21, సెప్టెంబర్ 2011, బుధవారం

మూక శంకరులు అందించిన మధుర ఫలం మూక పంచశతి


శ్రీ గురుభ్యో నమః


గురుమూర్తే త్వాం నమామి కామాక్షీ


మూక పంచశతి - మూక శంకరులు
జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకర భాగవత్పాదాచార్యుల వారు దిగ్విజయములను పూర్తి చేసిన తరువాత మోక్షపురి అయిన కాంచీపురం లో సర్వజ్ఞ పీఠం స్థాపించారు, అదే మన కంచి కామకోటి పీఠం. ఆది శంకరుల తరువాత ఈ పీఠమును అధిష్టించిన వారు శ్రీ సురేశ్వరాచార్యుల వారు. వారి తరువాత ఉత్తరాధికారం శ్రీ సర్వజ్ఞాత్మన్ సరస్వతి స్వామి వారు నిర్వహించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు నిరంతర జగద్గురు పరంపర కొనసాగుతూనే ఉంది. 

శంకర భగవత్పాదాచార్యులు

ఆ గురుపరంపర లో మనకు తెలిసిన ప్రఖ్యాతి గాంచిన జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ కృపా శంకరులు, శ్రీ శ్రీ శ్రీ మూక శంకరులు, శ్రీ శ్రీ శ్రీ అభినవ శంకరులు, శ్రీ శ్రీ శ్రీ పరమశివేంద్ర సరస్వతి, శ్రీ శ్రీ శ్రీ భోధేంద్ర సరస్వతి మరియు ఈ తరములో ఉన్న మనందరికీ తెలిసిన అరవై ఎనిమిదవ పీఠాధిపతి నడిచే దేవుడు, పరమాచార్య శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. శ్రీ పరమాచార్య తరువాత ప్రస్తుత తరములో ఉన్న జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు మరియు శ్రీ శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారు. 
కామకోటి పీఠం సైట్ సౌజన్యంతో.. 
ఈ ఆచార్య పరంపరలో 20 వ పీఠాధిపతి గా ఉన్న వారు శ్రీ శ్రీ శ్రీ మూక శంకరేంద్ర సరస్వతి స్వామి వారు. వీరినే మనం మూక శంకరులు అని అంటాము. వీరు క్రీస్తు శకం 398 నుండి 437 వరకు పీఠాధిపతిగా ఉన్నారు. వీరి తండ్రి గారి పేరు శ్రీ విద్యావతి, వారు ఒక ఖగోళ జ్యోతిష్యుడు. మూక శంకరులు పుట్టుకతోనే మూగ-చెవుడు ఉన్నవారు. అందుచేతనే వీరిని మూక కవి అనేవారు. కానీ అమ్మ వారి కటాక్షం ఉంటే, పుట్టుకతో మాటలు రాని వాడు మాట్లాడతాడు అనడానికి మూక శంకరుల జీవితమే నిదర్శనం.
ఒక రోజు మూక శంకరులు కామాక్షీ అమ్మ వారి ఆలయంలో కూర్చుని ఉన్నారు. వారితో పాటు వేరొక సాధకుడు కూడా అమ్మని ధ్యానిస్తూ కూర్చున్నారు. కామాక్షీ అమ్మ వీరిని అనుగ్రహించదలిచి, కర చరణాదులతో ఒక స్త్రీ రూపంలో కదలి వచ్చింది. అలా వచ్చిన అమ్మ వారు తాంబూల చర్వణం చేస్తూ, అమ్మ నోటిలోంచి ఆ తాంబూలం ముద్ద (పిడచ) కొంచెం తీసి మూక శంకరుల ప్రక్కన ఉన్న సాధకుడికి ఇచ్చింది. ఆయన పాపం అమ్మ యొక్క ఆగమనం గుర్తించలేక, మామూలు ఒక స్త్రీ అనుకుని, ఎంగిలి అనే భావముతో అమ్మ ఇచ్చిన తాంబూలం స్వీకరించ లేదు.
కామాక్షీ అమ్మ వెంటనే ఆ తాంబూలమును మూక శంకరుల చేతికి ఇచ్చింది. మహా ప్రసాదంగా తీసుకుని కళ్ళకద్దుకుని నోట్లో వేసుకున్నారు మూక శంకరులు. అంతే తక్షణమే కామాక్షీ అమ్మ వారి అనుగ్రహముతో మూక శంకరులకి మాట వచ్చింది. మాట రాగానే, ఆయనలో కవితా ప్రవాహం పెల్లుబికింది, వెంటనే కామాక్షీ అమ్మ వారిని చూస్తూ ఆశువుగా ఐదు వందల శ్లోకాలు చెప్పారు మూక శంకరులు. ఈ ఐదు వందల శ్లోకాలను కలిపి మూక పంచశతి అంటారు. ఇందులో అమ్మ వారి యొక్క గొప్ప తనం వివరిస్తూ నూరు శ్లోకములు (దీనిని ఆర్యా శతకము అంటారు), అమ్మ వారిని స్తుతి చేస్తూ నూరు శ్లోకములు  స్తుతి శతకము), అమ్మ వారి కన్నులు చూస్తూ నూరు శ్లోకములు (కటాక్ష శతకము), అమ్మ వారి నవ్వును స్తుతిస్తూ నూరు శ్లోకములు (మందస్మిత శతకము) & అమ్మ వారి యొక్క పాదములు స్తుతి చేస్తూ నూరు శ్లోకములు (పాదారవింద శతకము), ఇలా మొత్తం కలిపి ఐదు వందల శ్లోకములు చేశారు.
కామాక్షీ అమ్మ అనుగ్రహముతో మాట వచ్చిన మూక శంకరులు భక్తి పారవశ్యంతో చేసిన స్తోత్ర రత్న మాలయే "మూక పంచ శతి". ఇవి ఐదు శతకాలుగా ఉంటాయి.
 
1. ఆర్యా శతకం
2. స్తుతి శతకం 
3. కటాక్ష శతకం
4. మందస్మిత శతకం
5. పాదారవింద శతకం

ఈ పంచశతి సాక్షాత్తు కామాక్షీ అమ్మవారే చెప్పారు అంటారు పెద్దలు. అమ్మయే మూక శంకరులలో ప్రవేశించి, భావి తరాల వారు ఉద్ధరింపబడాలని ఇంత అద్భుతమైన శ్లోకములను కటాక్షించింది జగన్మాత కామాక్షీ అమ్మ.

అమ్మ అనుగ్రహముతో మాటలు వచ్చి, ఐదు శతకములతో అమ్మని స్తోత్రం చేసిన తరువాత కామాక్షీ అమ్మ ఏమి వరం కావాలి అని అడిగింది. అప్పుడు మూక శంకరులు "అమ్మా, నోరు లేనివాడి చేత ఇంత స్తోత్రం చేయించి అనుగ్రహించావు, ఏ నోటితో నీ స్వరూపమును కీర్తించగలిగానో, ఆ నోటితో ఇక వేరే మాటలు మాట్లాడలేనమ్మా, కాబట్టి నన్ను మళ్ళీ మూగ వాడిని చెయ్యి" అని వేడుకుంటారు. అమ్మ అనుగ్రహించి మళ్ళీ మూక శంకరుల యొక్క మాట్లాడే శక్తిని తీసివేసింది.
ఈ విషయం తెలుసుకున్న అప్పటి కామకోటి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ మార్తాండ విద్యా ఘనేంద్ర సరస్వతి స్వామి వారు వీరి తల్లి తండ్రులకు కబురు పంపారు. ఈ పిల్లవాడికి పీఠం యొక్క ఉత్తరాధికారం ఇవ్వాలని ఉంది, మీరు అనుమితిస్తే సన్యాసం ఇస్తాను ఈ పిల్లవాడికి అని అడిగారు. తల్లి తండ్రులు సంతోషంతో అంగీకరించడంతో, వారు తరువాత పీఠాధిపతి అయ్యారు. ఉజ్జయినీ సామ్రాజ్యం పాలించిన విక్రమాదిత్యుడు, కాశ్మీర్ రాజు ప్రవరసేనుడు, మాత్రుగుప్తుడు మొదలగు వారు మూక శంకరాచార్యుల వారిని అనన్య భక్తితో సేవించారు. 

మూక పంచశతి కి సమాన స్థాయిలో ఉండేది మళ్ళీ లీలా శుకుడు చేసిన శ్రీ కృష్ణ కర్ణామృతం అని చెప్తారు పెద్దలు.

ఈ విధంగా కామాక్షీ అమ్మ వారి సేవలో తరించిన మూక శంకరులు శ్రీ ధాతు నామ సంవత్సరములో శ్రావణ పౌర్ణమి నాడు, మన గోదావరీ నదీ తీరంలోనే ముక్తిని పొంది, కామాక్షి-ఏకాంబరేశ్వరులలో ఐక్యం అయ్యారు.
అంతటి మహానుభావుడు ప్రాతః స్మరణీయుడు శ్రీ శ్రీ శ్రీ మూక శంకరులు చేసిన ఈ " మూక పంచశతి" అందరూ చక్కగా ఇంట్లోనూ, ఎప్పుడైనా పుణ్య క్షేత్రములకు వెళ్ళినప్పుడు చదువుకుంటే, కామాక్షీ అమ్మ అనుగ్రహమును తప్పక పొందగలము.

మూక పంచశతి ప్రవచనములు:
పూజ్య బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు

ఇంత అద్భుతమైన స్తోత్రము గురించి పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు 2009 లో కాకినాడలో ప్రవచనము చేసి ఉన్నారు. వారు చేసిన ప్రవచనము యొక్క లంకె ఈ క్రింద ఇవ్వబడినది దీనిని మీ కంప్యూటర్ లోకి దించుకుని వినవచ్చు.
 


అంతేకాక, ఈ రోజు వరకు శ్రీ వేంకటేశ్వరా భక్తి ఛానెల్ లో ప్రసారం అవుతున్న పూజ్య గురువు గారు చేసిన మూక పంచశతి పరిచయ ప్రసంగాలుఈ రోజుతో పూర్తి అయ్యాయి. ఈ రోజు ప్రవచనంలో గురువు గారు ఆర్యా శతకము నుండి ఈ క్రింది శ్లోకమును వివరించి ఉన్నారు. ఈ శ్లోకము చదువుకునే పిల్లల దగ్గర నుంచి మోక్షం కోరే పెద్ద వాళ్ళ వరకు అందరికీ నోటికి వచ్చి ఉండాలి అని చెప్పారు. ఎంతో అద్భుతమైన ఈ శ్లోకమును క్రింద ఇస్తున్నాను.

విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ
కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ II 92 II

మూక పంచశతి సంస్కృత లిపి ఆధారం:
ఈ మూక పంచశతి స్తోత్రమును నేను తెలుగులో వ్రాయడానికి ఆధారమైన సంస్కృత పుస్తకం యొక్క లంకె ఇది... 
http://ambaa.org/pdf/kAmAxI_mUka_panchashati.pdf
 
 మూక పంచశతి స్తోత్రం యొక్క ఆడియో:
1. కంచి కామ కోటి పీఠం వారి వెబ్ సైట్ లో శ్రీమతి రామ రామకృష్ణన్ అనే తల్లి మూక పంచశతి కీర్తన చేసిన ఆడియో ని mp3 ఫైల్స్ రూపంలో ఉంచారు. ఈ ఆడియో చాలా అద్భతంగా ఉంది. ఎటువంటి సంగీత వాయిద్యములు లేకుండా, ఆ తల్లి ఎంతో రాగయుక్తంగా, నెమ్మదిగా పాడారు. ఇవి వింటూ మనం మూక పంచశతి శ్లోకములను నేర్చుకోవడం చాలా సులభం. ఇవి ఆన్ లైన్ లో వినడమే కాకుండా వాటిని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఆ లంకె...
2. మూక పంచశతి యొక్క ఆడియో mp3 ఈ క్రింద తెలిపిన లంకె నుండి కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ ఆడియో పాడినది బోంబే సిస్టర్స్. చాలా అద్భుతంగా పాడారు. 
3. మూక పంచశతి యొక్క ఆడియో CD ఈ క్రింద ఇచ్చిన రెండు ఆన్ లైన్ షాపుల నుండి కొనుగోలు చేయవచ్చు. దీనిని పాడిన వారు తంజావూర్ ఎస్. రాధాకృష్ణ శాస్త్రిగళ్ గారు. మనం ఆర్డర్ ఇచ్చిన రెండు రోజులలో వాళ్ళు పంపుతారు, మనం ఉన్న దూరాన్ని బట్టి వారం పది రోజులలో మనకు అందుతుంది. వీళ్ళు భారత దేశంలోనే కాక విదేశాలలో ఉన్న వారికి కూడా పంపుతారు. నేను కళాకేంద్ర, చెన్నై వారి నుంచి తెప్పించుకున్నాను, చాలా చక్కగా ఉంది.


రాబోయే టపాలలో ఈ మూక పంచశతి శతకములను తెలుగులిపిలో వ్రాసి ఈ బ్లాగులో ప్రచురిస్తాను. ఎవరైనా ఇవి పారాయణ చేసుకోవాలంటే సులువుగా ఉండడం కోసం పెద్ద అక్షరాలలో వ్రాస్తున్నాను. వీటిని ప్రింట్ తీసుకుని చక్కగా పారాయణ చేసుకోవచ్చు.
పెద్ద వాళ్ళు తరచూ చెప్తూ ఉంటారు, ఒక సారి చదివిన దాని కన్నా, వ్రాసినది మనకి ఎక్కువ గుర్తు ఉంటుంది అని, అందులోనూ మనసు పెట్టి అమ్మని ధ్యానం చేస్తూ, అమ్మని కీర్తించే ఈ శతకములు వ్రాస్తే అది ఇంకా మంచిది అనే ఉద్దేశ్యంతో వ్రాస్తున్నాను.
చిన్న గమనిక: ఇది తెలుగు అనువాదము కాదు, ఇంత మహిమాన్వితమైన స్తోత్రమును అనువదించే స్థాయి నాది కాదు. కేవలం సంస్కృత శ్లోకములు పారాయణ చేయడానికి వీలుగా ఉంటుందని తెలుగు లిపిలో వ్రాసినది, తత్ఫలితముగా అమ్మ కృపను పొందడం కోసం ఓ చిన్ని ప్రయత్నము. తెలిసిన పెద్దలు ఎవరైనా, ఈ తెలుగు లిపిలో దోషములు ఉంటే తప్పక తెలియజేయగలరు.
ఇందులో ఉన్న దోషములను, సర్వజ్ఞ, అవ్యాజకరుణామూర్తి, శ్రీమాత కామాక్షీ అమ్మ నన్ను క్షమించు గాక.
 
ఓం శ్రీ స్కంద మాత్రే నమః


సర్వం శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

12 కామెంట్‌లు:

  1. చాలా బాగా విశదీకరించి వివరించినందుకు ధన్యవాదములు....

    రిప్లయితొలగించండి
  2. ధన్యవాదములు! పరమ సంతోషము! తల్లి కామాక్షీ కటాక్షమును చేకూర్చగల (ఎల్లరకును) సంకల్పమిది.
    ఈ సందర్భములో అవుసరమైనచో నన్ను సైతం ఉపయోగించుకోగలందులకు మనవి...............
    మీ సంకల్పమునకు ప్రణామములతో,
    మీ వాడు,
    చెరువు కాశీ విశ్వనాధ ప్రసాదు

    రిప్లయితొలగించండి
  3. అమూల్యమైన మంచి మంచి విషయాలనందిస్తున్న మీకు నా ధన్యవాద సహస్రములు.

    రిప్లయితొలగించండి
  4. @ శ్రీ చెరువు కాశీ విశ్వనాథ ప్రసాద్ గారు,
    చాలా ధన్యవాదములు.
    మీ వంటి పెద్దల ఆశీస్సులు ఉంటేనే ఇలాంటివి సాధ్యం. మీరు సహకారం ఇస్తానని అన్నందుకు కృతజ్ఞుడను...
    రేపు మొదట ఆర్యా శతకం పోస్ట్ చేస్తాను. మీకు చిన్న మనవి. మీరు ఈ ఆడియో లంకెలలో ఈ స్తోత్రం విని, నేను వ్రాసే లిపిలో దోషములు ఉంటే తప్పక తెలియజేయగలరు.

    భవదీయుడు...
    మోహన్ కిషోర్

    రిప్లయితొలగించండి
  5. @ శ్రీ సో మా ర్క గారు...
    మీ అభినందనలకు ధన్యవాదములండీ...

    రిప్లయితొలగించండి
  6. కామాక్షీ కటాక్ష లబ్ధ సుజ్ఞాన సుప్రకాశా! నెమ్మలూరి మోహన్ కిషోర్! మీరు ధన్య జీవులు. మీ నిశ్చల భక్తి ప్రపత్తులు ఆ జగదంబ దయచేత ప్రవర్ధిల్లుచునే యుండుగాక. శుభమస్తు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజ్య శ్రీ చింతా రామ కృష్ణా రావు గారికి నమస్కారము,

      మీ యొక్క ఆశీర్వచనముతో కూడిన అభినందనలకు చాలా ధన్యుడను. అయ్యా, నేను బ్లాగులో వ్రాసే విషయంలో ఏమైనా అక్షర/భావ దోషములుంటే దయచేసి తెలుపగలరు.

      కృతజ్ఞలతో...
      మీ..

      తొలగించండి
  7. మొత్తానికి ఈ మీ సంకల్పం నేటితో పరిపూర్ణమయ్యిందన్న మాట. 10 మార్చ్‌, 2012 కే పూర్తయినా, ఇవాళ (14 మార్చ్‌, 2012) మొత్తాన్ని PDF రూపంలో కూడా అందించారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి