శ్రీ గురుభ్యో నమః
II ఆర్యా ద్విశతి - 86వ శ్లోకము II
తద్వాపికాంతరాళే తరళే మణిపోతసీమ్ని విహరంతీమ్ I
సిందూరపాటలాంగీం సితకిరణాంకూరకల్పితవతంసామ్ II ౮౬
తాః తద్వాపికాంతరాళే - ఆ అమృతబావి మధ్యన ఉండు, తరళే - చలించుచున్న, మణిపోతసీమ్ని - మణులచే పొదగబడిన పడవయందు, విహరంతీం - విహరించుచున్నదియు, సిందూరపాటలాంగీం - సిందూరము వలె ఎఱ్ఱని దేహకాంతి కలిగినదియు, సితకిరణ - చంద్రుని యొక్క, అంకూర - మొలకచేత (అనగా బాలచంద్రుని చేత), కల్పిత - చేయబడిన, వతంసామ్ - శిరోభూషణము కలదియు...
ఆ అమృతబావి యందు ఉన్న మణులచే పొదగబడిన బావి యందు చలించుచున్నది, సిందూరమువలె ఎర్రని దేహకాంతి కలదియు, బాలచంద్రుని శిరోభూషణముగా కలదియు....
II ఆర్యా ద్విశతి - 87వ శ్లోకము II
పర్వేందుబింబవదనాం పల్లవశోణాధర స్ఫురితహాసామ్ I
కుటిలకబరీం కురంగీశిశునయనాం కుండలస్ఫురద్గండామ్ II ౮౭
తాః పర్వేందుబింబవదనాం - పూర్ణచంద్రబింబము వంటి ముఖము కలిగినది, పల్లవశోణాధర - చిగుళ్లవలె ఎర్రని పెదవుల యందు, స్ఫురిత - ప్రకాశించుచున్న హాసాం - చిరునవ్వు కలదియు, కుటిలకబరీం - వంకరలగు కేశభారము కలదియు, కురంగీశిశునయనాం - ఆడు జింకపిల్ల నయనముల వంటి కన్నులు కలదియు, కుండల - కుండలములచేత స్ఫురత్ - ప్రకాశించుచున్న, గండాం - చెక్కిళ్ళు కలదియు ...
పూర్ణచంద్రుని పోలిన ముఖము కలిగినది, ఎర్రని పెదవుల యందు ప్రకాశించుచున్న చిరునవ్వు కలదియు, వంకరలు తిరిగిన కేశభారము కలిగినదియు, ఆడు జింకపిల్ల నయనముల వంటి కన్నులు కలదియు, కుండలములచేత ప్రకాశించుచున్న చెక్కిళ్ళు కలదియు....
II ఆర్యా ద్విశతి - 88వ శ్లోకము II
నికటస్థపోతనిలయాశ్శక్తీ శ్శయవిధృత హేమశృంగజలైః I
పరిషించంతీం పరితస్తారాం తారుణ్యగర్వితాం వందే II ౮౮
తాః నికటస్థ - సమీపము నందు ఉండు, పోత - పడవల యందు, నిలయాః - ఉన్నట్టి, శక్తీః - శక్తులు అను పేరుగల దేవతలగు పరిచారికలను, శయ - చేతుల యందు, విధృత - ధరించిన, హేమశృంగ - బంగారు శృంగముల నుండి, జలైః - నీళ్లచేత, పరితః - చుట్టునూ, పరిషంచంతీం - బాగుగా తడుపుపుచున్నదియు, తారుణ్యగర్వితాం - యవ్వనము చేత శోభించుచున్న, తారాం - తారాదేవికి, వందే - నమస్కరించుచున్నాను !!
II ఆర్యా ద్విశతి - 89వ శ్లోకము II
ప్రాగుక్తసంఖ్యయోజనదూరే ప్రణమామి బుద్ధిమయసాలమ్ I
అనయోరంతరకక్ష్యా మష్టాపదరూపమేదినీరుచిరామ్ II ౮౯
తాః ప్రాగుక్తసంఖ్యయోజనదూరే - ముందు చెప్పబడిన ఏడు యోజనముల దూరమునందు ఉండు, బుద్ధిమయసాలం - బుద్ధిమయమగు ప్రాకారమునకు (21వ ప్రాకారము), ప్రణమామి - నమస్కరించుచున్నాను, అనయోః - ఆ రెండిటి (బుద్ధిమయ, మనోమయ ప్రాకారముల), అంతరకక్ష్యాం - మధ్య ప్రదేశమునందున్న, అష్టాపదరూప - బంగారుమయమైన, మేదినీ - ప్రదేశము చేత, రుచిరాం - మనోజ్ఞమైనదియు..
మనోమయ ప్రాకారమునకు ఏడు యోజనముల దూరము నందు ఉన్న బుద్ధిమయప్రాకారమునకు నమస్కరించుచున్నాను. ఈ మనోమయ, బుద్ధిమయ ప్రాకారములకు మధ్యప్రదేశమున బంగారుమయమైనది, మనోజ్ఞమైనది అయిన...
II ఆర్యా ద్విశతి - 90వ శ్లోకము II
కాదంబరీనిధానాం కలయామ్యానందవాపికాంతస్యామ్ I
శోణాశ్మనివహనిర్మిత సోపానశ్రేణిశోభమానతటామ్ II ౯౦
తాః తస్యాం - పైన చెప్పిన ప్రాకారముల మధ్య భూమి యందు, కాదంబరీనిధానాం - మద్యమునకు స్థానమును, శోణాశ్మ - ఎఱ్ఱని రాళ్ళ (కెంపుల), నివహ - గుంపులచేత, నిర్మిత-నిర్మింపబడిన, సోపానశ్రేణి - మెట్ల వరుసలచేత, శోభమాన - ప్రకాశించుచున్న, తటాం - గట్టులు కలద్యు అగు, ఆనందవాపికాం - ఆనందమయమగు బావిని, కలయామి - ధ్యానించుచున్నాను !
మనోమమ మరియు బుద్ధిమయ ప్రాకారముల మధ్య ప్రదేశమున ఉండు, మద్యమునకు స్థానము (అనగా బ్రహ్మానందమును అనుభవించే స్థితికి సంకేతము, తప్ప లౌకికముగా బుద్ధిమాంద్యము కల్పించే మద్యము కాదు..), కెంపుల చేత నిర్మింపబడిన మెట్ల వరుసలు కలిగిన తటములు (గట్ల)చే ప్రకాశించుచున్నది అయిన ఆనందబావిని ధ్యానించుచున్నాను !!
II ఆర్యా ద్విశతి - 91వ శ్లోకము II
మాణిక్యతరణి నిలయాం మధ్యే తస్యామదారుణకపోలామ్ I
అమృతేశీత్యభిధానా మంతఃకలయామి వారుణీందేవీమ్ II ౯౧
తాః తసాః మధ్యే - ఆ ఆనందబావికి నడుమన ఉండు, మాణిక్య - రత్నములచేత పొదగబడిన, తరణి - పడవయందు నిలయాం - ఉన్నట్టిదియు, మదారుణకపోలాం - మద్యపాన మత్తుచేత ఎర్రని చెక్కిళ్ళి కలదియు, అమృతేశీత్యభిధానాం - అమృతేశి అను పేరు గల దేవతకు (సుధామాలిని అని కూడా పేరు కలదు), వారుణీం దేవీం - వారుణి అను దేవిని (ఈమె నౌకాధినాయిక), అంతః - మనస్సునందు, కలయామి - ధ్యానించుచున్నాను !!
ఆనందబావికి నడుమన ఉండు, రత్నములచేత పొదగబడిన పడవయందు ఉన్నట్టిది, ఎర్రని చెక్కిళ్ళి కలదియు అయిన అమృతేశి అను దేవిని, వారుణీదేవి అను దేవిని మనస్సునందు ధ్యానించుచున్నాను !!
II ఆర్యా ద్విశతి - 92వ శ్లోకము II
సౌవర్ణకేనిపాతనహస్తాః సౌందర్యగర్వితాదేవ్యః I
తత్పరితః స్థితిభాజో వితరంత్వస్మాక మాయుషాం వృద్ధిమ్ II ౯౨
తాః తత్పరితః - ఆ ఆనందబావికి చుట్టును, స్థితిభాజః - వసించుచున్న వారును, సౌవర్ణ - బంగారముతో చేయబడిన, కేనిపాతన - పడవ నడుపు తెడ్డులను, హస్తాః - చేతులయందు ధరించినవారును, సౌందర్యగర్వితాః - తమ సౌందర్యముచేత గర్వించినవారును అగు, దేవ్యః - దేవతాస్త్రీలు, అస్మాకం - మాకు, ఆయుషాం వృద్ధిమ్ - దీర్ఘాయుష్షును వితరంతు - కలుగజేయుదురు గాక !!
ఆ ఆనందబావికి చుట్టూ వసించుచున్నవారును, బంగారముతో చేయబడిన పడవ నడుపు తెడ్డులను హస్తముల యందు ధరించినవారును, తమ సౌందర్యముచేత గర్వించినవారును అయిన దేవతాస్త్రీలు, మాకు ఆయుర్వృద్ధిని కలుగజేయుదురుగాక !!
(సశేషం ....)
సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు .