవచనముల నుండి విన్నవి, పురాణ/ఇతిహాసముల నుండి అమ్మ చదివించిన మేరకు, గుర్తున్నంత మేరకు స్వామి వారి జనన విశేషాలు ఇక్కడ స్మరిస్తున్నాను.
పరమశివునికి ఆవాసమై, రమణీయ, కమనీయ మహనీయ సుందర కుసుమ సౌరభాన్ని నాలుగు దిక్కులకు వెదజల్లు కైలాస గిరీంద్రము, ఆ కైలాసము వర్ణింపశక్యము కానిది. అందులో ఉన్న వనములు ఆరు ఋతువులలో పూసి, ఫలించి శివమహాత్మ్యాన్ని ప్రపంచానికి అందిస్తున్నాయి.

గండుతుమ్మెదలు అచటగల పూలచుట్టూ ఝుంకారము కావిస్తూ అందులో కల మకరందాన్ని గ్రోలడం, చూపరులకాహ్లాదాన్ని అందిస్తున్నాయి. ఆ కైలాస గుహలలో మహర్షులు వేలాది సంవత్సరాలు శంకరుని గూర్చి తపోనిష్టాగరిష్ఠులై ఎచట చూసినా గానవస్తారు.

అమ్మవారి అయ్యవారి కళ్యాణానంతరము, పార్వతీఅమ్మవారితో కలిసి పరమశివుడు ఆ కైలాసము నందు వేయి సంవత్సరాలు శృంగారలీలాకళోస్సాల హృదయులై క్రీడిస్తూ గడుపుతున్నారు. అది ఆదిదంపతుల ఆనందనిలయముగా లోకాలన్నిటికీ ఆదర్శవంతమై ఉన్నది.


సురస్థిరసాధ్య విద్యాధరాదులు, తారకాసురుడు పెడుతున్న బాధలు భరింపలేకుండా ఉన్నారు. వాడు బ్రహ్మగారిచే ఒక వరం పొందాడు, అది ఏమిటంటే, పరమశివుని వీర్యమునకు జన్మించిన వాడి చేతిలోనే తారకాసురుడు సంహరింపబడతాడు. శివుడు అంటే కామమును గెలిచిన వాడు, ఆయన ఎప్పుడు తనలోతానే రమిస్తూ ఆత్మస్థితిలో ఉంటాడు కదా, ఆయనకి పుత్రుడు ఎలా కలుగుతాడులే అనుకుని, తారకాసురుడు, దేవతలందరినీ బాధపెడుతున్నాడు.


శివవీర్యమునకు జన్మించే ఆ బాలుడు ఎప్పుడు ఉద్భవిస్తాడా అని సకల దేవతలూ అహోరాత్రులూ ఎదురుచూస్తున్నారు. అందుకోసం, దేవతలందరూ కలిసి, సత్యలోకమునకు వెళ్ళి, అక్కడ వాణీనాథుడైన చతుర్ముఖ బ్రహ్మ గారిని దర్శించి, అక్కడి నుంచి బ్రహ్మగారితో సహా శ్రీమన్నారాయణుని దర్శించి తారకాసురుడు పెడుతున్న బాధలన్నీ ఏకరువు పెట్టారు. అప్పుడు స్థితికారుడైన శ్రీమహావిష్ణువు అన్నారు…”బ్రహ్మాదిదేవతలారా! మీ కష్టాలు త్వరలో తీరుతాయి. మీరు కొంత కాలము క్షమాగుణముతో ఓపిక పట్టండి..” అని ఓదార్చారు.


అప్పుడు దేవతలందరికీ ఒక శంక కలుగుతుంది, పరమశివుని తేజస్సు అమ్మవారి యందు నిక్షిప్తమైతే, ఆ వచ్చే శక్తిని మనము తట్టుకోగలమా అని ఒక వెర్రి ఆలోచన చేసి, దేవతలంతా కైలాసానికి పయనమయ్యారు. అచ్చటికి వెళ్ళి పరమశివ పార్వతీ అమ్మవారి క్రీడాభవన ముఖ ద్వారము వద్ద నిలచి దేవాదిదేవా! ప్రభూ మహాఆర్తులము, నీ కరుణా కటాక్షముతో మమ్ము రక్షింపుమని, తారకాసురుని బాధలనుండి కాపాడమని, మీ యొక్క తేజస్సుని, అమ్మవారి యందు నిక్షిప్తము చేయవద్దు అని ప్రార్ధిస్తారు. భక్తవశంకరుడు అయిన పరమశివుడు, పార్వతీ అమ్మవారితో సంతోషముగా గడుపుతున్నవాడు, దేవతల ఆర్తనాదాలను విన్నవాడై బయటకి వచ్చాడు. దేవతల ప్రార్ధన విన్న శంకరుడు, ఇప్పటికే నా తేజస్సు హృదయ స్థానము నుండీ విడివడినది కావున, నాతేజస్సుని భరించగలిగిన వారు ముందుకు రండి అని చెప్తారు. పరమశివుని తేజస్సు అమ్మవారు పొంది, తను మాత్రుమూర్తిని అయ్యే అవకాశాన్ని దేవతల యొక్క తొందరపాటుతనంతో దూరం చేసినందుకు గానూ, అంతట అమ్మవారు ఆగ్రహము చెందినదై, దేవతలందరినీ శపిస్తుంది, నాకు సంతానము కలుగకుండా అడ్డుకున్నారు కనుక, ఇకమీదట దేవతలెవరికీ సంతానము కలుగదు అని. అందుకే అప్పటి నుంచి దేవతల సంఖ్య పెరగదు, కేవలం ముఫ్ఫైమూడుకోట్ల మంది అంతే.


అప్పుడు దేవతలందరి ప్రార్ధన మీద హవ్యవాహనుడు, ఆ శివతేజాన్ని తాను స్వీకరిస్తాడు. తీసుకోవడం అయితే తీసుకున్నాడు కానీ, శివుని తేజస్సుని ధరించడం అంటే అంత తేలికా… అంతట అగ్నిదేవుడు ఆ తేజస్సు యొక్క తాపాన్ని తట్టుకోలేకపోయాడు. అప్పుడు శివుని ఆజ్ఞ మేరకు, అగ్నిదేవుడు ఆ శివతేజస్సుని భూమాత యందు ప్రవేశ పెడతాడు. అంతటి తేజస్సుని భరించలేక భూమాత కూడా, వెళ్ళి గంగామాతని ప్రార్ధిస్తుంది. అప్పుడు గంగా అమ్మ వారు ఆ శివతేజాన్ని స్వీకరిస్తుంది. అంతటి గంగా నది కూడా ఆ తాపాన్ని తట్టుకోలేక, కైలాస శిఖరముల దగ్గరలో ఉన్న శరవణము అనే రెల్లుపొదల తటాకము నందు విడిచిపెడుతుంది. ఆ రెల్లుపొదల తటాకము నుండి, ఆరుముఖములతో, పన్నెండు చేతులతో, దివ్యమంగళ స్వరూపుడై, మార్గశీర్ష శుక్లషష్ఠినాడు, ఒక బాలుడు ఉద్భవించాడు. ఆయనే మన బుజ్జి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారు. ఆయన పుట్టగానే, ఆరుగురు కృత్తికా నక్షత్రములు వచ్చి వారి స్తన్యమిచ్చాయి కావున, స్వామివారికి, కార్తికేయ అనీ, పుట్టగానే ఆరుముఖములతో ఉండడం వలన స్వామికి ఆరుముగన్ అనీ, షణ్ముఖ అనీ నామము వచ్చినది. షణ్ముఖుడు పుట్టగానే దేవతలు ఆ బాలునిపై పుష్పవర్షము కురిపించారు. దేవదుందుభిలు మ్రోగించారు. దేవతలందరూ పరమానందభరితులయ్యారు.


శరవణ అనే తటాకము నుండి ఉద్భవించిన కారణముగా స్వామికి శరవణభవ అని నామము వచ్చినది. ఇంతలో గంగమ్మ కూడా వచ్చి, కొంతసేపు నేను కూడా శివతేజాన్ని భరించాను కాబట్టి, నాకు కూడా కుమారుడే అని చెప్పింది. అప్పటి నుంచి స్వామికి గాంగేయ అని నామము వచ్చినది. అలాగే అగ్నిదేవుడు కూడా చెప్పడంతో, వహ్నిగర్భ, అగ్నిసంభవ అనే నామములు వచ్చాయి. దేవతలను రక్షించుటకొరకై శివుని నుండి, స్ఖలనమై వచ్చాడు కావున స్వామికి స్కంద అనే నామము వచ్చినది. అలాగే క్రౌంచపర్వతమును భేదించడం వలన, క్రౌంచధారణుడు అని పిలువబడ్డారు. తమిళనాట స్వామి వారిని మురుగన్, కందా, వెట్రివేల్, వేలాయుధన్, షణ్ముగన్, ఆరుముగన్, శక్తివేల్, పళని ఆండవన్ అని అనేక నామములతో కొలుచుకుని వాళ్ల యొక్క ఇష్టదైవముగా చేసుకున్నారు.


సరే ఇంతమందికి పుత్రుడైనాడు, మరి మన జగన్మాత పార్వతీమాతకి సుబ్రహ్మణ్యుడు ఎలా పుత్రుడైనాడు… అని అడిగితే, త్రిపురారహస్యంలో మాహాత్మ్య ఖండము నందు, బ్రహ్మగారి మానసపుత్రుడైన సనత్కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా వచ్చారని చెప్పబడినది. ఒకనాడు సనత్కుమారుడు తపస్సు చేసుకుంటూ ఉండగా, శివపార్వతులు ఆయన తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమవుతారు. నీకు వరం ఇస్తాము కోరుకోమంటాడు శివుడు. అప్పుడు అద్వైత స్థాయిలో బ్రహ్మానందము అనుభవిస్తున్న సనత్కుమారుడు, నాకు వరం అక్కర్లేదు. ఇవ్వడానికి నువ్వొకడివి, నేనొకడిని అని ఉంటేగా నువ్వు ఇచ్చేది. ఉన్నది అంతా ఒకటే కాబట్టి, నాకే వరమూ అవసరం లేదు అని చెప్తాడు. అప్పుడు శంకరుడు ఆగ్రహం చెందినట్లుగా, వరం ఇస్తాను అంటే వద్దంటావా.. శపిస్తాను అంటారు శంకరుడు. అంతట సనత్కుమారుడు, వరమూ, శాపమూ అని మళ్ళీ రెండు ఉన్నాయా, వరమైతే సుఖమూ, శాపమైతే దుఃఖము అని రెండు లేనప్పుడు, నువ్వు వరమిస్తే ఏమిటి, శాపమిస్తే ఏమిటి? ఇస్తే ఇవ్వండి అని ఆయన యథావిధిగా ధ్యాననిమగ్నుడౌతాడు. అంతట ఆతని తపస్సుకి మెచ్చిన శంకరుడు, సరే నేనే నిన్ను ఒక వరము అడుగుతాను అంటే, ఏమి కావాలి అని అడుగుతాడు. అప్పుడు శంకరుడు మాకు పుత్రుడిగా జన్మించమని కోరతాడు. దానికి సనత్కుమారుడు శంకరుడితో “నేను నీకు మాత్రమే కుమారుడిగా వస్తాను…” అని చెప్తాడు. ఇదంతా వింటున్న పార్వతీ అమ్మవారు ఒక్కసారి ఉలిక్కిపడి…”ఇదేమిటి!! శంకరుడికి పుత్రుడిగా వస్తాననడం ఏమిటి, నీకు మాత్రమే అని అంటూన్నావు అని అడిగితే..” అప్పుడు సనత్కుమారుడు చెప్తాడు..”శివుడు వరం అడిగితే అవునన్నాను కానీ, కోరి కోరి మళ్ళీ గర్భవాసం చేసి, యోనిసంభవుడిగా రానమ్మా…. నన్ను క్షమించు” అని చెప్తాడు. నీ కోరిక నెరవేరడానికి, ఒకనాడు నీవు మోహినీ అవతారములో ఉన్నప్పుడు, కైలాస పర్వత సమీపములో జలరూపములో నీ అవతారం ముగించావు. ఆ జలం ఎక్కడైతే ఉన్నదో అదే తటాకము నుండీ నేను ఉద్భవిస్తాను. కాబట్టి నేను నీకు కూడా కుమారుడినే అని చెప్పి నమస్కరిస్తాడు.


సుబ్రహ్మణ్యుడు అనే నామము ఎలా వచ్చిందీ అంటే, ఒకనాడు బ్రహ్మగారికి మరియు పరమశివునికి కూడా ప్రణవార్ధం బోధించినవాడు కావున స్వామి సు-బ్రహ్మణ్య అంటే బ్రహ్మజ్ఞాని అని పిలువబడ్డాడు. అంతేకాదు, పుత్రాదిఛ్చేత్ పరాజయం అని చెప్పినట్లుగా, శంకరుడు, కుమారుని నుండీ ప్రణవార్ధం విన్నాడు కాబట్టి, శివగురు లేదా స్వామినాథ అనే నామముకూడా స్వామికలదు.


సుబ్రహ్మణ్యస్వామి వారిని మన ఆంధ్రదేశములో సుబారాయుడిగా పూజిస్తారు. బాలుడిగా ఉండేవాడు, కుత్సితులను సంహరించేవాడూ, మన్మథుని వలె అందముగా అందముగా ఉండేవాడు అని కుమారస్వామి అనే నామం వచ్చింది. అసలు లోకములో కుమార అనే శబ్దం కానీ, అలాగే స్వామి అనే శబ్దం కానీ సుబ్రహ్మణ్యుడికే చెందినవి.


అలాగే స్వామి వారికి గల అనేక నామములలో “గురుగుహా” అనే నామము కలదు. గురుగుహా అంటే, ఇక్కడే మన హృదయ గుహలలో కొలువై ఉన్న గురుస్వరూపము. సుబ్రహ్మణ్యుడు సాక్షాత్తు శంకరుడికే బోధించిన గురుస్వరూపము. (ఇక్కడ పరమశివుని తక్కువచేయటం అని కాదు, ఏ తండ్రికైనా తన కొడుకు చేతిలో పరాభవం గొప్ప భూషణంగా, ఆనందముగా భావిస్తాడు..) ఈ గురుగుహా అనే నామమును, ప్రఖ్యాత వాగ్గేయకారుడు, సుబ్రహ్మణ్య అనుగ్రహ ప్రాప్తుడు శ్రీముత్తుస్వామిదీక్షితార్ గారు, ఆయన వ్రాసిన అన్ని కీర్తనలలోనూ గురుగుహా అనే నామంతో కలిపి చేశారు. అలాగే అరుణగిరినాథర్ తిరుప్పుగళ్ అనే గొప్ప తమిళకీర్తనలను కుమారస్వామి వారిపై రచించాడు.


వల్లీ అమ్మవారు, దేవసేనా అమ్మ ఇద్దరూ మహావిష్ణువు కుమార్తెలు. దేవసేనా అమ్మని ఇంద్రుని దగ్గర పెంచమని ఇస్తే, ఇంద్రుడు, ఆయన దగ్గర ఉన్న ఐరావతానికి ఆ బాధ్యత అప్పజెప్తారు, తమిళంలో ఏనుగు అంటే యానై, దేవతల ఏనుగు పెంచడంవల్ల దేవయాని అనే పేరు వచ్చింది. అలాగే వల్లీ అమ్మవారు, ఒక భిల్లరాజు వద్ద పెరుగుతుంది. భిల్లరాజు అంటే అరణ్యములలో ఉండే గిరిజన నాయకుడు. వల్లీ అమ్మవారు మన శరీరములో ఉండే కుండలినీ శక్తికి ప్రతీక. అలాగే స్వామి వారి ఇద్దరు శక్తులైన వల్లీ దేవసేనా అమ్మవార్లు ఇఛ్చాశక్తి, జ్ఞానశక్తిలకు ప్రతీక.స్వామి వారు ఇఛ్చాశక్తి, జ్ఞానశక్తిలతో కూడిన క్రియాశక్తి స్వరూపమైన పరబ్రహ్మ స్వరూపము.


కేశి అనే పేరుగల రాక్షసుడు దేవసేన అమ్మని బంధించి తీసుకుని పోవుతుండగా దేవేంద్రుడు అడ్డుపడి వజ్రాయుధముతో ఆ రాక్షసుని సంహరించి, ఆమెను శరవణాతటాకము నందు జన్మించిన సుబ్రహ్మణ్యుడికిచ్చి వివాహం చేయతలంచెను.


సంస్కృత భారతములో వేదవ్యాసుల వారు షష్ఠీ ప్రాశస్త్యమును తెలుపుతూ “తస్మాత్ షష్ఠీ మహాతిథిః” అని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి దేవీభాగవతములో ఒక కథ కూడా కలదు.


పూర్వం స్వాయంభువమనువునకు ఉత్తానపాదుడు, ప్రయవ్రతుడు అని ఇద్దరు కుమారులు కలరు. ఉత్తానపాదుడు ధృవుడు అన్న విషయం అందరికీ తెలిసినదే. ప్రియవ్రతుడు విరక్తి భావము కలవాడై ప్రవృత్తి భావము నందు అభిలాషలేక మోక్షగామియై తపస్సు చేయ పూనుకునెను.


ఆయన తపస్సుకి మెచ్చిన బ్రహ్మగారు ప్రత్యక్షమవగా, ప్రియవ్రతుడు..”ఈ జీవితము అశాశ్వతము, భోగభాగ్యాలు ఇంకా అశాశ్వతము, జీవితము క్షణభంగురము, నేను రాజ్యము చేయకోరిక లేనివాడనై ఈ తపస్సు చేస్తున్నాను” అని చెప్తాడు. అప్పుడు బ్రహ్మగారు, “ఓ రాజా! నిండు సంసారమును విడిచి క్లేశమును పొందుతూ తపస్సు చేయుట వలన ఎట్టి లాభమూ లేదు. కనుక నీవు వివాహము చేసుకుని రాజ్యపాలన చేయుము” అని చెప్తారు.


బ్రహ్మౌపదేశము మీద, ప్రియవ్రతుడు తపస్సుని విరమించి, మాలతి అనే స్త్రీని వివాహమాడి ధర్మనిష్ఠతో రాజ్యపాలన చేస్తూ ఉండెను. పుత్రసంతతి కోసం అతడు పుత్రకామేష్ఠి చేయగా పుత్రుడు కలిగెను. కానీ ఆ పిల్లవాడు మరణించి ఉండెను. ప్రియవ్రతుడు ఆ శవమును భుజముపై వేసుకొని, శ్మశానమునకు వెళ్ళి ఖననం చేయ ప్రయత్నంలో ఉండగా, ప్రియవ్రతుడు, ఆయన వెంట వచ్చినవారు అందరూ ఎంతగానో దుఃఖించిరి. ఆ అర్ధరాత్రి సమయమున ఆకాశములో ఒక మెరుపు కనిపించెను. నిలకడగా చూస్తే అది మెరుపు కాదు, ప్రకాశించుచున్న దివ్యవిమానము. ఆ విమానము ప్రియవ్రతుని సమీపమునకు చేరెను. ఆ విమానము నుండి ఒక తేజోమూర్తి యైన స్త్రీమూర్తి దర్శమిచ్చి ప్రియవ్రతునితో …”నేను ఆదిపరాశక్తి ఆరవ అంశతో అవతరించినదానను కావున నన్ను షష్ఠీ దేవి అని పిలుస్తారు. దేవసేన అని మరిఒక పేరు కూడా కలదు. నేను సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారికి ధర్మపత్నిని. నా దర్శనము వృధా కాదు. ఎవరికేమి కావలసినా ఈయగలను. నీ కుమారుడిని బ్రతికించెదనని”, ఆ ప్రియవ్రతుని కుమారునికి ప్రాణము పోసెను. అంతట ఆ పిల్లవాడికి సువ్రతుడు అని నామకరణం చేసెను. ప్రియవ్రతుడు ఎంతగానో సంతోషించెను. ఇంకా దేవసేనా అమ్మవారు ప్రియవ్రతునితో ఇట్లు పలికెను..” ఓ ప్రియవ్రతా! మీరందరు షష్ఠి వ్రతము చేయుడు. మార్గశీర్ష శుక్ల షష్ఠి నాడు షష్ఠీ వ్రతమునారంభించి ప్రతీ నెలలోనూ వచ్చిన శుద్ధ షష్ఠి నాడు ఈ వ్రతము సంవత్సర కాలము చేసినచో సత్పురుష సంతానము కలుగును” అని సకల జనులకు వరమునిచ్చి అమ్మవారు అంతర్ధానము అయ్యెను.


వల్లీదేవసేనాసమేత సుబ్రహ్మణ్యారాధన చేసిన వారికి తప్పక సత్సంతానము కలుగును. స్వామి అనుగ్రహం వల్ల, సమస్త శుభములు సర్వులకూ లభించును.


సుబ్రహ్మణ్యస్వామి వారి క్షేత్రాలు తమిళనాడులో ఆరుపడైవీడు అనే పేరున, స్వామి వారి ఆరు ముఖములకు ప్రతీకగా ఆరు క్షేత్రాలలో స్వామి వెలిశారు. అవే పళని, తిరుత్తణి, స్వామిమలై, తిరుచెందూర్, తిరుప్పరంకుండ్రం, పళముదిచ్చొళై. తమిళనాట అనేక మంది భక్తులు విశేషమైన సుబ్రహ్మణ్యారాధన చేస్తారు.


అలాగే కర్నాటక రాష్ట్రము నందు, మూడు ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాలు కలవు. అవి ఆదిసుబ్రహ్మణ్య (కుక్కే సుబ్రహ్మణ్య), మధ్య సుబ్రహ్మణ్య (ఘాటి సుబ్రహ్మణ్య) మరియు అంత్య సుబ్రహ్మణ్య (నాగలమడక సుబ్రహ్మణ్య) అనే మూడు అద్భుతమైన క్షేత్రాలు. ఈ మూడూ కలిపితే ఒక సర్పాకారం ఏర్పడుతుంది అని, ఈ మూడు క్షేత్రాలను ఎవరు దర్శించి స్వామిని ఆరాధిస్తారో, వారికి ఉన్న సకల కుజ, రాహు, కేతు దోషములు, సకల నవగ్రహ దోషములు పరిహరింపబడి, స్వామి అనుగ్రహమును పొంది, సకల అభీష్టములు పొందుతారు. ఇది సత్యం సత్యం పునః సత్యం.

అలాగే మన తెలుగునాట కూడా, అనేక పుణ్యక్షేత్రాలలో స్వామి వెలసి ఉన్నారు. తిరుమలలో ఆనంద నిలయములో కొలువై ఉన్న శ్రీవేంకటేశ్వర స్వామి వారు సాక్షాత్ సుబ్రహ్మణ్యుడిగా కొలిచే పెద్దలు ఎందరో ఉన్నారు. అందుకే అక్కడ స్వామి పుష్కరిణి అనే నామము, తిరుమలేశునికి స్వామి అనే నామము వచ్చాయి అని పెద్దలు విశ్వసిస్తారు. అలాగే కృష్ణా జిల్లాలోని మోపిదేవి, తూర్పుగోదావరిజిల్లాలో మల్లవరం క్షేత్రము మొదలైనవి. ఈ మల్లవరం క్షేత్రంలో వెలిసిన సుబ్రహ్మణ్యుని గురించి పూజ్య గురువు గారు అనేకసార్లు ప్రవచనములలో చెప్పి ఉన్నారు. అలాగే బెజవాడ దుర్గమ్మ ఆలయములో గుట్టపై వెలిసిన స్వామి.


కొలిచిన వారికి కొంగుబంగారమై, అభీష్టములు నెరవేర్చి, ఆయన పాదములను పట్టుకున్న వారికి ధర్మార్ధకామములతో పాటు మోక్షమును కూడా ఇవ్వగలిగిన వాడు, అవ్యాజకరుణామూర్తి, ఎప్పుడూ చిద్విలాసముతో చిరునవ్వులొలికిస్తూ ఉండే నా బుజ్జి తండ్రి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహ కటాక్షములు మనందరిమీదా వర్షించాలని, బయటా, మనలోపలా ఉన్న ఆసురీ ప్రవృత్తిని సంహరించి, మనల్ని ధర్మమార్గములో నడపాలనీ, మన సనాతన ధర్మమును పరిరక్షించాలనీ, గురుగుహా స్వరూపములో మన అజ్ఞానతిమిరాలను పారద్రోలాలనీ శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి పాదములు పట్టి ప్రార్ధిస్తున్నాను.

సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు