15, ఫిబ్రవరి 2016, సోమవారం

భగవాన్ క్రోధభట్టారక విరచిత శ్రీ ఆర్యాద్విశతి తాత్పర్యము - 16


శ్రీ గురుభ్యో నమః

II ఆర్యా ద్విశతి - 79వ శ్లోకము II
తద్వరణోత్తరభాగే తారాపతిబింబచుంబినిజశృంగః I
వివిధమణీగణఖచితో వితరతు సాలో వినిర్మలాం ధిషణామ్ II ౭౯

తాః తద్వరణోత్తరభాగే - ఆ (నానారత్నమయ) ప్రాకారమునకు పై భాగమునందు ఉండు, తారాపతిబింబ - చంద్రబింబమును, చుంబి - స్పృశించుచున్న, నిజశృంగః - తనయొక్క శిఖరములు (మిక్కిలి పొడవగు శిఖరములు) కలదియు, వివిధమణీగణఖచితః - పలురకములైన మణులతో పొదుగబడినదియు అగు, సాలః - ప్రాకారము, వినిర్మలాం - మిక్కిలి స్వచ్ఛమైన, ధిషణాం - బుద్ధిని, వితరతు - ఇచ్చుగాక !!

18వ ప్రాకారమైన నానారత్న ప్రాకారమునకు పై భాగము నందు, చంద్రబింబమును స్పృశించుచున్న పొడవైన శిఖరములు కలదియు, పలురకములైన మణులతో పొదగబడినది అయిన ప్రాకారము (19వ ప్రాకారము) - నాకు స్వచ్ఛమైన బుద్ధిని ప్రసాదించుగాక !!

II ఆర్యా ద్విశతి - 80వ శ్లోకము II
ప్రాకారద్వితయాంతరకక్ష్యాం పృథురత్ననికరసంకీర్ణామ్ I
నమత సహస్రస్తంభక మండపనామ్నా౨తివిశ్రుతాం భువనే II ౮౦

తాః ప్రాకారద్వితయాంతరకక్ష్యాం - ఆ రెండు (నానారత్న, నానామణిమయ) ప్రాకారముల మధ్య భూమి యందు ఉండు, పృథు - గొప్పవియగు, రత్న - మణుల, నికర - గుంపులచేత, సంకీర్ణాం - నిండినదియు, సహస్రస్తంభక మండపనామ్నా - సహస్రస్తంభక మంటపమను పేరుతో, భువనే - ప్రపంచమునందు, అతి విశ్రుతాం - మిక్కిలి ప్రసిద్ధమైనదియు దానికి, నమత - నమస్కరించుచున్నాను !!
నానారత్న, నానామణిమయ ప్రాకారముల మధ్య భూమి యందు ఉండు, గొప్పవైన మణులచేత నిండినటువంటిది, లోకమున మిక్కిలి ప్రసిద్ధమైనది అయిన సహస్ర స్తంభ మంటపమునకు నమస్కరించుచున్నాను !!

II ఆర్యా ద్విశతి - 81వ శ్లోకము II
ప్రణుమ స్తత్ర భవానీసహచర మీశాన మిందుఖండధరమ్ I
శృంగారనాయికా మనుశీలనభాజో౨పి భృంగినందిముఖాన్ II ౮౧ 

తాః తత్ర - ఆ సహస్ర స్తంభక మంటపము నందు ఉండు, భవానీసహచరం - పార్వతీదేవితో కూడినవాడును, ఇందుఖండధరం - బాలహంద్రుని శిరస్సుపై ధరించినవాడును, ఈశానాం - శివుని, శృంగారనాయికా - శృంగారము అంటే సౌందర్యము, సౌందర్యనాయిక అయిన శ్రీలలితాంబిక యొక్క, మను - మంత్రమును, శీలనభాజః - జపించుచున్నవారగు, భృంగినందిముఖాన్ - భృంగి, నంది మొదలగు ప్రమథ గణములను, ప్రణుమః - స్తుతించుచున్నాను !!

సహస్ర స్తంభ మంటపము నందు ఉండు, బాలచంద్రుని శిరసున ధరించి పార్వతీసహితుడైన ఈశానుని మరియు సౌందర్యనాయిఅక అయిన శ్రీలలితాంబికాదేవి మంత్రమును జపించుచున్న భృంగి, నంది మొదలగు ప్రమథ గణములను నేను స్తుతించుచున్నాను !!

ఈశానుడు కూడా శ్రీలలితామహాదేవిని సేవించుచున్నాడని చెప్పబడినది. 

శివలోకోత్తమేతస్మింత్సహస్ర స్తంభమంటపే I
ఈశానస్సర్వవిద్యానాం రాజతే చంద్రశేఖరః II

లలితాజ్ఞాపాలకశ్చ లలితాజ్ఞాప్రవర్తకః I
లలితామంత్రజాపీ చ నిత్యమానందమానసః II

శైవ్యాదృష్ట్యా స్వభక్తానాం లలితామంత్రసిద్ధయే I
అంతర్బహిస్తమః పుంజనిర్భేదనపటీయసీమ్ II

మహాప్రకాశరూపాంతాం మేధాశక్తిం ప్రకాశయన్ I
సర్వజ్ఞస్సర్వకర్తా చ సహస్రస్తంభమంటపే I
వర్తమానో మహాదేవః శ్రీదేవీమేవ సేవతే II

ఇత్థం కారణ కృత్యేంద్రాః శ్రీదేవీభక్తినిర్బరాః I
తత్తత్సాలాం సమాశ్రిత్య వర్తంతే కుంభసంభవ II (లలితోపాఖ్యానము 38వ అధ్యాయము, 96-101శ్లోకములు)

II ఆర్యా ద్విశతి - 82వ శ్లోకము II
తస్యైణవాహనయోజనదూరే వందే మనోమయం వప్రమ్ I
అంకూరన్మణికిరణామంతరకక్ష్యాం చ నిర్మలా మనయోః II ౮౨

తాః తస్య - దానికి (వివిధ మణిమయ ప్రాకారమునకు), ఏణవాహనయోజనదూరే - ఏడు యోజనముల దూరము నందు, (జింకను వాహనముగా కలవాడు), మనోమయం -  మనోమయమగు, వప్రమ్ - ప్రాకారమును, నిర్మలాం - స్వచ్ఛమైనదియు, అంకూరత్ - ప్రకాశించుచున్న, మణికిరణాం - మణికిరణముల కాంతులు కలదియు, అనయోః అంతరకక్ష్యాం చ - ఆ రెంటి ప్రాకారముల మధ్య ప్రదేశమును, వందే - స్తుతించుచున్నాను !!
వివిధ మణిమయ ప్రాకారమునకు (19వ) ఏడు యోజనముల దూరము నందు, మనోమయ ప్రాకారము (20వ ప్రాకారము) కలదు, ఈ రెండు ప్రాకారముల మధ్యన ఉండు స్వచ్ఛమైన ప్రకాశించుచున్న మణికిరణ కాంతులు కల మధ్య ప్రదేశమును నేను స్తుతించుచున్నాను !!

II ఆర్యా ద్విశతి - 83వ శ్లోకము II
తత్రైవామృతవాపీం తరళతరంగావలీఢతటయుగ్మామ్ I
ముక్తామయ కలహంసీ ముద్రిత కనకారవిందసందోహమ్ II ౮౩

తాః తత్రైవ - అచ్చటనే ఉండు, తరళ - కదులుచున్న, తరంగ - అలలచేత, అవలీఢ - వ్యాపింపబడిన, తటయుగ్మాం - రెండు గట్టులు కలదియు, ముక్తామయ - ముత్యముల వంటి, కలహంసీ - కలహంసల చేత, ముద్రిత - అలంకరింపబడిన, కనకారవింద - బంగారు తామరల, సందోహామ్ - గుంపులు కలదియు ... (అమృతవాపీం - అను పదమునకు 85వ శ్లోకము నందు వివరణ ఇవ్వబడినది)..

II ఆర్యా ద్విశతి - 84వ శ్లోకము II
శక్రోపలమయ భృంగీసంగీతోన్మేష ఘోషితదిగంతామ్ I
కాంచనమయాంగవిలసత్ కారండవషండ తాండవమనోజ్ఞామ్ II ౮౪

తాః శక్రోపలమయ - ఇంద్రనీలమణిమయమైన (సమానమైన), (శక్ర - ఇంద్ర, ఉపల - రాయి), భృంగీ - ఆడు తుమ్మెదల, సంగీత - గానముల, ఉన్మేష - ప్రకాశములచేత, ఘోషిత - శబ్దించుచున్న, దిగంతాం - దిక్కులకొనలు కలదియు, కాంచనమయ - బంగారముతో సమానమైన, అంగ - శరీరముచేత, విలసత్ - ప్రకాశించుచున్న, కారండవ - జలపక్షుల, షండ - సమూహము యొక్క, తాండవ - నర్తనముల చేత, మనోజ్ఞాం - సుందరమైనదియు ....
ఇంద్రనీల మణుల కాంతితో సమానమైన కాంతుల చేత, ఆడు తుమ్మెదల గానముల చేత, దిక్కుల కొఅనల వరకు వస్తున్న శబ్దములచేత, బంగారముతో సమానమైన శరీరము చేత, ప్రకాశిస్తున్న జలపక్షుల సమూహముల నర్తనములచేత, సుందరమైనది అయిన ....

II ఆర్యా ద్విశతి - 85వ శ్లోకము II
కురువిందాత్మలహల్లక కోరక సుషమాసమూహపాటలితామ్ I
కలయే సుధాస్వరూపాం కందళితామంద కైరవామోదామ్ II ౮౫

తాః కురువిందాత్మక - కెంపులతో సమానమైన, హల్లక - ఎఱ్ఱ కలువల, కోరక - మొగ్గల, సుషమా - కాంతుల, సమూహ  - గుంపులచేత, పాటలితాం - ఎఱ్ఱగా చేయబడినదియు, కందళిత - మొలచుచున్న (పుట్టుచున్న), అమంద - అధికమగు, కైరవామోదాం - కలువపువ్వుల పరిమళము కలిగినదియు అగు, అమృతవాపీం - అమృతపు బావిని (83వ శ్లోకము నుండి..) కలయే - ధ్యానించుచున్నాను !!
కెంపులతో సమానమైన ఎర్ర కలువల గుంపులచేత, ఎర్రగా చేయబడినది, గొప్ప కలువపువ్వుల పరిమళము కలిగినది అయిన అమృతపు బావిని ధ్యానించుచున్నాను.

ఆ అమృత బావి యొక్క జలమును సేవించిన మాత్రాన సర్వసిద్ధులు కలుగును. జనులు విగతకల్మషులు అగుదురు. ఆ జలములను త్రాగిన, పక్షులు సైతం జరామరణములు లేకుండును. ఆ అమృత బావిని చేరుకోవాలి అంటే, నౌక వలన మాత్రమే సాధ్యము, అక్కడ నౌక నడుపు దేవతా శక్తులు అనేకము కలవు. ఆ దేవతా శక్తులకు యజమానురాలు 'తారాదేవి'. ఆ అమృతబావి వద్దకు చేరుకోవాలంటే, శ్యామలాదేవి, వారాహీదేవి - వీరిద్దరి ఆజ్ఞతో మాత్రమే తారాదేవి ఆ నౌకను నడిపిస్తుంది.

న తత్ర గంతుం మార్గోస్తి నౌకావాహనమంతరా I
ఆజ్ఞయా కేవలం తత్త్ర మంత్రిణీ దండనాథయో II

తారానామ మాహాశక్తిర్వర్తతే తరణీశ్వరీ I
ఆజ్ఞాం వినా తయో స్తారామంత్రిణీ దండనాథయోః II

త్రినేత్రస్యాపినోదత్తే వాపికాంభసి సంతరమ్ II (లలితోపాఖ్యానము 39వ అధ్యాయము, 12,13,18వ శ్లోకములు)

(సశేషం .... )

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి