13, సెప్టెంబర్ 2011, మంగళవారం

ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రములు – తిరుచెందూర్


ఆరు పడై వీడు – ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలు:

జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ

పార్వతీ దేవి కరుణామయి, అనుగ్రహరాశి, మరి తండ్రి శంకరుడో ఉబ్బులింగడు, ఆయనా అనుగ్రహ రాశి..... ఈ ఇద్దరి అనుగ్రహాల కలపోత మన బుజ్జి సుబ్రహ్మణ్య స్వామి వారు.

ఈ ఆరు క్షేత్రములు సుబ్రహ్మణ్యుని ఆరు ముఖములుగా పురాణములు చెప్తున్నాయి. ఈ ఆరు దివ్యమైన క్షేత్రములను తమిళనాడు లో ఆరుపడై వీడు అంటారు. ఈ ఆరు క్షేత్రములలో సుబ్రహ్మణ్య స్వామి వారు ప్రతీ చోటా రాక్షస సంహారం చేసేముందు విడిది చేసిన ప్రదేశములుగా ప్రఖ్యాత తమిళ కవి శ్రీ నక్కీరన్ కీర్తించారు. ఈ ఆరు క్షేత్రములు వరుసగా
1.     తిరుచెందూర్
2.   తిరుప్పరంకుండ్రం
3.   పళముదిర్చొళై
4.   పళని
5.    స్వామిమలై
6.   తిరుత్తణి

అమ్మవారి అనుగ్రహము వలన, 2008 లో మేము తమిళనాడు యాత్రలకు వెళ్ళినప్పుడు పళని స్వామి దర్శనం అయ్యింది. అప్పుడు ఈ ఆరు క్షేత్రముల గురించి మాకు తెలిసింది. తరువాత పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు “శివ పురాణము” ప్రవచనములో ఈ ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రముల గురించి వివరముగా తెలియజేయడం వలన ఈ సంవత్సరం 2011 మాఘ మాసములో ఈ ఆరు క్షేత్రములను దర్శించే భాగ్యం మాకు కలిగింది. స్వామి వారి ఆరు ముఖముల దర్శన భాగ్యము ద్వారా పొందిన ఆనందాన్ని, సుబ్రహ్మణ్య కటాక్షమును అందరితోనూ పంచుకోవాలని, “ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రములు” అనే శీర్షికన ఈ క్షేత్రముల గురించి వ్రాద్దామని చేస్తున్న చిన్ని ప్రయత్నం. 

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు ఈ ఆరుపడై వీడు క్షేత్రముల యందు తనని సేవించిన వారిని విశేషముగా అనుగ్రహిస్తారు. ఈ ఆరు క్షేత్రములలో ఒకో రూపములో స్వామి భక్తులను అనుగ్రహిస్తారు. సుబ్రహ్మణ్య ఆలయాలు అన్నీ ఎక్కువగా కొండమీదే ఉంటాయి. ఇప్పటికీ ఆది శంకరాచార్యుల సాంప్రదాయ పీఠాధిపతులు అయిన జగద్గురువులు వారు పీఠాన్ని అధిరోహించే ముందు తప్పని సరిగా ఒక సారి ఈ ఆరుపడై వీడు క్షేత్రములను పాదచారులై దర్శించి వస్తారు అని విన్నాను. సుబ్రహ్మణ్య అనుగ్రహము తోనే అటు శ్రీ విద్యా ఉపాసనలో అయినా, ఇటు జ్ఞానములో అయినా ఒక స్థాయిలోకి వెళ్ళడం సాధ్యం అని పెద్దలు చెప్తారు.  
నాగదోషం ఉన్న వారు ఎవరైనా ఈ ఆరు క్షేత్రముల దర్శనం చేస్తే ఆ దోషం పోయి ఇష్ట కామ్యములు నెరవేరుతాయి. అంతేకాక, కుజ గ్రహమునకు అధిపతి సుబ్రహ్మణ్యుడు. ఆయన పాదములు పట్టి ప్రార్ధిస్తే కుజదోషం తొలగి పోతుంది. ఇవ్వాళ దేశంలో అనేక ప్రమాదాలు జరగడానికి కారణం ఈ కుజ దోషం వల్లనే. కుజ దోషం పోవాలి అంటే సుబ్రహ్మణ్య ఆరాధన వల్లనే సాధ్యం అని పెద్దలు చెప్తారు. అటువంటి సుబ్రహ్మణ్యుని దివ్య క్షేత్రముల మహిమ ఎంతటిదో మనం ఊహించవచ్చు.

ఈ టపాలో తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి వారి గురించి వివరిస్తాను. స్వామి గురించి చేసే ఈ వర్ణనలో ఏమైనా దోషములు ఉంటే ఆ షణ్ముఖుడు నన్ను క్షమించు గాక.

తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి:

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో మొదటిది తిరుచెందూర్. ఈ క్షేత్రములో స్వామి తారకాసురుడు, సూరపద్మం అనే రాక్షసుల సంహారం చేయబోయే ముందు ఇక్కడ విడిది చేసి, పరమశివుని పూజించిన పవిత్రమైన క్షేత్రం. ఇక్కడే మామిడి చెట్టు రూపములో పద్మాసురుడు (సూర పద్మం) అనే రాక్షసుడు వస్తే, సుబ్రహ్మణ్యుడు వాడిని సంహరించి ఆ అసురుడి కోరిక మేరకు రెండు భాగములు చేసి ఒకటి కుక్కుటముగా, ఒకటి నెమలిగా స్వామి తీసుకున్నారు అని పురాణము చెబుతోంది.

"తిరుచెందూర్" లో సుబ్రహ్మణ్య స్వామి వారిని వర్ణించడం సాధ్యం కాదు. అంత అందంగా ఉంటారు. స్వామి తారకాసుర మరియు సూర పద్మం అనే రాక్షసులను సంహరించడానికి ఇక్కడ నుండే బయలుదేరారు. అందుకే ఇక్కడ, స్వామి తన ముద్దులొలికే రూపం తోటి పూర్తి ఆయుధాలతో కూడా దర్శనమిస్తారు. చాలా చాలా శక్తివంతమైన క్షేత్రము. ఎటువంటి వారికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, ఇక్కడ స్వామి విభూతి ప్రసాదంగా తీసుకుంటే అవి తొలగిపోతాయి. సముద్ర తీరంలో అంత శక్తివంతమై, అంతటి సుందరమైన దివ్య క్షేత్రం మునుపెన్నడూ చూడలేదు.


ఈ క్షేత్రం తమిళనాడు లో తిరునెల్వేలి నుండి అరవై కిలోమీటర్ల దూరములో సముద్ర తీరములో ఉన్న అద్భుతమైన ఆలయం. సాధారణంగా సుబ్రహ్మణ్య ఆలయాలు అన్నీ కొండ శిఖరములపై ఉంటాయి. కాని ఈ తిరుచెందూర్లో ఒక్కచోటే స్వామి సముద్ర తీరము నందు కొండ మీద కొలువై ఉన్నాడు. ఇక్కడ స్వామి వారికి చేసే విభూతి అభిషేకం ఎంత అద్భుతంగా ఉంటుందో. అది చూసి తీరాలి.  సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ప్రత్యేకంగా ఈ తిరుచెందూర్ లో ప్రసాదంగా ఇవ్వబడే విభూతి ఎంతో మహిమాన్వితమైనది.

ఈ ఆలయం గురించి స్కాంద పురాణములో చెప్పబడినది. ఈ క్షేత్రంలోనే ఒక గొప్ప విచిత్రం జరిగింది. ఒక సారి జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య దర్శనం కోసమై తిరుచెందూర్ వెళ్లారు. అక్కడ ఆయన ఇంకా సుబ్రహ్మణ్య దర్శనం చేయలేదు, ఆలయం వెలుపల కూర్చుని ఉన్నారు. అప్పుడు ఆయనకి ధ్యానములో సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనము అయ్యింది. వెంటనే శంకరులు సుబ్రహ్మణ్య భుజంగం చేశారు. ఈ భుజంగ స్తోత్రము ద్వారా, మనల్ని, మన వంశాలనీ పట్టి పీడించేసే కొన్ని దోషాలు ఉంటాయి, అటువంటి వాటిలో నాగ దోషం లేదా కాల సర్ప దోషం ఒకటి . దీనికి కారణం మనం తప్పుచేయకపోవచ్చు, ఎక్కడో వంశంలో తప్పు జరుగుతుంది, దాని ఫలితము అనేక విధాలుగా అనుభవిస్తూ ఉండవచ్చు. ఉదాహరణకు, సంతానము కలుగక పోవడం, కుష్ఠ రోగం మొదలైనవి. అటువంటి దోషములను కూడా పోగొట్టే సుబ్రహ్మణ్య శక్తి ఎంత గొప్పదో, శంకరులు ఈ సుబ్రహ్మణ్య భుజంగము ద్వారా తెలియజేశారు. ఎంతో అద్భుతమైన స్తోత్రం ఇది.  దీనిని ప్రతీ ఇంటిలో యజమాని రోజూ చదువుకోవాలి. ఈ భుజంగం ప్రభావము వలన మనకి ఉన్న సకల దోషములు పోయి మనసు ప్రశాంతత పొంది, మంచి బుద్ధి వచ్చి, ఇష్టకామ్యములు (ధర్మబద్ధమైన) నెరవేరుతాయి. 


ఈ సంసారము అనే మహా సముద్రము నుండి మనలను కడతేర్చడానికి నేనున్నాను మీకు అని అభయం ఇవ్వడానికే స్వామి ఇక్కడ నివాసము ఉంటున్నారు. అందుకే శంకర భగవత్పాదులు స్వామిని “మహాంబోధితీరే మహాపాపచోరే ..... అని కీర్తించారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రములో. అంతటి శక్తి ఈ తిరుచెందూర్ క్షేత్రమునకు ఉన్నది.

తిరుచెందూర్ క్షేత్రం యొక్క మరొక లీల ఏమిటంటే (అక్కడ ప్రజలు చెప్పగా విన్నాము), 2006 లో వచ్చిన సునామి వల్ల, ఇక్కడ ఎవరికీ హాని జరగలేదు కదా, కనీసం తిరుచెందూర్ దేవాలయాన్ని తాకనైనా లేదు. అది స్వామి వారి శక్తి.తిరుచెందూర్ విభూతి మహిమ:
ఇక్కడ స్వామి వారికి అభిషేకం చేసిన విభూతి తీసుకు వచ్చి ఇంట్లో పెట్టుకుంటే, ఎటువంటి గ్రహ, శత్రు, భూత, ప్రేత పిశాచ బాధలు ఉండవు. అంతే కాదు, ఈ విభూతిని సేవించడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక చర్మవ్యాధులు నయం అవుతాయి. ఎంతో మందికి అనుభవములోకి వచ్చాయి స్వామి వారి లీలలు. నమ్మిన వాడికి నమ్మినంత....అన్నారు పెద్దలు.

ఈ క్షేత్రమును చేరే మార్గములు:
తిరుచెందూర్ తమిళనాడు లోని Tuticorin జిల్లాలో ఉంది.
రోడ్ ద్వారా: ట్యూటికోరిన్ - 40Km, తిరునెల్వేలి – 60Km, కన్యాకుమారి – 90Km, మదురై – 175Km దూరంలో ఉన్నాయి. అనేక తమిళనాడు ఆర్టీసీ వారి బస్సులు అనేకం నడుస్తాయి.
రైలు ద్వారా: చెన్నై నుంచి తిరునెల్వేలి దాకా, అనేక రైళ్ళు ఉన్నాయి. (ఉదాహరణకి కన్యాకుమారి ఎక్సప్రెస్) తిరునెల్వేలి నుంచి అనేక బస్సులు, కార్లు దొరుకుతాయి.
విమానము ద్వారా: దగ్గరలో అంతర్జాతీయ విమానాశ్రయము చెన్నై (617Km), అది కాక జాతీయ విమానాశ్రయము ట్యూటికోరిన్ లో (40Km) ఉంది. 

వసతి సదుపాయము:
ఈ క్షేత్రములో ఆలయ దేవస్థానము వాళ్లవి అనేక గెస్ట్ హౌసులు రోజుకి Rs.115/- నుంచి Rs. 350/- దాకా ఉంటాయి. ఇవి ముందుగా ఆలయం వారి వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇంతే కాక అనేక ప్రైవేటు హోటళ్ళు కూడా ఉన్నాయి. మేము వెళ్ళినప్పుడు ఉన్న హోటల్ ఉదయం ఇంటర్నేషనల్.

ఆలయంలో ఆర్జిత సేవలు:
స్వామి వారి అభిషేకము కోసం పదిహేను వందల రూపాయలు ఖర్చు అవుతుంది. దీనికి ముందుగా ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చు. ఎవరైనా ఈ క్షేత్రము వెడితే ఈ అభిషేకం తప్పక దర్శించగలరు. అద్భుతం గా ఉంటుంది. ఇవి కాక ఇంకా అష్టోత్తర అర్చన, సహస్రనామ అర్చన మొదలైన సేవలు ఉన్నాయి.

క్షేత్రము యొక్క చిరునామా:
Joint Commissioner/Executive Officer
Arulmigu SubramaniaSwamy Temple,   
Tiruchendur - 628 215.   
Phone Numbers : 04639-242221, 04639-242270, 04639-242271

సర్వ వ్యాపకుడు, సర్వ నియంత, దేవసేనాపతి, పార్వతీ పరమేశ్వరుల గారాల బిడ్డడు, వల్లి, దేవయాని అమ్మల నాథుడు అయిన మన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అండ ఉండగా మన ఎవరికీ బెంగ లేదు. ఇంతటి శక్తివంతమైన క్షేత్రం దర్శనం చేయించిన సుబ్రహ్మణ్య స్వామి వారికి, భగవంతుడి యందు గురిని చూపించి మాలో విశ్వాసాన్ని పెంచి, మూల కారణమైన మన పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారికి మా సాష్టాంగ ప్రణామములు.


సర్వం శ్రీ వల్లీదేవసేనాసమేత శ్రీ సుబ్రహ్మణ్యార్పణ మస్తు.

9 వ్యాఖ్యలు:

 1. బాగుందండీ మీ టపా! వీటిల్లో నేను కేవలం పళని మరియు తిరుత్తణి చూసాను. మిగతా వాటి గురించి వినడం తప్ప ఇప్పటిదాకా దర్శనం కాలేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మోహన్ కిషోర్ గారూ సుబ్రహ్మణ్య క్షేత్రాలను గూర్చి మంచి సమాచారాన్ని అందిస్తున్నారు.మీ సేవలకు ధన్యవాదాలు.అన్నట్లు మీ బ్లాగును మాంచి భక్తి పూర్వక నిలయంగా మలచారు.మరో సారి హృదయ పూర్వక అభినందనలు.
  మీ వాడు,
  సోమార్క.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మీ అభినందనలకు ధన్యవాదములు సోమయాజి గారు, స్వామి వారిని ఈ విధంగానైనా కాసేపు తలుచుకుని ధన్యత పొందాలని కోరిక అంతేనండి. నేను వ్రాసే విషయములలో ఏమైనా తప్పులుంటే తెలియజేయగలరు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. అధ్బుత ప్రయత్నం.....మంచి విషయాలను పొందుపరుస్తున్నారు. అభినందనలు..!!

  ప్రత్యుత్తరంతొలగించు
 5. మంచి వివరాలు తెలియచేసినందుకు దన్యవాదాలు చాగంటి కోటేశ్వర రావు గారు చెప్పిన శివమహాపురాణం లో సుబ్రహ్మణ్యం క్షేత్రం కోసం 106 ఫొల్డెర్స్ లో ఎక్కడ ఉన్నది దయచెసి తెలపగలరు.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. మంచి వివరాలు తెలియచేసినందుకు దన్యవాదాలు చాగంటి కోటేశ్వర రావు గారు చెప్పిన శివమహాపురాణం లో సుబ్రహ్మణ్యం క్షేత్రం కోసం 106 ఫొల్డెర్స్ లో ఎక్కడ ఉన్నది దయచెసి తెలపగలరు.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. శ్రీ గురుభ్యో నమః థన్యవాదాలు సార్

  ప్రత్యుత్తరంతొలగించు