శ్రీ గురుభ్యో నమః
II ఆర్యా ద్విశతి - 61వ శ్లోకము II
పవమానసంఖ్యయోజనదూరే బాలతృణమేచక స్తస్య I
సాలో మరకతరచితస్సంపదమచలాం శ్రియం చ పుష్టాతు II ౬౧
తాః తస్య - దానికి (ముక్తామణి ప్రాకారమునకు), పవమాన సంఖ్యయోజనదూరే - ఏడు యోజనముల దూరము నందు, (పవమాన సంఖ్య - వాయువుల సంఖ్య అనగా ఏడు), బాలతృణమేచకః - లేతపచ్చికగడ్డి వలె కాంతిగల, మరకతరచితః - మరకత మణులతో నిర్మింపబడిన సాలః - ప్రాకారము, సంపదం - సంపదలను/ధనములను, అచలాం - స్థిరమైన, శ్రియం చ - లక్ష్మిని (సౌభాగ్యమును), పుష్టాతు - వృద్ధి పొందించుగాక !!
పదిహేనవ (ముక్తామణి) ప్రాకారమునకు ఏడు యోజనముల దూరములో లేతపచ్చికగడ్డి వలె కాంతిగల మరకత మణులతో చేయబడిన ప్రాకారము - పదహారవది అయిన మరకతమయ ప్రాకారము - మాకు స్థిరమైన సంపదలను, సౌభాగ్యమును వృద్ధి పొందించుగాక !!
II ఆర్యా ద్విశతి - 62వ శ్లోకము II
ఆవృత్తియుగ్మాంతరతో హరితమణీనివహమేచకే దేశే I
హాటకతాళీవిపినం హాలాఘటఘటిత విటపమాకలయే II ౬౨
తాః ఆవృత్తియుగ్మాం - ఆ రెండు (ముక్తామణి మరియు మరకతమయ) ప్రాకారముల, అంతరతః - మధ్య ప్రదేశమునందు, హరితమణీ - మరకత మణుల, నివహ - గుంపులవలె, మేచకే - నల్లని, దేశే - ప్రదేశమునందు ఉండు, హాలాఘట - కల్లుకుండలతో, ఘటిత - కూర్పబడిన, విటపం - కొమ్మలుగల, హాటకతాళీవిపినం - బంగారు తాటిమ్రాకుల వనమును, కలయే - ధ్యానించుచున్నాను !!
ముక్తామణి మరియు మరకతమయ ప్రాకారముల మధ్యప్రదేశమునందు, మరకత మణుల గుంపులవలె నల్లని ప్రదేశమునందు కల్లుకుండలతో కూర్పబడిన కొమ్మలు గల, బంగారు తాటివృక్షముల వనమును ధ్యానించుచున్నాను !!
II ఆర్యా ద్విశతి - 63వ శ్లోకము II
తత్రైవ మంత్రిణీగృహపరిణాహం తరళకేతనం సదనమ్ I
మరకతసౌధమనోజ్ఞం దద్యాదాయూంషి దండనాథాయాః II ౬౩
తాః తత్రైవ - ఆ ప్రదేశమునందే ఉండు, మంత్రిణీగృహపరిణాహం - శ్యామలాదేవి యొక్క సదనమంతటి వైశాల్యము కలదియు, తరళకేతనం - చలించుచున్న పతాకములు కలదియు, మరకతసౌధమనోజ్ఞం - మరకత నిర్మితమైన మేడలచేత రమ్యముగా నుండునదియు అగు, దండనాథాయాః - దండనాథాదేవి (ఈమెయే వారాహీ అమ్మవారు), సదనం - గృహము, ఆయూంషి - దీర్ఘాయుస్సులను, దద్యాత్ - ఇచ్చుగాక !!
ముక్తామణి మరియు మరకతమయ ప్రాకారముల మధ్యప్రదేశము నందు, బంగారు తాటి వృక్షముల వనము ఉండు చోట, శ్యామలాదేవి యొక్క సదనమంతటి వైశాల్యము కలిగినది, మరకత మణులతో నిర్మింపబడిన మేడలచేత రమ్యముగా ఉండునది అయిన, దండనాథాదేవి (అనగా వారాహీ అమ్మవారి) గృహము, మాకు దీర్ఘాయుష్షును ఇచ్చుగాక !!
దండనాథాదేవికి ద్వాదశ నామములు కలవు - అవి వరుసగా...
శ్రీహయగ్రీవః II
శృణు ద్వాదశనామాని తస్యా దేవ్యా ఘటోద్భవః I
యేషామా కర్ణనామాత్రాత్ప్రసన్నా సా భవిష్యతి II
పంచమీ దండనాథా చ సంకేతా సమయేశ్వరీ I
తథా సమయసంకేతా వారాహీ పోత్రిణీ తథా II
వార్తాళీ చ మహాసేనాప్యాజ్ఞా చక్రేశ్వరీ తథా I
అరిఘ్నీచేతి సంప్రోక్తం నామద్వాదశకం మునే II
నామా ద్వాదశకాభిఖ్య వజ్రపంజరమధ్యగః I
సంకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవః II (లలితోపాఖ్యానము, 23వ అధ్యాయము, 54-58 శ్లో.)
వారాహీ అమ్మవారు, లలితాంబిక యొక్క అహంకారము నుండి పుట్టినది.
అహంకారాత్సముత్పన్నా మేఘశ్యామల విగ్రహా I
మహావార్తాళికాదేవీ పోత్రివక్త్రసముజ్జ్వలా II (లలితోపాఖ్యానము, 22వ అధ్యాయము, 31వ శ్లోకము)
II ఆర్యా ద్విశతి - 64వ శ్లోకము II
సదనే తత్ర హరిన్మణిసంఘటితే మంటపే శతస్తంభే I
కార్తస్వరమయపీఠే కనకమయాంబురుహకర్ణికామధ్యే II ౬౪
తాః తత్ర సదనే - ఆ గృహము నందు (అనగా వారాహీ అమ్మవారి గృహము నందు), హరిన్మణిసంఘటితే - పచ్చని పరకత మణులచేత నిర్మింపబడినది, శతస్తంభే - నూరు స్తంభములు కలదియు, మంటపే - మంటపము నందు, కార్తస్వరమయపీఠే - బంగారముతో చేయబడిన పీఠము యందు, కనకమయ - బంగారుమయమైన, అంబురుహ - తామరపువ్వు యొక్క, కర్ణిక - దుద్దు యొక్క, మధ్యే - నడుమ ఉండు....
II ఆర్యా ద్విశతి - 65వ శ్లోకము II
బిందుత్రికోణవర్తుల షడస్రవృత్తద్వయాన్వితే చక్రే I
సంచారిణీ దశోత్తర శతార్ణ మనురాజకమలకలహంసీ II ౬౫
తాః బిందుత్రికోణ - బిందువు, త్రికోణము, వర్తుల - గుండ్రమగు, షడస్రవృత్తద్వయ - ఆరు రేకులు గల రెండు వలయములతో, అన్వితే - కూడిన, చక్రే - చక్రము నందు, సంచారిణీ - సంచరించుచున్న, దశోత్తర - పదికి పైగాగల, శతార్ణ - నూరు వర్ణములు గల (110 అక్షరములు గల), మనురాజ - మంత్రశ్రేష్టమనెడు, కమల - తామరము యందు విహరించు, కలహంసీ - రాజహంసాంగనయు...
బిందువు, త్రికోణము, గుండ్రమగు ఆరురేకుల రెండు వలయములతో కూడిన చక్రము నందు, సంచరించుచున్నదియు, సహస్రముకి పైగా అక్షరములు గల మంత్రశ్రేష్టమనెడు కమలము యందు విహరించుచున్న రాజహంసాంగనయు ....
II ఆర్యా ద్విశతి - 66వ శ్లోకము II
కోలవదనా కుశేశయనయనా కోకారిమండితకిరీటా I
సంతప్తకాంచనాభా సంధ్యారుణచేల సంవృతనితంబా II ౬౬
తాః కోలవదనా - వరాహముఖము కలదియు, కుశేశయనయనా - తామరల వంటి నయనములు గలదియు, కోకారి - చంద్రుని చేత, మండిత - అలంకరింపబడిన, కిరీటా - శిరోభూషణము గలదియు, సంతప్తకాంచనాభా - తప్తము చేయబడిన బంగారము వంటి శరీరము గలదియు, సంధ్యారుణ - సంధ్యాకాంతివలె ఎర్రని, చేల - వస్త్రముచేత, సంవృత - చుట్టబడిన, నితంబా - శరీరము కలదియు..
వరాహముఖము కలిగి, తామరముల వంటి నయనములు, శిరస్సున చంద్రవంకను ధరించిన, తప్తము చేయబడిన బంగారము వంటి శరీరము కలదియు, ఎర్రని వస్త్రములను ధరించినదియు...
II ఆర్యా ద్విశతి - 67వ శ్లోకము II
హల ముసల శంఖచక్రాంకుశ పాశా౨భయవరస్ఫురిత హస్తా I
కూలంకషానుకంపా కుంకుమజంబాలితస్తనాభోగా II ౬౭
తాః హల - మడక, ముసల - రోకలి, శంఖ - శంఖము, చక్రము, అంకుశము, పాశము, అభయముద్ర, వరముద్ర తో , స్ఫురిత - ప్రకాశించుచున్న, హస్తా - హస్తములు గలదియు, కూలంకష - పూర్ణమైన (గట్టును పెళ్లగించు), అనుకంపా - దయారసము గలదియు, కుంకుమ - కుంకుమచేత, జంబాలిత - పూయబడిన, స్తనాభోగా - కుచముల వైశాల్యము కలిగినదియు..
II ఆర్యా ద్విశతి - 68వ శ్లోకము II
ధూర్తానామతిదూరా వార్తాశేషావలగ్నకమనీయా I
ఆర్తాళీ శుభదాత్రీ వార్తాళీ భవతు వాంఛితార్థాయ II ౬౮
తాః ధూర్తానాం - దుష్టులకు, అతిదూరా - మిక్కిలి దూరముగా ఉండునదియు (అనగా ధూర్తులకు లభించనది), వార్తాశేష - మాటయే శేషముగా గల (ఉన్నదో లేదో అనునంతటి సన్నని), వలగ్న - నడుము చేత, కమనీయా - మనోజ్ఞురాలైనదియు, ఆర్తాళీ - ఆర్తుల సమూహములకు (ఆర్తిగా ఉన్న భక్తులకు), శుభదాత్రీ - శ్రేయస్సును ఇచ్చునదియు అగు, వార్తాళీ - వారాహీ అమ్మవారు (దండనాథాదేవి), వాంఛితార్థాయ - అభీష్టములను, భవతు - ఇచ్చుగాక !!
దుష్టులకు అందనిది, సన్నని నడుము కలిగినది, ఆర్తులైన భక్తులకు శుభములను, శ్రేయస్సును ఇచ్చునది అయిన వారాహీ అమ్మవారు మాకు అభీష్టములను ప్రసాదించుగాక !!
II ఆర్యా ద్విశతి - 69వ శ్లోకము II
తస్యాః పరితో దేవీః స్వప్నేశ్యున్మత్తభైరవీముఖ్యాం I
ప్రణమత జృంభిన్యాద్యా భైరవవర్గాంశ్చ హేతుకప్రముఖాన్ II ౬౯
తాః తస్యాః పరితః - ఆ దేవిచుట్టూ ఉండు, స్వప్నేశీ - స్వప్నేశీదేవి, ఉన్మత్తభైరవీదేవి, ముఖాః - మొదలగు, దేవీః - దేవతలను, జృంభిన్యాద్యాః - జృంభినీ మొదలగు దేవతలను, హేతుక ప్రముఖాన్ - హేతుకుడు మొదలగు, భైరవవర్గాంశ్చ - భరవుడను దేవతను, ప్రణమత - నమస్కరించుచున్నాను.
వారాహీ అమ్మవారి చుట్టూ ఉండే స్వప్నేశీదేవి, ఉన్మత్తభైరవీదేవి, జృంభినీ, హేతుకుడు, భైరవుడు మొదలగు దేవతలకు నమస్కరించుచున్నాను !!
దండనాథాదేవి యొక్క చక్రమునకు కిరిచక్రరథమని పేరు. దానికి చక్ర రక్షకులు - డృంభిని, స్తంభిని, మోహిని అను ముగ్గురు శక్తులు. వీరు ఆ చక్రమునకు అధిష్టాన దేవతలు. ఆ రథమునకు క్రింది భాగమునందు, అష్టదిక్కులందును, అథోభాగమునందు రక్షకులై హేతుకుడు మొదలగు దశభైరవులు కలరు.. వారి పేర్లు..
హేతుక స్త్రిపురారిశ్చ తృతీయాశ్చాగ్నిభైరవః I
యమజిహ్వైకపాదౌచ తౌచకాలకరాళకౌ II
భీమరూపో హాటకేశస్తధైవాచలనామవాన్ I
ఏతే దశైవ విఖ్యాతా దశకోటిభటాన్వితాః II (లలితోపాఖ్యానము, 25వ అధ్యాయము, 81-82వ శ్లోకములు)
(సశేషం .... )
సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి