II కామాక్షీ సౌందర్యలహరి – 6వ శ్లోకము – అమ్మవారి కటాక్షమహిమ II (రెండవ భాగము)
ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః
వసన్తః సామన్తో మలమరుదాయోధనరథః I
తథా౽ప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపామ్
అపాఙ్గాత్తే లబ్ధ్వా జగదిద మనఙ్గో విజయతే II 6 II
సౌందర్యలహరి ఆరవ శ్లోకంలో మనం తెలుసుకోవలసిన తత్త్వ రహస్యములు
మన్మథుడి ధనుస్సు పుష్పములతో చేయబడినది అంటే – మన మనస్సే ధనుస్సు. లలితాసహస్రనామస్తోత్రంలో ‘మనోరూపేక్షుకోదండా’ అని అమ్మవారికి నామము. అమ్మవారు ఇక్షుకోదండం – అంటే చెరుకువిల్లు అనే కోదండం పట్టుకుంటారు. అదే ఇక్కడ మన్మథుడి చేతిలో కూడా ఉంటుంది. అంటే ఇక్కడ సాధనాపరమైన గొప్ప రహస్యం ఏమిటంటే – మన మనస్సులే మన్మథుడికి ధనుస్సు ఆయుధం. అంటే మన మనస్సులలో కామభావనలు ఉద్దీపనం చేసి మథిస్తాడు కనుకనే ఆయనకి మన్మథుడు అని పేరు వచ్చింది. మరి అమ్మవారు కూడా ఆ మనస్సు అనే ఇక్షుకోదండం పట్టుకోవడం దేనికి అంటే – అమ్మవారి అనుగ్రహం లభించనంతవరకూ మనస్సు మన్మథుడి ఆయుధమై ఉంటుంది. అలా మన మనస్సు మన్మథుడి ఆయుధమై ఉన్నంత వరకు మన మనస్సులో ఎప్పుడూ కోరికలు, కోరిక తీరడం వల్ల వచ్చే అనుభవములు ఇలా వీటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అదే అమ్మవారి అనుగ్రహం లభిస్తే, ఇంతక్రితం ఏ మనస్సు వలన పతనం అవుతున్నామో, అదే మనస్సుని మనల్ని ఉద్ధరించే దిశగా భగవంతుడివైపుకి త్రిప్పగలదు అమ్మవారు. అది సూచించడానికే అమ్మవారు మనస్సనే రూపమును కలిగిన చెరుకువిల్లుని పట్టుకుంటుంది. ఇక అమ్మ కటాక్షం లభించిందా అప్పటినుంచీ మనస్సులో వచ్చే కోరికలు అన్నీ ధర్మబద్ధమైనవి, సాత్వికమైనవి అయి ఉండి మనల్ని ఉద్ధరించేవిగా, భగవంతుడి పరంగా ఉంటాయి.
అదే విధంగా తుమ్మెదలవరుసతో కూడిన వింటినారి అని చెప్పడంలో రహస్యం – ఇంద్రియ సుఖములను మన మనస్సుకు అనుభవింపచేసే నాడీ మండలాన్ని (పంచతన్మాత్రలు) సూచిస్తుంది ఈ తుమ్మెదల వరుస. దీనినే లలితాసహస్రనామస్తోత్రంలో ‘పంచతన్మాత్రసాయకా’ అనే నామంతో అనుసంధానం చేసుకోవచ్చు. మన్మథుడి చేతిలో ఉండే ఐదు బాణములు వరుసగా ఉన్మాదము, తాపనము, స్తంభనము, శోషణము మరియు సమ్మోహనము. అలాగే మన్మథుడి చేతిలో ఉండేవి ఐదు పుష్పములు. అవి వరుసగా అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక మరియు నీలోత్పలము. ఈ ఐదు బాణములే ఐదు జ్ఞానేంద్రియములకు సంకేతము. ఇదే ఐదు పుష్పాలను అమ్మవారు కూడా పట్టుకుంటారు. అమ్మవారి నాలుగు బాహువులలో పట్టుకునే వాటిని లలితాసహస్రంలోని మనోరూపేక్షుకోదండా, పంచతన్మాత్రసాయకా అనే నామములను పరిశీలిస్తే – ఇవే చెరుకువిల్లు, ఐదుపుష్పాలు మన్మథుడు పట్టుకుంటే మనం ఎలా లౌల్యంతో తిరుగుతామో, అదే అమ్మవారు పట్టుకుంటే ఎలా ఉద్ధరింపబడతామో ఆ రహస్యం తెలుస్తుంది.
అమ్మవారి అనుగ్రహం లభినంచనంతవరకు మన్మథ బాణాలు పడుతూనే ఉంటాయి. కోరిక తర్వాత కోరిక పుడుతూనే ఉంటుంది, ఒక ఇంద్రియముతో సుఖము అనుభవించడం, అది అయ్యాక మరొక ఇంద్రియముతో…. ఇలా మార్చి మార్చి .. మార్చి మార్చి మనచేత ఇంద్రియ సుఖములను అనుభవింపజేయడమే మన్మథుని విజయము.
గరుడ పురాణములో ఒక శ్లోకము కలదు –
“కురంగ మాతంగ పతంగ భృంగ మీనాః హతాః పంచభిరేవపంచ
ఏకః ప్రమాథీ సకథం వహన్యతే యస్సేవతే పంచభిరేవపంచ”
పై శ్లోకానికి అర్ధం – “లేడికి శ్రోత్రేంద్రియ లౌల్యము, ఏనుగుకి స్పర్శేంద్రియ లౌల్యము, మిడతకి రూపేంద్రియ లౌల్యము, తుమ్మెదకి రసనేంద్రియ లౌల్యము, చేప ఘ్రాణేంద్రియ లౌల్యము – ఇలా ఒక్కో జాతి ఒక్కో ఇంద్రియ లౌల్యముతో పతనం అయిపోతుంది. కానీ మనిషికి ఐదు ఇంద్రియముల వలన పతనం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మిగతా జీవుల కన్నా మనం ఐదురెట్లు జాగ్రత్తగా ఉండవలెను” అని.
ఇప్పటి వరకూ మన్మథుడి బాణాలు పడుతున్నంతసేపూ కేవలం సుఖం కోసం, ఇంద్రియ లౌల్యముతో తిరుగుతూ ఉంటాడు. అదే అమ్మవారి చేతిలో ఉన్న పుష్పబాణము వంక చూసి, అమ్మకి నమస్కరిస్తే – ఇంద్రియ సుఖములను కూడా భగవంతుడి పరం చేయడం అలవాటౌతుంది. ఉదాహరణకి ఇతఃపూర్వం రసేంద్రియమునకు లోబడి అదే పనిగా తినేవాడు ఇప్పుడు అమ్మ అనుగ్రహం కలిగాక, అదే పదార్ధాన్ని అమ్మవారికి అయ్యవారికి నివేదన చేసి, అమ్మ ప్రసాదం తింటున్నాను అని కళ్లకద్దుకుని తింటాడు. అలాగే అమ్మ అనుగ్రహం కలిగాక స్పర్శ అనే ఇంద్రియముతో ఎప్పుడెప్పుడు తాను నమ్మిన గురువు గారి యొక్క పాదములకు తన తల తాకించి నమస్కరిద్దామా అని చూస్తాడు. ఎప్పుడెప్పుడు గురువు గారి ఆశీర్వచనం చేసే ఆయన చేయి తన శిరస్సుకి తాకుతుందా అని కోరుకుంటాడు. అమ్మవారి చేతిలో ఉండే పుష్పములను చూస్తే ప్రతీ ఇంద్రియాన్ని జీవితంలో ఎదగడానికి, ఆధ్యాత్మికముగా ఉద్ధరణహేతువై ఉపయోగించుకుంటూ లౌల్యమునకు గురికాకుండా బ్రతకడం అలవాటవుతుంది.
అలాగే ఈ శ్లోకంలో వసంతుడిని సామంతుడిగా చెప్పడానికి కారణం – వసంత ఋతువు చెట్లను చిగురింపచేసి, పుష్పింపచేసి ప్రకృతి శోభను పెంచడం ద్వారానూ మనుష్యులకు, ఇతర జీవరాశికి ఆశలను చిగురింపజేయడంలో మన్మథుడికి సహకరిస్తాడు. అలాగే మలయ పర్వతము మీద నుంచి వచ్చే గాలి మనస్సులకు ఆహ్లాదము/పులకరింత కలిగించి మన్మథుడికి మరింత సహాయ పడుతుంది. కానీ ఇక్కడ వసంత ఋతువు ఎప్పుడూ ఉండదు. మలయ పర్వతము అనేది ఎక్కడో ఒక్కచోట ఉండడం వల్ల ఆ మలయమారుతము అన్ని చోట్ల ఒకేలా వీస్తుంది అని చెప్పడం కష్టం. ఇలా అన్నీ బలహీనమైన ఆయుధ సామాగ్రి కలిగి ఉండీ, శరీరము కూడా లేకపోయినా – మన్మథుడు జగత్తులో సకల జీవులనూ జయించగలుగుతున్నాడు అంటే కారణము – హిమగిరిసుత అయిన కామాక్షీ అమ్మవారి అపాంగ వీక్షణం మన్మథుడిపై పడడం వలన మాత్రమే.
ఈ శ్లోకములో శంకరాచార్యులవారు మన్మథుడి విజయానికి కారణమైన రహస్యాన్ని చెప్తున్నారు.. అమ్మవారి యొక్క కరుణాకటాక్షం ఉండబట్టే మన్మథుడు ఈ లోకాలన్నిటినీ జయించగలుగుతున్నాడు. మన్మథుడి విజయాలకు కారణమైన అమ్మవారి కటాక్ష మహిమ తెలుసుకొని, భక్తితో అమ్మవారికి నమస్కరించి ఈ శ్లోకం పారాయణ చేయడం వలన, మన్మథుడి బాణములు మనమీద పడవు. అమ్మవారి కటాక్షం లభించడం వలన జీవితంలో అనుభవించే ప్రతీదీ ఈశ్వర ప్రసాదముగా, ధర్మబద్ధమైన సుఖములను (ధర్మబద్ధమైన అర్ధము+కామము) మాత్రమే అనుభవిస్తూ, ఇంద్రియ సుఖముల యందు లౌల్యము లేకుండా అమ్మవారు అనుగ్రహిస్తారు.
(సశేషం...)
సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు