14, ఫిబ్రవరి 2016, ఆదివారం

భగవాన్ క్రోధభట్టారక విరచిత శ్రీ ఆర్యాద్విశతి తాత్పర్యము - 15
శ్రీ గురుభ్యో నమః

II ఆర్యా ద్విశతి - 70వ శ్లోకము II
పూర్వోక్తసంఖ్యయోజనదూరే పూషాంశుపాటలస్తస్య I
విద్రావయతు మదార్తిం విద్రుమసాలో విశంకటద్వారః II ౭౦

తాః తస్య - దానికి (మరకతప్రాకారమునకు), పూర్వోక్తరసంఖ్యయోజనదూరే - ముందు చెప్పబడిన యోజనముల దూరమునందు (ఏడు యోజనముల దూరమున ఉండు), పూషా - సూర్యుని, అంశు - కిరణములవలె, పాటలః - ఎఱ్ఱని కాంతి కలదియు, విశంకట - విశాలమైన, ద్వారః - వాకిళ్ళు గలదియు, విద్రుమసాలః - పగడములతో చేయబడిన ప్రాకారము, మదార్తిం - నా యొక్క పీడను/బాధలను,సంకటములను, విద్రావయతు - పోగొట్టుగాక !!
మరకతమయ ప్రాకారమునకు ఏడు యోజనముల దూరమునందు సూర్యుని కిరణాలవలె ఎఱ్ఱని కాంతి కలది, విశాలమైన వాకిళ్ళు కలది, పగడములతో చేయబడినది అయిన పదిహేడవ ప్రాకారము (పగడమయ) - నా యొక్క బాధను/పీడను/సంకటములను పోగొట్టుగాక !!

II ఆర్యా ద్విశతి -  71వ శ్లోకము II
ఆవరణయోరహర్నిశ రంతరభూమౌ ప్రకాశశాలిన్యామ్ I
ఆసీనమంబుజాసన మభినవసింధూరగౌరమహమీడే II ౭౧

తాః ఆవరణయోః - మరకత, విద్రుమ ప్రాకారముల యొక్క, ప్రకాశశాలిన్యాం - ప్రకాశములతో ఉన్న, అంతరభూమౌ - మధ్యప్రదేశమునందు, ఆసీనం - కూర్చుని ఉన్నట్టి, అభినవసింధూరగౌరం - క్రొత్త సింధూరమువలె ఎర్రని శరీరకాంతి కలవాడగు, అంబుజాసనం - బ్రహ్మగారిని, అహం - నేను, ఈడె - స్తుతించుచున్నాను !!
పదహారవ (మరకతమయ) మరియు పదిహేడవ (విద్రుమ) ప్రాకారముల యొక్క మధ్యప్రదేశమునందు, బాగా ప్రకాశించుచున్న ప్రదేశమున, క్రొత్త సింధూరమువలె ఎర్రని శరీరకాంతి కలిగిన బ్రహ్మగారిని నేను స్తుతించుచున్నాను !!

II ఆర్యా ద్విశతి - 72వ శ్లోకము II
వరణస్య తస్య మారుతయోజనతో విపులగోపురద్వారః I
సాలో నానార్త్నైస్సంఘటితాంగః కృషీష్ట మదభీష్టమ్ II ౭౨

తాః తస్యవరణస్య - ఆ పగడపు (విద్రుమ) ప్రాకారమునకు, మారుతయోజనతః - ఏడు యోజనముల దూరమునందు ఉండు, విపులగోపురద్వారః - విశాలమైన గోపురములు, ద్వారములు కలదియు, నానారత్నైః - పలువిధములైన మణులచేత, సంఘటితాంగః - చేయబడినది అగు, సాలః - ప్రాకారము, మదభీష్టం - నా అభీష్టములను, కృషీష్ట - నెరవేర్చుగాక !!

పగడపు ప్రాకారమునకు ఏడు యోజనముల దూరమునందు, విశాలమైన గోపురములు, ద్వారములు కలిగి, నానారత్నములచేత అలంకరింపబడిన 18వ ప్రాకారము (నానారత్న ప్రాకారము) - నా అభీష్టములను నెరవేర్చుగాక !!

II ఆర్యా ద్విశతి - 73వ శ్లోకము II
అంతరకక్ష్యా మనయోరవిరళశోభాపిచండిలోద్దేశామ్ I
మాణిక్యమంటపాఖ్యాం మహతీమధిహృదయ మనిశమాకలయే II ౭౩

తాః అనయోః - ఆ రెండు (పగడము, నానారత్న) ప్రాకారముల, అంతరకక్ష్యాం -  మధ్య భూమియందు ఉండు, అవిరళ - దట్టమైన, శోభా - కాంతులచేత, పిచండిలా - పూరింపబడిన (కాంతులతో నిండిన), ఉద్దేశాం - ప్రదేశము కలదియు, మహతీం - గొప్పదైన, మాణిక్యమంటపాఖ్యాం - మాణిక్యమండపమును, అధిహృదయం - మనస్సునందు, అనిశం - ఎల్లప్పుడూ, ఆకలయే - ధ్యానించుచున్నాను !!

పగడము, నానారత్న ప్రాకారముల మధ్య ప్రదేశమునందు, దట్టమైన కాంతులచేత నిండిన మాణిక్యమండపమును నా మనస్సునందు ఎల్లప్పుడూ ధ్యానించుచున్నాను !!

II ఆర్యా ద్విశతి - 74వ శ్లోకము II (ఈ 74వ శ్లోకము నుండి 78వ శ్లోకము వరకు శ్రీమహావిష్ణువుని ధ్యానించే శ్లోకములు)
తత్ర స్థితం ప్రసన్నం తరుణతమాలప్రవాళకిరణాభామ్ I
కర్ణావలంబికుండల కందళితాభీశుకవచితకపోలమ్ II ౭౪

తాః తత్ర - ఆ మణిక్యమంటపము నందు, స్థితం - ఉన్నట్టివాడును, ప్రసన్నం - ప్రసన్నముగా ఉండెడి వాడును (అనుగ్రహించెడి వాడు), తరుణ - కోమలమైన, తమాల - కానుగచెట్ల, ప్రవాళ - చిగుళ్లయొక్క, కిరణ - కాంతుల వంటి, ఆభం - శరీర కాంతి కలవాడు, కర్ణావలంబి -చెవులయందు ధరింపబడిన, కుండల - కుండలముల నుండి, కందళిత - బయలువెడలుచున్న, అభీశు - కిరణములచేత (కాంతులచేత), కవచిత - వ్యాపింపబడిన, కపోలమ్ - చెక్కిళ్ళు కలవాడును...

ఆ మాణీక్యమంటపము నందు, ప్రసన్నముగా ఉండెడి వాడు, లేత కానుగ చుగుళ్ళ కాంతులవంటి శరీరఛాయ కలవాడును, చెవులలో ధరించిన కుండలముల నుండి వెలువడు కాంతులచేత ప్రకాశింపబడిన చెక్కిళ్ళు కలవాడును ....

II ఆర్యా ద్విశతి - 75వ శ్లోకము II
శోణాధరం శుచిస్మితమేణాంకనిభాస్య మేధమానకృపమ్ I
ముగ్ధైణమదవిశేషక ముద్రితనిటలేందురేఖికారుచిరమ్ II ౭౫

తాః శోణాధరం - ఎఱ్ఱని పెదవి కలవాడూ, శుచిస్మితం - తెల్లని శుద్ధమైన చిరునవ్వు కలవాడూ, ఏణాంక - చంద్రునితో, నిభ - సమానమైన, ఆస్యం - ముఖము కలవాడూ, ఏధమాన - పైపై వృద్ధి చెందుతున్న, కృపం - దయారసము కలవాడూ, ముగ్ధ - సుందరమైన, ఏణమద - కస్తూరితో దిద్దబడిన, విశేషక - బొట్టుచేత, ముద్రిత - అలంకరింపబడిన, నిటలేందురేఖికా - చంద్రరేఖవంటి ఫాలము చేత, రుచిరం - మనోహరుడైనట్టి వాడూ...
ఎర్రని పెదవులు కలవాడూ, శుద్ధమైన చిరునవ్వు కలవాడూ, చంద్రునితో సమానమైన ముఖము కలవాడూ, అత్యంత దయ కలిగిన వాడూ, సుందరమైన కస్తూరితో దిద్దబడిన బొట్టుచేత అలంకరింపబడిన, చంద్రరేఖ వంటి ఫాలము కలవాడూ, మనోహరుడైన వాడూ ...

II ఆర్యా ద్విశతి - 76వ శ్లోకము II
నాళీకదళసహోదర నయనాంచలనటితమనసిజాకూతమ్ I
కమలాకఠినపయోధర కస్తూరీఘసృణపంకిలోరస్కమ్ II ౭౬

తాః నాళీకదళ - తామరరేకులకు, సహోదర - సమానమైన, నయన - నేత్రముల, అంచల - కొనలయందు, నటిత - కదలుచున్న (ప్రకాశించుచున్న), మనసిజ - మన్మథుని యొక్క, ఆకూతమ్ - భావము కలవాడూ, కమలా - లక్ష్మీదేవి యొక్క, కఠినపయోధర - ధృఢమైన స్తనములయందలి, కస్తూరీ - కస్తూరి చేతను, ఘసృణ - కుంకుమపూవుచేతను, పంకిల - పూయబడిన, ఉరస్కం - ఱొమ్ము కలవాడూ ...
తామరరేకులతో సమానమైన నేత్రముల యందు ప్రకాశించుచున్న మన్మథుని భావము కలవాడూ, లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ధృఢమైన స్తనములయందలి కస్తూరి చేతనూ, కుంకుమపూవుచేతనూ పూయబడిన ఱొమ్ము వాడూ (అనగా, లక్ష్మీ సమేతుడైన వాడూ..)

II ఆర్యా ద్విశతి - 77వ శ్లోకము II
చాంపేయగంధికైశ్యం శంపాసబ్రహ్మచారికౌశేయమ్ I
శ్రీవత్సకౌస్తుభధరం శ్రితజనరక్షాధురీణచరణాబ్జమ్ II ౭౭

తాః చాంపేయ - సంపంగి పూవుల, గంధి - వాసన కల, కైశ్యం - కేశసమూహము కలవాడూ, శంపా - మెఱుపు తీగతో, సబ్రహ్మచారి - సమానమైన, కౌశేయం - పట్టువస్త్రములను ధరించినవాడూ, శ్రీవత్సకౌస్తుభధరం - శ్రీవత్సమనెడు చిహ్నమును, కౌస్తభమను మణిని ధరించినవాడూ, శ్రితజన - తనను ఆశ్రయించిన వారిని (భక్తులను), రక్షా - కాపాడుటయందు, ధురీణ- భారమును వహించిన, చరణాబ్జం - పాదకమలములు కలవాడూ ...
సంపంగి పూవుల వాసన కల కేశసమూహము కలవాడునూ, మెఱుపుతీగవంటి పట్టువస్త్రములను ధరించినవాడునూ, శ్రీవత్సమనెడు చిహ్నమును, కౌస్తుభ మణిని ధరించినవాడునూ, తనను ఆశ్రయించిన భక్తులను రక్షించుటయందు భారమును వహించిన పాదకమలములు కలవాడునూ...

II ఆర్యా ద్విశతి - 78వ శ్లోకము II
కంబుసుదర్శన విలసత్కరపద్మం కంఠలోలవనమాలమ్ I
ముచుకుందమోక్షఫలదం ముకుందమానందకంద మవలంబే II ౭౮ 

తాః కంబు - శంఖము, సుదర్శన - చక్రము లతో, విలసత్ - ప్రకాశించుచున్న, కరపద్మం - కరకమలములు కలవాడూ, కంఠ - మెడయందు, లోల - వ్రేలాడుచున్న, వనమాలం - పూలదండ కలవాడూ (తోమాల), ముచుకుంద మోక్షఫలదమ్ - ముచుకుందుడు అనెడి భక్తుడికి మోక్షరూపమైన ఫలమును ఇచ్చినవాడూ, ఆనందకందం - ఆనందమునకు మూలకారణమైనవాడూ (బ్రహ్మానంద స్వరూపుడు అగు), ముకుందం - శ్రీమహావిష్ణువును, అవలంబే - ఆశ్రయించుచున్నాను !!

(సశేషం .... )

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి