శ్రీ గురుభ్యో నమః
II ఆర్యా ద్విశతి - 93వ శ్లోకము II
తస్య పృషదశ్వయోజనదూరే హంకారసాలమతితుంగమ్ I
వందే తయోశ్చ మధ్యమకక్ష్యాం వలమానమలయపవనామ్ II ౯౩
తాః తస్య - దానికి (బుద్దిమయ) ప్రాకారమునకు, పృషదశ్వయోజనదూరే - ఏడు యోజనముల దూరము నందు ఉండు (పృషదశ్వ - వాయువు), అతితుంగం - మిక్కిలి పొడవైన, అహంకారసాలం - అహంకారమయమగు ప్రాకారమునకు, తయోశ్చ - ఆ రెండు (బుద్ధిమయ, అహంకారమయ) ప్రాకారముల, మధ్యమకక్ష్యాం - మధ్య ప్రదేశమునందు, వలమాన - వీచుచున్న, మలయపవమానామ్ - మలయమారుతమును, వందే - నమస్కరించుచున్నాను !!
బుద్ధిమయ (21వ) ప్రాకారమునకు, ఏడు యోజనముల దూరము నందు ఉన్న అహంకారమయ ప్రాకారము (22వ)నకు మరియు, ఈ బుద్ధిమయ-అహంకారమయ ప్రాకారముల మధ్య ప్రదేశమునందు వీచుచున్న మలయమారుతమునకు నమస్కరించుచున్నాను !!
II ఆర్యా ద్విశతి - 94వ శ్లోకము II
వినుమో విమర్శవాపీం సౌషుమ్నసుధాస్వరూపిణీం తత్ర I
వేలాతిలంఘి వీచీకోలాహలభరిత కూలవనవాటీమ్ II ౯౪
తాః తత్ర - అచ్చట, వేలా - హద్దులను (పొలిమేరలను), అతిలంఘి - అతిక్రమించి, మీరుచున్న, వీచీ - అలల, కోలాహలం - కలకల ధ్వనుల చేత, భరిత - నిండిన, కూల - తీరప్రదేశములందలి, వనవాటీం - వనముల సమూహము కలదియు, సౌషుమ్నసుధాస్వరూపిణీం - మహాయోగీశ్వరుల సుషుమ్న నాడి యందు ఉండు అమృతస్వరూపము గలదియు అగు, విమర్శవాపీం - విమర్శపు బావిని, వినుమః - నుతించుచున్నాను !!
బుద్ధిమయ, అహంకారమయ ప్రాకారముల మధ్య ప్రదేశమునందు, హద్దులను మీరి వీచుచున్న అలలచేత నిండిన తీరప్రదేశమునందు వనముల సమూహములు కలదియు, మహాయోగీశ్వరుల సుషుమ్ననాడి యందు ఉండు అమృతస్వరూపము గలదియు అయిన విమర్శపు బావిని - నమస్కరించుచున్నాను !!
తయోస్తుపాలయోర్మధ్యే కక్ష్యా భూరఖిలామునే I
విమర్శవాపికానామ సౌషుమ్నామృతరూపిణీ II
యన్మహాయోగినామంతర్మనో మారుతపూరితే I
సుషుమ్నాదండ వివరే జాగర్తి పరమామృతమ్ II
తదేవ తస్యాస్సలిలం వాపికాయాస్తపోధన I
పూర్వవత్తటసోపాన పక్షినౌకాభిధాస్మృతాః II
తత్ర నౌకేశ్వరీదేవీ కురుకుళ్ళేతి విశ్రుతా I
తమాలశ్యామలాకారా శ్యామకంచుకధారిణీ II (లలితోపాఖ్యానము, 39వ అధ్యాయం, 38-41వ శ్లోకములు)
II ఆర్యా ద్విశతి - 95వ శ్లోకము II
తత్రైవ సలిలమధ్యే తాపింఛదళ ప్రపంచసుషమాభామ్ I
శ్యామలకంచుకలసితాం శ్యామాం విధుబింబడంబర హరాస్యామ్ II ౯౫
తాః తత్రైవ - ఆ విమర్శవాపియందు, సలిలమధ్యే - నీటి మధ్యన, తాపింఛదళ - కానుగు ఆకుల, ప్రపంచ - సమూహము యొక్క, సుషుమ - కాంతివంటి, ఆభాం - కాంతి గలదియు, శ్యామల - నల్లని, కంచుక - చీరచేత, లసితాం - ప్రకాశించునదియు, శ్యామాం - మధ్యయౌవనము గలదియు, విధుబింబ - చంద్రబింబము యొక్క, డంబర - గర్వమును, హర - పోగొట్టు, ఆస్యాం - ముఖము కలదియు...
ఆ విమర్శవాపి యందు ఉన్న జలముల మధ్యన, కానుగు ఆకుల సమూహముయొక్క కాంతిని కల్గినదియు, నల్లని చీరచేత ప్రకాశించుచున్నదియు, మధ్య యౌవనము కలదియు, చంద్రబింబము యొక్క గర్వమును పోగొట్టు ముఖబింబము కలదియు అగు...
II ఆర్యా ద్విశతి - 96వ శ్లోకము II
ఆభుగ్నమసృణ చిల్లీహసితాయుగ్మశర కార్ముకవిలాసామ్ I
మందస్మితాంచితముఖీం మణిమయతాటంకమండితకపోలామ్ II ౯౬
తాః ఆభుగ్న - చక్కగా వంకర తిరిగిన, మసృణ - నునుపైన, చిల్లీ - కనుబొమలచేత, హసిత - నవ్వబడిన (తిరస్కరింపబడిన), అయుగ్మశర - మన్మథుని, కార్ముక - వింటి యొక్క, విలాసాం - చక్కదనము కలదియు (ఆ దేవి కనుబొమలు మన్మథుని వింటికంటెనూ సుందరమైనవి), మందస్మిత - చిరునవ్వుచేత, అంచిత - సుందరమైన, ముఖీం - వదనము గలదియు, మణిమయ - రత్నఖచితమైన, తాటంక - కర్ణాభరణముల చేత, మండిత - అలంకరింపబడిన, కపోలాం - చెక్కిళ్ళు గలదియు ....
మన్మథుని యొక్క వింటి కంటె సుందరమైన చక్కగా వంకర తిరిగిన నునుపైన కనుబొమల సౌందర్యము కలిగినదియు, చిరునవ్వుతో కూడిన వదనము కలదియు, రత్నఖచిత కర్ణాభరణములచేత అలంకరింపబడిన చెక్కిళ్ళు గలదియు ....
II ఆర్యా ద్విశతి - 97వ శ్లోకము II
కురువిందతరణి నిలయాం కులాచలస్పర్ధి కుచనమన్మధ్యామ్ I
కుంకుమవిలిప్తగాత్రీం కురుకుళ్లాం మనసి కుర్మహే సతతమ్ II ౯౭
తాః కురువిందతరణినిలయాం - కెంపులచే చేయబడిన పడవ యందు ఉన్నదియు, కులాచల - కులపర్వతములతో స్పర్ధి - కలహించుచున్న (వాటి కంటే గొప్పవి అని), కుచ - స్తనములచేత, నమత్ - వంగిన మధ్యామ్ - నడుము కలదియు, కుంకుమవిలిప్తగాత్రీం - కుంకుమచేత పూయబడిన శరీరము గలదియు అగు, కురుకుళ్ళాం - కురుకుళ్ళ అను దేవతను (ఈమెయే నౌకేశ్వరీ దేవి), సతతం - ఎల్లప్పుడూ, కుర్మహే - ధ్యానించుచున్నాను !!
కెంపులచేత చేయబడిన పడవయందు ఉన్నదియు, కులపర్వతముల కంటే గొప్పవైన స్తనములు కలిగినది (ఇది అమ్మవారి మాతృతనమునకు నిదర్శనము, ఆబ్రహ్మకీటజనని అయిన అమ్మవారి యొక్క పోషించే తత్వాన్ని, మాతృతనాన్ని వర్ణించారు మహర్షి), ఆ స్తనభారము చేత వంగిన నడుము గలదియు (ఇది గొప్ప సాముద్రిక లక్షణం), కురుకుళ్ళా దేవిని (నౌకేశ్వరీదేవి అని కూడా నామము) ఎల్లప్పుడూ ధ్యానించుచున్నాను !!
(సశేషం .... )
సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి