10, జూన్ 2013, సోమవారం

శ్రీ పరమాచార్య వాణి - భగవంతుడిని ఎందుకు పూజించాలి?


మనకి కనబడుతున్న ఈ విశ్వం అంతా ఒక నియతితో నడుస్తూ ఉంది అంటే, ప్రకృతి శక్తులన్నీ ఒక క్రమపద్ధతిలో పనిచేస్తున్నాయి అంటే, వీటన్నిటికీ వెనుక, వీటిని సృష్టించి నడిపిస్తున్న శక్తి ఒకటి ఉన్నది .. ఆ శక్తిని ఆస్తికులు 'భగవంతుడు' అని అంటారు. మనం చేసే ప్రతీ పనికీ, మనం ఆశించినా/ఆశించక పోయినా ఒక ఫలితం ఉంటుంది. భగవంతుడు మనం చేసే పనులను అనుక్షణం వీక్షిస్తూ, వాటికి తగ్గ ఫలితములను మనకి ఇస్తూ ఉంటాడు.

"సరే భగవంతుడు ఉన్నాడు, ఉంటే మనం ఆయనని ఎందుకు భక్తితో పూజించాలి? మనల్ని అడిగి ఆయన ఈ సృష్టి చేశాడా? అసలు భగవంతుడు మనల్ని సృష్టించబట్టే కదా మనకి ఈ కష్టాలన్నీ. అటువంటప్పుడు, ఆయన పట్ల మనం ఎందుకు భక్తి కలిగి ఉండాలి? ఎందుకు ఆయనని పూజించాలి??" అనేలాంటి ప్రశ్నలు కొందరికి ఉండవచ్చు.


పై ప్రశ్నకి సమాధానంగా, ఆస్తికులు/భగవద్భక్తులు అయిన వారు.."భగవంతుడు మన కష్టాలను/సమస్యలను తీర్చగల సమర్ధుడు" అని చెప్పారనుకోండి, దానికి కూడా ప్రతిగా ..."సరే! భగవంతుడిని పూజిస్తేనే మన కష్టాలు తీరుతాయి అంటే, మీరు చెప్తున్నట్లుగా ఆయన కరుణామూర్తి కాడన్నమాట, కేవలం ఎవరైతే పూజిస్తారో వారి కష్టాలను మాత్రమే తొలగిస్తాడా?" అని కొందరు అడగవచ్చు. అంతేకాదు, "మనం చేసిన పనులకు ఆయన ఫలితములనిస్తాడు అన్నారు కదా, అంటే మనకి ఒక కష్టం వచ్చింది అంటే, మనం ఇంతకు పూర్వం చేసిన పాపములకు ఇప్పుడు ఫలితం ఇస్తున్నాడు, ఇప్పుడు ఆ పాపఫలితం నేను అనుభవించను అని అంటే అది సబబా??" అని కూడా అడగవచ్చు.


శ్రీనీలకంఠ దీక్షితార్ వ్రాసిన 'ఆనందసాగర స్తవం'లో మనపై ప్రశ్నలకి చక్కని సమాధానం ఇచ్చారు. నీలకంఠ దీక్షితార్ ఆ స్తవంలో, మీనాక్షీ అమ్మవారిని ఉద్దేశించి అంటారు, "అమ్మా మీనాక్షీ!! నీకు నేను ఏమీ నోరు విడిచి చెప్పనక్కర్లేదు, నీకు అన్నీ తెలుసు. అయినా నా సమస్యలను నీకు చెప్పకపోతే, నాకు చాలా బాధగా ఉంటుంది, నోరు విడిచి నీకు చెప్పుకున్నంత మాత్రాన, నాకు చాలా తృప్తిగా, ధైర్యంగా ఉంటుందమ్మా. ఈ కారణం వల్లనే, నీకు నా గురించి సర్వమూ తెలిసినా, నా అంతట నేను నా సమస్యలను నీకు విన్నవిస్తున్నాను" అని.


భగవంతుడిని పూజించడం వలన, ఆయన మన సమస్యల నుంచి మనల్ని రక్షిస్తాడా, లేదా మనం చేసిన కర్మలకి మనకి ఏ ఫలితం రావాలో ఆ ఫలితాన్ని అలాగే ఇస్తాడా లేక మనం ఏదైతే పాపఫలితాన్ని అనుభవించాలో, దానిని తట్టుకునే స్థైర్యాన్ని ఇస్తాడా... అనేది వేరే విషయం, మొదటగా మనం భగవంతుడికి మన సమస్యలని విన్నవించుకోవడం వలన, మనకి ముందు కొంత ప్రశాంతతనిస్తుంది.


కానీ, నిజానికి ఈశ్వరుని యందు మనకి ఉండవలసిన భక్తి అనే విషయమై మాట్లాడితే, మన సమస్యలకు పరిష్కారం కోసం మాత్రమే ఈశ్వరుడిని పూజించాలి అనేది సరికాదు. అలాకాకుండా, ప్రస్తుతం మనకి సుఖమయ జీవితాన్ని ఈశ్వరుడు ఇచ్చాడు అనే కృతజ్ఞతని ఆవిష్కరించడానికి కూడా కాదు ... ఈశ్వరుడిని పూజచేయవలసినది. ఎందుకంటే, నారు వేసిన వాడే నీరు పోస్తడు అని చెప్పినట్లుగా, నన్ను సృష్టించినవాడికి నాకు ఎప్పుడు ఏమి అవసరమో తెలుసు, అలా అవన్నీ ఇవ్వడం ఆయన యొక్క కర్తవ్యం, ఇందులో ఆయనకి నేను కృతజ్ఞత చెప్పేది ఏముంది? అనే భావన ఉన్నవారు కూడా కొందరు ఉండవచ్చు. కాబట్టి, మనకేదో ఈశ్వరుడు ఇచ్చాడు, మనం సుఖంగా ఉన్నాం కాబట్టి, కృతజ్ఞతా భావంతో పూజచేయాలి అనేది కూడా సరికాదు, అలాగే మన సమస్యలను తీర్చేందుకే భగవంతుడిని పూజించాలి అనేది సరికాదు.


సుఖము, కష్టము అనేవి రెండూ మనసుని ఎప్పుడూ కదిలిస్తూ ఉంటాయి. అందుకే పైన చెప్పిన సుఖములలో లేక కష్టములలో భగవంతుడి పట్ల భక్తి అనే ఉద్దేశ్యంలో నేను మాట్లాడడం లేదు. ఎక్కడైతే మనసు స్థిరముగా, ప్రశాంతముగా ఉంటుందో అదే నిజమైన శాశ్వతమైన ఆనందం. మిగతా సంతోషాలన్నీ శాశ్వతము కావు. మనం బాగా గాఢమైన నిద్ర(సుషుప్తి)లో ఉన్నప్పుడు లేక మానసిక ఉన్మాదం వంటివి ఉన్నప్పుడు కూడా ఎటువంటి సుఖము లేక కష్టము రెండిటినీ మనం అనుభవించము. సంపూర్ణ ఆనంద స్థితిలోనే ఉంటాము, కానీ అలా సుషుప్తిలో, మనం పొందే ఆనందం మనకి ఎరుకలో (being aware) ఉండదు. మనం మెళకువగా ఉన్నప్పుడు, మనసులో ఏ ఇతర ఆలోచనలూ లేక, సంపూర్ణమైన ఎఱుకతో, మనం ఆ ప్రశాంతతని అనుభవించాలి. కానీ అలా మనం గమనిస్తూ ఉండగ, ఆ శాశ్వతమైన ప్రశాంతత పొందాలి అంటే, మన మనసులో ఎటువంటి ఆలోచనలు ఉండకూడదు. కానీ మన మనసులో ఒకదాని వెంట మరొక ఆలోచనలు పుడుతూనే ఉంటాయి. ఈ ఆలోచనలు మనలో పుడుతున్నంత సేపూ, 'జీవుడిగా' నేను వేరు, పరమాత్మ వేరు అనే భావన మాత్రమే మనకి ఎరుకలో ఉంటుంది. మనస్సు నిశ్చల స్థితిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే జీవాత్మ/పరమాత్మల భేదాలు తొలగిపోతాయి. అటువంటి నిశ్చల స్థితిలో పరమాత్మ తప్ప వేరుగా ఏదీ లేదు అనే అద్వైత స్థితిని అనుభవిస్తాము. ఆ స్థితిని చేరుకోవాలంటే, ఏదైతే/ఎవరైతే ఆ స్థితిలో ఉన్నారో, దానిని తదేక దీక్షగా ధ్యానం చేయాలి. మనం దేనినైతే ధ్యానం చేస్తూ ఉంటామో, కొన్నాళ్ళకు దానిగానే మారిపోతాము. ఈ విషయాన్ని ఆధునిక వైజ్ఞానిక శాస్త్రం కూడా అంగీకరించినది. ఈ విధముగా, ప్రశాంతమైన, ధ్యాన యోగ్యమైన అద్వైత స్థితిలో ఉన్నది సాక్షాత్తు భగవంతుడే.


సృష్టి, స్థితి, లయములు చేస్తూ, కర్మ ఫలితాలనిచ్చే భగవంతుడు ఎప్పుడూ డస్సిపోడు, బ్రహ్మానంద స్థితిలోనే ఎప్పుడూ ఉంటాడు. భగవంతుడి నామాలలో స్థాణుః అనే నామం ఉన్నది. స్థాణువు అనగా ఇక కదలడానికి వీలులేనంతలా అంతటా వ్యాపించిపోయిన వాడు అని ఒక అర్ధం, అలాగే, ఒక చెక్క దుంగ అనే ఒక అర్ధం కూడా ఉన్నది.  లోపల జీవం ఉన్న దుంగ పైకి జీవం లేనట్టుగా కనబడుతుంది. అటువంటి స్థాణువైన చెక్కదుంగని ఒక లత అల్లుకుంటుంది, ఆ లతయే అమ్మవారు. స్థాణువుగా ఉన్న ఈశ్వరుడిని, ఆకులు లేని లత అయిన అపర్ణగా అల్లుకుని ఉంటుంది. భగవంతుడిని గురించి మనం ఎప్పుడు ఆలోచించినా జ్ఞానము + శాంతి అనే విషయాలు మన ఆలోచనకి వస్తాయి. అందువల్లనే భగవంతుడిని మనం ఎప్పుడూ ధ్యానం చేస్తూ ఉంటే, మనకి జ్ఞానము+శాంతి కలుగుతాయి.


ఒక వ్యక్తి ప్రారంభ దశలో, తన కష్టాలను భగవంతుడికి విన్నవించుకుని ఆ కష్టాల నుండి బయటపడినా, లేక భగవత్కృపతో సుఖమయ జీవనాన్ని గడపుతున్నందుకు భగవంతుడికి ప్రతీ రోజూ పూజ చేస్తూ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా, అటు కష్టములోనూ, ఇటు సుఖములోనూ, భగవంతుడికి విన్నవించుకోవడం అనేది ప్రాథమిక దశ. ఇలా భగవత్ చింతన అలవాటైన కొద్దీ, మన మనసు నెమ్మది నెమ్మదిగా ఈ కష్టముల వల్ల కలిగే బాధ నుండీ, మరియు సుఖముల వల్ల కలిగే ఆనందము నుంచీ, రెండిటి నుండీ విడివడడం మొదలవుతుంది. భగవంతుని యందు మనసు పెట్టి, సాధన పెరుగుతున్న కొద్దీ, పోను పోను అన్నీ ఈశ్వరేచ్ఛగా జరుగుతున్నాయి, అన్నీ ఈశ్వరుడే చూసుకుంటాడు అని, తనకి కష్టం వచ్చినా, సుఖమే వచ్చినా రెండిటినీ పట్టించుకోని స్థితిలోకి వెడతాడు. ఒకవిధమైన ఆనందము, శాంతి కలగడం ప్రారంభం అవుతుంది. ఒక కష్టానికీ కృంగి పోడు, సుఖానికి పొంగిపోడు, అన్నిటినీ ఈశ్వరుడే ఇస్తున్నాడు, అన్నీ ఆయనే చూసుకుంటాడు అనే శరణాగతి బుద్ధి అలవడుతుంది. ఇదే, మనల్ని ఆత్మోన్నతివైపుకి నడిపిస్తుంది. ఈ విధంగా ఆలోచించడం వల్ల, మనకి పూర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది.


కేవలం ఆత్మ విచారణ, ధ్యానము, యోగము ద్వారానే మన మనసు నిశ్చలమవుతుంది. నిశ్చలమైన మనసు ఉన్నప్పుడే, పూర్ణమైన ఆత్మానందస్థితిని ఎఱుకతో అనుభవించగలుగుతాము. అయితే మీరు నన్ను ఒక ప్రశ్న అడుగవచ్చు, "ఈ ఆత్మ విచారణ, ధ్యానము, యోగము అనే ప్రక్రియలు ఎలా చెయ్యాలో చెప్పకుండా, మీరు భగవద్భక్తి గురించి, భగవంతుడిని ఎందుకు పూజించాలి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు?". ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు చెప్పారు, ఏ స్థితిలో అయితే ఏ చలనము, ఏ ఆలోచనా, కనీసం భక్తి అనే ఆలోచనా కూడా ఉండవో ఆ స్థితియే 'మోక్షస్థితి'. అప్పుడు "మరి భగవంతుడిని పూజించమని ఎందుకు చెబుతున్నారు?" అని మీరు నన్ను అడుగవచ్చు. దీనికి సమాధానం శంకరులే మనకి చెప్పి ఉన్నారు. మోక్షం పొందే సాధనా మార్గాలలో భక్తి మార్గం సర్వోత్కృష్టమైనది అని. అయితే ఈ భక్తి అంటే ఏమిటి? దేనిని భక్తి అంటారు? దీనికి కూడా సమాధానం శంకరులే మరుసటి వాక్యంలో చెప్పి ఉన్నారు, 'నిజమైన నేను (enquiring into the real nature of self) ఎవరో విచారణ చేయడంలో నిమగ్నమై ఉండడమే భక్తి' అని శంకరులు చెప్పారు. శంకరుల నిర్వచనం ప్రకారం, భక్తి అనేది కేవలం ఆత్మవిచారణ, ధ్యానము, యోగము ద్వారానే సాధ్యము తప్ప మనం సాధారణంగా ఇప్పటి వరకూ అనుకునే భక్తి... అనగా భగవంతుడు అనేవాడు బయట ఎక్కడో ఉన్నాడు, ఆయన పట్ల మనం చూపే ప్రేమనే భక్తి.... అని మనం అనుకునేది అసలు భక్తి కాదు.


సరే, భక్తి అంటే ఏమిటో పైన చెప్పిన నిర్వచనం స్వయంగా శంకరులే ఇచ్చి ఉన్నా కూడా, మా పీఠములలో (కంచికామకోటి పీఠం, మరియు ఇతర శంకరాచార్య ప్రతిష్టిత పీఠములు) చేయవలసిన చంద్రమౌళీశ్వర ఆరాధనా పద్ధతిని వారే ప్రారంభించారు. నిర్గుణమైన పరబ్రహ్మమే మన అంతిమ లక్ష్యము అని శంకరులే ప్రకటించినా కూడా, వారే ఆరు భగవదారాధనా పద్ధతులను స్థాపించడం వల్ల వారికి షణ్మత స్థాపనాచార్య అనే నామం కూడా వచ్చింది. వారు మన దేశంలో కాలుమోపని పుణ్యక్షేత్రం లేదు. ఆసేతు హిమాచలం పాదచారియై పర్యటించారు. అనేక దేవతా స్వరూపాలను స్తుతిస్తూ ఎన్నెన్నో స్తోత్రాలను ఇచ్చారు. దీనిని బట్టీ మనం అర్ధం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, ప్రస్తుతం మనం ఏదైతే భగవదారాధానా/పూజా పద్ధతులు ఉన్నాయో (వేటిని మనం భగవద్భక్తి అనుకున్నామని చెప్పానో..), ఈ పూజా విధానాలకు శంకరుల అనుమతి ఉన్నది. కాబట్టే కదా వారే స్వయంగా అన్ని స్తోత్రాలు ఇవ్వడం, అనేక క్షేత్రాలలో వారు పర్యటించడము, ఆఖరికి వారు ప్రతిష్టించిన పీఠాలలో కూడా నిత్య చంద్రమౌళీశ్వరారాధనా క్రమాన్ని ప్రారంభించి, పరంపరాగతంగా కొనసాగుతూ ఉండడం వస్తున్నది.


జ్ఞానమే అన్నిటికన్నా సర్వోత్కృష్టమైన ఆధ్యాత్మిక సాధనా ఫలితముగా చాలా మందికి ఒక భావన ఉన్నది. అలాగే జ్ఞానము కన్నా ఓ స్థాయి తక్కువగా ఆత్మ విచారణ, ధ్యానము, యోగము, దానికన్నా క్రింద స్థాయిలో పూజలు చేయడము, పుణ్యక్షేత్రములను దర్శించటము అనీ, అన్నిటికన్నా క్రింద స్థాయిలో వైదిక క్రతువులు, కర్మకాండ చూడబడుతూ ఉన్నది. చాలా మంది చదువుకున్న వారిలో కూడా, వైదిక క్రతువులంటే కేవలం మూఢనమ్మకాలు అనే స్థిరమైన అభిప్రాయము, పూజాధికములు నిర్వహించడం ఒక మానసిక భావము (sentiment) గానూ, ధ్యాన/యోగములు మాత్రమే నిజమైన ఆధ్యాత్మికత అనీ ఒక ప్రగాఢ విశ్వాసం ఉన్నది.


ఆదిశంకర భగవత్పాదులంతటి వారు, సాక్షాత్ కైలాస శంకరుడే ఆదిశంకరుడిగా వచ్చినా, వారు స్వయంగా ఎప్పుడూ బ్రహ్మానంద స్థితిలో ఉండే మహాపురుషుడే అయినా, కర్మకాండతో పాటు జ్ఞాన మార్గము కూడా అవసరం అని చెప్పినా..... శంకరులే మనసు+క్రియ కలిపి చేయవలసిన భగవంతుడి పూజ, వైదిక కర్మలను కూడా సమ్మతించారు. దీనికి కారణం ఉన్నది. సంసారంలో మమేకమై ఉన్న మనందరికీ, మనసు ఎప్పుడూ నిరంతర ఆలోచనలతో అలజడికి గురై ఉంటుంది. అటువంటి మనసును ఒక్క క్షణమైనా నిశ్చలంగా ఉంచడం చాలా కష్టం. అలాగని, మన ప్రయత్నంతో మనసులో వచ్చే ఆలోచనలను అరికట్టి, నిశ్చల పరుద్దాం అని అనుకున్నా, అది అత్యంత కష్టమైన విషయం. ఆలోచనలు అదేపనిగా మన మనసుని అన్ని దిశల నుండీ తాకుతూనే ఉంటాయి. మనకి సంసారంలో ఉన్న బంధాలు, వ్యక్తులతో ఉన్న విరోధాలు, బాధలు, భయాలు, సంతోషాలు అన్నీ ఒకదాని వెనుక ఒకటి మనల్ని అలల్లా తాకుతూ, మనల్ని ఒక సందిగ్ధావస్థలో ఉంచుతాయి. దీని కారణంగానే, "మనసుని నిశ్చలముగా ఉంచుకొనుము, తద్వారా ఆత్మనందము పొందగలవు" అని చెప్పడం తేలిక, ఆచరణలో దానిని సాధించడం అంత తేలిక కాదు.


మన మనస్సును నిశ్చలముగా, ఎటువంటి ఆలోచలు లేకుండా నిలపలేక పోవడానికి కారణం ఏమిటి?


మనం పూర్వ జన్మలో చేసిన కర్మల ఫలితమే దీనికి కారణం. జన్మ తర్వాత జన్మ, ప్రతీ జన్మలోనూ మనం ఏవో కొన్ని పాపములు చేస్తూ వచ్చాము. జన్మజన్మాంతర ఆ పాపరాశి ధ్వంశం అయితే తప్ప, మనం ఆత్మ దర్శనం పొందలేము. అటువంటి స్థితిని చేరుకోవాలంటే, మన కర్మలన్నిటికీ ఫలితాలనిచ్చే ఈశ్వరుడు, మన పాపములన్నిటికీ మన చేత శిక్ష అనుభవింప చేసిన తర్వాత మాత్రమే సాధ్యము. పాపము ఇచ్చే ఫలితము ఎలా తుడిచిపెట్టుకుపోతుంది? పుణ్యములు చేయడం ద్వారా. పుణ్య కార్యములు చేయడం వలన, ఈ జన్మలో అన్ని పాపములు అనుభవించలేక పోతే, మళ్ళీ ఇంకొక జన్మలో, ఈశ్వరుని యొక్క నిర్హేతుక కృపతో ఇంకో శరీరాన్ని ఇస్తాడు. అప్పుడు ఆ కొత్త శరీరంతో ఇతఃపూర్వం ఉన్న పాపరాశి మళ్ళీ కొంత అనుభవించగలుగుతాడు. కానీ మనం ఏమి చేస్తున్నాము? గత జన్మలలో ఉన్న పాపములను అనుభవించడమే కాకుండా, ఈ జన్మలో మళ్ళీ కొత్తగా పాపములను చేస్తూ, మన పాపముల చిట్టా రోజు రోజుకీ పెంచుకుంటున్నాము. ఇలా మనం అజ్ఞానంతో పాపములను తగ్గించుకోవడం మానేసి, గుణాత్మకంగా పాపములను పెంచుకుంటున్నాము అనే, జగద్గురువులైన శ్రీఆదిశంకర భగవత్పాదులు, జ్ఞాన మార్గముతో పాటు, వైదిక కర్మలను చేయడం, భగవంతుడిని పూజ చేయడం వంటి కూడా తప్పనిసరి అని సూచించారు.

పాపములు రెండు రకములు. ఒకటి కాయకముగా చేసిన పాపములు, రెండు మానసికముగా చేసిన పాపములు. కాయకముగా చేసిన పాపములు పరిహారం అవ్వాలి అంటే, కాయకముగా పుణ్య కార్యములు చెయ్యాలి. అలాగే మానసికముగా చేసిన పాపములు పరిహారం అవ్వాలి అంటే, పుణ్యప్రదమైన ఆలోచనలు/సత్సంకల్పాలు చేస్తూ ఉండాలి.


పుణ్య కార్యం అంటే ఏమిటి? - వేదం వేటిని చేయమని చెప్పినదో అవి అన్నీ పుణ్యకర్మలు. సమాజంలో అందరికీ ఒక్కో కర్తవ్యాన్ని వేదం నిర్దేశించినది. వేదశాస్త్రములు చెప్పినట్లుగా, ఈ వేదవిహిత కర్మాచరణలో వైక్లవ్యం కలుగకుండా, ఎవరి స్వకర్మలు వారు పాటించడం చేస్తే, అన్నిటికన్నా అదే పెద్ద పుణ్య కార్యం.


పాపకార్యం అంటే ఏమిటి? ఏ క్రియ అయితే కేవలం స్వార్ధం/అసూయల కారణంగా చేస్తామో, దానిని శాస్త్రం పాపంగా పరిగణిస్తుంది. ఒక్క స్వార్ధం వల్లనే, ఒక వ్యక్తికి కలిగే కోరికలను నెరవేర్చుకోవడానికి, సకల విధములైన అధర్మ మార్గములలో పయనించడం మొదలు పెడతాడు. ఇలా చేయడంలో భయము, విరోధము, బాధ మొదలైన దుర్గుణములతో మనసు కలుషితమైపోతుంది.

స్వార్ధం ప్రాతిపదికగా కాకుండా,
 వేదము చెప్పిన కార్యములను, విివిధానములను మనం ఆచరించడం మొదలు పెడితే, అత్యాశ, అనారోగ్యకరమైన పోటీ తత్త్వము, స్వార్ధం, అసూయ తగ్గిపోతాయి.

వేదవిహిత కర్మాచరణ ఎవరికి నిర్దేశింపబడినవి వారు, చేస్తూ ఉంటే, అది మొత్తం సమాజానికి క్షేమాన్ని చేకూరుస్తుంది. అంతే కాక, అటువంటి వేదవిహిత కర్మాచరణ వ్యక్తుల యొక్క పాపములను కూడా పరిహరించి, పునీతులను చేస్తుంది. ఇలా పుణ్యకార్యములు చేస్తూ ఉండడం వల్ల, పాపవిముక్తులమై, మన మనసు 
పవిత్రమవుతుంది.

ఏ పనీ చేయకుండా కూర్చుని ఉంటే, అనేక విధములైన చెడు ఆలోచనలు మనసులో పుడుతూ ఉంటాయి. అందువలననే మన మననుని నిశ్చల స్థితిలోకి (ఎటువంటి ఆలోచనలు లేకుండా) తీసుకువెళ్ళి, ఆపైన అద్వైత దర్శనం చేయాలి అంటే, ముందు మన మనసులో కలిగే చెడు ఆలోచనలు ఆగి, మనసు పునీతం కావాలి. ఒక వ్యక్తి ఆధ్యాత్మిక సాధన ప్రాథమిక స్థాయిలో ఉండగా, మనసుని పవిత్రం చేయడం అనేది కేవలం వైదిక కర్మలు, పుణ్య కార్యముల చేత మాత్రమే సాధ్యము. ఈ కారణంగానే, శంకరులు వైదిక కర్మలను చేయమని ప్రతిపాదించి, వివిధ దేవతాస్వరూపాలను కీర్తించే స్తోత్రాదులు ఇచ్చారు.


ఇతరులకు సహాయం చేయడము, సమాజ సేవ చేయడం, మనకున్న విభూతిని సమాజం కోసం వెచ్చించి త్యాగం చేయడం వంటి పుణ్య కర్మలు మనలోని పాపపు ఆలోచనలను తగ్గిస్తుంది. దీనినే మనం ప్రేమ అనవచ్చు. ఇదే ప్రేమని పరమాత్మ వైపుకు త్రిప్పగలిగితే, పరమాత్మపై మనకి ఉండే ఆ ప్రేమనే 'భక్తి' అంటారు. భగవంతుడి యందు ఉండే భక్తి, భగవత్ చింతన అనేవి, అనేక జన్మల పరంపరగా మనం చేసిన పాపాలను సమూలంగా నాశనం చేయగలదు. భగవద్భక్తి ఒక స్థాయి చేరిన తర్వాత, మన మనసు కేవల పరమాత్మపైనే దృష్టి పెట్టే స్థితి వస్తుంది. మనసులో అసలు ఏ ఆలోచనలూ లేకుండా నిశ్చల స్థితిలో ఉండగలడం అనే నిశ్చల సమాధి స్థితికి ఒక మెట్టు ముందు కేవల భగవత్ చింతన ఉండే స్థితి అబ్బుతుంది. మరే ఇతర ఆలోచనలు లేక కేవలం పరమాత్మ చింతనయే మనసులో మిగిలిన వాడికి, అనతి కాలంలోనే, ఇక ఏ ఆలోచనాలేని, పరమాత్మ స్థితిలో నిలబడే స్థితి వస్తుంది. అంత్యమున పరమాత్మ తప్ప మరేది ఉండదు.

పైన చెప్పిన విధంగా, మన మనసు ఒకే ఒక్క విషయంపై (భగవత్ చింతన) ఏకాగ్రత పొంది, ధ్యాన యోగ స్థితిని చేరడం కోసమే, శంకర భగవత్పాదుల వారు మనకి వైదిక కర్మలను (నిత్య నైమిత్తిక కర్మలు, భగవంతుడి పూజ) తప్పనిసరిగా చేయాలనీ, భగవంతుడి యందు భక్తి కలిగి ఉండాలనీ బోధించారు.

మొదట స్తోత్రాదులను పఠించడమూ, పూజ చేయడమూ, పుణ్యక్షేత్రములను సందర్శించడమూ మొదలైన వాటితో భగవద్భక్తి ప్రారంభం అవుతుంది. భక్తితో, వైదిక కర్మలు చేస్తూ ఉంటే, పరమాత్మ అనుగ్రహంతో శాంతి పొందుతాము. నిద్రలో సుషుప్తిలో ఉన్నప్పుడులా కాకుండా, మనం మెళకువగా ఉన్నప్పుడే, మన మనసు జాగురూకతతో ఉన్నప్పుడే (fully concious state), భగవద్భక్తి మనల్ని పరమాత్మకి దగ్గర చేస్తుంది. అందువలననే, ప్రతీ ఒక్కరూ భక్తిని అలవరచుకుని, శాస్త్రం విహించిన వైదిక కర్మాచరణ చేయడం అభ్యసించాలి.

కేవలం 'అద్వైతం' అనే స్థితిని గూర్చి మాట్లాడుతూ ఉండడం వలన ఏమీ ప్రయోజనం లేదు. అద్వైత స్థితికి సాకారరూపం ఈశ్వరుడు. అటువంటి ఈశ్వరుని గురించి ధ్యానిస్తూ ఉండడం వలన, అప్పుడప్పుడైనా తాత్కాలిక ప్రశాంతని పొందగలము. మనకి అర్ధం కానీ, మనం ప్రేమతో అనుబంధం పెట్టుకోలేని ఆ స్థితిని, మనం ఊహకూడ చేయలేని మరియు ఏ గుణములూ లేని నిర్గుణ పరబ్రహ్మ అద్వైత స్థితిని గురించి మాట్లాడే కన్నా, సగుణరూపములో ఉన్న పరబ్రహ్మ స్వరూపాన్ని పూజ చేయడం చాలా చాలా అవసరం, సగుణ  పరబ్రహ్మము నందు మన మనను త్వరగా లయం అయి, మనకి ఈశ్వరుని యందు భక్తి బాగా కుదురుకుంటుంది. అటువంటి సగుణరూప పరబ్రహ్మమును పరమభక్తితో పూజించడం చాలా అవసరం.

చివరగా చెప్పేది ఏమిటంటే, "భక్తి అనేది కేవలం లౌకికమైన ఈతి బాధలు తీరడానికి కాదు. మనం ఎవరో, మన స్వస్వరూపమేమిటో తెలుసుకొని, నిజమైన 'నేను'లో రమించి శాంతిని పొందుట కొరకు మాత్రమే భక్తి".



(తమిళంలోని దైవదిన్ కురళ్ - Voice of God అనే పరమాచార్య స్వామి వారి అనుగ్రహ భాషణముల పుస్తకము నుంచి సంగ్రహించినది).

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.

6, జూన్ 2013, గురువారం

శ్రీ పరమాచార్య వాణి - కట్నం తీసుకోవడాన్ని శాస్త్రం అంగీకరించలేదు


"శాస్త్రం చెప్పిన వైదిక కర్మలు చేయడానికి అమితమైన డబ్బు అవసరం లేదు, అలాగే పూజ చేయడానికి పెద్ద హంగులు, ఆర్భాటమూ కూడా అవసరం లేదు. కేవలం ఎండిపోయిన తులసి ఆకులు, మారేడు దళాలు నాలుగు ఉన్నా, పూజ చేయవచ్చు. మనం రోజూ తినడానికి వండుకునే అన్నమే నైవేద్యంగా నివేదించవచ్చు.
'ఈ రోజుల్లో వివాహం అనగానే చాలా చాలా డబ్బు దాని కొఱకు వెచ్చిస్తున్నారు కదా దీని మీద మీ అభిప్రాయం ఏమిటి' అని కొందరడిగారు. దానికి నా సమాధానం -  'శాస్త్రం ప్రకారం వివాహము కూడా ఒక వైదికమైన క్రతువు. ఇప్పుడు మనం చూస్తున్నట్లుగా, వివాహము అమితమైన వ్యయంతో కూడుకుని చేయమని మన ఏ శాస్త్రాలలో కూడా చెప్పలేదు. అనగా వివాహం పేరు మీద అంతంత డబ్బు ఖర్చు చేయడానికి శాస్త్రం అంగీకరించలేదు. అందునా ప్రత్యేకంగా వివాహ క్రతువులో, కట్నం తీసుకోవడం అనేది పూర్తిగా శాస్త్ర విరుద్ధము, మన శాస్త్రాలు కట్నం తీసుకోవడాన్ని అంగీకరించలేదు".

సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.



4, జూన్ 2013, మంగళవారం

శ్రీ పరమాచార్య వాణి - శాస్త్రవిహిత జీవన విధానమే శాంతికి మూలం


"మన శాస్త్రములు చెప్పిన విషయాలు పరమ సత్యము అని, మనము అనన్యమైన విశ్వాసము కలిగి ఉండాలి. శాస్త్రవిహితముగా జీవనం గడపలేము అనుకుని, శాస్త్ర వాక్యములను వదిలిపెట్టరాదు. ఆధునిక/పాశ్చాత్య జీవన విధానమునకు మనం బానిసలుగా మారకూడదు. మన కోరికలను కొంచెం తగ్గించుకుంటే, ధనార్జన అనే తృష్ణకి లోనుకాకుండా ఉండగలగుతాము, తద్వారా శాస్త్ర విహిత జీవనాన్ని, అనుష్టానమును వదిలిపెట్టవలసిన అవసరం రాదు. ప్రతీ మనిషికీ జీవితంలో కొంత ధనము అవసరమే, కానీ కేవలం ధనం సంపాదించడం ఒక్కటే జీవిత లక్ష్యంగా పెట్టుకోకుండా ఉన్నవాడికి, భగవత్ చింతన చేయడానికి, శాస్త్ర విహిత జీవనం గడపడానికి చాలా సమయం దొరుకుతుంది. శాస్త్రము చెప్పినట్లు బ్రతికే వాడికి, శాంతి, సంతృప్తి మరియు తరగని సంతోషం వాటంతట అవే వస్తాయి".

"తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్యావ్యవస్థితౌ"

సర్వం శ్రీవల్లీదేవసేనాంబికాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు.