31, డిసెంబర్ 2014, బుధవారం

కామాక్షీ సౌందర్యలహరి – 2వ శ్లోకము - అమ్మవారి పాదధూళి మహిమ

శ్రీ గురుభ్యో నమః
II కామాక్షీ సౌందర్యలహరి – 2 శ్లోకము - అమ్మవారి పాదధూళి మహిమ II



తనీయాంసం పాంశుం తవచరణ పఙ్కేరుహభవమ్
విరిఞ్చి స్సంచిన్వన్ విరచయతి లోకానవికలమ్ I
వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం
హరః సంక్షుద్యైనం భజతి భసితోద్ధూళనవిధిమ్ II 2 II

తాత్పర్యముః అమ్మా! నీ పాదపద్మములనంటిన లేశమాత్ర ధూళిని గ్రహించి బ్రహ్మ ఈ లోకాలన్నింటినీ ఏ విధమైన లోపములు లేకుండా సృష్ఠి చేయగలుగుతున్నాడు. అలాగే శ్రీమహావిష్ణువు కూడా నీపాదపద్మముల నంటిన లేశమాత్ర ధూళిని గ్రహించి ఆదిశేషుడి సహాయంతో ఈ లోకాలన్నిటినీ అతికష్టం మీద మోయుచున్నాడు. నీపాద ధూళి మహిమచే సృష్ఠింపబడిన ఈ లోకాలన్నిటినీ హరుడు (శివుడు) బాగా మెదిపి, ఆయన ఒళ్ళంతా విభూతిగా పూసుకొంటున్నాడు.

భావార్ధముః మొదటి శ్లోకములో హరి హర విరించాదులు సైతం అమ్మవారిని పూజిస్తారు అనే భావాన్ని ఈ రెండవ శ్లోకములో మరింత విపులంగా చెప్పారు శంకరులు. లోకంలో త్రిమూర్తులుగా ఆరాధింపబడే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సృష్టి స్థితి లయములు చేయగలుగుతున్నారు అంటే అది అమ్మవారి యొక్క పాదధూళి మహిమయే. ఇక్కడ ఈ శ్లోకార్ధం రెండు కోణాలలో అర్ధం చేసుకోవచ్చు.

మొదటి కోణంలో అమ్మవారి పాదధూళియే త్రిమూర్తులకు ముడిపదార్ధం – సృష్టి నిర్మాణపరంగా
అమ్మవారి పాదపద్మములను అంటిన లేశమాత్ర ధూళిని (తనీయాంసం పాంశుం) గైకొని బ్రహ్మ గారు పదునాలుగు లోకాలను సృష్టి చేయగలిగారు. అంటే మనకు కనబడే ఈ మొత్తం జగత్తంతా అమ్మవారి పాదపద్మరేణువు నుండీ వచ్చింది అని అర్ధం. ఇందులో అమ్మవారి మూలప్రకృతి తత్త్వాన్ని వివరించారు. జగత్తు అంటే, కేవలం మనం ఉండే ఈ భూలోకం ఒక్కటే కాదు. భూ లోకం ఆపైన భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం మొత్తం ఏడు ఊర్ధ్వ లోకాలు. అలాగే, అతల, వితల, సుతల, రసాతల, తలాతల, పాతాళ అని అథో లోకాలు ఏడు మొత్తం కలిపి పద్నాలుగు లోకములు. 

దీనిలో భౌతికశాస్త్రపరమైన రహస్యం దాగి ఉంది. పదార్ధం యొక్క నిర్మాణం అణువులతోనూ, ఇంకా లోపల చూస్తే పరమాణువులతోనూ, ఇంకా చిన్న స్థాయిలో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ లతోనూ కూడి ఉంటుంది అని మనం చదువుకుని ఉంటాము. అంటే సకల జగత్తు ఒక చిన్న పరమాణువు కన్నా సూక్ష్మ కణంలోంచి ఆవిర్భవించింది. అమ్మవారి యొక్క పాదములను అంటిన లేశమాత్ర కణమే ఇన్ని లోకాలని సృజించగలిగితే, ఇక అమ్మవారి శక్తి ఎంతటిదో మన ఊహకి కూడా అందదు.

విజ్ఞానశాస్త్ర ప్రకారం ఈ శ్లోకాన్ని అన్వయించుకుంటే, బ్రహ్మగారు సృష్టి చేయడం అంటే విశ్లేషణ (Analysis), మూలకణములలోని ప్రోటాన్ గా భావించవచ్చు. అలాగే స్థితికారకుడు విష్ణువు అంటే Equilibrium, మూలకణములలోని న్యూట్రాన్ గా భావించవచ్చు. లయకారుడు హరుడు అంటే సంశ్లేషణ (Synthesis), మూలకణములలోని ఎలక్ట్రాన్ గా భావించవచ్చు.

ఇక్కడ, జగత్తు యొక్క నిర్మాణం జరగడానికి మూలప్రకృతి అయిన అమ్మవారి నుండే సకల లోకాలు వచ్చాయి అని అర్ధం చేసుకోవచ్చు. అంటే, అమ్మవారి పరమాణువు మాత్ర పాదధూళి (తనీయాంసం పాంశుం) నుంచి అంతరిక్షములో ఉన్న గలాక్సీలు, సకల నక్షత్రాలు, గ్రహమండలాలు అన్నీ వచ్చాయి అన్నమాట. బహుశా దీనినే ఇప్పటి శాస్త్రవేత్తలు బిగ్ బ్యాంగ్ థియరీ గా చెప్తున్నారు అని నాకనిపిస్తుంది.

బ్రహ్మగారు ఈ లోకాలన్నిటినీ ఎటువంటి లోపములు లేకుండా సృష్టి చేస్తున్నారు (విరచయతి లోకానవికలమ్) అంటే దానర్ధం హరుడు ఈ లోకాలను లయం చేసే వరకు నిలిచే సామర్ధ్యం కలిగిఉన్న సృష్ఠిచేసే నైపుణ్యం అని.

అలాగే శౌరి అనగా శూరసేనుడి వంశమునందు పుట్టినవాడు విష్ణువు – ఇది విష్ణు సహస్రనామాలలో ఒక నామం. శ్రీమహావిష్ణువు స్థితికారకుడిగా ఆదిశేషుడి సహాయంతో, వేయిపడగలతో ఈ లోకాలను ఎలాగోలా అతికష్టం మీద మోయుచున్నాడు. ఎందుకని కష్టంమీద అని శంకరులు అన్నారు అంటే, భూమి సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు నిలువుగా ఉండి తిరగదు, ఒకసారి కర్కటరేఖవైపు, మరోసారి మకరరేఖవైపు వంగి తిరుగుతుంది. దీనివల్లనే, భూమి మీద ఋతుధర్మములు వర్ధిల్లి, సకలజీవకోటికి కావలసినవి అన్ని సమకూరుతున్నాయి. ఈ పదునాలుగు లోకాలలోనూ భూమి నుంచి పైన ఉన్న ఏడు లోకాలకు విష్ణువు మరియు భూమికి క్రింద ఉన్న ఏడు లోకాలకు విష్ణు శక్తితో శింశిమారుడు స్థితికారకుడిగా ఉన్నారు.

అలాగే హరుడు, ఈ లోకాలన్నిటిని అంత్యమున (అంటే ఆయా యుగాంతములలో), బాగా మెదిపి భస్మంగా చేసి, ఆయన వంటికి విభూతిగా పూసుకొనుచున్నాడు అని. హరుడు లయకారుడు కానీ వినాశకారుడు కాదు. లయం అనగా లీనమగుట. నిద్రాస్థితిలో మన అస్థిత్వమును కోల్పోయి ఎలా ఉంటామో, అలాగే హరుడు ప్రళయం రూపంలో ఈ లోకాలన్నిటినీ మెదిపి, ఒక విభూతి పండులా చేసి, దాన్ని వంటికి పూసుకొంటాడు. తిరిగి మళ్ళీ సృష్ఠి చేసినప్పుడు, సకల జీవులు తిరిగి వారి వారి కర్మ ప్ఫలమును అనుభవించడానికి జన్మ ఎత్తుతాయి.

ఈ విధంగా బ్రహ్మ విష్ణు హరులు వారి వారి కర్తవ్యములను నెరవేర్చి, లోకంలో త్రిమూర్తులుగా ప్రసిద్ధి చెందారు అంటే అది కేవలం అమ్మవారి పాదధూళి మహిమ మాత్రమే.

రెండవ కోణంలో అమ్మవారి పాదధూళిని గైకొన్న త్రిమూర్తుల వైభవం – అమ్మ పాదధూళి మహిమ:
అమ్మవారి పదరజస్సు శిరస్సు మీద వేసుకొని, త్రిమూర్తులు సృష్టి స్థితి లయములు చేసి, లోక పూజ్యులు అవుతున్నారు. ఇక్కడ అమ్మవారి పాదశూళి యొక్క మహిమను పదార్ధ నిర్మాణ స్థాయిలో కాకుండా, అమ్మ యొక్క పదరజస్సు యొక్క మాహాత్మ్యం (పారమార్ధిక/ఆధ్యాత్మిక స్థాయిలో) ఆలోచిస్తే, అమ్మవారి పదరజస్సు ఎంత శక్తివంతమైనదో మనకు అవగతమవుతుంది.

మన సనాతన ధర్మమునందు గురువు యొక్క మరియు భగవంతుడి యొక్క పాదములను ఆరాధిస్తూ ఉంటాము. ఉదాహరణకి కంచికామకోటి పీఠాధిపతులు నడిచే దేవుడిగా పేర్గాంచిన చంద్రశేఖర పరమాచార్య మహాస్వామి వారి పాదపద్మములు ఎంత పూజనీయమో, వారు నడిచి వెళ్ళిన ప్రదేశము ఎంత పవిత్రమై, శక్తివంతమై, పరమాచార్య స్వామి నడిచి వెళ్ళినచోట పడిఉన్న ఒక్క పరాగాన్ని మన శిరస్సు మీద వేసుకున్నంతమాత్రాన, మనల్ని ఆ శక్తి ఎలా రక్షిస్తుందో, పరమాచార్య స్వామి వారి భక్తుల అనుభవాల్లో మనం వినిఉంటాము. పరమాచార్యస్వామి వారి పాదపద్మములకు, ఆ పాదములనంటిన ధూళికి సైతం అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది – ఆయన పట్టుకున్న ధర్మము, తపశ్శక్తి వలన కదా!! అలాగే శ్రీరామాయణంలో రాముడి పాదుకలు సింహాసనం మీద ఉంచి, భరతుడు పద్నాలుగేళ్ళు అయోధ్యని పాలించాడు. అలాగే శ్రీవిద్యాసాంప్రదాయంలో గురుపాదుకలు అత్యంత శక్తివంతము మరియు పూజనీయమై, నిత్య ఆరాధనలో మృగముద్ర పట్టి శిరస్సు మీద గురుపాదుకలను ఉంచినట్లుగా స్మరించి గురువు గారి పాదపద్మములకు నమస్కరిస్తాము. మొత్తం శరీరంలో ఒక్క పాదములకే ఎందుకు ఇంత ప్రాధాన్యత వచ్చింది? మన ఇంటికి ఎవరైనా పూజ్యులు/పెద్దలు వచ్చారనుకోండి, వారికి పాదపూజ చేస్తాము తప్ప, ప్రత్యక్షంగా శిరస్సుకో, చేతులకో పూజ చేయము. దీనికి కారణం మన శరీరంలోని నాడీమండలము, గ్రంధులు, మెదడు అన్నీ పాదములతో అనుసంధానం అయి ఉంటాయి. పూజనీయులు, తపస్సంపన్నులు అయిన గురువుల యొక్క శక్తి అంతా వారి పదకమలముల యందు కేంద్రీకృతమై ఉంటుంది. అటువంటి పవిత్రమైన పాదములను భక్తుడు/శిష్యుడు తాకినప్పుడు ఆ శక్తి వారిని రక్షిస్తుంది. కరచరణాదులతో మనం చూడగలిగే గురువుల యొక్క చరణాంబుజములకే అంత శక్తి ఉంటే, ఇక అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అయిన జగదంబిక యొక్క పదరజస్సు యొక్క శక్తి ఎంతటిదో ఊహచేయడం ఈ లోకంలో ఎవ్వరికీ సాధ్యం కాదేమో కదా!!

అంత శక్తివంతము కదా అమ్మవారి పదరజస్సు, మరి కరచరణాదులతో మన ఈ మాంస నేత్రముతో అమ్మవారి యొక్క పాదపద్మములను మనం ఎప్పుడైనా చూడగలిగి కాదు కాదు చూస్తాము … అలా అమ్మ మన ఎదుట కనబడినపుడు..

“ప్రాతఃస్మరామి లలితా చరణారవిందం భక్తేష్టదాన నిరతం భవసింధుపోతం
పద్మాసనాది సురనాయక పూజనీయం పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం” ….
అంటూ అమ్మపాదపద్మములకు నమస్కరించి, అమ్మవారి పాదపద్మములను అర్చించి, అమ్మవారి పాదములను కడిగిన అభిషేకజలాన్ని మన శిరస్సు మీద ప్రోక్షించుకుని, ఆ దివ్యమైన అమ్మ పాదములకు మన శిరస్సు తాకించి నమస్కరించి, అప్పుడు అమ్మవారి పాదములకు అంటిన లత్తుక వాసన యొక్క దివ్యసుగంధపరిమళం వస్తూ, అప్పుడే అమ్మవారి చరణకమలములను దేవతాపుష్పములతో పూజ చేసినటువంటి సువాసన వస్తూ, అమ్మవారి పాదములకు ఉన్న పారాణి ఎరుపు, అమ్మవారు పాదములకు పెట్టుకున్న మంజీరముల కాంతిని చూస్తూ,  అమ్మకి నమస్కరిస్తే, ‘అమ్మా ఒక్కసారి నీ పాదములను నా శిరస్సు మీద పెట్టుకుంటానమ్మా అని ప్రార్ధిస్తే, అమ్మవారు అవ్యాజకరుణామూర్తి కదా, వెంటనే మన యందు కారుణ్యంతో అలాగే నాన్నా అని అమ్మ నవ్వుతూ మనవంక చూస్తే, అప్పుడు అమ్మవారి పాదపద్మములను రెండిటినీ మన అరచేతిలోకి తీసుకుని, ఒక్కసారి కళ్లకి అద్దుకుని, అప్పుడు అమ్మవారి రెండు పాదములను ఒక్కసారి మన శిరస్సు మీద మోపితే, పరమ పూజ్యము పవిత్రము శక్తివంతము అయిన, సుతిమెత్తని అమ్మవారి పాదముల స్పర్శ మన శిరస్సుని తాకితే, అప్పుడు మనం ఎటువంటి దివ్యానుభూతి పొందుతామో కదా, అటువంటి అదృష్టం నాకెప్పుడు కలుగుతుందో! రైలు ప్రయాణములో ప్రక్కనే వెళ్తున్న మరొక రైలు యొక్క పెద్ద ధ్వనికి భయపడిన చంటిపిల్లవాడిని దగ్గరకి లాక్కుని గట్టిగా హత్తుకొని కొండంత ధైర్యాన్నిచ్చిన అమ్మలా, జనన మరణ చక్రములో కొట్టుమిట్టాడుతూ, నిరంతరమూ మృత్యు భయముతోనూ, లేనిది రాదేమో, ఉన్నది పోతుందేమో అనే భ్రాంతిలోపడి నలిగిపోతున్న నన్ను కూడా ఆ కామాక్షీ అమ్మవారి అనుగ్రహంతో అమ్మ యొక్క చరణకమలములకు నా శిరస్సుతాకించిన మాత్రాన, నాకున్న సకలభయాలు పోయి, సుధాసారాభివర్షిణీ అయిన అటువంటి పరమానందస్థితిని అమ్మ యొక్క పాదస్పర్శ ద్వారా ఎప్పుడు పొందుతానో కదా !!

ఇతఃపూర్వం ఎవరైనా ఇలా కరచరణాదులతో ఉన్న అమ్మవారి దర్శనం పొంది, అమ్మ పాదపద్మములకు నమస్కరించే అదృష్టాన్ని పొందారా? అని మనకి సందేహం రావచ్చు. ఎందుకు లేరు? మన స్వామి హనుమయే ప్రత్యక్ష ఉదాహరణ. సాక్షాత్తు లలితా పరాభట్టారికా స్వరూపమైన సీతమ్మ తల్లి యొక్క దర్శనం పొందాక, ఆపైన అమ్మవారి యొక్క శిరోభూషణము (అభిజ్ఞానము) స్వీకరించిన తర్వాత, స్వామి హనుమ ఎంత శక్తివంతమైనదీ శ్రీరామాయణం సుందరకాండ చదివిన విన్న అందరికీ తెలుసుకదా! అమ్మ దగ్గర నుంచి ఆభరణం తీసుకున్న తర్వాత స్వామి హనుమ చేసిన రాక్షస సంహారమూ, జయమంత్ర ఘోష, అమ్మని చూడని క్రితం రావణాసురుడి తేజస్సుని చూసి ఒకింత చెట్టుచాటుకి ఒరిగిన స్వామి, అమ్మ ఇచ్చిన అభిజ్ఞానము స్వీకరించిన తర్వాత, ఏకంగా రావణుడి సభలోకి వెళ్ళి, వాడికి నాలుగు మంచి మాటలు చెప్తానని హనుమ ప్రదర్శించిన వీరోచితమైన కృత్యములు… ఇవన్నీ తలచుకుంటే ఆ ఆఖ్యానము విన్న మనకే ఎంతో ధైర్యం వచ్చేస్తుంది. సీతమ్మతల్లి అనుగ్రహం లభించడం వల్లనే కదా, హనుమ భవిష్యద్బ్రహ్మ అయ్యి, కథా పరంగా సీతారాములను కలిపినది హనుమయే అన్న శాశ్వత కీర్తిని గడించారు (కథాపరంగా అని ఎందుకు వ్రాశానంటే నిజానికి సీతారాములు ఇద్దరూ ఎప్పుడూ ఒక్కటే, వారు ఇద్దరూ వేరు వేరు అనుకుని సీతమ్మతో అనకూడని మాటలు అని మృత్యువు కొనితెచ్చుకున్నాడు రావణుడు. ఇదే మన స్వామి హనుమకి సీతమ్మలో రాముడు కనబడ్డాడు. ప్రకృతి-పురుష, శివఃశక్త్యా, సీతా-రామ, లక్ష్మీ-నారాయణ ఇలా ఏ నామంతో చెప్పినా అమ్మ-అయ్యలు అభేదం)

కాబట్టి, అమ్మవారి యొక్క పాదములనంటిన రజస్సుకి ఎంతటి శక్తి ఉంటుందో సృష్టి నిర్మాణ పరంగానూ (Speck of Dust from the Lotus feet of Kamakshi i.e., Atoms to the Whole Universe) మరియు అమ్మవారి యొక్క పాదధూళి యొక్క మాహాత్మ్యాన్ని కూడా చెప్పి (Parashakti is both transcendental and empirical), అటువంటి అమ్మవారి పాదములను మనం ధ్యానం చేసి, అమ్మపాదధూళిని మనం కూడా మన శిరస్సుమీద వేసుకొనే అదృష్టం పొందాలని సౌందర్యలహరిలోని ఈ రెండవ శ్లోకాన్ని మనకి కృపతో ఇచ్చారు ఆదిశంకర  భగవత్పాదాచార్యులవారు.

ఈ శ్లోకాన్ని లలితాసహస్రనామస్తోత్రంలోని ‘శృతిసీమంతసింధూరీకృతపాదాబ్జధూళికా’, ‘సృష్టికర్త్రీ’, ‘బ్రహ్మరూపా’, ‘గోప్త్రీ’, ‘గోవిందరూపిణీ’, ‘సంహారిణీ’, ‘రుద్రరూపా’, ‘మహాప్రళయసాక్షిణీ’ అనే నామాలతో కలిపి అనుసంధానం చేసుకోవచ్చు.

ఈ శ్లోకాన్ని ప్రతీ రోజూ భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తే సర్వలోకవశ్యము సిద్ధిస్తుంది. సర్వలోకవశ్యము అనగా మన మనస్సే ఒక లోకం, ఇందులో ఇంద్రియములు నిరంతరం మనల్ని భోగాలవైపు లాగుతూ ఉంటాయి, అలాగే కామక్రోధాది అరిషడ్వర్గములు నిరంతరము మన మనస్సుని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఈ శ్లోకం పునశ్చరణ చేయడం ద్వారా మనలోని ఇంద్రియముల తాకిడి తగ్గి, మనం ఏ పరబ్రహ్మం నుండి విడివడి ఈ శరీరమే నేను అనే భ్రాంతిలో కొట్టుకుంటున్నామో ఆ భ్రాంతి తగ్గి, అమ్మవారి పాదములను శరణవేడే బుద్ధిప్రచోదనం కలగడమే ‘సర్వలోకవశ్యము’ అని పెద్దల వ్యాఖ్యానము.
సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

29, డిసెంబర్ 2014, సోమవారం

కామాక్షీ సౌందర్యలహరి - మొదటి శ్లోకము - అమ్మవారి శివశక్త్యైకరూపము మరియు శక్తి మహిమ

శ్రీ గురుభ్యో నమః


II కామాక్షీ సౌందర్యలహరి - మొదటి శ్లోకము - అమ్మవారి శివశక్త్యైకరూపము మరియు శక్తి మహిమ II

శివశ్శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుమ్
న చే దేవం దేవో న ఖలు కుశలః స్పన్దితుమపి I
అతస్త్వామారాధ్యాం హరి హర విరిఞ్చాదిభిరపి
ప్రణన్తుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి II 1 II

తాత్పర్యముః సర్వమంగళస్వరూపుడైన పరమశివుడు పరాశక్తి అయిన నీతో (అనగా అమ్మవారితో) కూడి ఉన్నప్పుడు మాత్రమే సకల సృష్ఠి నిర్మాణము చేయడానికి సమర్ధుడై ఉన్నాడు. నీతో కూడి ఉండకపోతే అంతటి శుభప్రదుడైన పరమశివుడు సైతం కనీసం కదలడానికి కూడా అశక్తుడౌతాడు. హరి హర బ్రహ్మాదులచేత మరియు వేదములచేత కూడా ఆరాధింపబడే నీకు నమస్కారం చేయాలన్నా, స్తోత్రం చేయాలన్నా కనీసం స్మరించాలన్నా పూర్వ జన్మలలో చేసుకున్న పుణ్యబలం లేకపోతే ఎట్లా సాధ్యం అమ్మా!! (అంటే పూర్వం చేసుకున్న సత్కర్మాచరణతో కూడిన పుణ్యబలం ఉంటేనే అమ్మవారిని స్మరించడం, నమస్కరించడం లేదా స్తోత్రం చేయగలుగుతాము అని భావము).


భావార్ధముః ఇక్కడ శంకరులు సౌందర్యలహరి మొదటి శ్లోకంశివఃఅని ప్రారంభించారు. అమ్మవారు సదాశివపతివ్రత. ముందు అయ్యవారికి నమస్కరించకుండా అమ్మని స్తోత్రం చేయడం మొదలుపెడితే అమ్మవారు అసహ్యించుకుంటుంది. అందుకే శంకరులు మొదట శివః అని ప్రారంభించారు. అలాగే మొదటి శ్లోకములోనే శంకరులు అమ్మవారిని ‘శక్తి’ అనే నామంతోనే సంబోధించారు. అంటే సౌందర్యలహరి యొక్క మొత్తం వ్యాఖ్యానం ఈ మొదటి శ్లోకములో చెప్పేశారు.
ఈ శ్లోకములో మొదటి రెండు పదములను చూస్తే, శివః శక్త్యాఈ జగత్తు మొత్తానికి తల్లితండ్రులు పార్వతీపరమేశ్వరులు లేదా ప్రకృతి-పురుషుడు. ఈ జగత్తంతా ఎవరిలోంచి వచ్చిందో శంకరులు మొదటి శ్లోకంలోనే చెప్పారు. అయ్యవారు ఎల్లప్పుడూ తనలో తాను రమించే పరబ్రహ్మ స్వరూపం.
సత్యమనంతం బ్రహ్మ - అవ్యక్తము-నిర్గుణము -- అయ్యవారు
          సత్యమనంతం బ్రహ్మ - వ్యక్తం అయ్యేది, గుణములతో భాసించేది -- అమ్మవారు.

అమ్మవారు చిత్ స్వరూపిణి. సకల చరాచర సృష్ఠికి అమ్మయే కారణము. శివః అంటే మంగళం శాంతం కళ్యాణం శుభం. శివుడు ఈ లోకానికి మంగళం, శాంతం, శుభం చేకూర్చాలన్నా, అది అమ్మవారి ద్వారానే సాధ్యం. అసలు అయ్యవారిలోని ఏ గుణం వ్యక్తం అయినా అది అమ్మవారి కారణంగానే సాధ్యం. పరబ్రహ్మం బాహ్యంగా ప్రకటం అవ్వాలంటే శక్తి కావాలి, ఆ శక్తినే అమ్మవారు అని అంటున్నాము. దీపమును దీపపు కాంతిని వేరుచేయలేము. అలాగే పరమశివుడికి, స్పందన కలిగించే ఆయన శక్తికి అభేదము. ఇక్కడ ఒక ముఖ్యమైన పదం ‘స్పన్దితుమపి’. స్పందన అంటే లోపలి నుంచి పుట్టేదాన్ని స్పందన అంటారు. బయట నుంచి వచ్చేది అయితే చలనం, ఒక వస్తువు చలించాలి అంటే, దానికి బయట నుంచి బలం లభిస్తే అది కదులుతుంది. కానీ స్పందించాలి అంటే అది లోపల నుంచి వచ్చే శక్తి. అంటే అమ్మవారు ఎక్కడో వేరుగా లేదు, పరమశివుడిలోనే ఉంది అనీ, అమ్మ అయ్య అని ఇద్దరు లేరు అని ఈ స్పన్దితుమపి అనే పదంతో ఆదిశంకరులు సూక్ష్మంగా చెప్పారు.

అమ్మవారికి అయ్యవారికి అభేదము. ఒకే పరబ్రహ్మము తనలో తాను రమించేటప్పుడు అయ్యవారు (consciousness) గానూ, అదే పరబ్రహ్మము నేను అనేకమౌదును గాకఅని సంకల్పం చేయడం మొదలుకొని సకలచరాచర సృష్ఠి చేయడం వరకు అన్నీ అమ్మవారి గానూ (పరాశక్తి) చెప్తారు.

దయాశతకంలో వేదాంతదేశికులు అమ్మవారిని దయాస్వరూపంగా చెప్తారు. స్వామి యొక్క దయయే అమ్మ. శుద్ధజ్ఞానస్వరూపమైన అయ్యవారిని శాస్త్రములుకామేశ్వరఅని సూచించాయి. స్వామివారికిఅహంస్ఫురణ కలిగింది అంటే స్వామివారి యొక్క బింబ ప్రతిరూపాన్నికామేశ్వరీఅని అంటారు, ఇదే అమ్మవారు. అహం స్ఫురణ లేని కామేశ్వర తత్త్వాన్నిఅనహన్తాఅనీ, కామేశ్వరీ-కామేశ్వర తత్త్వాన్ని కలిపిపరహన్తాఅనీ, అన్ని అర్ధములు నా స్వరూపములే అని భావించుటఅహన్తా’ అనీ అంటారు – అమ్మవారు అహన్తా స్వరూపిణి. ఈ తత్త్వమునకు సంబంధించి మూకపంచశతి-ఆర్యాశతకములో ఒక అద్భుతమైన శ్లోకము ఇచ్చారు మూకశంకరులు.

అభిదాకృతిః భిదాకృతిః అచిదాకృతిరపి చిదాకృతిర్మాతః I
అనహన్తా త్వమహన్తా భ్రమయశి కామాక్షి శాశ్వతీ విశ్వమ్ II 47 II

పై శ్లోకంలో మూకశంకరులు అన్నారు- “అమ్మా కామాక్షీ! అభిదాకృతిః అంటే భేదము లేనిదానవు అనీ, భిదాకృతిః అంటే భేదము కలదానివి అనీ, చిదాకృతిః అంటే చిత్స్వరూప చైతన్యరూపిణివి అనీ, అచిదాకృతిః అంటే జడమైనది అనీ, అనహన్తా అంటే అహన్త లేనిదానివి అనీ, అహన్తా అంటే అన్నీ నేనే, నాస్వరూపములే అనే భావన కలిగినదానివి అనీ, శాశ్వతమైనదానవై, ఈ విశ్వమును భ్రమియింపజేయుచున్నావు”.

అసలు అమ్మవారు అయ్యవారు అని ఇద్దరు లేనే లేరు. అమ్మవారికి అయ్యవారికి అభేదము. ఉన్నది ఒకటే పరబ్రహ్మము దీనినే సామరస్య స్వరూపము అంటారు. అభేద స్థితిలో అమ్మవారు కూడా కామేశ్వరుడిలా అహం స్ఫురణ లేకుండా (అనహన్తా) ఉంటారు. ఎక్కడైతే అహం స్ఫురణ/చిత్ శక్తి అనే మాట వస్తుందో అది అమ్మవారు. అంటే ఏమిటి దీనర్ధంశివుడికి ఎలాగైతే అహంత (అహం స్ఫురణ) లేదో, అమ్మకి కూడా లేదు. కాబట్టి అమ్మకూడా అనహన్తా రూపిణియే. మరి లేని జగత్తు ఉన్నట్లు కనిపింపచేస్తున్నది ఎవరు? అదే మాయ! పరమేశ్వరుడేమీ చేయలేదు. అంతా మాయాస్వరూపిణి అయిన అమ్మవారే అహం స్ఫురణ కలిగించి, ఈశ్వరుడి చేత సృష్ఠి, స్థితి లయములు చేయిస్తుంది. శాక్తేయములో అమ్మవారి ప్రకాశ-విమర్శ రూపముల గురించి చెప్తారు. విమర్శ అంటే అహన్తా, ప్రకాశ అంటే అనహన్తా.  అమ్మవారు మహామాయాస్వరూపిణి. విద్య-అవిద్య రెండూ అమ్మయే. మనలను సంసారంలో బంధించే అవిద్య అమ్మయే అలాగే జ్ఞానము ఇచ్చి విముక్తి కలిగించే విద్య అమ్మయే - రెండూ అమ్మవారి చేస్తుంది. అంతేకాదు అమ్మవారే మూలప్రకృతి – అనగా ఈ సకల జగత్తు అంతా ఆ మూలప్రకృతి నుంచి వచ్చింది. గుణనిధిగా అన్ని గుణాలతో భాసించేది అమ్మయే, అలాగే అన్ని గుణాలకు అతీతమైన స్వరూపము అమ్మవారే.

సౌందర్యలహరిలోని శివశ్శక్త్యాయుక్తో అనే ప్రథమ శ్లోకాన్నీ, పైన వ్రాసిన ఆర్యాశతకంలో శ్లోకాన్నీ, లలితాసహస్రనామస్తోత్రంలోని ‘శివశక్త్యైక్యరూపిణీ’, ‘వ్యక్తావ్యక్తస్వరూపిణీ’, ‘హరిహరబ్రహ్మేంద్రసేవితా’, బ్రహ్మోపేంద్రమహేంద్రాదిదేవసంస్తుతవైభవా’, ‘పుణ్యలభ్యా’ అనే నామాల్ని కలిపి అనుసంధానం చేసుకుంటే ఈ ప్రథమ శ్లోకం బాగా అర్ధం అవుతుంది.

          స్వామి వారిలోని సంకల్పశక్తి, సృష్ఠిచేసే శక్తి, స్థితికారక శక్తి, లయకారక శక్తి అన్నీ అమ్మవారి కారణంగానే సాధ్యం. పరాశక్తిఇచ్ఛా శక్తి, జ్ఞాన శక్తి, క్రియా శక్తి అనే మూడురూపములలో వ్యక్తం అవుతుంది. అమ్మవారి శక్తి రజో గుణంగా వ్యక్తం అయితే బ్రహ్మగారు సృష్ఠి చేస్తున్నారు, సత్త్వ గుణంగా వ్యక్తం అయితే విష్ణుమూర్తి స్థితికారకుడిగా ఉన్నాడు, తమోగుణంగా వ్యక్తం అయితే హరుడు లయకారుడిగా ఈ లోకాలను లయం చేయగలుగుతున్నాడు. అయినప్పటికీ, అమ్మవారు ఈ మూడుగుణములకీ అతీతమైనది. త్రిగుణాతీత!

అలాగే ఈ మొదటి శ్లోకములో, శ్రీచక్రపరమైన అర్ధం కూడా ఉంది. శ్రీచక్రములో పైకి శీర్షము కలిగిన నాలుగు త్రిభుజాలు (ఇవి అయ్యవారికి సంకేతము), క్రిందికి శీర్షము కలిగిన ఐదు త్రిభుజాలు ఉంటాయి (ఇవి అమ్మవారికి సంకేతము). ఈ నాలుగు+ఐదు త్రిభుజాలు కలిపి తొమ్మిది త్రిభుజాలు అయితేనే, నవబ్రహ్మలు (ప్రజాపతులు) సూచించునది. కాబట్టి అమ్మవారితో కూడకపోతే ఈ జగన్నిర్మాణము సాధ్యము కాదు. అసలు ప్రపంచములో ఎక్కడ కదలిక ఉన్నా (భౌతికముగా, మానసికముగా) శక్తి లేనిదే, అమ్మవారి అనుగ్రహం లేనిదే అది సాధ్యం కాదు, ఆఖరికి ఆ పరమశివుడే అయినా అమ్మతో కూడితేనే, మనకి శివం చేయగలుగుతున్నాడు.

సౌందర్యలహరిలోని ఈ మొదటి శ్లోకములోనే శంకరాచార్యుల వారు శ్రీవిద్యా సాంప్రదాయములోనిపంచదశిమహామంత్రం కూడా ఇచ్చారని పెద్దల వ్యాఖ్యానము. ఏ మంత్రమైనా గురువు నుంచి ఉపదేశం పొందకుండా అనుష్ఠించకూడదు. కానీ సౌందర్యలహరి ఎవరైనా పఠించవచ్చు. అంటే సౌందర్యలహరి స్తోత్రాలను భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తే, శ్రీవిద్యా మంత్రమును కూడా మనకు తెలియకుండా ఉచ్ఛరిస్తున్నాము. మనమంతా ఆదిశంకరులకి ఎంత ఋణపడిఉన్నామో, ఎందుకు వారు జగద్గురువులు అయ్యారో అవగతమవుతుంది.

అలాగే మనం శ్వాస తీస్తున్నాము, మనం మాట్లాడగలుగుతున్నాము అన్నా (పశ్యంతీపరదేవతామధ్యమావైఖరీరూపా), మనలో అమ్మవారి శక్తి లేకపోతే మనం జీవించి ఉండడమే కుదరదు. అందుకే ఈ జనన మరణ సంసారం నుండి శాశ్వత విముక్తి కావాలన్నా కదలని స్థితిలో, తనలో తాను రమించే శివసాయుజ్య స్థితి పొందాలన్నా అమ్మవారి అనుగ్రహం ఉంటేనే సాధ్యం. అందుకే సుందరకాండలో స్వామి హనుమ అంతటి వారు లంక నలుమూలలా తిరిగినా సీతమ్మ దర్శనం కాకపోతే, అమ్మా నేనా నిన్ను దర్శించగలిగేది, నువ్వు అనుగ్రహిస్తే చూడగలుగుతానమ్మా అని శరణాగతి చేస్తే అప్పుడు సీతమ్మతల్లి దర్శనం ఇచ్చింది.

కాబట్టి అయ్యవారిచేత లోకముల సృష్ఠి, స్థితి, లయములు చేయించాలన్నా, అలాగే అయ్యవారిలో ఐక్యం అయ్యే మోక్షం పొందాలన్నా రెండిటికీ అమ్మవారి అనుగ్రహమే మూలకారణము. అయ్యవారిలో కలపడానికి తెరఎత్తి (అంటే మాయని తొలగించి) జగత్పిత అయిన పరమశివుడిని చూపగలదు, అలాగే తెర వేసి (మాయలో ముంచి) త్రిప్పనూ గలదు.
క్లుప్తంగా చెప్తే కదలిక లేని స్థితిలో ఉన్న పరబ్రహ్మం స్పందించి కదలాలన్నా, అలాగే కదలికలు ఉన్న స్థితిలోంచి కదలికలు లేని పరమాత్మ సాయుజ్యం పొందాలన్నా అన్నిటికీ పరాశక్తి స్వరూపమైన శ్రీలలితాంబికయే మనకి శరణ్యం.

ఇక్కడ ఇంకొక ముఖ్యమైన భావార్ధం గురించి మనం తెలుసుకోవాలి. లలితాసహస్రనామస్తోత్రంలో అమ్మవారికిగురుమూర్తి’, గురుమండలరూపిణి’, దక్షిణామూర్తిరూపిణిఅనే నామములు ఉన్నాయి. ఇదే మూకపంచశతిలోగురుమూర్తే త్వాం నమామి కామాక్షీఅని సంబోధించారు మూకశంకరులు. ఈ లోకానికి బోధచేయడానికి మొదట గురుస్వరూపంగా వెలసిన దక్షిణామూర్తి దగ్గర నుంచి, వ్యాసమహర్షి, జగద్గురువు ఆదిశంకరభగవత్పాదులు ఆ తరువాత కొనసాగుతూవస్తున్న యావత్ గురుపరంపర, అస్మద్గురువుల వరకూ అందరూ అమ్మవారి స్వరూపమే. గురువుకి అమ్మవారికి అభేదము. జననమరణ చక్రములో కొట్టుమిట్టాడే జీవుడు, ఈ మాయ నుంచి బయటపడి పరమాత్మ స్థితిని అనుభవించాలి అంటే, అమ్మవారికి అభేదమైన గురువు యొక్క అనుగ్రహకటాక్షములు పొందితేనే సాధ్యం. మాయ తొలగించడం కేవలం గురుస్వరూపమైన అమ్మవారు మాత్రమే చేయగలరు. ఇక్కడ గురువు భౌతికముగా బయట కనబడే గురువు ఒక్కరే కాదు. ప్రతీ వ్యక్తిలోనూ అంతర్గతముగా కూడా గురువు ఉన్నారు. మన శరీరంలోనే గురుమండలరూపిణి కొలువై ఉంది. ఇది ప్రారంభస్థాయిలో గుర్తించలేము కనుక, ప్రతీ వ్యక్తికి ముందు భౌతికముగా అమ్మవారికి అభేదమైన ఒక గురువుని ఆశ్రయించడం తప్పనిసరి

అదే విధంగా, శుద్ధజ్ఞానమూర్తిగా ఉన్న పరమశివుడిచేత లోకాలకి బోధ చేయడానికి గురువుగా (దక్షిణామూర్తిగా) రావాలి అన్నా, అది అమ్మవారి వలన మాత్రమే సాధ్యం. అంటే బ్రహ్మానందస్థితిలో ఏకంగా ఉన్న పరమశివుడికి, “ఈ లోకానికి మౌనబోధ చేయాలిఅనే సంకల్పం కలగడం కూడా పరాశక్తి వలననే సాధ్యం. మనం దక్షిణామూర్తి స్వామి వారిని ధ్యానం చేసే మూర్తిని చూస్తే ఆయనలో ఎడమవైపు అర్ధభాగం అంతా అమ్మవారే కనబడుతుంది. దీనికి సాక్ష్యం స్వామి వారి కుండలములు ఎడమచెవికి ఒకలా, కుడిచెవికి మరొకలా ఉంటాయి. అదేవిధంగా ఎడమవైపు కేశపాశం అమ్మవారిదిగానూ కుడివైపు కేశపాశం అయ్యవారిదిగానూ మనం గుర్తించ వచ్చు. మనందరికోసం గురువుగా ఈశ్వరుడు రావాలన్నా, మనందరికీ శుభములు/శివం కలిగించాలన్నా, మాయ తొలగించి స్వామివారిలో మనల్ని కలపాలన్నా అన్నీ అమ్మవారి అనుగ్రహంతోనే సాధ్యం అవుతాయి.

లోకములో త్రిమూర్తులుగా కీర్తింపబడుతున్న బ్రహ్మ, విష్ణు, ఈశ్వరులు సైతం అమ్మవారిని పూజించిన కారణంగా, వారి వారి కర్తవ్యములను నెరవేర్చగలుగుతున్నారుఅలాంటిది మామూలు మనుష్యులమైన మనక జీవితంలో సుఖశాంతులు కావాలన్నా, ఆపైన మోక్షం వైపు అడుగులు వేయాలన్నా పరాశక్తి స్వరూపమైన అమ్మవారిని పూజించడం, స్తోత్రం చేయడం, అమ్మవారి పాదపద్మములను స్మరించడం ఎంత ఆవశ్యకమో ఈ శ్లోకం  నుండీ మనం గ్రహించాలి. అయితే, శంకరులు ఒక మెలిక పెట్టారు ఇక్కడ. అమ్మని స్తోత్రం చేయడం, నమస్కరించడం అంత తేలికగా కుదరదురా, విశేషమైన పూర్వ పుణ్యము ఉంటేనే అమ్మవారి గురించి ఆలోచించగలవురా అని ఆదిశంకరులు 'కథమకృతపుణ్యః ప్రభవతి" అని చెప్పారు. అమ్మవారిని స్తుతించాలన్నా, అమ్మకి నమస్కరించాలన్నా, కనీసం అమ్మ గురించి స్మరించాలన్నా పూర్వం చేసుకున్న పుణ్యం ఉంటేనే సాధ్యమవుతుంది. పూర్వ పుణ్యము అంటే ఏమిటి? సత్కర్మాచరణ-విహితకర్మాచరణ-సత్పురుష సాంగత్యము మొదలైనవి. అమ్మవారు నన్ను ఉద్ధరించే స్వరూపము అని గుర్తించడానికే మన పూర్వపుణ్యం అంతా ఖర్చు అయిపోతే, ఇక ఇహములో పరములోనూ ఉన్నతి ఎలా పొందగలము అని ఒక అమాయక సందేహం కలుగవచ్చు మనకి. ఒక్కసారి మన పుణ్యం పండి - అమ్మవారి యొక్క శక్తిని గుర్తించగలిగామా, మనల్ని, మన కుటుంబాల్ని ఉద్ధరించగలిగిన అవ్యాజకరుణామూర్తి అమ్మ అన్న ఎరుక మనకి కలిగిందా - ఇంక మనకి చింత ఏమి? అమ్మవారే ఇహములో మనకి కావలసినవి అన్నీ ఇచ్చి, అంత్యములో పరమశివుడిలో ఐక్యం చేసేస్తుంది.

  కాబట్టి అమ్మవారి యందు మరియు అయ్యవారి పాదములు యందు నిరంతర భక్తిని, సత్కర్మాచరణ చేసే బుద్ధి ప్రచోదనాన్ని అమ్మవారు కటాక్షించాలని కోరుకుందాము. అంటే పుణ్యము చేసే బుద్ధి ఇచ్చేది కూడా అమ్మయే కదా! పుణ్యము చేసే బుద్ధినిచ్చి, మనచేత పుణ్యకర్మలు చేయించి, ఆ పుణ్యంతో అమ్మగురించి మరింత తెలుసుకోగలిగి, చివరికి అమ్మాయ్యలలో ఐక్యం చేయాలని కామాక్షీ చరణారవిందములను ప్రార్ధిద్దాము!

సౌందర్యలహరిలోని ఈ మొదటి శ్లోకం భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తే, సర్వకార్యసిద్ధి కలుగుతుంది.

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.